ముఖ్యమంత్రికి కోప మొచ్చింది .. ఎందుకో?

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు. ముఖ్యంగా సహచర మంత్రులపై గుస్సా అయిన సందర్భాలు అసలుకే లేవని చెప్పవచ్చును. మంత్రి వర్గ సమావేశాల్లోకానీ,  బయట ఇతరత్రా కార్యక్రమాల్లో  కానీ,మంత్రులు తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రేవంత్  రెడ్డి కోరుకున్నది కూడా లేదని అంటారు.  నిజానికి, ముఖ్యమంత్రి అందరిలో ఒకడిలా కలిసిపోతున్నారని, హుందాతనం రావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, నిజానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కిరీటాలు ఏమీ ఉండవు. మంత్రి వర్గంలో అందరూ సమానమే,అందులో ముఖ్యమంత్రిది మొదటి స్థానం,అంతే అంతకు మించి’ ముఖ్యమంత్రి మరో ప్రత్యేక ఏదీ ఉండదు. అయితే, అది సత్యమే అయినా వాస్తవం కాదు. వాస్తవంలో ముఖ్యమంత్రికి పెట్టని కిరీటంఉంటుంది,  ఆయన మాటే శాసనం అన్నట్లు. పరిపాలన నడుస్తుంది. కానే, రేవంత్ రెడ్డి మాత్రం, కారణాలు ఏమైనా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.  అందరిలో ఒకరిగానే మెలుగుతున్నారు. అదలా ఉంచితే,  రేవంత్ రెడ్డి గడచిన 18 నెలల్లో ఎప్పుడు మంత్రులను మందలించిన సందర్భం లేదు, కానీ, ఈ మధ్య కాలంలో సీఎం స్వరంలో కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో   రేవంత్ రెడ్డి  మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదని గుస్సా అయ్యారని, ఇలా అయితే, కుదరదని కొంచెం చాలా గట్టిగానేహెచ్చరించారని  సమాచారం. అలాగే, మంత్రులకు డూస్’ అండ్’  డోంట్స్’, (ఏమి చేయాలి, ఏమి చేయకూడదు)కు సంబదించి కూడా దిశా నిర్దేశం చేశారని, అందులో భాగంగా,. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిజానికి, ఇక్కడ ముఖ్యమంత్రి ఏ ఒక్క మంత్రిని పేరు పెట్టి తప్పు పట్టలేదు.కానీ, ముఖ్యమత్రి, అందరినీ కాకుండా కొందరిని ఉద్దేశించి మాత్రమే, గుస్సా అయ్యారని, అందులో, రెవిన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యులని పార్టీ వర్గాల సమాచారంగా, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత మంత్రులలో పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఇదరి మధ్య దూరం పెరిగిందని అంటారు. నిజానికి, ఒక దశలో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటిని, కీలక శాఖల నుంచి తప్పించే ఆలోచన చేశారని, ప్రచారం జరిగింది. అదొకటి అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తొందరపడి చేసిన ప్రకటన విషయంలోనూ పొంగులేటిని పీసీసీ చీఫ్’ మందలించి నట్లు వార్తలొచ్చాయి. అంటే కాకుండా, ఇటీవల కాలంలో పొంగులేటి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులు చేరినట్లు ప్రచారం  జరిగింది. ఈ నేపధ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మూడు రోజుల క్రితం (బుధవారం) ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఇప్పడు ఈ భేటీ వ్యహారం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా, కీలక నేతల స్థాయిలో  చర్చనీయాంశం అయిందని అంటున్నారు. అంతే కాదు, పొంగులేటి ఢిల్లీ ఎందుకు వెళ్ళారుఅనే విషయంలో, విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పొంగులేటిని అధిష్ఠానమే పిలిచిందా? లేదంటే, తనపై వస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌’ను కలిసి తనపై చేసిన ఆరోపణలకు సంబదించి వివరణ ఇచ్చేందుకు ఆయనే ఖేర్గేను కలిశారా, అనే విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు. అయితే, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా చినిగి పోయేదే,  ఆకుకే నష్టం, అలాగే, ఈయన వెళ్లి ఆయన్ని కలిసినా ఆయనే ఈయన్ని పిలిపించినా,జరిగేది అదే అంటున్నారు.  అయితే గంటకు పైగా జరిగినట్లు చెపుతున సమావేశంలో ఖర్గే, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పొంగులేటికి హితబోధ చేసినట్టు చెపుతున్నారు. అయితే ఢిల్లీ కోర్టుకు చేరిన పొంగులేటి పంచాయతీ’ ఇంతటితో ముగిసేది కాదని, ముందు ముందు కొత్త మలుపులు తిరిగినా,మరింతగా ముదిరిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఉక్కపోతను ఎక్కువ కాలం తట్టుకోవడం ఎవరికైనా కొంచెం చాలా కష్టం,సో.. పొంగులేటి వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు  

మహా న్యూస్ ఛానెల్‌పై దాడి హేయమైన చర్య : పవన్ కళ్యాణ్

  హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు.  మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదని డిప్యూటీ సీఎం తెలిపారు.  మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని పవన్ అన్నారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ సూచించారు.  

యాంక‌ర్ స్వేచ్ఛ చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌డేనా?

  పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు. చ‌నిపోయే నాటికి స్వేచ్ఛ టీ  న్యూస్ యాంక‌ర్ గా ఉన్నారు. అయితే ఆమెకు పూర్ణ‌చంద్ర‌రావు ఇక్క‌డే ప‌రిచ‌యం అయిన‌ట్టు తెలుస్తోంది. పూర్ణ టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ గా చేస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే పూర్ణ‌చంద్ర‌రావు త‌న కూతురి వెంట మూడేళ్లు ప‌డ్డాడ‌నీ.. త‌న భార్య‌ను వ‌దిలి నిన్నే పెళ్లాడుతానంటూ అత‌డు ఆమెను న‌యానా భ‌యానా ఒప్పించాడ‌నీ.. ఇందువ‌ల్లే ఆమె ఇత‌డితో స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌చ్చింద‌ని అంటున్నారాయ‌న‌. అయితే గ‌త కొంత కాలంగా స్వేచ్ఛ పూర్ణ మ‌ధ్య వివాదం న‌డుస్తోంద‌ని.. అత‌డ్ని పెళ్లి చేసుకోమ‌ని ఈమె ఎంత అడుగుతున్నా.. ఇంట్లో క‌న్విన్స్ చేయాల్సి ఉంద‌ని అత‌డు త‌ప్పించుకుని వ‌స్తున్నాడ‌ని అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఫైన‌ల్ గా తామిద్ద‌రం విడిపోద‌లుచుకున్నామ‌ని త‌న‌తో త‌న కూతురు చెప్పింద‌ని అంటున్నారు స్వేచ్ఛ తండ్రి. ఏది ఏమైనా త‌న బిడ్డ చావుకు కార‌ణం ఈ పూర్ణ చంద్ర రావే కాబ‌ట్టి అత‌డిపై తాను కేసు పెట్టానని చెబుతున్నారు స్వేచ్ఛ తండ్రి. అత‌డ్ని తాను చూడ్డం కూడా ఇదేన‌ని.. ఇంత వ‌ర‌కూ తాను చూడ‌లేదని.. అన్యాయంగా త‌న కూతురికి మాయ మాట‌లు చెప్పి.. మోసం చేసి, చివ‌రికి ఆమె ప్రాణాలు పోవ‌డానికి గ‌ల కార‌ణ‌మైన  ఇత‌గాడికి త‌గిన శిక్ష ప‌డాల‌ని డిమాండ్ చేస్తున్నారు యాంక‌ర్ స్వేచ్ఛ తండ్రి.

మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

  మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్‌‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.  కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకున్నారు. మీడియా స్వేచ్చపై దాడిని ఖండిస్తున్నట్లు మహా టీవీ వంశీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపారు. కానీ స్టూడియో పై దాడి, కెమెరాలను ధ్వంసం చేయడం పద్ధతి కాదని ఆయన తెలిపారు.  

క‌మ‌ల్ హాస‌న్‌కు అరుదైన అవ‌కాశం

  క‌మ‌ల్ హాస‌న్ కి యూనివ‌ర్శ‌ల్ హీరోగా పేరుంది. క‌మ‌ల్ కి ఆస్కార్ కీ ఉన్న సంబంధ బాంధ‌వ్యాలు అన్నీ ఇన్నీ కావు. భార‌త్ నుంచి అత్య‌ధికంగా ఆస్కార్ కి  నామినేట్ అయిన క‌థానాయ‌కుల్లో క‌మ‌ల్ ముందు వ‌రుస‌లో ఉంటారు.1987లో ఉత్త‌మ విదేశీ భాషా  చిత్రంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది క‌మ‌ల్ న‌టించిన  నాయ‌క‌న్ చిత్రం. అయితే తుది జాబితాలో చోటు ద‌క్కించుకోలేక పోయింది. ఇక 1992లో దేవ‌ర్ మ‌గ‌న్, 1995లో కురుతి పూన‌ల్, 1996లో ఇండియ‌న్, 2000 సంవ‌త్స‌రంలో హేరామ్ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. కానీ ఇంత వ‌ర‌కూ క‌మ‌ల్ కి ఎలాంటి  ఆస్కార్ పుర‌స్కారం రాలేదు. అలాంటి క‌మ‌ల్ హాస‌న్ కి అరుదైన గౌర‌వంగా.. ఆస్కార్ క‌మిటీలో చోటు ద‌క్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసిన స‌భ్యుల జాబితాలో క‌మ‌ల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాలుపంచుకోనున్నారు క‌మ‌ల్. ఆస్కార్ కి నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైన‌ల్ ఎంపిక ప్ర‌క్రియ‌లో వీరికి ఓటు వేసే ఛాన్సునిస్తుంది క‌మిటీ.  కాగా ఈ ఏడాది మొత్తం 534 మంది స‌భ్యుల‌ను ఆహ్వానించిన‌ట్టు ప్ర‌క‌టించింది అకాడ‌మీ. ప్ర‌తిభావంతులైన వీరికి అకాడ‌మీలో చోటు క‌ల్పించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంది అకాడెమీ.ఇటీవ‌ల క‌మ‌ల్ హీరోగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన థ‌గ్ ఆఫ్ లైఫ్ అనే చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. అయినా స‌రే ఆయ‌నకు శుభ‌వార్త‌ల వెల్లువ ఆగ‌డం లేదు. ఇటీవ‌లే డీఎంకే త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన క‌మ‌ల్ కి అనుకోకుండా  ఆస్కార్ క‌మిటీ స‌భ్యుడిగానూ ఎంపిక కావ‌డంతో ఆయ‌న ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికకు ముహూర్తం ఖరారు

  జూలై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా, ఎల్లుండి సోమవారం నామినేషన్ల స్వీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ను ఎంపిక చేస్తారు.  ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్‌షా ఇందూరుకు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు  బీజేపీ సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చని సమాచారం. ఆ సమయంలోనే ఏపీ నూతన అధ్యక్షుడి నియామకం సైతం జరుగునుంది.  అయితే,  బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, డీకే.అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీ హైకమాండ్​ ఎట్టకేలకు జులై రెండో వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండటంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్​ఉప ఎన్నికతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు  సత్తాచాటుతామని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు  

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీఏకు నోటీసులు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు  ఫోన్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడికు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు కవిత పీఎను  విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వీఐపీల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.  మరోవైపు 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్ సిట్ ఫోకస్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ అధికారుల ఆరా తీస్తున్నారు. కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయి అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభలకు గురిచేసిన ఆడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తు నివేదికను సుప్రీంకు సమర్పించిన సిట్

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ  ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.  ఆ సిట్ దర్యాప్తులో  ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదనీ, ఎందుకంటే అది  అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని  సిట్ స్పష్టం చేసింది.   ఈ కేసు   దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీం కోర్టుకు శుక్రవారం (జూన్ 27) నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో తన దర్యాప్తులో ఇంత వరకూ వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి   సిట్ సీల్డ్ కవర్ లో  అందజేసింది.   ఆ నివేదికలో  సిట్ తన దర్యాప్తులో  ఇప్పటివరకు సాధించిన పురోగతిని, నిందితులు వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను  సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది.  కేసు దర్యాప్తునకు  నిందితులు స‌ృష్టించిన,  సృష్టిస్తున్న అడ్డంకులపై కూడా ఆ నివేదికలో సిట్ పొదుపరిచినట్లు సమాచారం.   అలాగే   నిందితులు సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా సిట్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.   వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే  ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే   ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ  తామంటే భయం ఉందపి భావించారు. అయితే..  చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదనీ,  అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదనీ, ఎవరైనా కర్మఫలం అనుభవించకతప్పదనీ ఇప్పుడు తెలిసివస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు సిట్ విచారణలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి అన్ని విషయాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు సిట్ ఇంత వరకూ తన దర్యాప్తు నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించడంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రాధారులు, పాత్రధారులూ ఎవరన్నది బయటకు రావడం ఖాయమని అంటున్నారు.   

గవర్నర్ వద్దకు వైసీపీనేతల బృందం ఎందుకంటే?

జగన్ లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాళ్ల పర్యటలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన సంఘటనపై జగన్ ఏ2గా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జులై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణను వాయిదా వేస్తూ జులై 1 వరకూ జగన్ పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది. అంత మాత్రానికే కోర్టు జగన్ ను నిర్దోషిగా భావంచిందంటూ వైసీపీ నేతలూ, కార్యకర్తలూ అంటున్నారు. కానీ వాస్తవానికి ఈ కేసులో అరెస్టు తప్పదేమోనన్న భయం జగన్ లోనూ, ఆ పార్టీ నేతలలోనూ కనిపిస్తోంది. అందుకే  ఇంత కాలం లేనిది ఇప్పుడు హడావుడిగా వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను  గురువారం (జూన్ 26)  కలిసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో వైసీపీ పక్షనేత,   బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు  గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలిశారు.  మాజీ సిఎం జగన్‌ పర్యటనలలో భద్రత కల్పించడం లేదని, ఆయనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఫిర్యాదు చేశారు.    వాస్తవానికి జగన్ రెంటపాళ్ల పర్యటన ఆద్యంతం పోలీసు ఆంక్షలను, నిబంధనలనూ తుంగలోకి తొక్కుతూ సాగింది. వంద మందితో మాత్రమే రెంటపాళ్లకు వెళ్లాలని పోలీసులు జగన్ కు  అనుమతి ఇస్తే.. దానిని ఖాతరు చేయకుండా వేలాది మందితో వెళ్లారు. జగన్ కాన్వాయ్ లో మూడు కార్లకే అనుమతి ఉంటే ఆయన పెద్ద సంఖ్యలో కార్లతో వెళ్లారు. అంతే కాకుండా అడుగడుగునా పోలీసులతో ఘర్షణ పడుతూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేశారు. జగన్  వాటిని ప్రోత్సహిస్తున్న చందంగా   అభివాదాలు చేశారే తప్ప వారించలేదు.పైపెచ్చు తరువాత తాపీగా నా కారుకుంది పడి మా పార్టీ కార్యకర్త మరణిస్తే నాకు బాధకలగదా?అంటూ..సంగమయ్య కుటుంబానిి పార్టీ తరఫున పదిలక్షలు ఇచ్చాం కదా అని చెబుతున్నారు.  తన కారు కింద పడే సింగమయ్య మరణించాడని తద్వారా అంగీకరించేశారు.  అయినా సరే తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ దబాయిస్తున్నారు. ఆ కేసులో తనని అరెస్ట్‌ చేస్తారనే భయంతో జగన్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ కూడా వేశారు.   ఆ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ అంతలోనే తమ పార్టీ నేతలను  గవర్నర్‌ వద్దకు పంపించి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై ఎదురు పిర్యాదు చేయడం చూస్తే  సింగమయ్య మృతి కేసులో అరెస్ట్‌ చేస్తారేమోనని జగన్ భయంతో వణికిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్  శుక్రవారం (జూన్ 27) తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె వయస్సు 35 ఏళ్లు. ఆమెకు స్కూలుకు వెళ్లే వయస్సున్న కుమార్తె ఉంద. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.   పోలీసులు  కేసు నమోదు చేకుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణానికి ముందు తాను ధ్యానం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతలోనే ఆత్మహత్య చేసుకోవలసిన కారణమేమిటన్నది తెలియాల్సి ఉంది.

ఆరుగురిని హత్య చేసిన కేసులో ఒకనికి ఉరి.. విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు

పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ  జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.  ఏప్రిల్ 15, 2021న అప్పల రాజు పాత కక్షలతో బమ్మిరి రమణ అనే వ్యక్తి కుటుంబానికి చెదిన ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. బమ్మిడి రమణ కుటుంబంతో అప్పల రాజు కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటికి తోడు బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అప్పలరాజు కుమార్తెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచీ రెండు కుటుంబాల మధ్యా వైరం తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే బమ్మిడి రమణ కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే 2021లో స్థానిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఆ కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఇదే అదునుగా భావించిన అప్పలరాజు బమ్మడి రమణ సహా ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.   విశాఖపట్నం జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.  ఈ కేసులో కోర్టు అప్పలరాజును దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష విధించింది.   

విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.  ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.  విద్యుత్ ఉద్యోగుల శిక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నం దేశంలోనే అత్యుత్త‌మ శిక్ష‌ణ కేంద్రంగా నిలుస్తుంద‌ని, నిలవాలనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భ‌వ‌నం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండ‌టం ఆద‌ర్శ‌ప్రాయమ‌న్నారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 20 మందికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తు ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే కారుణ్య నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు 180 మందికి ఇలా నియామక పత్రాలు అందజేసినట్లు మంత్రి చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని మంత్రి గొట్టిపాటి చెప్పారు. విద్యుత్ శాఖ‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా  చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌నీ,  24 గంట‌లూ నాణ్య‌మైన గ్రీన్ ఎన‌ర్జీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అందించే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామనీ చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో 20 ల‌క్ష‌ల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం 10 వేల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. 

గుడివాడ కోర్టులో కొడాలినాని.. ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత  కొడాలి నాని  హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు  వచ్చా రు . గత   ఏడాది జరిగిన  ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు  కోసం  నాని గుడివాడ కోర్టుకు వచ్చారు.  మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి కొడాలి నానిపై కేసు నమోదైంది.   ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, గుడివాడలోని కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన శుక్రవారం గుడివాడ కోర్టుకు హాజరై బెయిలు పొందారు. ఇందుకోసం ఆయన బెయిలుకు అవసరమైన వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు.  ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన అనుచరులు 16 మందికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.  

మాజీ డీజీపీ పాత్ర వుంది.. ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఆరోపణ

నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో  ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది.  పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న  ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను   నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు. అందుకే ఇంతవరకు ట్యాపింగ్ బాధితుల్లో లేని రెండు మీడియా సంస్థల  ఎండీలకు సిట్ తాజాగా నోటీసులు ఇచ్చింది. , ఈ లెక్కన రేపు ఇంకెవరికైనా నోటీసులు వచ్చినా రావచ్చని అంటున్నారు. ఒక్క పక్షం రోజుల్లోనే 600 పై చిలుకు మంది రాజకీయ నాయకులు, నాయకుల అనుచరులు, నాయకుల వ్యక్తిగత సిబ్బంది ఫోన్లతో పాటుగా మొత్తం 4000 ఫోన్లు ట్యాప్ చేసిన సంఘటన దేశ చరిత్రలోనే కాదు, ప్రప్రంచ చరిత్రలోనూ బహుశా ఉండక పోవచ్చని అంటున్నారు. అలాగే.. ఇంత యథేచ్చగా ఫోన్లు ట్యాప్ చేసిన దుర్వ్యవస్థ కూడా బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండక పోవచ్చని అంటున్నారు. అదొకటి అయితే..  ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుల విచారణలో ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు 257 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ రికార్డ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నాయకుల ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది.  4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు.  రాజకీయనాయకులు,  గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ తేల్చింది.  కాగా.. ఈ శుక్రవారం(జూన్ 27) ) బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు.  ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు.  2023 నవంబర్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ విచారణకు హాజరైన  సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు చూపించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు.  బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిపై ఇంతవరకు ఎవరూ చేయని సంచలన ఆరోపణలు చేశారు. గత డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. తన ఆఫీస్‌లో వారెంట్ లేకుండా వచ్చి కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేసి.. ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. అలాగే, ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల కదలికలను కూడా పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్లను పోలీసులు పట్టుకున్నారనీ,  అవి తన డబ్బులు అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. మరోవంక..  మరో బీజేపీ ఎంపీ, రఘునందన రావు, దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని..  దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్   ట్యాపింగ్ అయ్యింది, తనను అడిగితే  అన్ని వివరాలు ఇచ్చే వాడినన్నారు.  ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని,  కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. నిజంగా కూడా, జరుగుతున్న తంతు చూస్తే, ఇదొక డెయిలీ సీరియల్ లానే నడుస్తోందని అంటున్నారు.

కలకలం రేపుతున్న..ఈ స్టాంపుల కుంభకోణం!

  అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్సీ ఇన్ఫ్రా వారు తమ అంతర్గత ఆడిటింగ్ లో నకిలీ ఈ స్టాంపులను గుర్తించి అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పోలీసులు వెంటనే మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ కొన్ని  తహసీల్దార్ల నకిలీ రబ్బర్ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీ సేవ బాబు, ఆయన సతీమణి భార్గవి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. తాజాగా కేసును కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు వారి అరెస్టు చూపితే గానీ పూర్తి వివరాలు అధికారికంగా వెల్ల డయ్యే అవకాశం లేదు. అయితే, ఒక కిలోకు పైగా బంగారు నగలు, 1.2 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ను పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు.   కుంభకోణం విలువెంత?  నకిలీ ఈ స్టాంపుల ద్వారా మీ సేవ బాబు ఎంత మేరకు కుంభకోణం చేశాడనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది...తాము ఒక్కరమే మీసేవ బాబు వద్ద 23 లక్షల రూపాయల విలువ చేసే 467 ఈ స్టాంపులను కొనుగోలు చేశామని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు తెలియజేశారు. దీన్నిబట్టి ఎంత పెద్ద మొత్తంలో మీసేవ బాబు నకిలీ ఈ స్టాంపులను విక్రయించి ఉంటాడో ఊహించుకోవచ్చు. మొత్తం మీద 13వేల నకిలీ ఈ స్టాంపులను మీ సేవ బాబు విక్రయించినట్టు చెబుతు న్నారు. అయితే వాటి విలువ ఎంత అనేది పోలీసుల విచారణలోనే తెలియాల్సి ఉంది.   ఎవరీ మీసేవ బాబు?  కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి కి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు. ఇంటర్ వరకు చదువుకున్న ఎర్రప్ప తొలుత కొన్ని దినపత్రికల్లో ఆఫీస్ బాయ్ గా పని చేస్తూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకున్నాడు. 2019 నుంచి మీసేవ కేంద్రం నడుపుతూ వచ్చాడు. 2020లో ఆధార్ సెంటర్ కు అనుమతి తెచ్చుకున్నాడు. అధికారులతో పరిచయాలు పెంచుకుని వారి సహకారంతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసే వాడనే విమర్శలు వచ్చాయి. అయినా, అధికారులెవరూ దృష్టి సారించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అతను మరింత వేగం పెంచి నకిలీ ఈ స్టాంపుల కుంభకోణానికి సైతం తెర తీశాడు.   రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి ? కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కు చెందిన ఎస్సార్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు చాలా కాలంగా మీ సేవ బాబు వద్దే ఈ స్టాంపులు కొనుగోలు చేస్తూవచ్చారు. ఈ క్రమంలోనే రూ 900 కోట్ల రుణం కోసం తాజాగా కూడా వారు ఈ స్టాంపులు కొనుగోలు చేశారు. అయితే, అందుకు సంబంధించి స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉంది కాబట్టే వారు ఆ వివరాలు బయటకు వెల్లడించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీ సేవ బాబుతో సురేంద్రబాబుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే, వైసీపీ నేతలతో సైతం మీసేవ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీంతో వారు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని  ఎమ్మెల్యే  సురేంద్రబాబు ఆరోపిస్తున్నారు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్ గా మీసేవ బాబు తనకు పరిచయమయ్యారన్నారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం అర్ధరహితం అన్నారు. తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును మీడియాకు చూపించారని, కుట్రలో భాగస్వాములు కాకపోతే ఆ పేపరు వారికి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తం మీద నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కూడా రాజకీయ రంగు పు లుముకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏసీబీ, సిట్, సిబిఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసిరారు.

కల్తీ డీజిల్‌తో ఆగిపోయిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌

  ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సీఎం మోహన్‌ యాదవ్‌, భోపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి నిన్న ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్తుండగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. వెంటనే వాటిని రోడ్డు పక్కకు తోసి, వేరే కార్లును తెప్పించి ముఖ్యమంత్రిని పంపించారు. మార్గమధ్యంలో దోసిగావ్‌ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్‌ కొట్టించారు. ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సీఎం కాన్వాయ్‌ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వాహనాలు ఎందుకు బ్రేక్‌డౌన్‌ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్‌ ట్యాంక్‌ తెరిచిచూడగా అందులో నీళ్లు కన్పించాయి. వాహనాల్లో నింపిన డీజిల్‌ను బయటకు తీయగా.. సగానికి సగం అందులో  నీరు కలిపినట్లుగా ఉంది. డీజిల్‌ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంక్‌లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్‌ పంప్‌ను తనిఖీ చేసి కల్తీని నిర్ధరించారు. ఆ బంక్‌ను సీజ్‌ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో  కార్లకు  కల్తీ డీజిల్‌ కొట్టించడంతో హాట్ టాఫిక్‌గా మారింది.

క్వాష్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసిందంతే!

సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సాధారణంగా బెయిలు పిటిషన్లు, క్వాష్ పిటిషన్ల విచారణ వాయిదా వేసే సందర్భంగా కోర్టులు ఇటువంటి ఆదేశాలు ఇస్తుంటాయి. అంత మాత్రాన ఆయా కేసులలో పిటిషన్లు దాఖలు చేసుకున్న వారు నిర్దోషులని కోర్టులు తీర్పు ఇచ్చినట్లు కాదు. కానీ జగన్ క్వాష్ పిటిషన్ విషయంలో మాత్రం వైసీపీ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేసి జగన్ పై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలకు తనదైన భాష్యం చెప్పు కుంటోంది. కోర్టు ఆదేశాలను జగన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువరించేసిందన్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి జరిగిందేమిటంటే.. జగన్ క్వాష్ పిటిషన్ ను పూర్తిగా పరిశీలించకుండానే కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. వాస్తవానికి జగన్ పల్నాడు యాత్రకు  పోలీసులు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా దానిని ధిక్కరించి, నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ వేలాది మందితో బలప్రదర్శనకు వచ్చినట్లు ఆ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా సింగయ్య ఆయన కారు కిందే పడి మరణించారు. ఇవన్నీ వాస్తవాలే.. జగన్ క్వాష్ పిటిషన్ విచారణలో ఈ విషయాన్నీ చర్చకు, ప్రస్తావనకు వస్తాయి.  కోర్టు విచారణను జులై 1కి వాయిదా వేయగానే జగన్ కు కేసు నుంచి విముక్తి వచ్చేసిందంటూ వైసీపీ పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉంది. జులై 1 వరకూ మాత్రమే కోర్టు జగన్ కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ రోజు జగన్ క్వాష్ పిటిషన్ ను విచారించి తీర్పు వెలువరిస్తుంది. అప్పుడు జగన్ క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేస్తే అరెస్టు నుంచి మినహాయింపు పోయినట్లే. ఆ విషయాన్ని పరిగణ నలోనికి తీసుకోకుండా ఇప్పుడే పండుగ చేసుకోవడం ఇల్లు అలికేసి పండగ వచ్చేసింనుకోవడమే.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం

  వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ బిల్డింగ్‌లో పూర్తిగా దెబ్బతిన్నదని  గతంలో కూడా పెచ్చులు ఊడి పెషెంట్‌లు పడగా పలువురు గాయపడ్డారని సిబ్బంది వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణం అయిందని, అధికారులు ఎవరూ భవనలు మరమ్మత్తులను పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎంజీఎం ఆస్పత్రిలో దెబ్బతిన్న భవనాల మరమ్మతులు చేయడం అవసరమా అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో భవనం పెచ్చులు ఊడిపోవడం, ప్రమాదాలు జరగడం, పలువురు గాయపడుతున్నారని విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆస్పత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆస్పత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులూడి పడటం చర్చనీయాంశంగా మారింది.

సీతక్కపై మావోయిస్టుల గుస్సా

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దాసరి అనసూయ, సీతక్కకు ప్రత్యేక స్థానం వుంది. సీఎం రేవంత్‌రెడ్డి సీతక్క తనకు సొంత అక్క కంటే ఎక్కువని పలు సంధర్భాలలో స్వయంగా చెప్పుకున్నారు, అంటే, ఆ ఇద్దరి అనుబంధం గురించి ఇక వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరోవంక మావోయిస్టు సిద్దాంత మూలాలు ఉన్న సీతక్కకు సహజంగానే అడవి బిడ్డలతో ప్రత్యేక అనుబంధం వుంది. అడవి బాట వదిలి జాతీయ రాజకీయ స్రవంతిలోకి వచ్చిన, గిరిజనులతో  సీతక్క సంబంద బాధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ పదవి’లో ఉన్నా, గిరిజనంతో కలిసే జీవిస్తున్నారు. గిరిజనుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో గిరిజన ఎమ్మెల్యేగా ఆమె,నెత్తిన మూటతో కాలినడకన కొండలు గుట్టలు ఎక్కి, గిరిజనులు నిత్యావసర సరుకులు మందులు అందించి సీతక్క శభాష్ అనిపించుకున్నారు. అందుకే, ములుగు నియోజకవర్గం ప్రజలు ఆమెను వరసగా మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇప్పడు రేవంత్ రెడ్డి ఆమెను మంత్రిని చేశారు. అయితే, ఇప్పడు సీతక్క ఒక వంక సొంత పార్టీలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఆమె పైన ఎప్పుడు లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి  ఇతరత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవంక, మాజీ కామ్రేడ్ సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా, మావోయిస్టులు ఆమెను హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా  మారింది. ఈ లేఖలో మావోయిస్టులు ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా.. మంత్రి సీతక్క స్పందించడం లేదని ఆరోపించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా...? అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు.  అయితే ఆదివాసీల వ్యవహారంలో మావోయిస్టులు తనకు రాసిన లేఖ పై సీతక్క, వెంటనే స్పందించారు.తన మూలాలను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్న,  జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు. అయితే, ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా మెయిన్ స్ట్రీమ్ రాజకేయల్లో ఉన్న సీతక్క, తొలి సరిగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కుంటున్నారని, ఆమె సన్నిహితులు అవేదన వ్యక్తపరుస్తున్నారు.