కేంద్రమంత్రి పళ్ళంరాజుపై ఇ.సి. నిషేధం?

  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పళ్ళంరాజు మీద ఎన్నికల సంఘం నిషేధం విధించాలని కాంగ్రెసేతర పార్టీలు కోరుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన పళ్లంరాజును ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అయితే మంగళవారం నాడు పళ్ళంరాజు కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారని, తనకు ఓటేయాలని రోగులు, వైద్యులు, సిబ్బందిని అడిగారని కాంగ్రెసేతర రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలలో పళ్ళంరాజు ఓటమి ఖాయమైందని, అందుకే దింపుడుకళ్ళం ఆశతో ప్రచారం గడువు ముగిసినా ప్రచారం చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. ఇ.సి. ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి, పళ్ళంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారని నిర్ధారణ అయినట్టయితే ఆయన ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం చేతిలో రాష్ట్ర భవిష్యత్

  ఇంతకు ముందు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాని చేతిలోనే రాష్ట్ర భవిష్యత్ ఉండేది. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కంటే కేంద్రం చేతిలోనే ఎక్కువగా ఉండబోతోంది. వివిధ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం వంటి భారీ వ్యయమయ్యే పనులకు నిధుల కోసం కేంద్రం మీద ఎలాగూ ఆధారపడక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన్నని ఆదాయవనరులు లేకపోవడంతో రాష్ట్ర కనీసావసరాలయిన ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు, సంక్షేమ కార్యక్రమాలు అమలు, ఇత్యాది అవసరాలకు కేంద్రప్రభుత్వం విదిలించే నిధులపైనే ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ఆర్ధిక స్థితిని గాడిన పెట్టేవరకు, పరిస్థితి క్లిష్టంగానే ఉండవచ్చును. ఒకవేళ ఏ కారణం చేతయినా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినట్లయితే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఒకవేళ తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే నదీజలాలతో సహా అనేక విషయాలలో వారితో సమస్యలు ఉత్పన్నం కావచ్చును. వాటి పరిష్కారానికి కేంద్రప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందువల్ల ఈ సారి ఎన్నికలలో సీమాంద్రాకు పూర్తి సహకారం అందించే పార్టీనే కేంద్రంలో కూడా ఎన్నుకోవలసి ఉంటుంది.

ఎన్నికలకు సీమాంద్ర సర్వం సిద్దం

  సీమాంద్రాలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి లోక్ సభకు 333మంది, అసెంబ్లీకి 2241 అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో 3,67,62,975 మంది ఓటర్లు ఈ అభ్యర్ధుల భవితవ్యం తేల్చనున్నారు. రేపు జరుగబోయే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ చాలా విస్త్రుత ఏర్పాట్లే చేసింది. 13 జిల్లాల్లో మొత్తం 40,708 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 13వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దాదాపు లక్షా ఇరవవేల మంది పోలీసులతో కనీ వినీ ఎరుగని రీతిలో చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా 84 హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 2 హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను నక్సల్ ప్రభావిత ప్రాంతమయిన పాడేరు ప్రాంతానికి కేటాయించారు. అదేవిధంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా దాదాపు 60 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలయిన తెదేపా, వైకాపాలకు చాలా కీలకమయినవి గనుక ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల నడుమ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండవచ్చనే ఆలోచనతోనే ఇంత భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వస్తోంది.   ఇక రాష్ట్ర విభజన తరువాత ఒక సంధికాలంలో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరికి విజయం దక్కుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇంత మంది పోటీ చేయాలనుకోవడం విశేషమే. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రానట్లయితే, అప్పుడు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన గెలిచినవారే కింగ్ మేకర్స్ అవుతారు. బహుశః అందుకే ఈ సారి ఇంతమంది బరిలో దిగి ఉండవచ్చును. అయితే ఈసారి ఇంతగా పోరాటం చేసిన తరువాత ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన దానికి పెనుసవాళ్లు ఎదుర్కోక తప్పదు. ఆరు నూరయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదు.

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది

      సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కి రెండు రోజుల ముందు ప్రచారాన్ని ఆపే సంప్రదాయం ప్రకారం సోమవారం నాలుగు గంటలకు పది అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగిసింది. సాయంత్రం ఆరుగంటలకు మిగతా 165 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్రలో ఈనెల ఏడో తేదీన 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 274 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది పోలీసులు కూడా శాంతిభద్రతలను కాపాడతారని ఆయన చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ఆదుకోవడానికి మూడు వేల అదనపు ఈవీఎంలను కూడా సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కి పిచ్చి ముదిరిందట!

      పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లాడు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు.. జగన్ పార్టీలో వున్న మహిళా తిట్ల స్పెషలిస్టు వాసిరెడ్డి పద్మ. పాపం ఈమె చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. ఏ పార్టీలో వున్నా ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టడంలో బోలెడంత అంకితభావం చూపిస్తూ వుంటారు.   తాజాగా పవన్ కళ్యాన్ జగన్‌ని విమర్శలతో తూట్లు పొడుస్తున్నారు. అయితే జగన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఏమీ అనడం లేదు. పవన్ కళ్యాణ్‌ది తన స్థాయి కాదని అనుకున్నాడేమోనని, తన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే బాధ్యతలు అప్పగించారు. దాంతో పద్మగారు పవన్ కళ్యాణ్‌ని తిట్టడం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ లైమ్ లైట్‌లోకి వచ్చిన పద్మ మేడమ్ ఇప్పుడు జగన్ పార్టీలోకి మారడం వల్ల పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు.  రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటి లాగానే చంద్రబాబుని తిట్టడంతోపాటు పనిలోపనిగా పవన్ కళ్యాణ్‌ని కూడా తిట్టిపోశారు. పవన్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లవాడని ధ్వజమెత్తారు. పవన్ తన తప్పుడు మాటలకు అర్జెంటుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  

మళ్ళీ పెళ్ళి చేసుకున్న వినోద్ కాంబ్లి

      మాజీ క్రికెటర్, మొన్నీమధ్యే గుండెపోటుకు గురై కోలుకున్న వినోద్ కాంబ్లీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. వినోద్ కాంబ్లీకి ఇప్పటికే ఆండ్రియా హెవిట్ అనే మహిళతో పెళ్ళయింది కదా.. వీళ్ళిద్దరికీ జీసస్ క్రిస్టియానో అనే కొడుకు కూడా వున్నాడు కదా.. తీవ్రమైన గుండెపోటు వచ్చి, చావుదాకా వెళ్ళొచ్చి కోలుకున్న కాంబ్లీని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఆ అమాయకురాలెవరు.. ఈ సందేహాలన్నీ వస్తున్నాయి కదూ?!   ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాం. వినోద్ కాంబ్లీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.. అయితే పెళ్ళి చేసుకుంది ఎవర్నో కాదు. తన భార్య ఆండ్రియా హెవిట్‌నే! కొడుకు సాక్షిగా వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని సెయింట్ పీటర్స్ చర్చ్ లో జరిగిన వేడుకలో కాంబ్లి తన భార్య అండ్రియా హెవిట్‌నే కాథలిక్ సంప్రదాయంలో పెళ్లాడాడు. కాంబ్లి, ఆండ్రియా మొదటిసారి పెళ్ళిచేసుకోవడానికి ముందు చాలాకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత కోర్టు ద్వారా వినోద్, ఆండ్రియాలు తమ వైవాహిక సంబంధానికి చట్టబద్దత కల్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, ఆ తర్వాత బతికి బయటపడిన కాంబ్లీ ఆధ్యాత్మిక చింతనకు లోనయ్యాడట. దాంతో దేవుడి మీద నమ్మకం పుట్టేసి తన భార్యని ఈసారి సంప్రదాయ పద్ధతిలో పెళ్ళాడాలని ఈ ‘సెకండ్ మ్యారేజ్’ కార్యక్రమం పూర్తి చేశాడట. ఆండ్రియాల వివాహ వేడుకకు బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, ఆయన సతీమణి, నటీమణి రేణుకా సహానీలు హాజరయ్యారు.  

‘నరసింహ’ డైలాగ్ కొట్టిన లోకేష్!

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సీమాంధ్రలో ప్రచారంలో తండ్రితో పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రమ్మని ఎవర్నీ బొట్టుపెట్టి పిలిచేది లేదు అని జూనియర్ ఎన్టీఆర్ మీద మొదటిసారి సెటైర్ వేసిన లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని తన భుజాల మీదకు తీసుకున్నారు. ప్రచార గడువు సోమవారంతో ముగుస్తున్న తరుణంలో లోకేష్ తన ప్రసంగంలో మంచి మంచి సినిమా డైలాగులు కొడుతూ, వాటిని పాలిటిక్స్‌ కి అన్వయిస్తూ సభకు వచ్చినవాళ్ళని ఆకట్టుకుంటున్నారు. సోమవారం ఆయన ఒక బహిరంగ సభలో రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఒక పాపులర్ డైలాగ్‌ కొట్టారు. ఆ సినిమాలో రజనీకాంత్ ‘‘అతిగా ఆశపడిన మగాడు.. అతిగా ఆవేశపడిన ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు’’ అంటారు. అదే డైలాగ్‌ని లోకేష్ కూడా ఉపయోగించారు. ఆ తర్వాత దానికి పొలిటికల్ వివరణ కూడా ఇచ్చారు. జగన్ అతిగా ఆశపడే మగాడట.. షర్మిల అతిగా ఆవేశపడే ఆడదట. అంచేత వీళ్ళిద్దరూ బాగుపడరట. లోకేష్ ఈ డైలాగ్ చెప్పి వివరణ ఇచ్చినప్పుడు సభ చప్పట్లతో మార్మోగిపోయింది.

విశాఖ జిల్లాలో పేలిన మందుపాతర

      ఎన్నికల ముందు ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. డబ్బు, మద్యం ప్రవహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అల్లర్ల సృష్టించడానికి సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి వరకు శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి సేకరించి పెట్టుకున్న బాంబుల లాంటి ఆయుధాలను పోలీసులు అనేక ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో మందు పాతర పేలింది. విశాఖ జిల్లా పెద్ద బయలు మండలం చీకుపనస గ్రామంలో సోమవారం నాడు మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ మందుపాతరకి, ఎన్నికలకు సంబంధం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక్‌సభలో ఏ పార్టీకి మెజారిటీ రాదు: ప్రియాంక

      నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ వస్తుందని డాంబికాలు పలికిన ప్రియాంకా గాంధీకి హఠాత్తుగా జ్ఞానోదయం కలిగినట్టుంది. అందుకే తన తమ్ముడి నియోజకవర్గం అమేథి సాక్షిగా మనసులోని మాటను బయటపెట్టారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం రాదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్‌కి మెజారిటీ రాదన్న విషయం ఏనాడో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయం ప్రియాంకకి కొత్తగా అర్థమైనట్టుంది. అయితే ప్రియాంక వ్యాఖ్య వెనుక అసలు ఉద్దేశం మరోటి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దీనిని తట్టుకోలేని ప్రియాంక కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా పూర్తి మెజారిటీ రాదని చెప్పడం కోసమే ఇలా వ్యాఖ్యానించి వుంటారని పరిశీలకులు అంటున్నారు.

నన్ను చంపాలనుకున్నోళ్ళే చచ్చారు: పాల్

      ఎప్పుడూ కామెడీ స్టేట్‌మెంట్లు ఇచ్చే మత ప్రచారకుడు కేఏ పాల్ తాజాగా చాలా సీరియస్‌గా మాట్లాడాడు. తనను గతంలో చాలామంది చంపాలని అనుకున్నారని, తనను చంపాలని అనుకున్నవాళ్ళే చచ్చారని కేఏ పాల్ చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ విన్నాక, పాల్‌ని చంపాలనుకున్నవాళ్ళు.. ఆ తర్వాత చచ్చిపోయినవాళ్ళు ఎవరబ్బా అనే ఆలోచన రాష్ట్రంలో మొదలైంది. చాలామంది మనసులలో ఒక పేరు స్ఫురించినప్పటికీ, పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులూ అనే పాట గుర్తొచ్చి సైలెంట్‌గా వుండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకూ స్ఫురించింది కదూ.. అయితే మనసులోనే పెట్టేసుకోండి. అన్నట్టు కేఏ పాల్‌కి వైసీపీ అధినేత జగన్ మీద పీకలదాకా కోపం వున్నట్టుంది. జగన్ పేరు చెబితేనే పాల్ పాలు మరిగినట్టు మరిగిపోతున్నాడు. జగన్ ఈ ఎన్నికలలో పొరపాటున కూడా గెలవడని ప్రార్థనల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు. ఒకప్పుడు బిజీ మత ప్రచారకుడిగా వున్న కేఏ పాల్‌ని అణగదొక్కేసి, బ్రదర్ అనిల్‌కుమార్ని మత ప్రచారకుడిగా పైకి తేవడానికి కుట్ర జరిగిందన్న అభిప్రాయాలు జనంలో వున్నాయి. ఈ కుట్రలో భాగంగానే కేఏ పాల్ మీద ఏవేవో కేసులు పెట్టి జైల్లో వేయించారన్న అభిప్రాయలు కూడా వున్నాయి. అందుకే కేఏ పాల్ ఇప్పుడు జగన్ మీద విరుచుకుపడుతున్నాడు.

రాష్ట్ర విభజనపై స్టే‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

      రాష్ట్ర విభజన విషయంలో సుప్రీంకోర్టు మీద ఆశలు పెట్టుకున్న సీమాంధ్రులకు తీవ్ర నిరాశ కలిగింది. రాష్ట్ర విభజన మీద సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల మీద సుప్రీం కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర విభజన మీద సుప్రీం కోర్టు స్టే విధించే అవకాశం వుందన్న ఊహాగానాలకు సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర విభజన మీద ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను ఆగస్టు 20వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జూన్ 2న వున్న అపాయింటెడ్ డేని రద్దు చేయాలని పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, సీమాంధ్ర ఎంపీలను గెంటివేసి, పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని విభజించారని అంటూ ఈ కేసును వాదిస్తున్న లాయర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పట్టించుకోలేదు.

జగన్ పార్టీ మందు, డబ్బు బోగస్సే..

      జగన్ పార్టీ సీమాంధ్రలో గెలిచి తీరాలనే ఉద్దేశంతో డబ్బు, మద్యం కుమ్మరిస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా చెల్లని నోట్లని, కల్తీ మద్యాన్ని కూడా పంచేస్తోంది. జగన్ పార్టీ నుంచి డబ్బు తీసుకున్న చాలామంది అవి చెల్లని నోట్లని తెలుసుకుని లబోదిబో అంటున్నారు. కొంతమంది అయితే తాము డబ్బు తీసుకోవడం పెద్ద తప్పు అనే విషయాన్ని మరచిపోయి, తమకు జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇచ్చిందంటూ పోలీస్ స్టేషన్లని కూడా ఆశ్చయించిన సందర్భాలు వున్నాయి. జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇస్తే ఇచ్చింది. వాటివల్ల పెద్ద ప్రమాదం లేదు. కల్తీ మద్యం సరఫరా చేస్తోంది. అదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు జగన్ పార్టీ నాయకులు పోయించిన కల్తీ మద్యం కారణంగా ఇప్పటికే సీమాంధ్రలో ముగ్గురు చనిపోయారు. ఎన్నికల లోపు ఎంతమంది చనిపోతారో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘పవన్ కళ్యాణ్ హఠావో’ పుస్తకం వెనుక వున్నదెవరు?

      పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన వెంటనే చేసిన నినాదం ‘కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో’. ఈ నినాదం ఆయన్ని మోడీకి చేరువ చేసింది. తెలుగుదేశం పార్టీకి చేరువ చేసింది. ఈ నినాదాన్ని పవన్ కళ్యాణ్ రకరకాలుగా మారుస్తూ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్‌ని పవన్ కళ్యాణ్ మీదే రాజకీయ ప్రత్యర్థులు ప్రయోగించారు. ‘పవన్ హఠావో.. సీమాంధ్ర బచావో’ అనే పుస్తకం ఒకటి విడుదల చేశారు. ఆ పుస్తకం కూడా ఎవరో దారిన పోయే దానయ్య రాయలేదు.. పవన్ కళ్యాణ్ అభిమానే రాశాడట. ఈ పుస్తకం వెనుక జగన్ పార్టీయే వుండొచ్చన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్రలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ మీద విమర్శులు గుప్పిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే సీమాంధ్ర సర్వనాశనం కావడం ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయనను డ్యామేజ్ చేయడానికే ఓ ‘అభిమాని’ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పుస్తకం రాయించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబుకి జైరాం రమేష్ ప్రచారం?

      కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజన సూత్రధారి జైరాం రమేష్ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచారం చేయడమేంటి? ఆశ్చర్యంగా వుంది కదూ? ఇది పాక్షికంగా నిజం. అదెలాగంటే, ప్రస్తుతం సీమాంధ్రలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు, మరొకరు వైసీపీ నేత జగన్.   ఈ ఎన్నికల తర్వాత జగన్ సీఎం కావడం కాదు.. చంచల్‌గూడాలో పర్మినెంట్‌గా సెటిల్ కావడం ఖాయమని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతోంది.  అందువల్ల ఈసారి చంద్రబాబుకే ముఖ్యమంత్రి పట్టం కట్టాలని సీమాంధ్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. జగన్‌ పార్టీకి ఓటు వేయొద్దని కనిపించినవాళ్ళందరికీ చెబుతున్నారు. ఇప్పుడు జైరాం రమేష్ కూడా చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. జైల్లో వుండి బయటకి వచ్చిన జగన్‌కి ఓటేయొద్దు అని గత వారం పదిరోజులుగా అయన అనేకసార్లు చెబుతూ వస్తున్నారు. జగన్‌కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఆయన చెబుతున్నారు తప్ప.. కాంగ్రెస్‌లో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత వుందో ఆయన చెప్పలేకపోతున్నారు. జైరాం రమేష్ తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారోగానీ ఆయన  పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

మా అల్లుడు వెరీగుడ్డు: సూపర్‌స్టార్ కృష్ణ

      అల్లుడు గారు ఎన్నికలలో పోటీ చేస్తుంటే మామగారు అల్లుడి గెలుపు కోరుకోవడం మామూలే. మన సూపర్‌స్టార్ కృష్ణ కూడా తన మామగారి మనసును బయటపెట్టారు. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. చాలా మంచోడు, నలుగురికీ ఉపయోగపడేవాడైన మా అల్లుడికి ఓటేసి గెలిపించండి అని మామగారి హోదాలో కృష్ణ ఓటర్లను రిక్వెస్ట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్‌ను గెలిపించాలని కృష్ణ తన అభిమానులను, గుంటూరు లోక్‌సభ ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలో ఓ మంచి పారిశ్రామికవేత్తగా జయదేవ్ ఎంతో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అమర్‌రాజా గ్రూపు అధినేతగా పరిశ్రమలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని సూపర్‌స్టార్ కృష్ణ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలో రైలు ప్రమాదం: 21మంది మృతి

      మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దివా-సావంత్‌వాడి పాసింజర్ రైలు ఇంజన్‌సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 21మంది ప్రయాణికులు మరణించగా, 145 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు నాగోధానే, రోహాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి 10వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సునీల్ తత్కరే ఆదివారం సాయంత్రం ప్రమాదస్థలి వద్దకు చేరుకుని సహాయచర్యలను సమీక్షించారు. Maharashtra Train Accident Photos

పవన్ కళ్యాణ్ తో షర్మిల ఢీ..!

  పవన్ కళ్యాణ్ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలతో ఊక్కిరిబిక్కిరి అవుతున్న వైకాపాను ఆదుకోవడానికి మళ్ళీ షర్మిలే ముందుకు వచ్చారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ కు అంతే ధీటుగా బదులిస్తూ, ఆయన ఆలోచనలకి,మాటలకి, చేతలకి ఎక్కడా పొంతన ఉండదని విమర్శించారు. పార్టీ పెట్టినప్పుడు మీకు నచ్చిన వారికే ఓట్లు వేసుకోమని ప్రజలకు ప్రభోదించిన ఆయన, ఆ తరువాత మోడీకి, ఇప్పుడు చంద్రబాబుకి ఓట్లు వేయమని అడగడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుని తీవ్రంగా వ్యతితిరేఖించిన ఆయన ఈసారి ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేయమని ఏ మొహం పెట్టుకొని ప్రజలను అడుగుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చివాడిలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, ఊగిపోతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అటువంటి పిచ్చోడు చెప్పిన మాటలు విని, ఆయన చెప్పిన అభ్యర్ధులకు మీరు ఓట్లు వేస్తారా? అని ప్రజలను అడిగారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొత్తగా పెళ్ళయిన జంటలా రాసుకుపూసుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.   చంద్రబాబు ఎన్నికలలో గెలిచేందుకు మోడీని, వెంకయ్య నాయుడిని వెంటతెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించక పోయినా, ఆయన వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని షర్మిల అన్నారు. హిందూపురం నుండి పోటీ చేస్తున్న బాలకృష్ణకు ఏవిధంగా మతిస్థిమితం లేదో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మతి స్థిమితం లేదని ఆమె ఎద్దేవా చేసారు. అటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులు చెపుతున్న మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఆనక వారే తీవ్రంగా నష్టపోతారని ఆమె హెచ్చరించారు.