జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్‌ షా

  కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పసుపు ఉత్పత్తులను హోంమంత్రి  పరిశీలించారు. అంతకుముందు హైదరాబాదులోని బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు బయలుదేరిన అమిత్ షా.. కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం వరకు చేరుకున్నారు.  అనంతరం ఆయన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా ఎక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పసుపు సంబంధిత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.   

కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం : జగదీష్‌ రెడ్డి

  మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మహా న్యూస్ చానల్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే..ఇంకో రెండు, మూడు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తామని జగదీష్‌ రెడ్డి అన్నారు  మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణను విడదీశాడు అనే కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.  సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నామని  ఆ స్లాటర్ హౌసులను వదిలిపెట్టమని జగదీష్‌ రెడ్డి వెల్లడించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్రపోషించే పోలీసులు.. తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైనా మీ ప్రేలాపనలు. ఉద్యమం నుంచి వచ్చినోళ్లం కేసులకు భయపడతామా. మహా న్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అదేపనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు.  మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మీపని చెప్తాం. సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని నడుపుతున్న స్లాటర్ హౌసులను వదిలిపెట్టం. మా దాడి వేరే విధంగా ఉంటది. కేసీఆర్‌ది మొదటినుంచి గొప్ప క్షమాగుణం. ఆయన క్షమించినా మేము క్షమించం. భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని జగదీష్‌ రెడ్డి డిమాండ్ చేశారు.  

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

  ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ప్రస్తుతం ఒడిశా లోని పూరీలో జగన్నాథ రథయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పూరీలోని జగన్నాథ రథయాత్రలో తాజాగా అపశృతి జరిగింది. అక్కడి గుడించా దేవాలయం వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది.  ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు భక్తులు మృతి చెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరుకైన ప్రాంతంలో చెక్కదొంగల లోడుతో ఉన్న ట్రక్కులు రావడంతో తోపులాట జరిగిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు నెట్టుకొని.. కింద పడిపోయారని చెబుతున్నారు. అంతలోనే ముగ్గురు మరణించారని కూడా సమాచారం అందుతుంది.

నారాయణకే తెలియని మర్మం...?

  ఏపీ లిక్కర్ స్కాం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొడ్డిదారిన స్వాహా చేసి బినామీ కంపెనీలు.. హవాలా మార్గంలో తెచ్చుకుని ఎన్నికలకు వినియోగించారనేది సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం తిరుపతితో కూడా సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా అనుచరులు, స్నేహితులు పాత్ర ఉందని స్పష్టం అయ్యింది.  ఇక కీలక పాత్రధారి పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా తిరుపతి, శ్రీకాళహస్తి కి చెందిన పలువురు దొంగ కంపెనీలతో సిండికేట్ గా ఐదేళ్ల పాటు అక్రమ మార్గంలో సక్రమంగా మద్యం నిధులు కొల్లగొట్టారు. ఇంత జరుగుతున్న గత ఐదేళ్ల లో ఎక్సైజ్ శాఖ మంత్రి గా, డిప్యూటీ సీఎం గా, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గా పని చేసిన కె.నారాయణ స్వామి పాత్ర పై సిట్ ఆలోచించిందా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఒక మంత్రిగా డమ్మి వ్యక్తిని సొంత జిల్లాలోనే పెట్టుకుని ఇలా మద్యం కుంభకోణం చేశారనే ఆరోపణలు లేకపోలేదు.  ఇటీవల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పర్యటనలో నారాయణ స్వామికి సంతకం పెట్టలేదు కూడా రాదని అన్నాడు అని వ్యాఖ్యానించారు... అయితే సంతకం కూడా రాని వ్యక్తి ఐదేళ్లలో మంత్రిగా పని చేసారా...? సంతకం రాని వ్యక్తికి... కాదు కాదు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కి కూడా తెలియకుండా ఇంత కుంభకోణం జరిగిందా.. లేదా తెలిసినా సహకరించారా.. భవిష్యత్తులో మాజీ మంత్రి హస్తం పై విచారణ జరిగే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. నారాయణ స్వామిని వద్ద మద్యం కుంభకోణం పేరు ఎత్తగానే చిరెత్తుకొచ్చి నువ్వే చెప్పు చంద్రబాబు కు నన్ను అరెస్టు చేయమని అంటూ రుసరుసలాడారు. త్వరలో మద్యం కుంభకోణం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 

అది జ‌గ‌న్ మార్క్...క్యూఆర్ స్కాన్ కాదు స్కామ్ గురూ

  ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో. దీన్ని కొత్త‌గా నిర్వ‌హించాల‌ని థింక్ చేసిన జ‌గ‌న్ అండ్ కో.. స్వామి కార్యం స్వ‌కార్యం చ‌క్క‌బెట్టే య‌త్నం చేస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి అతి కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్టు గ‌త కొంత కాలంగా పార్టీలో ఉన్న సొంత నాయ‌కులే కామెంట్లు చేస్తున్న ప‌రిస్థితి. ఇపుడీ క్యూఆర్ కోడ్ అందులో భాగ‌మ‌ని.. ఇది కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కింద‌కే వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో గ‌డప గ‌డ‌ప‌కూ వైసీపీ చెప్పుకోడానికి క్రేజీగానే ఉన్నా.. అందులోంచి వ‌చ్చిన ఫ‌లితాలు రివ‌ర్స్ కొట్టిన విష‌యం తెలిసిందే. జ‌నం ఈ విధానం దారుణంగా తిప్పి కొట్టిన విష‌యం మ‌న‌మంతా చూసే ఉంటాం. ఎవ‌రైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్క‌డ దీనికి కొన‌సాగింపుగా వ‌స్తోన్న కొత్త విధాన‌మేంటంటే.. రియ‌ల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది త‌ర‌హాలో ఒక క్యూ ఆర్ కోడ్ పాంప్లెంట్ ప‌ట్టుకుకెళ్లేలా ఒక ఎత్తుగ‌డ‌. త‌ద్వారా వాళ్ల ఫోన్లో స్కాన్ తీయించి.. కూట‌మి ప్ర‌భుత్వంలో ఆయా ల‌బ్ధిదారుల‌కు ఏయే ప‌థ‌కాలు వ‌చ్చాయో చూస్తారు. త‌ద్వారా ఒక డాటా బ‌య‌ట‌కు తీయాల‌న్న‌ది ఒక ఆలోచ‌న‌. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవ‌రు? ఇప్పుడు కొత్త‌గా ఆ ప‌థ‌కాలు కోల్పోయిన వారెవ‌రు? అన్న‌ది బ‌య‌ట‌కు లాగాల‌న్న‌ది జ‌గ‌న్ మార్క్ స్కెచ్ అయితే ఇక్క‌డ మ‌రో ప్ర‌మాద‌మేంటంటే.. వైసీపీలో ఉండేవారంతా దాదాపు రౌడీ బ్యాచ్. మొన్న తెనాలి, త‌ర్వాత ప‌ల్నాడు సంగ‌తి చూసే ఉంటాంగా. గంజాయి తాగేవాళ్లు, బెట్టింగులు ఆడే వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. ఒక‌సారిగానీ ఈ స్కాన్ లోకి గానీ మ‌న ఫోన్ నెంబ‌ర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలు ఇత‌ర వివ‌రాలుగాని వెళ్తే.. ఇంకేం లేదు.. ఖాతాల‌కు ఖాతాలు ఖాళీ అయిపోయే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మ‌న ఇంట్లోని పూర్తి వివ‌రాలు వారి చేతికి వెళ్తే.. ఎప్పుడు ఎలాంటి కండీష‌న్లో మ‌న‌పై సైబ‌ర్ దాడులు జ‌రుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడ‌పిల్ల‌లు వారి వివ‌రాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ‌ గోప్య‌త  మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది కాబ‌ట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు సైబ‌ర్ ఎక్స్ ప‌ర్ట్స్.

యాంకర్ స్వేచ్ఛ సుసైడ్‌ కేసులో కీలక మలుపు

  యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్‌కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో  లొంగిపోయిరు. తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దీంతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. స్వేచ్ఛ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్ణచందర్ విడుదల చేసిన లేఖ వైరల్‌గా మారింది. ఇక పూర్ణ చందర్ విడుద‌ల చేసిన లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, కుటుంబ నేపథ్యంకి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసని, ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్‌లో ప‌ని చేశామ‌ని చెప్పారు. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని గుర్తుచేశారు. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని ఆయన పేర్కొన్నారు.  2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా తన వద్దకు తీసుకువచ్చిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. తాజాగా పూర్ణ చందర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఆధారంగా పోక్సో కేసు ఫైల్ చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు అరణ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులో.. 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  

తాడిపత్రిలో హైటెన్షన్..పెద్దారెడ్డి అరెస్ట్

  అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రి ఇంట్లో ఉండరాదంటూ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చేసేదేంలేక పెద్దారెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.  ప్రస్తుతం పెద్దిరెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు  సమాచారం. మరోవైపు.. హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ స్థానిక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాకను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ  ఆరోపించారు.  తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు.గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను గెలిచినా, ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు. దీంతో తెలుగు దేశం పార్టీలు నేతలు గత కొంత కాలంగా ఆయన్ను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

జూబ్లీ తెరపైకి ..మరో మాగంటి

  జూబ్లీహిల్స్ అసెంబ్లీ  నియోజకవర్గం ఉప ఎన్నికకు  ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. సిట్టింగ్ బీర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైన జూబ్లీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, ఇప్పటికే, ఉప ఎన్నిక రూట్లో కంటోన్మెంట్ సీటును తమ ఖాతాలో వేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ,   జూబ్లీలోనూ బీఆర్‌ఎస్‌’ను ఓడించి, సిటీలో మరో సీటును తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. మరో వంక, బీజేపీ ఫ్యూచర్ వ్యూహాలకు పునాదులు వేసుకునే ప్రయత్నంలో భాగంగా, ఏపీలో సక్సెస్ అయిన, కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో రీప్లే చేసేందుకు జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని ప్రయోగశాల చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  నిజానికి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గలో గెలుపు ఓటములను నిర్ణయించడంలో, ఒక లక్షా 23 వేల వరకు ఉన్న ముస్లిం ఓటు, 70 వేలకు పైగా ఉన్న సెటిలర్స్’ ఓటు కీలకం కాగా, పార్టీలు, పొత్తులు, అంతకు మించి అభ్యర్ధుల ఎంపిక గెలుపు ఓటములను నిర్ణయించడంలో మరింత కీలకం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే, ప్రధాన పార్టీలు, ఓ వంక పొత్తులు, లోపాయికారీ ఒప్పందాలపై కసరత్తు చేస్తూనే, మరో వంక అభ్యర్ధుల, ‘లెక్కలు’ తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.  పొత్తుల విషయానికివస్తే,కాంగ్రెస్ పార్టీ లక్షకు పైగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని,ముస్లిం అభ్యర్ధిని బరిలో దింపి ఎంఐఎంతో లోపాయికారీ, ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో, బీఆర్ఎస్’ ఇదే ప్రయోగం (ఎంఐఎం లోపాయి కారీ ఒప్పందం) చేసి, విజయం సాదించిన నేపధ్యంలో కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ బాటలో నడవాలనే ఆలోచన చేస్తున్నట్లు చెపుతున్నారు. గత (2023)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్’ను బరిలో దింపింది, అయినా, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్’ 16 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.ఎంఐఎం అభ్యర్ధికి 7,848 ఓట్లు మాత్రమే వచ్చాయి.అంటే, ముస్లిం ఓటును ఎంఐఎం సక్సెస్ఫుల్’ గా బీఆర్ఎస్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ వార్ రూమ్’లో పాత ఫలితాలను ముందేసుకుని, కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెసుస్తోంది. అలాగే, పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ టికెట్‌ తనకే దక్కుతుందని ధీమాను వ్యక్తం చేశారు. అయితే, పార్టీ నాయకత్వం గతంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే  స్పష్టం  చేశారు.  మరోవంక,బీఆర్ఎస్’ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో చేతులు ఎత్తేసిన హస్తం పార్టీ మోసాలతో పాటుగా, వరసగా మూడు సార్లు గెలిచిన ‘మాగంటి’ గోపీనాథ్’ ఇంటి పేరునే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో దించాలని, అనుకున్నా,ఆమె అంత సుముఖమ లేరని అంటున్నారు.  ఈ నేపధ్యంలో, గులాబీ పార్టీ,మాగంటి గోపీనాథ్ సోదరుడు, మాగంటి వజ్రనాథ్’ను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.నిజానికి, ‘మాగంటి’ రాజకీయ,వ్యాపార విజయాలలో గోపీనాథ్ తెరమీద హీరో అయితే, తెర వెనక హీరో,’వజ్రనాథ్’, అంటూ బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే, మాగంటి సోదరులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ 90 ఏళ్ళు పైబడిన, తల్లి మహానంద దేవి’ మాట జవదాటరని, అంటున్నారు.  మరోవంక  బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్’ కు గోపీనాథ్’కు ఎంత గుర్తింపు గౌరవం వుందో, వజ్రనాథ్’కు అంతే గుర్తింపు గౌరవం,ఉన్నాయని, అలాగే,వరసగ మూడు ఎన్నికల్లో సోదరుడి ఎన్నిల బాధ్యతను బుజానికి ఎత్తుకుని విజయవంతంగా పూర్తి చేసిన వజ్రనాథ్’కు నియోజక వర్గం, ఎత్తుపల్లాలు అన్నీ కొట్టిన పిండని, బీఆర్ఎస్ వర్గాలు వజ్రనాథ్’ ను తెరపైకి  తెచ్చేప్రయత్నం చేస్తున్నాయి. సో .. గులాబీ బాస్’మరో, ‘మాగంటిని’ బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు చెపుతునన్నారు. అయితే, పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సహా మరికొందరు, టికెట్ ఆశిస్తున్న నేపధ్యంలో, గులాబీ బాస్’  ఇంతవరకు ఎవరి విషయంలోనూ ఒక నిర్ణయానికి  రాలేదని అంటున్నారు. ఓ వంక అధిఅక్ర కాంగ్రెస్, మరో వంక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోందని, అంటున్నారు.

జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

  పూరి జగన్నాథ రథయాత్రలో  విషాదం చోటు చేసుకుంది.  తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మూడు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతల దర్శనం  భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. పూరి జగన్నథ రథయాత్రలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించడం పట్ల ఒడిశా మంత్రి పృధ్విరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.  పూరీలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత గల ఉత్సవంగా భావిస్తారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.  కాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

వైసీపీలో పిన్నెళ్లి ఛాప్టర్ ముగిసినట్లేనా?

వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికరంలో ఉన్నన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కలుగులో దూరిన ఎలుకలా మారిపోయారు. కేసుల చట్రంలో ఇరుక్కుని బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. అసలాయన రాజకీయాలలో ఉన్నారా? ఉంటే వైసీపీలోనే ఉన్నారా? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్రలకు సమాధానం లభించని పరిస్థితి నెలకొంది.  పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ వదిలేసిందన్న చర్చ మాచర్ల నియోజకవర్గంలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా  వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులలో ఉన్న పిన్నెళ్లి పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఒక సారి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఆయనపై ఇంకా పలు కేసులు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు వెనుకాడుతున్నారు.  అసలు జనంలోకి రావడం లేదు. జనం వరకూ ఎందుకు పార్టీ నాయకులు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ జెండా ముట్టుకోవడం లేదు. వైసీపీ తరఫున గళమెత్తడానికి సైతం జంకుతున్న పరిస్థితి.  ఇటీవలి జగన్ పల్నాడు పర్యటనలో కూడా పిన్నెళ్లి జాడ కనిపించలేదు.  ఇదిలా ఉంటటే జగన్ మాత్రం చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలూ, క్యాడర్ ఇంటింటికీ వెళ్లి మరీ ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఆ ఆదేశాల మేరకు పిన్నెళ్లి పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పల్నాడు వైసీపీలో కూడా పిన్నెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పుంజుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో ఆయనను పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తత పరిస్థితుల్లో పిన్నెళ్లి మునుపటిలా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో వైసీపీతో ఆయన రాజకీయ ప్రయాణం దాదాపు ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైళ్లకు వెళ్లేందుకు సద్ధపడాలని, పార్టీ నేతలూ క్యాడర్ అందరూ బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చిన తరుణంలో కేసులకు భయపడి బయటకు రావడం మానేసిన పిన్నెళ్లిని పార్టీ పదవి నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీ బీజేపీలో స్తబ్దత..ఎందుకో మరి!?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందా? అసలు ఏపీలో బీజేపీ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా.. తన వంతుగా కేబినెట్ లోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ పదవులు తీసుకుని కూడా.. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను ఖండించడం కానీ, దీటుగా స్పందించడం కానీ చేయడం లేదని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీలో బీజేపీ నేతల తీరు.. ప్రభుత్వంపై విమర్శలకు స్పందించాల్సిన బాధ్యత తమది కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుుదేశం పార్టీది మాత్రమే అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ సీనియర్ నేతలు  కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా..  పరామర్శ యాత్రల పేరుతో నిబంధనలు తుంగలోకి తొక్కి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవహరిస్తున్నా.. బీజీపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారే తప్ప పెదవి విప్పి విమర్శలు చేయడం లేదు.   వైసీపీనీ, జగన్‌ని ఎదుర్కోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, అలాగే తెలుగుదేశం, జనసేనలదే అన్నట్లు మౌనంగా ఉండిపోతున్నారు. వచ్చే నెల 1న  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ శాఖలకు   కొత్త అధ్యక్షుల ఎంపిక జరగ నుంది.  అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.  ఇప్పుడు కాదు.. భవిష్యత్ లో కూడా ఏపీలో బీజేపీ స్టేక్ పెరిగే అవకాశం కనిపించడం లేదన్న భావనో ఏమో.. ఇంతోటి దానికి అధ్యక్ష పదవి కోసం పోటీ ఎందుకు అన్న నిర్లిప్తతతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.   

ఫ్లవర్ ని కాదు.. ఫైర్ ని అంటున్న కొండా మురళి

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై గట్టి పట్టు ఉన్న నాయకుడైన కొండా మురళి ఇటీవల వచ్చే ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్లు, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఆపార్టీని భ్రష్ఠుపట్టించి.. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరై వారిని కూడా తప్పుదోవ పట్టించి నాశనం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. సొంత పార్టీ నాయకులపైనే బహిరంగంగా విమర్శలు చేయడం,వరంగల్ లో తాను ఉన్నంత కాలం మరో లీడర్ రాడంటూ ప్రకటించడం,  పరకాలనియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏకపక్షంగా ప్రకటించడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు.  ఆ భేటీలో కొండా మురళి వ్యాఖ్యలను ఖండించారు. ఈ భేటీలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, సారయ్య, గుండు సుధారాణి, నాయిని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదలా ఉంటే తాజాగా కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట శనివారం (జూన్ 28)  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారీగా మద్దతు దారులతో గాంధీభన్ కు ర్యాలీగా వచ్చారు. క్రమశక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యాంమోహన్, రామకృష్ణ, కమలాకరరావులతో దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్నపరిణామాలపై క్రమశిక్షణ సంఘానికి లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే తన వ్యాఖ్యలు, తనపై ఆరోపణలపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది.    క్రమశిక్షణ కమిటీ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మురళి తనను రెచ్చగొట్టదంటూ పరోక్షంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాను పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చాననీ, మరి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా? చేయరా? ఆయనే తేల్చుకోవాలన్నారు. తాను దేనికీ భయపడనన్న మురళీ.. అవసరం వచ్చినప్పుుడు అన్ని విషయాలూ చెబుతానన్నారు. మురళి వ్యాఖ్యలపై వివరణ కోరడానికి పిలిచిన క్రమశిక్షణ కమిటీ ఆయనను ఏం ప్రశ్నించిందన్నది పక్కన పెడితే మురళి మాత్రం కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపై కమిటీకి ఫిర్యాదు  చేసినట్లు తెలుస్తోంది.  ఉమ్మడి వరంగల్‌లో ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై  వేదికలాంటి లేఖను క్రమశిక్షన కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. క్రమశిక్షణ కమిటీలో తనను అసలు ప్రశ్నించలేదన్న మురళి..తానే  అయితే తానే తనపై  ఆరోపణలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చానన్నారు.   

ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరి అరెస్టు

తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్నకారు నుసీజ్ చేసి   ఒకరిని అరెస్ట్ చేశారు.  టాస్క్ ఫోర్స్ బృందం  భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్  నిర్వహిస్తుండగా శనివారం (జూన్ 28)  రంగంపేట - శ్రీనివాస మంగాపురం రోడ్డులో  వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. అందులోనుంచి  ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా  పొలీసులు వెంటాడి  అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత   చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి  ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును  క్వాష్ చేయాలనిఆయన  దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు   తిరస్కరించింది.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్  దమ్మాలపాటి శ్రీనివాస్  వాదించారు.  మోహిత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఒకవైపు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసి  ః చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు కోరడం సరికాదని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు ఏజీ  వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కింది  కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై  అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన వాదనలను విజయవాడ   కోర్టులోనే వినిపించి, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది.   ఈ కేసుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.  ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహత్ రెడ్డిని ఏ39గా సిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.   ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల మోహిత్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే మోహిత్ రెడ్డి  . విచారణకు గైర్హాజరై యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఉండగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్.. విచారణకు సహకరించకుండా వ్యవహరిస్తున్న నిందితులకునార్కోటెస్ట్ చేయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్‌లు నిర్వహించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు నార్కో పరీక్షలు నిర్వహించి నిజాలను రాబట్టాలని సిట్ భావిస్తోంది.

అయినా ..ఆయనే బీజేపీ అధ్యక్షుడు !

    వినాయకుడి  పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు సంవత్సర కాలం పైగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి,వచ్చే నెల (జులై) 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే,బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని, నిర్ణయించిన నేపధ్యంలో,ఈలోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగని మిగిలిన అన్ని రాష్ట్రాలలో జులై 15లోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.ఇదే విషయాన్ని, బీజీపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుకే. లక్ష్మణ్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అప్పటినుంచే, ఆసవహుల పరుగులు మొదలయ్యాయి.  అదలా ఉంటే, బీజేపే నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో, పార్టీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోందని, పార్టీ వర్గాల అంతర్గత సమాచారంగా తెలుస్తోంది. ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలకు, ప్రాధాన్యత ఇస్తూనే 2028 అసెంబ్లీ ఎన్నికల విజయం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అంతిమ లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యంతో, అధ్యక్షుని ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడుఎన్నికయ్యే అధ్యక్షుని నాయకత్వంలోనే 2028 ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుందన్న  అంచనాతో తాత్కాలిక వ్యూహంతో కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో నూతన అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, ‘తెలుగు వన్’ చెప్పారు. అయితే,అది ఎవరనే విషయంలో మాత్రం ఇంతవరకు అధిష్టానం నోటినుంచి సంకేతం రాలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి వినిపిస్తున్న నలుగురు ఎంపీల పేర్లలో. మల్కాజిరి ఎంపీ, ఈటల రాజేందర్ పేరు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి,ఈటల పేరు, ఎప్పుడోనే ఖరారైందని, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాల కారణంగా, ప్రకటన వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇటీవల తెర పైకి వచ్చిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా హాజరైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు, కొంత వివాదస్పద మయ్యాయి.ఈ కారణంగా, ఆయన అధ్యక్షుని రేస్’లో వెనక పడ్డారని, నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఈటలే రేసులో ముందున్నారని, పార్టీ అంతర్గత సమాచారంగా తెలుస్తోంది.  అయితే,ఈటలతో పాటుగా, పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘనందన్‌రావు, డీకే.అరుణ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పాత కొత్త లెక్కల్లో భాగంగా, ముందు నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మల్యే చింతల రామచంద్రా రెడ్డి,తో పాటుగా, కల్వకుర్తి నియోజకవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన, పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజు ఆచారి పేరు కూడా పార్టీ సర్కిల్స్’లో వినిపిస్తోంది. అయితే, అంతిమంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అనేది అధికారిక ప్రకటన తర్వాత కానీ, తెలిసే అవకాశం లేదని అంటున్నారు. అయితే, రేపు (జులై29) కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో, రానున్న 24 గంటల్లో మరికొంత క్లారిటీ రావచ్చని పార్టీ వారలు భావిస్తున్నాయి.

సీతక్క ప్రజల్లో పట్టు కోల్పోతుందా?

  ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల గొంతుకై ప్రశ్నించింది, తనను నమ్ముకున్న ప్రజల సంతోషాల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయింది, ప్రజల పట్ల తనకున్న అభిమానం విలక్షణమైన తన సేవ గుణం దేశంలోనే ఒక గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి తన పార్టీ నాయకుల వ్యవహార శైలితో రోజురోజుకీ ప్రజల్లో పట్టుకోల్పోతుందా అనిపిస్తుంది ఇంతకీ ఎవరు ఆ నాయకురాలు ఏంటా కథా.. సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు..కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి ఒకప్పుడు  జేజేలు పలికినవారు నేడు ఆమెకి దూరం అవుతున్నారు. ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా, ప్రజల కష్టాలలో ఓదార్చి వారి తరుపున మాట్లాడి వ్యక్తి, నేడు రాష్ట్ర మంత్రిగా, మరో జిల్లా ఇంచార్జ్ మంత్రిగా  బిజీ గా ఉండటంతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఎందుకు సీతక్క లాంటి నాయకురాలు ప్రజల నుండి దూరం అవుతున్నారు, ప్రజలు సీతక్క గురించి ఏమను కుంటున్నారో తన దృష్టికి వెళ్తుందా లేదా ములుగు జిల్లా నాయకులు మంత్రి సీతక్క ను మై మరిపిస్తున్నారా..? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ములుగు లోని ప్రజలు ఎంతో సంతోషించారు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నారు.. కానీ వారు కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి..సితక్క లాంటి డైనమిక్ లీడర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు తనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అయోమయంలో నియోజకవర్గ ప్రజలు.  గల్లీ లీడర్ నుంచి జిల్లా లీడర్ వరకు సెటిల్మెంట్ల దందా, ఇసుక దందా లో అధికార పార్టీ నాయకుల చేతివాటం పై అనేక ఆరోపణలు, అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల అక్రమ దందాకు అసలైన లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఎవరైనా నిలదీస్తే వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతూ దాడులు చేస్తామని బెదిరిస్తున్న అధికార పార్టీ నాయకులు. దీంతో ఒకప్పుడు జేజేలు కొట్టిన వారే ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.ములుగునియోజకవర్గ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి తో  సీతక్క గెలుపు కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన ఎందరో అభిమానుల మనసులో వున్న అభిమానం తొలగిపోతుంది.  ఒక మండలంలోని గ్రామ అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మంత్రి సీతక్క మండల నాయకుల నుండి జిల్లా నాయకులు వరకు చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు సరికదా వారి ఆగడాలకు అడ్డు కట్ట వేయక పోవటంతో రెచ్చిపోతూ వి డోంట్ కేర్ ఎనీ వన్ అన్ని విర్ర విగుతున్నారు. అధికారమనేది ఎవరికి శాశ్వతం కాదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చేసే అభివృద్ధి పనులు స్థిర స్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోవాలి. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలి.  అధికారం ఉందనే పొగరుతో పోలీసుల సహాయంతో కోర్టు గొడవలు,భూ పంచాయతీలు, బలవంతపు సెటిల్మెంట్, అవినీతి అక్రమాలు, పేకాట దందాలు, ఇసుక దందా, కాంట్రాక్టర్ల దందా లకు కేరాఫ్ అడ్రస్ గా ములుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి ఉంది అని ప్రజలు గుసగుస లాడుతున్నారు. ఓ సీనియర్ నాయకుడు జిల్లాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పలుమార్లు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రాణం పోయినా పేకాట ఆపను అని బహిరంగనే చెప్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎలాంటి హోదా లేకపోయినా హడావుడి చేస్తున్న ఎందుకు సీతక్క అతనిపై చర్యలు తీసుకోవటం లేదు. నైతిక విలువలకు మారుపేరుగా ఉన్న సీతక్క అధికార మత్తులో విలువలు విశ్వసనీయతను పక్కకు పెట్టేసిందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.. సీతక్క అంటే ఒక అంకితభావం,క్రమశిక్షణ, పట్టుదల కలిగిన గొప్ప నాయకురాలు తన జీవితం లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తన 20 సంవత్సరాల పైగా  రాజకీయ జీవితంలో ప్రజా సేవ లలో తనకంటూ ప్రజల్లో గొప్ప అభిమానం సంపాదించుకున్న నాయకురాలు సీతక్క..ఇప్పటికైనా సీతక్క తన వ్యక్తిత్వానికి మచ్చ తీసుకువస్తున్న వారిని కంట్రోల్ చేయాల్సిన అవసర ఎంతైనా ఉంది. అధికార పార్టీ నాయకులను అధికార అహంకారం నుంచి ప్రజాసేవ వైపు మళ్లించాలి ప్రజలు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పేకాట,సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొనీ అధికార పార్టీ మంత్రిగా తనని నమ్ముకున్న ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రజలు ఆశిస్తున్నారు.

భారత గూఢచార సంస్థ రా కొత్త చీఫ్ గా పరాగ్ జైన్ నియామకం

  భారత  గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.పరాగ్‌ జైన్‌.. 1989 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది.  పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో పరాగ్‌ జైన్‌ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.వీటితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం కూడా పరాగ్ జైన్‌ను ఈ పదవికి ఎంపిక చేయడంలో దోహదపడింది. గతంలో ఆయన కెనడా, శ్రీలంక వంటి దేశాల్లోనూ భారత ప్రతినిధిగా దౌత్యపరమైన సేవలు అందించారు

మహా న్యూస్‌పై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

  హైదరాబాద్‌‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని పిలుపునిచ్చారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాని చంద్రబాబు ట్వీట్టర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. మహాన్యూస్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం చేశారు. కార్యాలయం లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపైనా దాడికి దిగినట్లు తెలుస్తోంది.