ఆగ‌స్టు 5 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

  తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.  1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ఆర్జితసేవలు రద్దు ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 4న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగ‌స్టు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.  

3 గంటల్లో శ్రీవారి దర్శనమా..

  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకోవడం అసంభవంమని తెలిపారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం..ఇవాళ ఉదయం వీఐపి విరామ సమయంలో తిరుమల ఆలయంలో  స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.  భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రెండు మూడు గంటల్లో చేయించడం అసంభవం అని ఆయన కొట్టిపడేశారు.. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించిన త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని స్పష్టం చేశారు... ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి కి సూచించారు

దీని భావమేమి జగనేశా?

లిక్కర్ స్కామ్ తో మాకేం సంబంధం లేదు. నా తల్లి మీద ఒట్టు. మా నాన్న, తమ్ముడు మద్యం వ్యసనం కారణంగా ఇబ్బంది పడితే.. మా అమ్మ నన్ను దాని జోలికే పోవద్దనింది. మరి నేనలా చేస్తానా? దానికి తోడు నేను డాక్టర్ ని విద్యాధికుడ్ని. వినాయక చవితి రోజు విగ్రహాలు పంచేవాడ్ని.అటువంటి నన్ను కూడా అవమానిస్తారా? ఇదీ చెవిరెడ్డి మీడియా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పిన విధం.  కన్నీటి పర్యంతమై సెంటిమెంటు సైతం పండించేశారాయన.  అలాంటి చెవిరెడ్డి శిష్యుడు,  ఏ సీరీస్ లో చెవిరెడ్డి కంటే ముందే ఉన్న   ఏ34 వెంకటేష్ నాయుడి దగ్గర కావల్సినంత మద్యం డబ్బు ఉన్నట్టు నిరూపించే వీడియోలను బయట పెట్టింది సిట్. మరి దీని భావమేమి చెవిరెడ్డిగారూ! మరి మీ అధ్వర్యంలో మీ అనుచర గణం మీ పరివార గణం సుమారు 200 కోట్ల రూపాయల మేర.. మీ పార్టీ అభ్యర్ధులకు, ఓటర్లకు డబ్బు పంచింది నిజం కాదా? తుడా వాహనాలను కూడా వదలకుండా అధికార దుర్వినియోగం చేసింది నిజం కాదా? అన్నదిపుడు ప్రశ్నగా మారింది.  ఇక ఇదే కేసులో.. ధనుంజయ రెడ్డి తాను పాత కారే వాడుతున్నాను. ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ కేసులో నా పాత్ర లేదు. నాకే పాపం తెలీదని అంటారాయన. ఆయనకేం తెలీకుండానే వైసీపీ నేతలైన జక్కంపూడి రాజా వంటి వారు మీడియా ముందుకొచ్చి తిడతారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఏవన్ రాజ్ కేసిరెడ్డి పెద్ద డాన్ అంటున్నారు. ఆయన డబ్బే ఇదంతా అని చెబుతున్నారు. అంత తెలిసిన వాడు ఈ డబ్బు ఇంత కాలం ఎందుకు దాచకుంటా ఉంటాడంటూ సన్నాయి నొక్కులు. మరి ఇదంతా ఏంటి? సిట్ వీరిపై 305 పేజీల ఛార్జ్ షీట్ ఊరకే రాసిందంటారా? చెవిరెడ్డిని ఊరకే అరెస్టు చేశారా? మిథున్ రెడ్డికి ఏ పాపం తెలీదు. చిన్నప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య గొడవల వల్లే ఈ కేసును పుట్టించి మరీ అరెస్టు చేశారు. ఇదంతా కక్ష సాధింపని అంటోన్న జగన్ అండ్ కో.. మరి ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లో చిక్కిన వీడియోల మాటేంటి? మా వాళ్లకు యూఏఈలో, యూకేలో ఎలాంటి ఆఫీసుల్లేవు సంస్థల్లేవు. టాంజీనియా, జాంబియాలో అసలే పర్యటనలు చేయలేదు. ఉన్నవీ లేనివీ కల్పిస్తున్నారని చెబుతోన్న జగనన్న.. మరి 28 సార్లు వారు విదేశీ పర్యటనలు ఎందుకు చేసినట్టో? అంటే పాస్ పోర్ట్ నెంబర్లు కూడా కల్పితాలేనా?     ఇక ఇప్పుడు పట్టుబడ్డ వీడియోల తాలూకూ తాడేపల్లిలో క్యాష్ డంప్ లు ఎవరివి? వాటిలో దాగిన డబ్బు ఎవరిది? ఇక మొన్న పట్టుబడ్డ 11 కోట్లు. ఇవాళ వాటికి సాక్ష్యంగా వెలుగు చూసిన వెంకటేష్ నాయుడు వీడియోలు... ఏంటిదంతా? మధ్యలో ఇలాగే ఒక సారి ఒక చెక్ పోస్టులో 8 కోట్లకు పైగా పట్టుబడ్డ డబ్బు ఎవరిది? అన్నీ లెక్కలు నిదానంగా తేలుతాయ్. ఇప్పటి వరకూ మద్యం కేసుల్లో చిక్కని వారు లేరు. కేజ్రీవాల్ అయితే ఏకంగా సీఎంగా ఉండగానే అరెస్టయ్యారు. మా. ము  (మాజీ ముఖ్యమంత్రి) అయిన జమోరె కూడా అరెస్టవ్వక తప్పదని అధకారులు అంటున్నారు.  

అడ్డంగా బుక్కైన జె గ్యాంగ్ సభ్యుడు.. నోట్ల కట్టల వీడియోలు బయటపెట్టిన సిట్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైసీపీ గ్యాంగ్ ఒక్కరొక్కరుగా బుక్కౌతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఫోన్ నుంచే  డబ్బుల డెన్ వీడియోలను సిట్ రిట్రీవ్ చేసింది.  మద్యం ముడుపుల సొమ్ములు దాచిన డెన్ లో నోట్ల కట్టలను లెక్కిస్తూ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయన పీఏ అడ్డంగా దొరికిపోయాడు.   ఆ వీడియోతో మద్యం ముడుపుల డెన్ లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పీఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్ లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతోంది.ఆ వీడియోను వెంకటేష్ నాయుడి ఫోన్ నుంచే సిట్ రిట్రీవ్ చేయడంతో మద్యం కుంభకోణంలో వందల కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా దోచుకుని దాచేసుకున్న సంగతి తిరుగులేకుండా రుజువైనట్లైంది.  ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ నాయుడు ను సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకూ తనకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదంటూ వైసీపీ కీలకనేత చెవిరెడ్డి బుకాయింపులు అన్ని పచ్చి అబద్ధాలనీ తేలిపోయింది. 

గొర్రెల స్కామ్ @ 1000 కోట్లు .. తలసానికి తలనొప్పేనా?

మొన్నటి వరకూ గొర్రెల స్కామ్ విలువ కేవలం 250 కోట్ల రూపాయలు  మాత్రమే అన్నట్టు తేల్చింది కాగ్. అయితే ఈ కుంభకోణం దర్యాప్తులోని  ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఈ  కుంభకోణం వెయ్యి కోట్ల రూపాయల పై మాటే నంటూ వెయ్యి టన్నుల బాంబు పేల్చింది. అది కేవలం ఏడు జిల్లాలకు మాత్రమేనని.. ఈ మొత్తం హెచ్చించి చూస్తే అది అటూ ఇటూగా  ఓ 1200 కోట్ల మేర ఉంటుందని తేల్చింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.  దీంతో నోళ్లు వెళ్ల బెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కరూ.  ఆనాటి పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని కాగా.. ఆయన ఓఎస్డీ  కళ్యాణ్‌ కుమార్ ఇందులో భారీ ఎత్తున చేతివాటం చూపించినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెబితే అసలైన లబ్ధిదారులకు కాక.. నకిలీ వ్యవస్థలకు చెందిన ఫేక్ అకౌంట్లలోకి ఈ నిధులు నీళ్లలా ప్రవహించినట్టు తేల్చింది ఈడీ. ఒక మంత్రిగారి ఓఎస్డీ ఇదంతా చేస్తుంటే.. మరి మంత్రిగారికి తెలీకుండానే జరిగి ఉంటుందనుకోవాలా? అన్నదిపుడు   పెద్ద చర్చగా మారింది.  గతంలో ఇలాంటిదే గడ్డి కుంభకోణం జరిగింది. అది ఇంత మొత్తం కాదు కాదు కానీ ఇంచు మించు అలాంటిది. అయితే ఈ కేసులో బుక్ అయిన లాలూ.. ప్రజా ప్రతినిథుల చట్టం కింద ఎన్నికల వ్యవస్థకే దూరం కావల్సి వచ్చింది. ఇప్పటి వరకూ గులాబీ దళాధిపతి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్‌, కవిత మాత్రమే పీకలోతు స్కాముల్లో ఇరుక్కున్నారు.  మిగిలిన వారంతా కడిగిన ముత్యాలేనని భావించే వారికి  దిమ్మ తిరిగేలా..  ఆ పార్టీ మంత్రులు కూడా ఏం తక్కువ తినలేదన్న కోణంలో ఈ గోట్ స్కామ్ బయట పడ్డంతో.. అసలు గొర్రెలు ఎవరు? వీళ్లకు ఓటు వేసిన వారా? అన్న చర్చకు తెర లేచింది.  ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులోని నిధులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లలోకి కూడా మళ్లించారట. ఇప్పటికే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు వాటిని ప్రమోట్ చేసిన వారిపై భారీ ఎత్తున ఈడీ కొరడా ఝుళీపిస్తున్న విషయం తెలిసిందే. మరి నాటి మంత్రిగారికి ఇది కూడా ఒక కొత్త తలనొప్పిగా తయారవుతున్నట్టు భోగట్టా. ఇదంతా ఇలా ఉంటే ఓఎస్డీ.. ఆయన వెనకున్న మంత్రిగారు.. ఆ మంత్రి గారి వెనకున్న అధినేతలు.. ఈ పరంపర ఇంకాఎంత లోతుంది? వీటి ప్రభావం ఏ మేరకు పడనుందన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక వేళ ఈ కేసులో నాడు మంత్రిగా పని చేసిన తలసాని పీకలోతు కష్టాల్లో చిక్కినట్టేనని భావిస్తున్నారు. అంతే కాదు భారాసా అధినేతకు ఇదో కొత్త తలనొప్పి   కానుందనీ అంచనా వేస్తున్నారు. మ  ఈడీ మరెందరు గొర్రె కేడీలను వెలికి తీస్తుందో తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.  కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో  కోర్టు ఏకీభవించింది.  ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించింది.  కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.  

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు,   మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ ఖైదు విధిస్తూ శనివారం  (ఆగస్టు 2) తీర్పు వెలువరించింది.  జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయల జరిమానా.. బాధితురాలికి 7 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.  రేవణ్ణ అరెస్టు అయిన తరువాత దాదాపు 14 నెలల పాటు కేసు దర్యాప్తు సాగింది. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలో తీర్పు వెలువడింది. కోర్టులో రేవణ్ణపై విచారణ శుక్రవారం (ఆగస్టు 1) ముగిసింది. శుక్రవారమే కోర్టు రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా నిర్దారించింది. రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలు మాయం చేయడం తదితర అంశాలలో రేవణ్ణపై నేరాలు రుజువయ్యాయి.   2024లో రేవణ్ణ హసన్పై ఆరోపణలు, ఆ ఆరోపణలకు సంబంధించి వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన జర్మనీకి పరారైపోయారు.   ఎన్నికల అనంతరమే దేశానికి తిరిగి వచ్చారు. రేవణ్ణకు మే 31న బెంగళూరు విమానాశ్రయంలో   పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్ సమీపంలోని రేవణ్ణ ఫాంహౌజ్ లో వంట పని చేసే 47ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవణ్ణపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  

హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. జల ప్రళయం

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రళయం సృష్టించింది. కులు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో శుక్రవారం (ఆగస్టు 1) పెను విషాదం చోటు చేసుకుంది.  కుండపోత వర్షం కారణంగా  మహోగ్రఉగ్రరూపం దాల్చిన మలానా నది గట్లు తెంచుకు ప్రవహించింది. మలానా వరద ధాటికి మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్‌డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది.  స్థానిక నివేదికల ప్రకారం, ఈ జలప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది.   ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఈ భారీ వరదలలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు చెబుతున్నారు.పలువురు వరద ముంపులో చిక్కుకున్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆహారం, నీరు లేక నానాయాతనా పడుతున్నారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది.  పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అత్యవసర ఉన్నతస్థాయి  సమావేశం నిర్వహించారు. కులులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.   భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరింత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం ఔతున్నది. 

ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి.. బాలకృష్ణ హర్షం

మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్  కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని  ఆ సినీమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భగవంత్ కేసరి జాతీయ సినిమా పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిపైన సంగతి తెలిసిందే. తాను నటించిన భగవంత్ కేసరి సినిమా  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా  ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఈ గౌరవం మొత్తం భగవంత్ కేసరి చిత్ర బృందానికే చెందుతుందన్నారు. చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే భగవంత్ కేసరి సినిమా విజయం సాధమైందనీ, ఇప్పుడు ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యిందనీ పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పరిశీలించేందుకు బాలకృష్ణ శనివారం ( ఆగస్టు 2) అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 21 ఎకరాలలో మూడు దశలలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. ఇక నుంచి తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన సందేశాలు ఉంటాయని చెప్పారు.  తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు బాలకృష్ణ చెప్పారు.  

రాందాస్ సొరేన్ ఆరోగ్య పరిస్ఖితి ఆందోళనకరం

ఝార్ఖండ్ మంత్రి రాందాస్ సొరేన్  ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (ఆగస్టు 2) తెల్లవారు జామున ఆయన జంషెడ్ పూర్ లోని తన నవాసంలో బాత్రూమ్ లో జారి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టిందని చెబుతున్నారు. రాందాస్ సొరేన్ ను తొలుత జంషెడ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సైచనమూరకు మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నాయకుడైన రాందాస్ సొరేన్   ఘట్‌షిలా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా, సాక్షరత, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2024లో ఆయనకు ముఖ్యమంత్రి మరో రెండు కీలక శాఖలు రెవెన్యూ, రవాణా కూడా అప్పగించారు. 

జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్.. మరో 18 మంది వైసీపీ నేతలపై కేసులు?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్ తో  వైసీపీ నాయకులపై కేసులు నమోదౌతున్నాయి. జగన్ పర్యటన సందర్భంగా  నెల్లూరు అంబేద్కర్ భవన్ పక్కన జరిగిన తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యకు  తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే  మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్,  పాతపాటి ప్రభాకర్ పై నెల్లూరు దర్గా మిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.  వీరి ముగ్గురితో పాటు ఈ తొక్కిసలాటకు కారకులుగా మరో 18 మందిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.  బారికేడ్లను తోసి వేయడం.. సెక్షన్ 30 యాక్ట్  ను ఉల్లంఘించడంతోపాటు హెడ్ కానిస్టేబుల్ గాయపడడానికి కారణమైన  ఈ18 మందిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.  పోలీసులు గుర్తించిన ఈ  18 మందీ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్  నియోజకవర్గాలకు చెందిన వారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో వీరిని అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని సుమారు నాలుగు కేసులు వరకు నమోదైన సంగతి తెలిసిందే. 

జూబ్లీ ఉప ఎన్నికల బరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం?

భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక  దగ్గర పడుతున్న కొద్దీ, నియోజక వర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.  జూన్ 6 న మాగంటి మరణించిన నేపధ్యంలో.. ఆరు నెలల లోగా అంటే డిసెంబర్ లోగా జూబ్లీ హిల్స్  ఉపఎన్నిక నిర్వహించ వలసి ఉంటుంది.అయితే..  ఇంకా ఎలక్షన్ కమిషన్,నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రధాన పార్టలు ఏవీ అభ్యర్ధులను ప్రకటించలేదు. అయినా..  జూబ్లీ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ఎగసి పడుతోంది.  ఈ నేపధ్యంలో..  అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో పాటు  బీజేపీ కూడా జూబ్లీ సీటును తమ ఖాతాలో కలుపుకోవాలని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్ధులను ప్రకటించక పోయినా.. పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీల టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఓ వంక టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవంక టిక్కెట్  ఖాయంగా వస్తుందన్న విశ్వాసంతో నియోజక వర్గంలో కార్యకర్తలు, అనుచరుల సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.  అదలా ఉంటే సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఇప్పటికే కకంటోన్మెంట్ ఉప ఎన్నికలలో గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సీటును కైవసం చేసుకుని..  జీహెచ్ఎంసీ ఎన్నికలకు, స్ట్రాంగ్  గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని చూస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కిషన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గంలో కేంద్ర మంత్రి హోదాలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తున్నారు. మరోవంక ప్రధాన పార్టీలు మూడింటిలోనూ.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిజానికి ఎంఐఎం ఆమోదంతో..  గతంలో పోటీ చేసిన మాజీ క్రికెటర్’ అజారుద్దీన్ పేరు  ఆల్మోస్ట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే.. ఇప్పడు తలఫై ఫిరాయింపుల కత్తి వేళ్ళాడుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ టికెట్ కోసం క్యూలో నిలబడినట్లు తెలుస్తోంది. అయితే..  దానం నాగేందర్ మాత్రం తాను టికెట్ కోరలేదని..  కానీ తనకు టికెట్ ఇస్తే..  జూబ్లీతో పాటుగా  ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్  నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని అంటున్నారు. మరోవంక జూబ్లీలో ఎవరు గెలిస్తే వారు మినిస్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో  కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ టికెట్ కోసం పోటీ ఎక్కవగా ఉందని అంటున్నారు.  అదలా ఉంటే కొద్ది రోజుల క్రితం..  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్న ప్రభాకర్, జూబ్లీ టికెట్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ టికెట్ స్థానికంగా పనిచేసే వారికే కానీ.. నాన్ లోకల్ అంటే  స్థానికేతరులకు ఇచ్చేది లేదని స్పష్తం చేశారు. అలాగే.. ఎంఐఎం, కాంగ్రెస్ టికెట్ ముస్లిం మైనారిటీకి ఇస్తేనే..  తమ మద్దతు ఉంటుందని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం షరతు విధించిన తర్వాతనే.. కాంగ్రెస్ నాయకత్వం అజారుద్దీన్ కు గ్రీన్  సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజక వర్గంలో ఒక లక్షా 30 వేల వరకు ఉన్న ముస్లిం ఓట్లు అత్యంత కీలకం అయిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పత్వాను కాదన లేదని అంటున్నారు. అయితే.. దానం పైకి ఏమి చెప్పినా, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి బయట పడేందుకు  ఆయన ఢిల్లీ స్థాయిలోనూ పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు ఖైరాబాద్’ స్థానానికి రాజీనామా చేసి ఫిరాయింపుల కేసు నుంచి బయట పడడంతో పాటుగా.. జూబ్లీలో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా సిటీ ఖాతాలో మంత్రి పదవిని సొంతం చేసుకోవచ్చని దానం పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు. ప్రధానంగా సుప్రీం కోర్టు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలల్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించిన నేపథ్యంలో  దానం అనర్హతవేటు నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల విషయం ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోణీ కొట్టి ఫిరాయింపుల ఖాతా ఓపెన్ చేయడంతో పాటుగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే  కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్  లోక్ సభ స్థానం నుంచి   పోటీ చేసిన దానం నాగేందర్  రాజీనామా చేసి, ఎంతో కొంత గౌరవ ప్రదంగా పక్కకుతప్పుకోవడం తప్ప మరో మార్గం లేదనీ.. అందుకే దానం నాగేందర్  జూబ్లీలో పోటీచేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే.. జూబ్లీ స్టోరీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. అంతిమంగా ఏమి జరుగుతుందో  ఇప్పుడే చెప్పడం కష్టం అంటున్నారు  విశ్లేషకులు.

న్యూయార్క్ నగరంలో వరద బీభత్సం

అమెరికా తూర్పు తీరంలో  భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరం భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని గంటల పాటు అతలాకుతలమైపోయింది. నగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లు, భవనాలలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానా ఇబ్బందులూ పడ్డారు.   భారీ వర్షం కారణంగా రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.   చాలా చోట్ల   నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.    ఒక ప్యాసింజర్ రైలులో నీరు ప్రవేశించడంతో అందులోని ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటకు తరలించాల్సి వచ్చింది. న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిం చారు.  

ఆ పది నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు.. కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా? 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరమైనట్లుగా కనిపించిన ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా?  పార్టీని, పార్టీ శ్రేణులనూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడానికి నడుం బిగించారా? అంటే తాజాగా ఆయన తన ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. శనివారం (ఆగస్టు 2) ఆయన ఆయన పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యమనీ, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచీ ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలూ, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అలాగే పార్టీ సంస్థాగతంలో బలోపేతం చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ముందుగా స్థానిక ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు సమాయత్తం కావాలనీ, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ, ఆ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దృష్టిసారిద్దామన్నారు. ఇక పోతే బనకచర్ల విషయంలో రేవంత్ వైఖరిని ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బనకచర్ల నిర్మింతి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు చెబుతున్నా.. నోరుమెదపకుండా తెలంగాణ సీఎం మౌనం వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.   బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలన్నారు.   

నేతన్నలకు ఉచిత కరంట్..ఈనెల 7 నుంచి అమలు

రాష్ట్రంలో మగ్గాలున్న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో జెట్ స్పీడ్ లో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఒక్క ఆగస్టు నెలలోనే మూడు పథకాల అమలును ప్రారంభిస్తున్నారు. శనివారం (ఆగస్టు 2) నుంచి అన్నదాతా సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇదే నెల 15 నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక ఈ నెల 7 నుంచి మగ్గాలున్న నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు.  నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.   కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు  పవర్ లూమ్స్ ఉన్నవారికి  500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని   ప్రకటించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.  ప్రజావేదిక వేదికగా చంద్రబాబు  ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే కాకుండా, రాష్టరానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నాలనూ వివరించారు.   అలాగే  జగన్ హయాంలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలను విమర్శించారు.  దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక..  నిలబెట్టడమే చాలా కష్టం అన్న చంద్రబాబు జగన్ హయాంలో రాష్ట్రంలో   ఐదేళ్లు  విధ్వంసమే జరిగిందనీ, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందని విమర్శించారు.  అంతకు ముందు జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో చంద్రబాబు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటించారు.  

రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా.. చంద్రబాబు

పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం (ఆగస్టు 1) గండికోట వద్ద  ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రసంగించన చంద్రబాబు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందనీ, చారిత్రక సంపదకు ప్రతిరూపమనీ అన్నారు.  గండికోట ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో  ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.  పర్యాటకులు బస చేసేందుకు స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు.   టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ వంటి  మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.   అలాగే రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే,  లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరి కల్లా టెంట్ సిటీని రెడీ అవుతుందన్నారు. అలాగే సెప్టెంబర్ నుంచి  హెలిరైడ్స్ ఆరంభమౌతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.  కాగా  ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో   రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సీఎం సమక్షంలో పలు ఒప్పందాలు జరిగాయి.  ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పోరేషన్ తో  500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి.  గండికోటతో పాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్,  జెట్ స్కీయింగ్ లాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి. కేంద్రప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు,  అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.   ఏపీలో అమలు చేస్తున్న టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.  

శ్రీశైలం మల్లన్న హుండీ దొంగ అరెస్ట్.. నగదు స్వాధీనం

 శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి  లక్షా 24 వేల 200 రూపాయలను రికవర్ చేశారు. దేవస్థానంలో కాంట్రాక్ట్  పరిచారక విధులలో ఉండే విద్యాథర్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  జూన్ 16 తెల్లవారుజామున   స్వామివారి గర్భాలయం ముందు ఉన్న క్లాత్ హుండీ నుంచి 24 వేలు దొంగతనం చేసి పరారీలో ఉన్న   విద్యాధర్ ను శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ అధికారులు శుక్రవారం (ఆగస్టు 1) అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసుల విచారణలో  మల్లికార్జున స్వామి వారి హుండీని అవసరానికి డబ్బించే అడ్డాగా మార్చుకున్న విద్యాథర్ ఇప్పటి వరకూ 12 స్వార్లు స్వామి వారి హుండీలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు.  ఆ చోరీ సొమ్ముతో   బైక్ కొని, లక్ష రూపాయలు పెట్టి తన ఇంటికి మరమ్మతులు చేయించినట్లు కూడా తెలిపారు.   రెండేళ్ల వ్యవధిలో మల్లన్న హుండీ నుంచి విడతల వారీగా 3 లక్షల 79 వేల 200 రూపాయల సొమ్మును చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు ఖర్చు చేయగా అతని వద్ద మిగిలిన సొత్తు లక్షా 24 వేల 200 రూపాయలను పోలీసులు రివకర్ చేశారు. అలాగే నిందితుడి నుంచి నిందితుడు ఖర్చు చేయగా మిగిలిన 1,24,200 రూపాయలను రికవరీ చేయడంతో పాటు, బైక్ను స్వాధీనం చేసుకుని  నిందితుడిని ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచారు. 

ఆ 10 స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయా ?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి టికెట్ పై గెలిచి.. అధికార  కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను  ఆదేశించింది. అంతే కాకుండా.. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని.. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.  రాజకీయ ఫిరాయింపుల నిలువరించకపోతే అవి  ప్రజాస్వామ్యానికే  నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. అదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం, న్యాయస్థానాలకు లేదని, అది స్పీకర్  విచక్షనాధికారాల పరిదిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. అదే సమయంలో  అనర్హత పిటిషన్లు సమర్పించి దాదాపు ఏడు నెలలు గడిచినా నోటీసులు జారీ చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాతే నోటీసులు జారీ చేయడంపై స్పీకర్‌ను  ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా  గౌరవ  ఎమ్మెల్యేలు కూడా సుప్రీం తీర్పును స్వాగతించారు. అంతే కాదు.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామని అంటున్నారు.  మరోవంక ఎవరి భాష్యం వారిది అన్నట్లుగా..  సుప్రీం తీర్పును,రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన భాష్యం వారు వినిపిస్తున్నారు. ఎవరికి వారు తమకు అనుకూలమైన విధంగా అన్వయించుకుంటున్నారు. మరో వంక  రాజకీయ పండితులు ఎవరి  పద్దతిలో వారు   విశ్లేషిస్తున్నారు.  అలాగే న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు ఎవరికి వారు ఎవరి అభిప్రాయాలను   వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇటు రాజకీయ నాయకుల అభిప్రాయాలు, న్యాయ నిపుణులు అభిప్రాయాలను విశ్లేషించి చూస్తే.. అటు తిరిగి ఇటు తిరిగి బంతి మళ్ళీ స్పీకర్  కోర్టుకే చేరిందనే అభిప్రాయం అంతర్లీనంగా అందరి మాటల్లోనూ వినిపిస్తోంది.  అందుకే.. ఇప్పడు అందరి చూపు స్పీకర్ వైపుకు మరలుతోంది. అయితే..  స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది  ఎవరికీ తెలియదు. కాగా..  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌   సుప్రీం కోర్టు తీర్పును చదివిన తర్వాత.. తీర్పులో ఏముందో పరిశీలించి న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే..  అదే సమయంలో  స్పీకర్ ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు, ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడిన మాటలు వింటే అప్పుడు అన్నీ మీకే తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అంటే..  రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయ లేవనే  ధన్‌ఖడ్‌ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్న సంకేతాలు అయితే ఇచ్చారు. అయితే.. న్యాయనిపుణులతో సప్రదించిన తర్వాత స్పీకర్  ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే..  సుప్రీం కోర్టు  స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశించింది కానీ.. అనర్హులుగా ప్రకటించాలని సంకేత మాత్రంగా అయినా చెప్పలేదు. అనర్హులుగా ప్రకటించవచ్చు లేదంటే తెలంగాణ శాసనసభ పదేళ్లుగా పాటించిన సంప్రదాయన్ని ‘ప్రిసీడెంట్’ తీసుకుని..  ఆ రకంగా నిర్ణయం తీసుకున్నా  తీసుకోవచ్చును. అంతిమ నిర్ణయం ఏమిటో  ఇప్పుడే చెప్పడం కుదరదని నిపుణులు అంటున్నారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా.. అందరి ముందున్న ప్రధాన ప్రశ్న, ఉప ఎన్నికలకు   సంబధించి.. దానికి సమాధానం చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.  అయితే బీఆర్ఎస్ ఉప ఎన్నికలు తధ్యమని అంటుంటే, కాంగ్రెస్ నాయకులు ఆ ఆస్కారమే లేదనీ.. ఆ చర్చే అనవసరమని అంటున్నారు. నిజానికి.. రెండు మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక నుంచే, ఏ చట్టాలు మారాయని, అప్పుడు బీఆర్ఎస్ హయంలో రాని  ఉప ఎన్నికలు ఇప్పడు వస్తాయని, ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రశ్నే లేదని, బే ఫికర్ గా ఉండచ్చని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సో .. ముఖ్యమంత్రి భరోసా నిజం అయితే ఉప ఎన్నికలు రావు .. బీఆర్ఎస్ ఆశలు ఫలిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ప్రస్తుతానికి ఇలాగే అనుకుని సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.  

హెల్మెట్ క్లిప్పు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం.. ప్రమాదంలో నిండు ప్రాణం బలి

  ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని..  అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ వల్ల ప్రాణాపాయం  తప్పుతుందని పోలీసులు పదే పదే చెబుతున్నా.. చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫైన్ ల భయంతో నామ్ కేవాస్తేగా హెల్మెట్ ను తల మీద ఉంచుకుని క్లిప్పు పెట్టుకోకుండా వదిలేస్తున్నారు. దీని వల్ల హెల్మెట్ పెట్టుకున్న ప్రయోజనం నెరవేరడం లేదు.  హెల్మెట్ క్లిప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనీ, తల పోటు వస్తుందని సాకులు చెబుతుంటారు. అయితే ఆ క్లిప్పే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్న విషయాన్ని విస్మరిస్తుంటారు.   హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఒక ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ లో పని చేసే కూకట్ పల్లికి చెందిన నాగ రాజ్ అనే   వ్యక్తి తన ద్విచక్రవాహనంపై మియాపూర్ కి వెళ్లి  కూకట్ పల్లికి వస్తుండగా  స్కూల్ బస్సు ఢీకొని సంఘటనా స్థలంలోనే మరణించాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక నాగరాజు సంఘటనా స్థలంలోనే మరణించడానికి అతడు హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్పు పెట్టుకోకపోవడమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్కూలు బస్సును ఢీకొన్న నాగరాజు రోడ్డుపై పడినప్పుడు హెల్మెట్ క్లిప్పు పెట్టుకోకపోవడంతో ఆ హెల్మెట్ ఎగిరిపోయింది. దీంతో నాగరాజు తల రోడ్డును బలంగా తట్టుకుని అక్కడికక్కడే మరణించాడు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు వేరే వాహనం డాష్ కెమేరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.