గత బడ్జెట్‌ కంటే పెరిగిన గ్రామీణాభివృద్ది కేటాయింపులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా గ్రామీణాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కవే కేటాయించారు. గత బడ్జెట్‌లో.. రూ.6,583 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. ఈసారి 10,731 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ది లక్ష్యంగానే 2015లో గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టామని..  మన వూరు- మన ప్రణాళికలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా గ్రామాభివృద్ధికి ప్రణాళిక తయారుచేయడమే గ్రామజ్యోతి ఉద్దేశమన్నారు. 2016-17లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.10,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్‌ఎస్‌ఎస్ ను ఐసిస్ తో పోల్చిన ఆజాద్.. రాజ్యసభలో దుమారం..

కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగుతోంది. ఆర్ఎస్ఎస్ ను ఐసిస్ ను పోలుస్తూ ఆజాద్  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎలాగైతే ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తామో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను కూడా వ్యతిరేకిస్తాం. ఇస్లాం మతస్తులు తప్పు చేస్తే.. అది ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు తప్పు చేసినట్లే అని ఆజాద్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ఆజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐసిస్‌తో పోల్చి ఆజాద్ నోరు జారారని..  ఈ రకంగా ఆయన ఐసిస్ ను గౌరవించారని.. దీన్ని బట్టి వారి మనస్థత్వాలు ఏంటో అర్దమయిందని అన్నారు.   అయితే దీనికి ఆజాద్ మాత్రం తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ను.. ఐసిస్ ను పోల్చి వ్యాఖ్యలు చేయలేదని.. కావాలంటే ఆ ప్రసంగానికి సంబంధించిన సీడీలను పరిశీలించాలని కోరారు.

పచ్చిమిరపకాయ ప్రాణాలు తీసింది

పచ్చిమిరపకాయని కొరకడం వల్ల ఓ రెండేళ్ల పాప తన ప్రాణాలనే కోల్పోయింది. దిల్లీలో జరిగిన ఈ సంఘటన ద్వారా పిల్లల ఉసురు తీసేందుకు ఎన్నిరకాలైన ప్రమాదాలు వేచిఉంటాయో మరోసారి తెలుస్తోంది. డా॥ చిత్తరజంన్ బెహరా అనే వైద్యుడు అందిస్తున్న సమాచారం ప్రకారం... మిరపకాయను తిన్న తరువాత విపరీతంగా వాంతులు చేసుకున్న ఆ పాప తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. జీర్ణాశయంలో ఉండే ద్రవాలు ఊపిరితిత్తులలోకి చేరుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా ఊపిరితిత్తులలోకి ఇలాంటి ద్రవాలు చేరుకున్నప్పుడు, అవి శ్వాసకు అడ్డుపడకుండా మన శరీరం ప్రయత్నిస్తుందనీ.... వాంతులు చేసుకోవడం, దగ్గడం ద్వారా మనిషి శ్వాసనాళంలో ఉన్న ద్రవాలు వెలుపలికి వెళ్లిపోతాయనీ చెబుతున్నారు. అయితే రోగి స్పృహ కోల్పోయినప్పుడు, రోగికి తెలియకుండానే ఊపిరితిత్తులు ద్రవాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు శ్వాస ఆడక రోగి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

జగన్ రికార్డ్ సృష్టించాడు.. ఉమా.. కుక్కలు మొరిగాయ్

  ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈసందర్బంగా అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడుతూ.. జగన్ వైఖరి నచ్చకే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని.. అధికార కాంక్షతో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. వైసిపి ఎమ్మెల్యేలే దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ఏపీ అభివృద్ది ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుతోనే సాధ్యమని.. ప్రజలు కూడా ఆ విషయాన్ని గమనించే టీడీపీని గెలిపించారని అన్నారు. కానీ జగన్ మాత్రం అధికార దాహంతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు తనపై ఉన్న కేసుల గురించి కూడా ఉమ ప్రస్తావించారు. 420 కేసులు, 11 ఛార్జీషీట్లు, 16 నెలలు జైలులో ఉన్న ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ రికార్డ్ సృష్టించాడని బోండ ఉమ ఎద్దేవా చేశారు.   దీనికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. గజరాజు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని టీడీపీ నేతలను కుక్కలతో పోలుస్తూ ఎద్దేవ చేశారు.

సింహం ముందు మతాధికారి మహిమ... పనిచేయలేదు!

‘ఫ్లూటు జింక ముందు ఊదు.... సింహం ముందర కాదు’ అని మన బాలయ్యబాబు చెప్పిన డైలాగుని సదరు మతాధికారి విన్నాడో లేదో కానీ, సింహాల ముందు తన మహిమను చూపించబోయాడు. ఎలెక్‌ డివానే అనే ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ క్రైస్తవ మతాధికారి. గత వారం ఎలెక్‌, చర్చిలోని తన సహచరులతో కలిసి, క్రూగెర్‌ అనే నేషనల్‌ పార్కుకి చేరకున్నాడు. అక్కడ తిరుగుతున్న సింహాలను చూడగానే ఎలెక్‌కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఒక్కసారిగా పూనకం పూనినవాడిలా వాహనం తలుపు తీసుకుని సింహాల దగ్గరకి పరిగెత్తాడు. మొదట్లో ఏదో ఆహారాన్ని తింటున్న సింహాలు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎలెక్‌ అరుపులు విన్న సింహాలు అతడి మీదకి వెళ్లడం మొదలుపెట్టాయి. తన మహిమ పనిచేయడం లేదని అనుమానం రావడంతో ఎలెక్‌ వెనక్కి తిరిగి పరుగు లంకించుకున్నాడు. కానీ సింహాలు వదుల్తాయా! ఒక సింహం అతని వెంటపడి ఎలెక్‌ పిరుదులను కొరికి పారేసింది. ఇంతలో అటవీశాఖ అధికారులు గాల్లోకి తుపాకులను పేల్చడంతో, సింహాలు పారిపోయాయి. ఎలెక్‌ ఊపిరి దక్కించుకున్నాడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎలెక్‌ను ‘మీరెందుకలా చేశారని’ అడిగితే.... ‘భగవంతుడు నా ద్వారా తన మహిమను చూపిస్తాడనుకున్నాడు. ఈ భూలోకంలోని జీవులందరి మీదా మనిషికే కదా అధికారం ఉంది’ అని వాపోయాడట ఎలెక్‌! పాపం ఎలెక్ నమ్మకం గురించి సింహాలకు తెలియదేమో! లేకపోతే సదరు మతాధికారికి కాస్త దూరంగా ఉండేవి కదా!

ఏపీ అసెంబ్లీ.. అవిశ్వాసం తీర్మానంపై చర్చ.. తీర్మానం ఎందుకు పెట్టారు..?

  ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది.. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. ఇంకా పలువురు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ఒక్క సభ్యుడైన పెట్టొచ్చు.. పేపరు మీద సంతకం చేసిన వాళ్లే మాట్లాడాలనుడం సరికాదు.. రాష్ట్రంలో కుళ్లు, కుతంత్ర రాజకీయాలు నడుస్తున్నాయని.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.. ఈ రోజే అవిశ్వాసంపై చర్చకు ఎందుకు అనుమతించారు అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని అన్నారు. జగన్ పై విశ్వాసం లేకే వైసీపీ నేతలు టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. ఎందుకు అవిశ్వాసం పెట్టారో వైసీపీ చెప్పాలి అంటూ.. పోలవరానికి అడ్డంకులు తొలగించాం అందుకా.. పెన్షన్లను ఐదు రెట్లు పెంచినందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారా అంటూ ప్రశ్నించారు.  

ప్రజల ఆరోగ్యంపై దృష్టి.. వైద్య సదుపాయలకు ప్రోత్సాహకాలు..

2016-17 సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వైద్య సదుపాయల పట్ల బాగానే దృష్టి సారించారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని ఈటల పేర్కొన్నారు. అన్నట్టుగానే గతేడాది కంటే ఈ ఏడాది రూ.1036 కోట్లు అదనంగా ఆరోగ్య శాఖకు కేటాయించారు.   * పీహెచ్‌సీల నుంచి నిమ్స్‌ వరకు అన్ని ఆసుపత్రుల్లో సమూల మార్పులు * ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు * గ్రామాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహం * రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తాం * 40 చోట్ల డయాలసిస్‌, 40 చోట్ల డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు * హైదరాబాద్‌లో పెరిగిన ప్రజల అవసరాల దృష్ట్యా మరో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..

తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని హైలైట్స్ * 2016-17 బడ్జెట్ అంచనా 1,30,415.87 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లు * 2015-16 రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో 11.76 శాతం వృద్ది * పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 7,861 కోట్లు * కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 6,286 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు * అసరా పెన్షన్లకు రూ. 4, 693 కోట్లు * కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కు రూ. 738 కోట్లు * ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు * సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సింగల్ విండో అనుమతులు * వచ్చే ఖరీఫ్ నుండి రైతులకు 9 గంటల విద్యుత్ * 2016 డిసెంబర్ లోగా 6 వేల గ్రామాలు, 12 పట్టణాలకు తాగునీరు. * సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,152 కోట్లు * రుణమాఫీకి కేటాయింపులు రూ. 3,178 కోట్లు * మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,553 కోట్లు * రహదారులు, భవనాలకు రూ. 3,333 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు * బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు * గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ కు రూ. 10,731 కోట్లు * రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,43,023గా ఉంటుందని అంచనా * జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 50శాతం ఎక్కువ * కేంద్ర నిధులు పన్నుల్లో వాటా తగ్గింది. * కేంద్రం నుండి 450 కోట్లు మాత్రమే వచ్చింది * వాగ్ధానాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం * ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం.

సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు పెద్దపీట..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్లోని అంశాలు * రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,43,023గా ఉంటుందని అంచనా * జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 50శాతం ఎక్కువ * 2016-17 బడ్జెట్ అంచనా 1,30,415.87 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లు * కేంద్ర నిధులు పన్నుల్లో వాటా తగ్గింది. * కేంద్రం నుండి 450 కోట్లు మాత్రమే వచ్చింది * వాగ్ధానాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం * ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం.

రెండేళ్ల పాపనీ వదల్లేదు.. అత్యాచారం ఆపై హత్యాయత్నం!

సమాజంలోని పరిస్థితులు ఆడపిల్లల పట్ల ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు, మరో వార్త వెలుగులోకి వచ్చింది. పంజాబులోని లుధియానాలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్ల పాప మీద అత్యాచారం చేసి ఆపై గొంతుకోసేశాడో కీచకుడు. ఆడుకోవడానికని వెళ్లిన తమ పాప ఎంతకీ తిరిగిరాకపోయేసరికి, ఆమె తల్లిదండ్రులు పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో తాళం వేసిన ఓ పాడుపడిన గదిలోంచి అరుపులు వినిపించడంతో, దాన్ని బద్దలు కొట్టి వెళ్లినవారికి అక్కడ రక్తపుమడుగులో తమ పాప కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పినట్లైంది. పాపను ఆడుకునేందుకు తీసుకువెళ్లిన ఓ పధ్నాలుగేళ్ల బాలుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఆ పిల్లవాడు కూడా కనిపించకుండా పోవడంతో, అతని మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త!

ఇక మీదట దుప్పట్లను రోజూ ఉతుకుతాం... రైల్వే

గత నెల రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా, ఏసీ బోగీల్లోని దుప్పట్లకు సంబంధించి రైల్వే మంత్రి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. సదరు బోగీల్లో ప్రయాణికులకు అందించే మందపాటి దుప్పట్లను, రెండు నెలలకి ఓసారి ఉతుకుతామని ఆయన చెప్పారు. ఈ విషయమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు రైల్వేలు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకమీదట రైల్వేలలో కొత్త తరహా దుప్పట్లను అందిస్తామనీ, వీటిని రోజూ ఉతికేందుకు వీలుగా ఉంటాయని రైల్వే మంత్రి తాజాగా ప్రకటించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT) సంస్థ రూపొందించే ఈ దుప్పట్లు వాడకానికి వీలుగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు... త్వరగా నిప్పు అంటుకోవని చెబుతున్నారు. కేవలం దుప్పట్లు మాత్రమే కాదనీ, రైళ్లలో వాడే దిండ్లు, కర్టెన్లు... ఇలా అన్నింటినీ మరింత ఆకర్షణీయంగానూ, ఉపయోకరంగానూ మార్చేందుకు NIFT కంకణం కట్టుకుందట! ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొద్ది రైళ్లలో మాత్రమే ఉపయోగించే ఈ సరంజామా, రాబోయే రోజుల్లో అన్ని రైళ్లలోకీ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు! సదరు దుప్పట్లను తక్కువ ధరకి కొనుక్కునే అవకాశం కూడా లభించవచ్చు. అదే కనుక జరిగితే.... మన దేశంలోని ప్రతి ఇంట్లోనూ రైల్వే దుప్పట్లే కనిపిస్తాయేమో!

మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వం.. వివరణ ఇవ్వాలని నోటీసులు

కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎప్పటినుండో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన పౌరసత్వంపై రాహుల్ కు ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మళ్లీ రాహుల్ కు పౌరసత్వంపై చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు సంగతేంటంటే.. రాహుల్ భారతీయుడు కాదని.. తనకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాహుల్ కు బ్రిటన్లో ఓ కంపెనీ ఉందని.. దానికి సంబంధించిన పత్రాలలో రాహుల్ తాను బ్రిటన్ వారసత్వానికి చెందిన వాడినని చెప్పినట్టు..  భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి మహేశ్‌ గిరి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు  ఫిర్యాదు చేయడంతో.. స్పీకర్ ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీకి పంపించారు. దీనిపై విచారణ జరిపిన పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ రాహుల్ తన పౌరసత్వంపై వెంటనే విచారణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.   ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ  ఈవ్యవహారంపై మండిపడుతోంది. స్పీకర్ ఫిర్యాదు చేసేముందు రాహుల్ గాంధీని సంప్రదించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ కు ఈ వారసత్వం గురించిన తలనొప్పులు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు.