జగన్ దీక్ష అలా వాయిదా పడింది
posted on Sep 25, 2015 @ 6:22PM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపట్నుంచి గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్ష వాయిదా పడింది, ఒకవైపు పోలీసులు అనుమతి నిరాకరించడం, మరోవైపు అనుమతి ఇచ్చేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించిన నేపథ్యంలో దీక్షను వాయిదా వేసుకున్నారు, దీక్ష వాయిదా విషయాన్ని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పు వచ్చాక జగన్ దీక్ష ఎప్పట్నుంచో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అయితే జగన్ దీక్షకు అనుమతి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైసీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది, హౌస్ మోషన్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ వేయాలని ధర్మాసనం సూచించడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందన్న ఆయన, జగన్ దీక్షకు హైకోర్టు అనుమతి ఇస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.