మా ఊళ్లో ఆడపిల్ల పుట్టుక చావుతో సమానం..కంగనా తండ్రి!
ఇప్పటికీ దేశంలోని చాలాచోట్ల, ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను ప్రకటించింది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్. తను తల్లిదండ్రులకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడని, కాబట్టి ఆ కొడుకు మళ్లీ పుడతాడని వారు ఆశించారనీ, ఎప్పుడైతే తాను పుట్టానో వారి ఆవేదనని అంతులేకుండా పోయిందని చెప్పుకొచ్చింది కంగనా. తన కుటుంబంలోనే తాను ఒక అక్కర్లేని మనిషిగా పెరిగిందని బాధపడింది. తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ తను ఆడపిల్లననీ, చనిపోయిన కొడుకు బదులు పుట్టానని గుర్తుచేసేవారని వాపోయింది. ఈ విషయం మీద హిమాచల్ ప్రదేశ్‌లో నివసించే కంగనా తండ్రి కూడా నోరువిప్పారు.
తాము నివసించే ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే, ఆ ఇంట్లో ఏదో చావు సంభవించినంతగా జనం బాధపడిపోతారనీ, ప్రతిఒక్కరూ వచ్చి ఆడపిల్ల పుట్టినందుకు ఓదారుస్తారనీ చెప్పుకొచ్చారు. చనిపోయిన కొడుకు తిరిగి పుడతాడని ఆశించిన తాము, కంగనా పుట్టడంతో నిరాశ చెందిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కంగనా జీవితమే ఇలాంటి ఆటుపోట్లతో కూడుకున్నదనుకుంటే, ఆమె అక్క రంగోళీ పరిస్థితి ఇంకా దారుణం. రంగోళీ వెంటబడిన ఓ కుర్రవాడు ఆమె మీద యాసిడ్ పోసి పారిపోయాడు. దాంతో ఆమె శారీరికంగా, మానసికంగా ఎన్నో కష్టాలను అనుభవించారు. తన అక్క ఎదుర్కొన్న కష్టనష్టాల కథనే తెరకెక్కించేందుకు ఇప్పడు కంగనా సిద్ధపడుతోంది.