సమ్మె చేస్తున్నా పట్టించుకునే వారు లేరు
posted on Jul 11, 2015 @ 4:38PM
సీఎం కేసీఆర్ దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలి.. అందుకోసం కృషి చేయాలి అని మాటలు చెప్పినోళ్లే తప్ప చెప్పనోళ్లు లేరు. మరి ఇప్పుడు హైదరాబాద్ నగర పరిస్థితి చూస్తుంటే బంగారు తెలంగాణ ఏమో కానీ కనీసం మాములు తెలంగాణ చేస్తే చాలు అని అనిపిస్తుంది. గత ఐదురోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల హైదరాబాద్ నగరం కాస్త చెత్త నగరంగా మారిపోయింది. ఎక్కడ చూసిన కుప్పలుకుప్పలు చెత్తతో నగరంగా అద్వానంగా తయారైంది. ఐదురోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్న కనీసం పట్టించుకునే తీరిక ఎవరికి లేకుండా పోయింది. అప్పుడెప్పుడో స్వచ్ఛ భారత్ పేరుతో ఏదో అధికారులంతా పేరుకోసం చీపురు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఒక్కరోజు చేస్తే అయిపోతుందా.. అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేతులు గ్లౌజులు.. కాళ్లకు బూట్లు వేసుకొని మరీ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. అలాంటిది నిరంతరం చెత్తలో పనిచేసే జీహెచ్ఎంసీ కార్మికులు తమ కావాల్సిన పరికరాలు.. వేతనంలో పెంపుదల అడిగితే మాత్రం అవి గొంతెమ్మ కోర్కెలు అంటున్నారు.
మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు సి.కృష్ణయాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు రోజులుగా నగరంలో జిహెచ్‌ఎంసి సిబ్బంది సమ్మెబాట పట్టారని..ముందుగానే వారి సమస్యలను ప్రభుత్వంతోపాటు జిహెచ్‌ఎంసి కమీషనర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికి పట్టించుకోలేదని, కనీసం సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనైనా కార్మికులతో చర్చలు జరపక కమీషనర్ సమస్యను పెంచి పోషించారని అన్నారు. ఇలాగే ఉంటే నగరంలో చెత్త వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. నగరంలో నలుగురు మంత్రులు ఉన్న ఎవరూ పట్టించుకోని స్థితిలో ఉన్నారని.. ఇక జిహెచ్‌ఎంసి కమిషనర్ ఎలాగూ కార్మికుల సమస్యలు పట్టని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కనీసం సీఎం కేసీఆర్ అయినా ఈ సమ్మె విషయంలో కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు.