జగన్ పై విరుచుకు పడుతున్న అధికార పార్టీ నేతలు.. కౌంటర్ కు ప్రతి కౌంటర్లు

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన.. రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసులు లేవు.. అంగన్ వాడీ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు లేవు.. విద్యార్ధి రితికేష్వరీ కామాంధులకు బలైపోయింది ఆ కేసుకు సంబంధిచిన వారిపై కేసులు లేవు.. నిజంగా రాష్ట్రంలో మహిళలను గౌరవిస్తున్నామా..? అని ప్రశ్నించారు.   దీంతో జగన్ మాటలకు మళ్లీ అచ్చెన్నాయుడు స్పందించి ఆయనకు గట్టిగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగే నీచ స్థాయికి జగన్ వచ్చారు.. పాత విషయాలే ప్రస్తావిస్తున్నారు.. కొత్త విషయం ఒక్కటైనా ఉందా..? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు.. సలహాలు, సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం అని అన్నారు. దీంతో జగన్ మీరు చేసే అన్యాయాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మైకే కట్ చేసి తిట్టిస్తారా అని అన్నారు.   అంతేకాదు రావెల సుశీల్ అంశాన్ని కూడా జగన్ ప్రస్థావించారు. దీంతో రావెల స్పందించి.. తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే.. నా కుమారుడు సుశీల్ తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమే.. పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడు.. అని వ్యాఖ్యానించారు.. దీనికి జగన్.. కొడుకు తప్పు చేస్తే నన్ను నిందిస్తున్నారు.. ఓ శాసనసభ్యుడి మాటలపై నేషనల్ ఛానెళ్లలో చర్చు జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. 

బీజేపీ పొత్తుపై పీడీపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీజేపీతో పొత్తు నా తండ్రి వీలునామా..

  పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సయీద్ భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపై గత కొద్ది రోజుల నుండి వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. ఒకానొక సందర్భంలో పీడీపీ, బీజేపీతో పొత్తు విరమించుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మెహబూబా ముఫ్తీ సయీద్ పొత్తుపై మాట్లాడుతూ బీజేపీతో పొత్తు అనేది తన తండ్రి దివగంత ముఫ్తీ మహ్మద్ సయీద్ జీవించివుండగా రాసిపెట్టిన వీలునామా అని..  తన తండ్రి మాట శిలాశాసనం లాంటిదని, ఆయన మాట జవదాటబోమని అన్నారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు అన్నది మా తండ్రి తీసుకున్న నిర్ణయం అని.. ఒక తండ్రి పిల్లలకు వీలునామా రాశాడంటే... దాన్ని అమలుపరచడం ద్వారా వాళ్లు నాశనమైపోయినా సరే... దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని..ఈ పొత్తువల్ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా నాశనమైనప్పటికీ అధైర్యపడి వెనుకంజ వేయబోమని స్పష్టంచేశారు. దీంతో పీడీపీ, బీజేపీ తో పొత్తు ఓకే అయినట్టు తెలుస్తోంది.

మరో వివాదంలో స్మృతీ ఇరానీ.. చేతులు జోడించినా వెళ్లిపోయారు..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరో వివాదంలో స్మృతీ ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. స్మృతీ ఇరానీ శనివారం రాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా ఆమె కాన్వాయ్ ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన కుమార్తె స్మృతీ పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత వైద్య సహాయం అందించడానికి మంత్రి ముందుకు రాలేరని.. కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. పిల్లలు సహాయం కోసం అర్థిస్తున్నా మంత్రి స్మృతి ఇరానీ చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె సోదరుడు అభిషేక్‌ ఆరోపించాడు. దీంతో అభిషేక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు.   ఇదిలా ఉండగా జరిగిన ఈ ఆరోపణలకు మంత్రి కార్యాలయం స్పందించి.. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని.. మంత్రి కారు వల్ల ప్రమాదం జరగలేదని ఎస్‌ఎస్‌పీ రాకేష్‌ సింగ్‌ తెలిపారు.

జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం.. మాట్లాడే హక్కు లేదు..

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి అచ్చెన్నాయుడు కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. బొగ్గు నుంచి కరెంట్ వరకు రాష్ట్రంలో కుంభకోణం జరిగిందని.. ఎల్ఈడీ బల్పుల కొనుగోలులో స్కాం జరిగిందని అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందించి.. విద్యుత్ ఆదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల ఉపయోగాన్ని పెంచామని, వీధి దీపాలు పెట్టామని.. అన్నారు. జగన్, వైసిపి నేత బొత్స సత్యనారాయణ వంటి వారికి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

టీడీపీకి మరో షాక్.. వారిద్దరూ కూడా టీఆర్ఎస్ లోకి..?

తెలంగాణలో ఇప్పటికే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. టీడీపీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ  సమావేశానికి వీరిద్దరు డుమ్మా కొట్టడంతో వీరిద్దరు కూడా టీడీపీ వీడనున్నట్టు తెలుస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక వీరిని చేర్చుకోవాలని తెరాక నేతలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లినస్ మృతి

ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లిసన్ కన్నుమూశారు. 74 ఏళ్ల రే, వాషింగ్టన్లోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.  ఆయన 1941 ఏప్రిల్ 23 న న్యూయార్క్ లో జన్మించారు . కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఎక్స్ పర్ట్ గా రాణించి, ఈ మెయిలింగ్ సిస్టమ్ ను కనిపెట్టారు. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మెయిల్ పంపడం ఎలా అన్నదానిపై పరిశోధనలు చేసి, ఎట్టకేలకు 1971లో బోస్టన్ లో తను పనిచేస్తున్న సంస్థలో తోటి ఉద్యోగికి మొట్టమొదటి మెయిల్ ను పంపించారు. మెయిల్ కోసం ఉపయోగించే @ సింబల్ ను కూడా మొట్ట మొదట ఆయనే ఉపయోగించడం విశేషం. ఈమెయిల్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ సమూలంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారడంలో ఈమెయిల్ చాలా కీలక పాత్ర పోషించింది. రే చేసిన సేవలకు మెచ్చి ఆయన్ను ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ వరించింది. ఇంతటి మేధావి మరణించడం పట్ల నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా బంగ్లాదేశ్ ఫైనల్ కు తుఫాన్ ముప్పు

  ఆసియా టి20 కప్ లో భాగంగా, ఈరోజు రాత్రి ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, మ్యాచ్ జరగనున్న మీర్ పూర్ లో తుఫాన్ వాతావరణం నెలకొంది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వేస్తున్నాయి. దీంతో మ్యాచ్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. ఒక వేళ వర్షం వెలిసిపోతే, కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో, ఫైనల్ కోసం రిజర్వ్ డే కేటాయించని కారణంగా, కప్ ను ఇండియా బంగ్లాదేశ్ రెండూ విజేతలుగా పంచుకుంటాయి. మరో వైపు బంగ్లాదేశ్ ను ఫైనల్లో కూడా చిత్తుచేసి ఈ ఏడాది టి20 ఫేవరెట్స్ అని ప్రూవ్ చేసుకోవాలని టీం ఇండియా చూస్తుంటే, ఎలాగైనా ఇండియాను ఓడించి, ప్రపంచదేశాలకు తామంటే ఏంటో చూపాలని బంగ్లా తహతహలాడుతోంది.

నా కొడుకు తప్పు చేయలేదు : రావెల

రాజకీయంగా కుట్ర పన్ని నా కొడుకును ఇరికించారు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు అన్నారు రావెల కిషోర్. కేవలం తమను దెబ్బ తీసేందుకు, జగన్ ఇలాంటి ఆటలు ఆడిస్తున్నారంటూ ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, తన కుమారుడు నిర్దోషిగా బయటికి వస్తాడని ఆయన అన్నారు. చంద్రబాబు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తుంటే, చూడలేకే జగన్ నీచానికి దిగజారుతున్నారంటూ విమర్శించారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు మమ్మల్ని విమర్శించే హక్కు లేదంటూ, జగన్ కులాల కుమ్ములాటను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు మంత్రి. కాగా ఇప్పటికే రావెల సుశీల్ పోలీసులకు లొంగిపోయారు. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ, సుశీల్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..

గుజరాత్ లో టెర్రర్ అలర్ట్ : రంగంలోకి దిగిన గార్డ్స్

గుజరాత్ లో టెర్రర్ ఎలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు పదిమంది మిలిటెంట్లు, రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు ఇంటిలెజన్స్ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీని భారీగా పెంచారు. ముఖ్యంగా సముద్రతీరప్రాంతమంతా కోస్టల్ గార్డ్స్ గస్తీ తిరుగుతున్నారు. కుచ్ తీరం వద్ద గత మూడు నెలల్లో ఐదు పడవలు వదిలేసి వెళ్లడంతో అనుమానం బలపడింది.   పాకిస్థాన్ సెక్యూరిటీ అడ్వైజర్ నాసిర్ జంజువా 10 మంది గుజరాత్ లోకి ప్రవేశించారని కన్ఫామ్ చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అడిషనల్ సిఎస్ శనివారం, త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. గుజరాత్ లో సోమ్ నాథ్ ఆలయం, ద్వారకేశ్వర ఆలయం, అక్షర్ థాం, సర్దార్ సరోవర్ డ్యాం లాంటి కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. పోలీసులు బస్ట్ స్టాప్ లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారందరినీ చెకింగ్ చేస్తున్నారు. శివరాత్రి రోజున దేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి.

మంత్రి గారి కొడుకు కుక్కపిల్ల కోసం వెళ్లాడా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తన ఫేస్ బుక్ లో సుశీల్ వివరణ ఇచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం కుక్కపిల్లను కాపాడే ప్రయత్నం చేశానని, ఆ మహిళ అడ్డొచ్చి స్థానికులతో కలిసి తనపై దాడి చేసిందని, ఇదంతా కేవలం రాజకీయమేనంటూ ఆరోపించారు.   కానీ సంఘటనా స్థలం దగ్గర ఒక షాపుకు సంబంధించిన సీసీ క్యామ్ ఫుటేజ్ లో చూస్తే, అక్కడ ఎలాంటి కుక్కపిల్లా లేదు. పైగా, కారు స్లో అవడం, కారును చూసి మహిళ వేగంగా నడిచివెళ్లిపోవడం మాత్రమే సీసీ ఫుటేజ్ లో ఉంది. న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన ఈ ఫుటేజ్ కు, సుశీల్ తన ఫేస్ బుక్ లో చెబుతున్న దానికి పొంతన లేదు. ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరో వైపు నిందితుణ్ని శిక్షించాలంటూ మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి.

దిల్లీ పోలీసుకు ఇక నుంచి పెళ్లిరోజు సెలవులు

పోలీసు ఉద్యోగమంటేనే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు ఎప్పుడు మొదలవుతాయో, ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియని పనివేళలు ఉంటాయి. ఒకోసారి రోజుకి 18గంటల పాటు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. దానివల్ల సమాజానికి రక్షణని అందించే పోలీసులకే ప్రశాంతత లోపించే సందర్భాలు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు వారు మానసికంగా కుంగిపోవడం, ఉన్నతాధికారుల మీద సైతం తిరగబడటం సాధారణమైపోతోంది.   దీనికి దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. దిల్లీ పోలీసులు తమ పెళ్లిరోజునాడు, పిల్లల పుట్టినరోజునాడు సెలవు తీసుకోవచ్చని ఉత్తర్వు జారీ చేశారు. మరీ అత్యవసరం అయితే తప్ప ఈ వెసులుబాటుకి అభ్యంతరం చెప్పకూడని నిబంధన పెట్టారు. దీనివల్ల 70,000కి పైగా ఉన్న దిల్లీ పోలీసులు తమకి ఇష్టమైన రోజున తమ మనసుకి దగ్గరైన కుటుంబసభ్యులతో గడపవచ్చునన్నమాట. అయితే ఈ ఆలోచన దిల్లీ పోలీసులదే అనుకుంటే పొరపాటే! మహారాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరం నుంచే ఇలాంటి పద్ధతిని అమలు చేస్తోంది.  

ధోనీ తల నరికిన పోస్టర్లు!

రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ జరిగే ముందు, మాటల యుద్ధం సాధారణమే! కానీ భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య ఆసియాకప్‌ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఒక పోస్టరు పెను వివాదాన్నే రాజేస్తోంది. టాస్కిన్‌ అహ్మద్‌ అనే బంగ్లా ఫాస్ట్‌ బౌలరు, ధోనీ తలను నరికి చేత్తో పట్టుకున్న ఈ పోస్టరు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భారత్‌ క్రికెట్‌ అభిమానులంతా ఈ చిత్రాన్ని చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. అయితే ఇలాంటి పోస్టర్లను సృష్టించడం బంగ్లా క్రికెట్‌ అభిమానులకు కొత్తేమీ కాదు. 2015లో ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్‌, భారతీయ బ్యాట్స్‌మెన్లను ఇబ్బందిపెట్టిన సందర్భంగా ఒక బంగ్లా పత్రిక, భారతీయ బ్యాట్స్‌మెన్‌ అందరికీ ముస్తాఫిజుర్‌ అరగుండు కొట్టినట్లుగా ఓ చిత్రాన్ని రూపొందించింది. క్రికెట్లో బంగ్లాదేశ్‌, భారత్ జట్ల మధ్య ఉన్న వివాదం ఈనాటిది కాదు. 2015 ప్రపంచ కప్ సందర్భంగా క్వార్టర్‌ ఫైనల్స్ ఆడుతున్నప్పుడే ఈ వైరానికి బీజం పడింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఔటైనా కూడా అంపైర్‌ అతణ్ని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతకాన్ని సాధించి ఇండియాని గెలిపించాడు. అదిగో! అప్పటి నుంచి... బంగ్లా క్రికెట్‌ అభిమానులు ఇండియా అంటేనే విరుచుకుపడిపోతున్నారు. ఒకోసారి ఆ ఆవేశం హద్దులను, సభ్యతను కూడా దాటుతున్నట్లుంది!

రెండేళ్ల పాప పోలీసులకి ఫోన్‌ చేసింది... ఎందుకంటే...

అమెరికాలోని గ్రీన్‌విల్లే అనే ప్రాంతం. అక్కడ మొన్న బుధవారం పోలీసులకి ఒక ఫోన్‌ వచ్చింది. తీరా చూస్తే అవతలివైపు ఎవరో చిన్న పాప మాట్లాడుతోంది. ఇంతకీ ఆ పాపకి వచ్చిన అవసరం ఏంటనుకుంటున్నారా... తనకి ప్యాంట్ వేసుకోవడం చేతకావడం లేదనీ, వచ్చిన కాస్త ప్యాంట్ వేసిపెట్టమని ఫోన్‌ చేసిందట. అసలు విషయం ఏంటో కనుక్కుందామని బయల్దేరిన ‘మార్తా లోన్స్’ అనే మహిళా అధికారి, సదరు ఇంటిని చేరుకునేసరికి ఓ రెండేళ్ల పాప కనిపించింది. తను ఓ ప్యాంటు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ, కానీ చేతకావడం లేదనీ కాస్త సాయం చేయమనీ అడిగిందట ఆలియా అనే ఆ పాప. ప్యాంట్ వేసుకోవడం కూడా చేతకాని పిల్లలు సైతం పోలీసులకు ఫోన్ చేయగలుగుతున్నారంటే... వాళ్లు ఎంత చురుకుగా తయారవుతున్నారో చెప్పేదేముంది! ఆ సాయంత్రం పని నుంచి ఇంటికి తిరిగివచ్చిన ఆలియా వాళ్లమ్మ, పాప చేసిన ఘనకార్యం విని తెగ మురిసిపోయిందట. ‘ఇంకా మా పాప మున్ముందు ఏం చేస్తుందో చూడాలి’ అంటూ ఎదురుచూస్తోంది ఆలియా వాళ్లమ్మ!

వాడేసిన ఫోన్లను ఇండియాలో అమ్ముతాం : ఆపిల్ సంస్థ

బయటి దేశాల్లో వాడేసిన యాపిల్ ఫోన్లను ఇండియాలో అమ్మడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది యాపిల్ సంస్థ. ఇక్కడి జనాలకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మడం ద్వారా, భారత్ లో తమ మార్కెట్ ను మరింత విస్తృతపరుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఫోన్ ఖరీదు చాలా ఎక్కువ కావడంతో, చాలా మంది భారతీయులు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లకే మొగ్గు చూపుతున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది యాపిల్ ప్లాన్. టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాజ్యసభకు లిఖిత పూర్వకంగా దీన్ని తెలిపారు. అయితే ప్రభుత్వం, ఈ విషయం మీద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

కన్నయా నాలుక తెగ్గోస్తే 5 లక్షలు...ఓ యువనేత ప్రకటన!

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాజపాకు చెందిన ఓ యువనేత చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని బదావ్ జిల్లాకు చెందిన కుల్‌దీప్‌ అనే నాయకుడు, కన్నయాకుమార్‌ నాలుకను తెగ్గోస్తే 5 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించేశాడు. కన్నయాకుమార్‌ జైలు నుంచి వచ్చిన దగ్గర్నుంచీ కూడా భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనీ అందుకని అతనికి తగిన శిక్ష విధించాలంటూ కుల్‌దీప్‌ ఈ ప్రకటన చేశాడు. కుల్‌దీప్‌ ప్రకటన వివాదాస్పదం కావడంతో భాజపా అతణ్ని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కన్నయాకుమార్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా ఒక సమావేశాన్ని నిర్వహించిని విషయం తెలిసిందే! ప్రస్తుతం కన్నయాకుమార్‌ దేశద్రోహం కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు.