దమ్ముంటే చంద్రబాబుకు నోటీసులు ఇవ్వండి... పల్లె
posted on Jun 20, 2015 @ 5:27PM
ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్ తో పాటు సాక్షి ఛానల్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో టీ న్యూస్ ఛానల్ తో పాటు సాక్షి ఛానల్ కూడా చాలా అతిగా ప్రవర్తించిందని.. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేశామని విశాఖపట్నం డీజీపీ త్రివ్రిక్రమ్ వర్మ చెప్పారు. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నోటీసులు ఇచ్చాం.. దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వండని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కేసీఆర్ కు బహిరంగంగా సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డామనే వార్తలు వస్తున్నాయి.. అలాంటి అవసరం లేదని.. తాము తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నామని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఎన్నికల కమిషన్ ఈ కేసును పర్యవేక్షించాలి కానీ ఏసీబీ ఎలా ఈ కేసు నమోదుచేస్తుందని ప్రశ్నించారు. అందుకే ఈ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు రాసి పేట్రేగి పోయిన న్యూస్ ఛాళ్లపైనే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు.
ఒకవైపు ఇప్పటికే టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు ఇచ్చినందుకు తెలంగాణ జర్నలిస్టులు నిరసనలు చేపడుతున్నారు. ఇప్పుడు సాక్షి ఛానల్ కు కూడా నోటీసులు ఇవ్వడంవల్ల ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం వల్ల తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచుతారేమో అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఈ నోటీసుల వల్ల కేసు మరో కీలక మలుపు తిరుగుతుందేమో అనిపిస్తోంది.