సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని సందర్శించిన మీనాక్షి నటరాజన్

పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం (జులై 2)  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వారు మంత్రి దామోదర్ రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు.  పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం భారీ పేలుడు సంభవించి  36 మంది కార్మికులు మరణించగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలా ఉండగా  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు వివరించారు. ఇక పోతే ఈ ప్రమాద ఘటన అనంతరం   పదమూడు మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని సమాచారం.   ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.  అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని తెలిపింది. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

వైసీపీకి వల్లభనేని వంశీ గుడ్ బై?.. రాజకీయ సన్యాసమేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసులలో గత కొంత కాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరుకు ఆయనపై నమోదైన అన్ని కేసులలోనూ బెయిలు లభించడంతో బుధవారం (జులై 2)  ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత.. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ.  అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయార్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిలు లభించడంతో  బయటకు వచ్చే అవకాశం ఉంది.  వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా ప్రజాజీవితం నుంచి కూడి రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైలులో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. ఈ వార్తలలో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

గోదావరికి వరద.. పాపికొండల యాత్రకు బ్రేక్!

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్నది. ముఖ్యంగా ధవళేశ్వరం, భద్రచలం వద్ద గోదావరి వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ కారణంగా  పాపికొండల యాత్ర నిలిచిపోయింది. గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాపికొండలు విహార యాత్రను నిలిపివేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకూ పాపికొండల మీదుగా విహారయాత్రకు పర్యటకులు మక్కువ చూపుతారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదీస్తూ శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకోవడం ఒక మధురానుభూతిగా భావిస్తారు. అయితే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ యాత్రను నలిపివేసింది. ఈ యాత్ర మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న విషయాన్ని తెలియజేయలేదు. యాత్ర పున: ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది తరువాత ప్రకటిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంది.  

జగన్ నెల్లూరు పర్యటన రద్దు.. కాకాణికి అధినేత పరామర్శ లేనట్టేనా?!

మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పుడా పరామర్శ  యాత్ర రద్దు చేసుకున్నారు.  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు  గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు పర్యటన తలపెట్టిన విషయం విదితమే. ప్రభుత్వం హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ చెబుతోంది.    కానీ హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోయినా కూడా  జగన్ పర్యటన కొనసాగి తీరుతుందంటూ వైసీపీ నేతలు మీడియాముందుకు వచ్చి ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తొడగొట్టి మీసం మెలేసే అలవాటు ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ పర్యటన ఆగదు, మా ప్లాన్లు మాకున్నాయి.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ నెల్లూరు వచ్చి తీరుతారు, కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శిస్తారంటూ తొడగొట్టి చెప్పారు.  అయితే జగన్ మాత్రం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక కాకాణి పరామర్శకు ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. సరే అనువైన పరిస్థితులు లేవు కనుక హెలీప్యాడ్ కు స్థలం దొరకలేదు.. కానీ రోడ్డు మార్గాన వచ్చే ఆప్షన్ ను  వైసీపీ కనీసం పరిశీలించను కూడా పరిశీలించకపోవడానికి కారణ మేంటన్నది ఆ పార్టీ నేతలే చెప్పాలని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తారంటూ తొడకొట్టి మరీ చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.  అసలింతకీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టైన ఇన్నాళ్లకు జగన్ ఆయనను పరామర్శించాలని ఎందుకు తలపోశారు. ఇన్ని రోజులూ ఎందుకు పరామర్శకు రాలేదు అన్న ప్రశ్నకు కూడా వైసీపీ బదులు చెప్పాల్సి ఉంటుంది.  

అందుబాటులోకి రైల్ వన్ యాప్.. సింగిల్ లాగిన్ తోనే సమస్త సేవలు

రైలు ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.. రైల్వే ప్రయాణీకులు సమాచారం కోసం ఇప్పటి వరకూ వేర్వేరు యాప్ లను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే   తాజాగా రైల్వే శాఖ తాను అందించే సేవలన్నిటికీ  సింగిల్ విండో సిస్టమ్ లాంటి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  రైల్ వన్ పేరుతో   ఆల్-ఇన్-వన్ సూపర్‌ యాప్‌ను కేంద్ర రైల్వే  మంత్రి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా  కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. అంతే కాకుండా.. రైల్ వన్  యాప్ ప్రయాణికులకు సమగ్రమైన సేవలను అందిస్తుంది.  అన్‌రిజర్వ్‌డ్  టికెట్లను ఇప్పుడు   యాప్ ద్వారా  బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్లాట్ ఫారమ్ టికెట్లను సైతం కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా జరిగే రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ యథాతథంగా కొనసా గుతుంది. అలాగే ప్రయాణికులు సింగిల్ లాగిన్‌తో తమ రైలు  రన్నింగ్ స్టాటస్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోనే వీలు ఈ యాప్ ద్వారా కలుగుతుంది.  ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే,  రైల్ మదద్  ఫీచర్ ద్వారా యాప్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో కి వచ్చింది. భవిష్యత్ లో ప్రాంతీయ భాషలను కూడా చేర్తుస్తారు. ఈ యాప్ ను  ప్లే స్టోర్, యాప్ స్టోర్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది.  

అమెరికాలోని ఇస్కాన్ టెంపుల్ లక్ష్యంగా కాల్పులు

ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ లక్ష్యంగా అమెరికాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.    స్పానిష్ ఫోర్క్‌లో ఉన్న  ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యలయం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆలయ అధికారులకు, భక్తులకు మద్దతు ప్రకటించింది. స్థానిక యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని, నిందితులను పట్టుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది. ఆలయ నిర్వాహకుల సమాచారం మేరకు  ఆలయంలో భక్తులు ఉన్న సమయంలోనే దాడి జరిగింది. దుండగులు 30 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆలయ స్వాగత తోరణాలు, కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. గోడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాగా హిందుత్వపై విద్వేషంతోనే ఈ దాడి జరిగిందని ఇస్కాన్ ఆరోపిస్తోంది.  ఈ ఆలయంపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదని పేర్కొంది. గత నెలలోనూ ఇటువంటివి మూడు సంఘటనలు జరిగాయని ఇస్కాన్ ప్రతినిథులు తెలిపారు.  ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  ఇలాంటి కాల్పుల సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు  భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ఇక అమెరికాలోని హిందూ ఆలయాలపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది మార్చిలో కాలిఫోర్నియాలో స్వామి నారాయణ ఆలయంపై దాడి జరిగిన సంగతి విదితమే.  

వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

  నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ ప్రభుత్వం  షాక్ ఇచ్చింది. వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కూటమి ప్రభుత్వం ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది. వంశీకి  బెయిల్‌  లభించినప్పటికి, రేపు సుప్రీం కోర్టులో జరిగే విచారణపై ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. స్తంభించిన ట్రాఫిక్

  హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రాజధాని నగరంలో జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారా హిల్స్, పంజాగుట్ట, బల్కంపేట, బేగంపేట్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, గచ్చీబౌలి, టోలీచౌకీ, మెహదీపట్నం, సైనిక్ పురి, సికింద్రాబాద్, వనస్థలిపురం, మియాపూర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపిలేకుండా ఒక మోస్తరు నుంచి కుండపోత కురుస్తోంది.  రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉద్యోగులు ఆఫీసులు నుంచి ఇంటి వెళ్లే పీక్ అవర్స్‌లో వర్షం పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి అధికారులు సూచించారు.  

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌

  కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌  మంజూరైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది. రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.    ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్‌ మంజూరు కాగా, తాజాగా నేడు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్‌ మంజూరైంది.  మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్‌ లభించడంతో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చర్మకారుడు సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

  తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోశిబాబును ఎక్కించుకున్నారు.  కొవ్వూరు మండలం దర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు సుమారు 2 కి.మీ మేర పోశిబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. కారులో వెళ్తున్న సమయంలో పోశిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోశిబాబును అడిగి  తెలుసుకున్నారు. అనంతరం పోశిబాబు ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.

అనకాపల్లి బీసీ గురుకుల పాఠశాల వార్డెన్ సస్పెండ్

  ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక వచ్చిన ఘటనపై అనకాపల్లి బీసీ గర్ల్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించేందుకు వచ్చిన హోంమంత్రి. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం లంఛ్ టైమ్ కావడంతో ఆమె అక్కడే బాలికలతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. హాస్టల్ సిబ్బంది ఆమెకు కూడా భోజనం వడ్డించారు.  విద్యార్థులతో కలిసి మధ్యలో కూర్చుని భోజనం మొదలుపెట్టిన సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె ప్లేట్‌లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటనతో అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హోంమంత్రి అయిన నా ప్లేట్‌లోనే బొద్దింకలు కనిపిస్తే, అక్కడే నివసించే బాలికలకు ఎలా క్వాలీటీ ఫుడ్ అందిస్తారని నిలదీశారు. అలాగే హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తిరుమల అన్నమయ్య భవన్ సమీపంలో చిరుత సంచారం

  తిరుమల అన్నమయ్య  అతిథి  భవనం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇవాళ  మధ్యాహ్నం సమయంలో ఇనుప కంచెను దాటుకోని చిరుత వచ్చింది. సమాచారం అందుకోని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సైరన్ లు మ్రోగించడంతో తిరిగి ఫారెస్ట్‌లోకి చిరుత వెళ్లింది. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ, మొదటి ఘాట్ రోడ్డులోనూ చిరుతలను చూసినట్లు భక్తులు చెబుతున్నారు.  దీంతో ఫారెస్ట్ అధికారులు అధికారులు అప్రమత్తమై, భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది కలిసి చిరుతల సంచారంపై నిఘా పెంచారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం గురించి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లకూడదని టీటీడీ అధికారులు హెచ్చరించారు.  

డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ

  ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండా కారును డెలివరీ చేసి టెస్లా రికార్డు సృష్టించింది. తమ కారు సెల్ఫ్ డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో తెలిసేలా టెస్లా ఓ వీడియో పోస్ట్ చేసింది. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీ నుంచి 30 ని.లు డ్రైవ్ చేసుకుని టెస్లా కారు తన ఓనర్ ఇంటికి చేరుకుంది. పార్కింగ్ స్లాట్స్, హైవేలు దాటుకుంటూ దానంతట అదే వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది.   ఏఐ సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్‌ కారు ‘మోడల్‌ వై’ను టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్‌ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన నూతన యజమాని ఇంటికి చేరుకుంది. ఎక్స్‌’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్‌ ఆపరేటింగ్‌ లేకుండా ఒక పబ్లిక్‌ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్‌ కారు తమదేనన్నారు

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవ ఎన్నిక

  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎవరు పోటీలో నిలవకపోవడంతో ఎంపీ పురంధేశ్వరి స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. పదవి అంటే గొప్పస్థానం కాదు.. అదొక బాధ్యత అని అన్నారు.1973, ఆగస్టు 10న ఏపీ లోని మద్దిలపాలెం లో జన్మించారు. ఆయన మాజీ బీజేపీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ అయిన పీ.వీ. చలపతి రావు, పీ.వీ రాధా దంపతుల పుత్రుడు.  ఆయన డాక్టర్ వీ.ఎస్. కృష్ణ కాలేజీ నుంచి బీ.కామ్ పట్టా పొందాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా మాధవ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్‌లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం  భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.  ఈ కాలంలో బీజేపీ శాసన మండలి నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎన్నికైన పీవీఎన్ మాధవ్‌కు సీఎం చంద్రబాబు,శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు.  కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం’ అంటూ ట్వీట్ చేశారు.  

బీవీ పట్టాభిరాం ఇక లేరు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు.  కేవలం హిప్నాటిస్ట్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా ఆయన తన ప్రసంగాలూ, ప్రదర్శనలతో  సమాజంలో , వ్యక్తులలో డిప్రషన్ ను అధిగమించి మానసిక స్థైర్యం పెంపోందించేలా కృషి చేశారు.  అత్యంత క్లిష్టతరమైన మానసిక శాస్త్ర అంశాలను   సామాన్యులకు సైతం అవగత మయ్యేలా వివరించడం ఆయనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఆయన ప్రసంగాలు ఉండేవి.  ఆ యన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పట్టాభిరాం అంత్యక్రియలు బుధవారం (జూలై 2) జరగుతాయి. 

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం : రామచందర్‌రావు

  తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ప్రకటించారు. ఈ మేరకు  రామచందర్‌రావుకు నియామిక పత్రాన్ని అందించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడు  రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు  బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. "రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఫర్వాలేదు. మన పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు, వాళ్లే మన బలం. నాయకత్వంలో ఎవరున్నా అందరూ ఐక్యంగా పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.  నూతన అధ్యక్షుడు రామచందర్‌రావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రామచందర్‌రావు అన్నారు. స్టేట్ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేస్తామని పిలుపునిచ్చారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచందర్‌రావు అన్నారు.  ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాంచందర్ రావు ఒక మిస్సైల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు మమ్మల్ని ట్రోల్ చేసే వారని బండి సంజయ్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాక  కూడా చాయి అమ్ముకునే వాడు ప్రధాని ఏంది అని ట్రోల్ చేశారని కేంద్ర మంత్రి అన్నారు.