అసలు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదు.. వెంకయ్యనాయుడు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీకి తాము చేసిన పనులు గురించి ప్రస్తావించారు. ఏపీలో ఎన్నో కేంద్రం విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశాం.. తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నషనల్ స్థాయికి తీసుకెళ్లామని, అమరావతి సమీపంలోని విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రూ. 65 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు.. విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేశామని వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి గుంటూరు, విజయవాడల అభివృద్ధికి రూ. 500 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. వైజాగ్, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్ణయించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి మండళ్లుగా గుర్తించామని వెంకయ్య తెలిపారు. ఏపీ హామీల విషయంలో కేంద్రం చిత్త శుద్దితో ఉంది.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఒక్క రాష్ట్రానికి ఇంత సాయం చేయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు.. ఇంత అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంటే, ఈ వ్యతిరేకత ఏంటని ప్రశ్నించారు. చట్ట రూప కల్పనలో కాంగ్రెస్ అప్పుడు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వైలెంట్ అవుతుందని ఎద్దేవ చేశారు.