రోడ్లు ఊడుస్తూ బీజేపీ నేతల నిరసన

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ ప్రారంభంకాగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కానీ స్పీకర్ మాత్రం వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు సమయాన్ని కేటాయించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకపక్క ఆందోళన జరుగుతున్నా టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్ వాడీ సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ప్రశ్నలు వేయగా ఆయన సమాధానమిచ్చారు. అయినా కానీ ప్రతిపక్షాలు ఆందోళన విరమింపకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ నేతలు అసెంబ్లీ ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు.

ముందు భోజనానికి వెళదాం పదండి.. జానాతో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీకి కొన్ని సూచనలు.. సలహాలు ఇవ్వాల్సి ఉందని.. అయితే దీనికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది.. ఇప్పుడు కొంచెం.. భోజనం తరువాత కొన్ని చెపుతానని అన్నారు. దానికి కేసీఆర్ దానిని అవును భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం.. బాగా చర్చించుకుంటాం అని అన్నారు. దీనికి వెంటనే జానారెడ్డి భోజనం తర్వాత మీరు సభలో ఉంటారా అని ప్రశ్నించగా దానికి కేసీఆర్ తప్పకుండా ఉంటాను ముందు భోజనానికి వెళదాం పదండి అని అందరిని నవ్వించారు. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార పక్షాలు కలిసి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకుంటారు.. కలిసి చర్చించుకోవడం.. సలహాలు సూచనలు తీసుకోవడం అరుదు.. ఈ రోజుల్లో అది చాలా కష్టం. కాని జానారెడ్డి.. కేసీఆర్ సంయమనం చూస్తే ఎప్పుడూ ఇదే తీరు అవలంబిస్తే.. ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకుంటూ చర్చించుకుంటే ప్రజలు సమస్యలు తీరడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.

కేసీఆర్ కు చిరాకు తెప్పించిన మంత్రి..నీ పని నువ్వు చూసుకో

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతు ఆత్మహత్యలపై.. వరంగల్ ఎన్ కౌంటర్ పై..ఇంకా పలు అంశాలపై చర్చ జరుగుతూ ప్రతిపక్షాల వాదనలు.. అధికార పక్షాల వాదనలతో అట్టడుకుతోంది. అయితే సాధారణంగా నేతలు ప్రత్యర్ధులపై కామెంట్లు..కౌంటర్లు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రిగారు అత్యుత్సాహం చూపి తన రాజకీయ అభ్యర్ధిపైనే కామెడీగా మాట్లాడేసరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్పించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ మధుసూధనాచారి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చదవటం మొదలు పెట్టారు. స్పీకర్ మధుసూదనాచారి ఆయన్ను కూర్చోమని చెప్పినా వ్యవసాయ మంత్రి మాత్రం తన ప్రకటన చదువుకుంటూ వెళుతున్నారు. అయితే ఆ సమయంలో మంత్రి జగదీశ్ కల్పించుకొని కాస్త గట్టిగా ఓ అన్నా కూకో అన్నా అంటూ గట్టిగా వ్యాఖ్యనించారు. అయితే జగదీశ్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ నీకేం పని.. నీ పని నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు. మొత్తానికి ప్రత్యర్ధుల మీద దూకుడు చూపించే జగదీశ్ రెడ్డి పార్టీ అభ్యర్దులపై కూడా చూపిస్తే ఎలా ఉంటుందో మంత్రిగారికి తెలిసొచ్చుంటుంది.

పాలసముద్రంలో బెల్ కి శంకుస్థాపన

  రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లా అనంతపురం. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని పరిస్థితిలో మారలేదు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమాని ఇప్పుడు ఆ జిల్లాలో చాల వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో గోరంట్ల మండలంలో పాలసముద్రం వద్ద భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అనే జాతీయ సంస్థ ఏర్పాటు కాబోతోంది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శంఖుస్థాపన చేసారు.   చాలా భారీ వ్యయంతో నిర్మించబోతున్న బెల్ సంస్థలో రక్షణ రంగానికి చెందిన భారీ యంత్రాలు, రాడార్లు మొదలుకొని చిన్నచిన్న యంత్ర పరికారాలు వరకు తయారవుతాయి. ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే దాని అనుబంధ పరిశ్రమలు చిన్నవి, పెద్దవి వందల సంఖ్యలో ఏర్పాటు అవుతాయి. వాటి వలన ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కరువు పీడిత అనంతపురం జిల్లాలో వ్యవసాయాన్ని నమ్ముకోవడం కంటే పరిశ్రమలను నమ్ముకోవడమే మంచిది. కనుకనే అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చాలా శ్రద్ద, ఆసక్తి చూపిస్తున్నాయి. కనుక మున్ముందు జిల్లాకి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి.

పవన్ కంటే మహేశ్ కు ఎక్కువుండటం నచ్చలేదు... వర్మ కామెంట్స్

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఈసారి మరో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో మీదనో లేక హీరోయిన్ మీదనో వ్యాఖ్యలు చేసే వర్మ ఈసారి ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. ఒక హీరో ఫ్యాన్స్ కాదు ఏకంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోలు ఎవరోకాదు ఒకరు పవన్ కళ్యాణ్ ఇంకో హీరో మహేశ్ బాబు. ట్విట్టర్ మహేశ్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా పవన్ కళ్యాణ్ కు మాత్రం కేవలం ఆరు లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతటితో ఆగాడా అంటే లేదు..పవన్ కళ్యాణ్ ఫాన్య్ ఏమన్నా నిరక్ష్యారాసులా.. వాళ్లకు ట్విట్టర్ వాడకం తెలీదా అంటు.. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ లేకుండా మహేశ్ బాబుకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నందుకు ఫీల్ అవుతున్నాఅని అన్నాడు. అంతేకాదు తమ అభిమాన నటుడిని ఫాలోఅవుతున్నందుకు మహేశ్ బాబు ఫ్యాన్స్ ను గౌరవిస్తున్నానని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను గౌరవించడం లేదని వ్యాఖ్యానించాడు. మరి వర్మ ట్వీట్లని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుంటారా లేక వర్మ ఎప్పుడూ ఏదో ఒక రకంగా కామెంట్లు చేస్తుంటాడు కాబట్టి లైట్ తీసుకుంటారా అని చూడాలి.

పవన్ కళ్యాణ్ ఎక్కడ? దీక్ష ఎక్కడ?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు.. దీక్ష చేస్తానని చెప్పి ఏమయ్యాడు.. ఇప్పుడు ప్రతిఒక్కరులోనూ మొదలయ్యే ప్రశ్నలు ఇవి. నిర్భంద తమిళం చట్టం ద్వారా తమిళనాడులో తెలుగుబాషపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ అమ్మకు వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ దీక్షను సెప్టెంబర్ నెలఖారున చేపట్టాలని అప్పుడు తెలిపారు. పవన్ తీసుకున్న ఈనిర్ణయానికి తెలుగు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు కూడా. కానీ ఇప్పుడు సెప్టెంబర్ ముగిసిపోయింది.. దీక్ష పరిస్థితి ఏంటి? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విట్టర్ ద్వారా ఏదో ఒకటి పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజులుగా ట్విట్టర్ ద్వారా ఎలాంటి పోస్ట్ లు చేయడంలేదు. దీక్ష చేస్తానని చెప్పిన నెల అయిపోయింది.. మరి దీక్ష విరమించుకున్నారా? లేక దీక్షను వాయిదా వేసుకున్నారా? అని చెప్పేవాళ్లు కూడా లేరు. మరోవైపు దీక్ష విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారా? లేక నిజంగానే సినిమాలతో బిజీగా ఉన్నారా అని పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి ప్రకటన చేయాలి.. లేకపోతే ట్విట్టర్ ద్వారా అయినా కూత వేయాల్సిందే.

ఆశాభోంస్లే తనయుడు హేమంత్ భోంస్లే మృతి

  ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే తనయుడు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే ఈ రోజు మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నహేమంత్ భోంస్లే స్కాట్లాండ్ లో మరణించారు. దీంతో ఆశా భోంస్లే కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిపోయారు. హేమంత్ భోంస్లే  'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. కాగా బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అంటే 2012 లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే కూడా డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు హేమంత్ భోంస్లే మరణానంతరం లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వేడుకలను రద్దు చేశారు.

ఎన్‌కౌంటర్‌ కు అనుమతులు ఉన్నాయి.. హరగోపాల్

  వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ వామపక్షాలు ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయితే ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. ప్రజలను కట్టడి చేసి విధ్వంసాన్ని సృష్టించవద్దని.. అధికార పార్టీ చేసే ప్రతిఒక్క పని రికార్డు అవుతుందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన మొదటి ప్రభుత్వం.. అలాంటిది ఒకవేళ తెలంగాణ చరిత్ర కనుక రాస్తే మొదటి తెలంగాణ ప్రభుత్వ అనుసరించిన విధానాలు గురించి కూడా తప్పనిసరిగా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాదు ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుతూ పైనుండి అనుమతులు లేనిదే పోలీసులు ఎన్ కౌంటర్ చేయరని వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ చేయకూడదని.. వీలుంటే వారిని అరెస్ట్ చేయాలని.. న్యాయవ్యవస్థ ద్వారా వారిని విచారణజరిపించాలి అంతేకాని ఎన్ కౌంటర్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఎన్ కౌంటర్ కు ప్రభుత్వం అనుమతి ఉందని హరగోపాల్ మాటల ద్వారా స్పష్టం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఛలో అసెంబ్లీ.. ముట్టడి కట్టడి

వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో శృతి, విద్యాసాగర్ లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఈ పని చేసిందని.. 350 సంఘాలతో చలో అసెంబ్లీ చేపడతామని వామపక్షాలు తెలిపారు. దీనిలోభాగంగానే ఈరోజు వామపక్షాలు శృతి, విద్యాసాగర్ ఎన్‌కౌంటర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వామపక్షనేతలు.. కార్యకర్తలు.. ఇతర సంఘాల నేతలు పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు ముందే సమాచారం తెలుసుకొని అసెంబ్లీ వద్ద భారీ బందో బస్తు ఏర్పాటుచేశారు. అంతేకాదు నిరసనలో పాల్గోనే వారందరిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థినులను ఎన్‌సీసీ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు..కొంతమందిని గృహనిర్భందం కూడా చేశారు. దీంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇంత బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది.

తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు

టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం లేదని.. మాకు ఆస్తులు సంక్రమించిన సమయంలో ఉన్న విలువనే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామని అంతేకాని ఎప్పటికప్పుడు పెరిగే..తరిగే విలువలను బ్యాలెన్స్ షీట్లో ఉండదని అన్నారు. తాము ఆస్తివివరాలు తెలిపినట్టు ఇతర పార్టీలకు చిత్తశుద్ది ఉంటే వారి ఆస్తి వివరాలు కూడా ప్రకటించాలని అన్నారు. అంతేకాదు తమ ఆస్తుల గురించి వాస్తవాలు తెలియకుండా తెలివితక్కువగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు.

మోడీతో కరచాలనం.. చేతులు దులుపుకున్న సత్యనాదెళ్ల..

  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో పలు సంస్థల అథిపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కూడా కలిశారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉంది అయితే ఈ సందర్భంగా ఒక అంశంపై ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే మోడీని సత్యనాదేళ్ల కలిసిన నేపథ్యంలో అప్పుడు మోడీతో కరచాలనం చేసిన సత్యనాదెళ్ల తన రెండు చేతుల్ని దులిపేసుకుంటూ పక్కకు వెళ్లినట్టు వచ్చిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరూ సత్యనాదెళ్ల ప్రధానిని అవమానించారని అనుకుంటుండగా.. కొంతమంది అది కావాలని చేసింది కాదు.. అలవాటు పూర్వకంగా చేసి ఉంటారని అనుకుంటున్నారు. దీనితో పాటు మోడీ ఫేస్ బుక్ అధినేత జుకెర్ బర్గ్ ను కలవడంపై కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. మోడీ, జుకెర్ బర్గ్ ను కలిసిన నేపథ్యంలో గుజరాత్ లో సంభవించిన అల్లర్లకు కారణమైన మోడీతో చేయి కలిపిన జుకెర్ బర్గ్ చేతులకు రక్తపు మరకలు అంటుకున్నాయని.. ఆరక్తపు మరకలు కడుక్కునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జుకెర్ బర్గ్ కు 250 బాటిల్స్ పంపించారట.

రైతుల అలక దీక్షతో టీఆర్ఎస్ కు చెమటలు

  నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని.. విపక్షాలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అధికార పార్టీ రైతుల ఆత్మహత్యల సమస్యతో సతమతమవుతుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి అధికార పార్టీని ఇరుకున పెడదామనే ప్లానింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు దీనికి తోడు వారికి మరో తలనొప్పి వచ్చిపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రైతులు అలక దీక్ష చేపట్టారు. అది ఎవరో కాదు కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న గ్రామ రైతులే దీక్షకు పూనుకున్నారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దీక్షకు నేతృత్వం వహించింది.. కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి కోసం గడ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఓఎస్డీ అశోక్ కుమార్. ఆయన రైతుల పక్షాన నిలిచి నిరసన వ్యక్తం చేయటంతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో సమస్యలు ఎదుర్కొంటున్నకారణంగా ఇప్పుడు ఈ విషయం ప్రచారం అయితే ఇంకా తలనొప్పులు తప్పవని గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఉరుకులు పరుగులు తీసుకుంటూ అక్కడి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా అక్కడికి వచ్చిన అధికారులకు అశోక్ కుమార్ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సరికొత్త కారణాలు చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తాను దీక్షను విరమించనని మొండికేశారు. అయితే ఆయన్ను ఎలాగొలా బుజ్జగించి దీక్షను విరమించే సరికి అధికారుల తల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది. ఏది ఏమైనా రైతుల ఆత్మహత్యల అంశం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుంది.

తెదేపా ఏపీ, తెలంగాణా, కేంద్ర కమిటీల ప్రకటన

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కేంద్ర పోలిట్ బ్యూరో కమిటీల వివరాలను విజయవాడలో ప్రకటించారు. తెదేపా ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణా అధ్యక్షుడిగా మళ్ళీ యల్. రమణను నియమించారు. చంద్రబాబు నాయుడు తెదేపా జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. నారా లోకేష్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డారు.   ఆంద్రప్రదేశ్ : ఈ కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 70మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: కళా వెంకట్రావు, ఉపాధ్యక్షులు: కారణం బలరామ్,బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి, జె.ఆర్. పుష్పరాజ్, ఎం. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు: వార్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగేశ్వర్ రెడ్డి, రామానాయుడు, అధికార ప్రతినిధులు: డొక్కా మాణిక్యవర ప్రసాద్, జూపూడి ప్రభాకర్, వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ముళ్ళపూడి రేణుక,ముత్తం శెట్టి శ్రీనివాస రావు, అనురాధ, లింగారెడ్డి, కోశాధికారి: బిసి. జనార్ధన్ రెడ్డి.   తెలంగాణా: ఆంద్రప్రదేశ్ కంటే తక్కువ జిల్లాలు ఉన్నప్పటికీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర కమిటీలో 93మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్: రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు:ఎం. వెంకటేశ్వర రావు, సాయన్న, స్వామీ గౌడ్, యూసఫ్ ఆలి, కృష్ణ యాదవ్, ఎ. గాంధీ, సి.హెచ్. సురేష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ. తెలుగు యువత అధ్యక్షుడు: వీరేందర్ గౌడ్, తెలుగు మహిళ అధ్యక్షురాలు: శోభారాణి   కేంద్ర కమిటీ: కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు: నందమూరి హరికృష్ణ, యనమల, అయ్యన్న, ప్రతిభా భారతి, అశోక్ గజపతి రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిన్న రాజప్ప, కాల్వ శ్రీనివాసులు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవ రెడ్డి, తదితరులు. అధికార ప్రతినిధులు: కే.రామ్మోహన్ నాయుడు, అరవింద్ కుమార్ గౌడ్, బోండా ఉమా.

అక్బరుద్దీన్ రియాక్ట్ వెనుక కారణం అదా?

  తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఐఏఎంపార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పార్టీని కడిగేసిన సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలపై ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కేటీఆర్ కు కూడా ఘాటుగా సమాధానం చెప్పి కేటీఆర్ నోరు మూయించాడు.. దాంతో మంత్రి హరీశ్ రావు కూడా కల్పించుకొని అక్బరుద్దీన్ వాగ్దాటికి బ్రేక్ వేద్దామని చూసినా కూడా అది వర్కవుట్ కాలేదు. ఆవిధంగా మొత్తానికి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రైతు ఆత్మహత్యల విషయంపై అధికార పార్టీని ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆ పని అక్బరుద్దీన్ ఒకరే చేసి చూపించారు. అయితే రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటంటే.. గతంలో ఒకసారి అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దాని గురించి చెపుతూ మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చిన నాకు ఆ బాధ ఏంటో తెలుసని.. నేను రైతును కాకపోయినా.. ఆ రైతు కుటుంబం బాధ ఏలా ఉంటుందో తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. చావు వరకూ వెళ్లిన నాకు ఆ బాధ తెలుసు ఇంటి పెద్దకు ఏదైనా అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి బాధ అనుభవిస్తారో నేను ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవడానికి పర్సనల్ ఎక్స్ పీరియన్స్ కారణం అన్నమాట..

నయనతార, సమంత ఇళ్ళపై ఐటీ దాడులు

  ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. వారేగాక ప్రముఖ తమిళహీరో విజయ్ ఆయన చేసిన ‘పులి’ సినిమా నిర్మాత షిబు సెల్వ కుమార్ ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడులో చెన్నై, మధురై, కేరళ రాష్ట్రంలో నయనతార ఉంటున్న కొచ్చి నివాసంపై ఏక కాలంలో ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. దేశంలో మరో 32 ప్రాంతాలలో కూడా ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజే దాడులు నిర్వహించారు. అంటే దేశంలో ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ఐటి అధికారులు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతల ఇళ్ళు కార్యాలాలపై దాడులు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ చాలా కాలంగా దాడులు చేయకపోవడం వలన ఇవి సంచలనం కలిగిస్తున్నాయి.

లోకేశ్, రేవంత్ కు కీలక పదవులు

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. ఈసందర్భంగా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి... * కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది. * ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది. * అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. * తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకముందు కొనసాగిన ఎల్ రమణనే కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు. * ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు.

ఏపీ, తెలంగాణ.. ఈసారి సరిహద్దు వివాదం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటది. ఇప్పటికే ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలలో కొన్ని సమస్యలు తీరినా.. కొన్ని సమస్యలు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఇది వివాదం సరిహద్దు సమస్యగా మారబోతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు వివాదం ఏంటంటే నాగార్జున సాగర్ సమీపంలో అనువు దగ్గర కొత్త బోట్లు తయారీకి గాను మొత్త మూడు లారీల్లో తయారీ సామాగ్రితో తెలంగాణ టూరిజం సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఆంధ్రాభూభాగంలో బోట్లు ఎలా నడుపుతారు అంటూ వారిని ఏపీ టూరిజం అధికారులు అడ్డుకున్నారు. అదే తెలంగాణ హుస్సేన్ సాగర్ లో నడిపితే ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. అంతే దీంతో తెలంగాణ టూరిజం అధికారులకు.. ఏపీ టూరిజం అధికారులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు సరిహద్దు వివాదానికి దారితీస్తుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.