స్నేక్ గ్యాంగ్ నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష...

స్నేక్ గ్యాంగ్ నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ  రంగారెడ్డి జిల్లా  కోర్టు తీర్పు నిచ్చింది. ఏ1 నుంచి ఏ7 దోషుల వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం… ఏ8 దోషికి మాత్రం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 37 మంది యువతను బెదిరించి దోపిడికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈకేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లు నిందితులు.

మరోసారి చిక్కుల్లో అమితాబ్.. 15 సంవత్సరాల నాటి కేసు..

  ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క పనామా పేపర్స్ పుణ్యమా అంటూ పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత ఇంక్రెడిబుల్ ఇండియా అంబాసిడర్ గా నుండి కూడా ఛాన్స్ పోయింది. ఇప్పుడు మరో చిక్కు ఎదురైనట్టు కనిపిస్తోంది. 2001లో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి అమితాబ్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పారితోషికంలో రూ. 1.66 కోట్లు పన్నుకట్టలేదని కేసు పెట్టింది. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు కేసు కొట్టివేసింది. దీంతో ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. మొత్తానికి అమితాబ్ కు ప్రస్తుతం కాలం కలిసిరానట్టు కనిపిస్తోంది.

మోడీ డిగ్రీపై ట్విస్ట్... పొరపాటున సంవత్సరం తప్పు పడింది..

  ఇప్పటికే ప్రధాని మోడీ సంబంధించి డిగ్రీలపై ఆప్ నేతలు పలు ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా విపక్షాలకు మరో అస్త్రాన్ని అందిచ్చిట్టయింది. రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మోడీకి సంబంధిచిన మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్టిఫికేట్ నిజమే కాని సంవత్సరం మాత్రం పొరపాటున తప్పు పడిందని ఢిల్లీ రిజిస్ట్రార్ తరుణ్ దాస్ వెల్లిడించారు. తాము రికార్డులన్నీ పరిశీలించామని, ఆయన 1978లో పరీక్షలు పాస్ కాగా, 1979లో డిగ్రీ వచ్చినట్టు తప్పు పడిందని తెలిపారు. ఆయన సీసీ 594/74 నెంబరుతో ఎన్ రోల్ అయ్యారని, ఆయన హాల్ టికెట్ సంఖ్య 16594 అని దాస్ వివరించారు.   దీంతో ఇప్పుడు మోడీ డిగ్రీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు అన్నట్టు మోడీది నకిలీ సర్టిఫికేటేనా.. లేకపోతే.. 1978లో పాస్ అయితే..  1979లో ఉత్తీర్ణుడైనట్టు సర్టిఫికెట్ ఇస్తే, అప్పుడే దాన్ని ఎందుకు సరిచేసుకోలేదన్నది.. ఇది కాకతాళీయంగా జరిగిందా? లేక ఆప్ ఆరోపిస్తున్నట్టు తప్పుడు ధ్రువపత్రమా? అని సందేహిస్తున్నారు. మరి దీనిపై మోడీ గారు చెబితే కాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది.

చంద్రబాబుకు గట్టి షాక్.. టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నుండి పెద్ద షాక్ తగలనుండా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీఆర్ఎస్ లోకి చేరిపోగా..రెండు రోజుల క్రితమే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనే ఎల్ రమణ, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.   గత కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ గురించి పట్టించుకోవడం లేదని.. ఇంకా వలస వెళ్లి పోతున్న ఎమ్మెల్యేలను నిలువరించే ప్రయత్నాలు కూడా చేయడంలేదని రమణ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీంతో ఇక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండేదేమోనని భావించి పార్టీ మారాలని నిర్ణయించుకున్న్టట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మాల్యాను వెనక్కి పంపించలేం.. బాంబు పేల్చిన బ్రిటన్

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా ఎంచక్కా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసి.. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి.. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేద్దామని చూస్తున్న నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రభుత్వం ఓ బాంబు పేల్చింది. తమ చట్టాల ప్రకారం విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించలేమని బ్రిటన్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవల భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వాన్ని కోరగా.. యూకే ప్రభుత్వం మాల్యాను పంపించలేమని వెల్లడించింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.

ఐదుగురు హత్యలు.. చేసింది అన్న కొడుకులే..!

  ఆదిలాబాద్ జిల్లా బైంసాలో దారణమైన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతంగా చంపిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణానికి పాల్పడింది కుటుంబసభ్యులే కారణమంటూ అనుమానిస్తున్నారు.  భైంసా పట్టణంలో బార్ ఇమామ్ గల్లీలో నివాసం ఉంటున్న నయామత్‌ఖాన్ కుటుంబానికి తన అన్న కుమారులతో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తన అన్న కుమారులు నయామత్‌ఖాన్ (55), యూనిస్‌ఖాన్ (35)లపై కళ్లల్లో కారం చల్లి గొంతుకోసి హత్యచేశారు. ఆ తర్వాత పట్టణంలోని బార్ ఇమామ్ గల్లీకి వెళ్లి మృతుడు నయామత్‌ఖాన్ భార్యపై దాడిచేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం.. పట్టణంలోని నయాబాదికి వెళ్లి అక్రమ్‌బి (62), ఆయేషాబేగం (15)లపై విచక్షణా రహితంగా దాడిచేసి పారిపోయారు. స్థానికులు అక్రమ్‌బి, ఆయేబేగంలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్రమ్‌బి ఆసుపత్రిలో మృతి చెందింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఆస్తికి సంబంధించిన తగాదాలు కారణంగానే ఈ హత్యలు జరిగుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెలగపూడిలో 144 సెక్షన్‌కు దారి తీసిన కార్మికుడి మరణం..

  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సమీపంలోని వెలగపూడి వద్ద నిర్మితమవుతున్న సచివాలయ నిర్మాణ పనులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు కాంక్రీట్ మిషన్‌లో పడి దుర్మరణం చెందాడు. పనులు పర్యవేక్షిస్తున్న కంపెనీ కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే కార్మికులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారని..చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేసి,నిప్పు పెట్టారు. అధికారులు వారితో చర్చించి..మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించడంతో కార్మికులు శాంతించారు. ఉద్రిక్త పరిస్థితుల రీత్యా అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

24 గంటల ఆన్‌లైన్ రేడియో టోరి ఒక్కటే: తెలుగువన్ ఎండీ రవిశంకర్

          ప్రపంచంలో 24 గంటలు పనిచేసే ఏకైక ఆన్‌లైన్‌ రేడియో టోరి రేడియో ఒక్కటే అన్నారు తెలుగువన్.కామ్ ఎండీ కంఠంనేని రవిశంకర్. తెలుగువన్ 16వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహరేళ్ల క్రితం తెలుగువన్.కామ్ పెడుతున్నట్లు తాను కొందరు సన్నిహితుల ప్రస్తావిస్తే తనను అందరూ వారించారని, కాని నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో తెలుగువన్ సంచలనం సృష్టించిందన్నారు. యూ ట్యూబ్ రాకముందే ఆన్‌లైన్‌లో సినిమాను ప్రదర్శించిన చరిత్ర తెలుగువన్‌ది అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ తాను ఆనాడు చేసిన ప్రయోగాన్ని ఆచరించి విజయవంతంగా దూసుకెళ్తుందన్నారు. టాలెంట్ ఉండి అవకాశాలు రాక నిరాశలో ఉన్న యువతకు షార్ట్‌ ఫిల్మ్ చేసే అవకాశాన్ని కల్పించి వారి ప్రతిభకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత తెలుగువన్‌దే అన్నారు. టోరి రేడియో ద్వారా 44 దేశాల్లోని తెలుగువారిని ప్రతిరోజు పలకరిస్తున్నామన్నారు. బీబీసీ రేడియో కూడా 22 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే..తాము 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నామన్నారు. 

టోరి రేడియో భారత్-పాక్‌లను కలిపింది:తెలుగువన్ ఎండీ రవిశంకర్

టోరి రేడియో భారత్-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను చెరిపివేసిందన్నారు తెలుగువన్.కామ్ ఎండీ కంఠంనేని రవిశంకర్. తెలుగువన్.కామ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగువన్ ఆధ్వర్యంలో నడిచే టోరి రేడియో ద్వారా 44 దేశాల్లోని తెలుగువారిని ప్రతిరోజు పలకరిస్తున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ రేడీయో కూడా 22 గంటలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే..తాము 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నామన్నారు.   కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా టోరి రేడియో ముందుంటుందన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..పేదరికంతో వైద్యం చేయించుకోలేకపోయిన ఎంతోమందికి టోరి రేడియో అండగా నిలబడిందన్నారు. బాధితుల సమస్యను శ్రోతల దృష్ఠికి తీసుకువెళ్లి దాతల సాయంతో టోరి రేడియో వారికి ఎన్నోసార్లు వైద్యం చేయించిందన్నారు. అలా ఒక సంఘటనను రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక బాలుడి దీనగాథను టోరి రేడియోలో ప్రసారం చేశామని ఈ సందర్భంగా టోరి రేడియో శ్రోతలు తమకు తెలిసిన వారి నుంచి విరాళాలు సేకరించారు. పాకిస్థాన్‌లో కూడా విరాళాలు సేకరిస్తుండగా అక్కడి స్థానికులు విషయం తెలుసుకుని వారు కూడా బాబు వైద్య ఖర్చుల నిమిత్తం విరాళం ఇచ్చారన్నారు. భారత్ అంటే ఏ మాత్రం పడని పాకిస్థానీయుల్ని కదిలించిన ఘనత టోరి రేడియోదేనని రవిశంకర్ అన్నారు.

ఘనంగా తెలుగువన్ 16వ వార్షికోత్సవం

  తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తూ..ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఒక్కతాటి మీదకు తీసుకువచ్చిన తెలుగువన్ విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో వార్షికోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీవీ9 సీఈవో రవిప్రకాశ్ హాజరయ్యారు.     ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగించిన రవిప్రకాశ్ 15 ఏళ్లుగా తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తూ..ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారిని కలుపుతున్న తెలుగువన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను పదిహేనేళ్ల క్రితమే గుర్తించి తెలుగువన్.కామ్‌ను ప్రారంభించిన సంస్థ ఎండీ రవిశంకర్ గారి ముందుచూపుని రవిప్రకాశ్ కొనియాడారు. తెలుగువన్ ఇంకా ఎన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తెలుగువన్‌లో వివిధ కార్యక్రమాలు రూపొందించి విశేష ప్రతిభ కనబరచిన దర్శకులకు రవిప్రకాశ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. 

ఎంపీలకు మోడీ ఆదేశం.. ఏడు రోజులు అక్కడే ఉండండి..

  ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ నేతలకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీలు ఎవరి నియోజక వర్గాల్లో వారు ఏడు రోజుల పాటు ఉండాలని.. రాత్రుళ్లు కూడా అక్కడే బస చేసి  ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారట. అంతేకాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రచారం చేయాలని.. అలాగే ప్రజల స్పందన, వారు ఏం కోరుకుంటున్నారో జాబితా తయారుచేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనలను తిరిగి ప్రధాని మోడీకి తెలియజేయాలని సూచించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. మరీ మోడీ చెప్పినట్టు ఎంపీలు చేస్తారో, చేయరో చూడాలి.

స్నేక్ గ్యాంగ్ నిందితులు దోషులే.. కోర్టు తుది తీర్పు

  స్నేక్ గ్యాంగ్.. వీరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం ఓ యువతిని పాముతో బెదిరించి.. ఆమెపై  అత్యాచారం చేసిన ఘటన బయటకు రావడంతో అసలు కథంతా బయటకొచ్చింది. ఈ గ్యాంగ్ ఎప్పటినుండో ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నట్టు.. దాదాపు ముప్పై మందిని పైగా ఇలానే బెదిరించి వారిపై అత్యాచారాలు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ గ్యాంగ్ కేసులో నిందితులుగా ఉన్న వారిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తెల్చుతూ తీర్పునిచ్చింది. నిందితులకు బుధవారం శిక్షలు ఖరారు కానున్నాయి.   ఈకేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు

ఏపీలో హెల్త్ కేర్ ఏటీఎంలు.. ఒక్క క్లిక్ తో..

  ఏపీ ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మరింత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకటి.. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి.. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఔషధాలు లభిస్తాయి. తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోదీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ రుగ్మత అధికంగా ఉంటే, ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలుంటుంది. కాగా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసింది.