బీజేపీ ఓడిపోవడానికి కారణాలు అవేనా?
posted on Nov 9, 2015 @ 1:46PM
బీహార్ ఎన్నికలు ఊహించని రీతిలో అందరికి షాకిచ్చాయి. ముఖ్యంగా బీజేపీకి. ఢిల్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటకట్టుకున్న బీజేపీ.. బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చాలా నమ్మకంగా ఉంది. కానీ బీహార్ ప్రజలు మాత్రం బీజేపీ నమ్మకాన్ని ఒమ్ము చేసి మహాకూటమికి పట్టం కట్టబెట్టాయి. అయితే బీహార్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ముందే ఒక అంచనాకి వచ్చినా ఆ అంచనాల్ని సైతం తారుమారు చేసి.. ఎలాంటి మొహమాటం లేకుండా స్వష్టమైన తీర్పును ఇచ్చారు బిహారీలు. బీహారీలకు మంచి ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం అవడానికి కొన్ని కారణాలు తెలుపుతున్నారు పరిశీలకులు అవేంటంటే.
* ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్న అనవసర మత అసహనంపై చర్చ. గోమాంసం వివాదం.. దీనిపై నేతలు చేస్తున్న వివాదాస్పదమైన చర్చలు.
* మహాకూటమి ఏర్పాటు.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఒక జట్టుగా మారటం.
* సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన నిత్యవసరం వస్తువులు ఆకాశాన్ని అందేలా ఉండటం
* నితీశ్ పై బీహార్ ప్రజలకు వ్యక్తిగతంగా ఎటువంటి అసంతృప్తి లేకపోవడం
* బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొందరు నేతల మాటనే అధినాయకత్వం వినటం.
* బీహార్ లో 14 శాతం మాత్రమే ఉండే అగ్రవర్ణాలకు మొత్తం టిక్కెట్లలో 40 శాతం ఇవ్వటం.
కారణాలు ఏదైనా మొత్తానికి బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందింది. దీనిబట్టి మొత్తానికి బీహార్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.