మంత్రి కుమారుడి మీద నిర్భయ చట్టం
posted on Mar 5, 2016 @ 1:54PM
అసలే మంత్రి కుమారుడు, ఆపై తాగి ఉన్నాడు. దారిన పోతూ ఉన్న ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై నిన్న వచ్చిన ఈ ఆరోపణతో రాజకీయ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కుమారుడు కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తెలంగాణకు చెందిన నేతలు స్వయంగా రంగంలోకి దిగి సుశీల్ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల మీద ఒత్తిడిని తీసుకువచ్చారు. దాంతో సుశీల్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న సుశీల్ మాత్రం, తాను ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదనీ, చిన్నపాటి గొడవను పెద్దది చేస్తున్నారంటూ తన ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చుకున్నాడు.
ఒక రాష్ట్ర మంత్రి కుమారుడి మీద నిర్భయం చట్టం కింద కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కేసులో సుశీల్ కనుక దోషిగా తేలితే ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు గారాల బిడ్డలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం కొత్త కాదు. కానీ ప్రతిసారీ ఏదో ఒక వివరణలతో వారు తప్పించుకుపోయేవారు. కానీ ఈసారి పరిస్థితి ఏమంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరి ఈ విషయంలో రావెల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి! కానీ ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో మాత్రం రాజకీయ యువ నేతల పట్ల మరింత విముఖత ఏర్పడే అవకాశం ఉంది.