దీని భావమేమి జగనేశా?
posted on Aug 2, 2025 @ 11:07PM
లిక్కర్ స్కామ్ తో మాకేం సంబంధం లేదు. నా తల్లి మీద ఒట్టు. మా నాన్న, తమ్ముడు మద్యం వ్యసనం కారణంగా ఇబ్బంది పడితే.. మా అమ్మ నన్ను దాని జోలికే పోవద్దనింది. మరి నేనలా చేస్తానా? దానికి తోడు నేను డాక్టర్ ని విద్యాధికుడ్ని. వినాయక చవితి రోజు విగ్రహాలు పంచేవాడ్ని.అటువంటి నన్ను కూడా అవమానిస్తారా? ఇదీ చెవిరెడ్డి మీడియా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పిన విధం. కన్నీటి పర్యంతమై సెంటిమెంటు సైతం పండించేశారాయన.
అలాంటి చెవిరెడ్డి శిష్యుడు, ఏ సీరీస్ లో చెవిరెడ్డి కంటే ముందే ఉన్న ఏ34 వెంకటేష్ నాయుడి దగ్గర కావల్సినంత మద్యం డబ్బు ఉన్నట్టు నిరూపించే వీడియోలను బయట పెట్టింది సిట్. మరి దీని భావమేమి చెవిరెడ్డిగారూ! మరి మీ అధ్వర్యంలో మీ అనుచర గణం మీ పరివార గణం సుమారు 200 కోట్ల రూపాయల మేర.. మీ పార్టీ అభ్యర్ధులకు, ఓటర్లకు డబ్బు పంచింది నిజం కాదా? తుడా వాహనాలను కూడా వదలకుండా అధికార దుర్వినియోగం చేసింది నిజం కాదా? అన్నదిపుడు ప్రశ్నగా మారింది.
ఇక ఇదే కేసులో.. ధనుంజయ రెడ్డి తాను పాత కారే వాడుతున్నాను. ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ కేసులో నా పాత్ర లేదు. నాకే పాపం తెలీదని అంటారాయన. ఆయనకేం తెలీకుండానే వైసీపీ నేతలైన జక్కంపూడి రాజా వంటి వారు మీడియా ముందుకొచ్చి తిడతారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఏవన్ రాజ్ కేసిరెడ్డి పెద్ద డాన్ అంటున్నారు. ఆయన డబ్బే ఇదంతా అని చెబుతున్నారు. అంత తెలిసిన వాడు ఈ డబ్బు ఇంత కాలం ఎందుకు దాచకుంటా ఉంటాడంటూ సన్నాయి నొక్కులు. మరి ఇదంతా ఏంటి? సిట్ వీరిపై 305 పేజీల ఛార్జ్ షీట్ ఊరకే రాసిందంటారా? చెవిరెడ్డిని ఊరకే అరెస్టు చేశారా? మిథున్ రెడ్డికి ఏ పాపం తెలీదు. చిన్నప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య గొడవల వల్లే ఈ కేసును పుట్టించి మరీ అరెస్టు చేశారు. ఇదంతా కక్ష సాధింపని అంటోన్న జగన్ అండ్ కో.. మరి ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లో చిక్కిన వీడియోల మాటేంటి?
మా వాళ్లకు యూఏఈలో, యూకేలో ఎలాంటి ఆఫీసుల్లేవు సంస్థల్లేవు. టాంజీనియా, జాంబియాలో అసలే పర్యటనలు చేయలేదు. ఉన్నవీ లేనివీ కల్పిస్తున్నారని చెబుతోన్న జగనన్న.. మరి 28 సార్లు వారు విదేశీ పర్యటనలు ఎందుకు చేసినట్టో? అంటే పాస్ పోర్ట్ నెంబర్లు కూడా కల్పితాలేనా?
ఇక ఇప్పుడు పట్టుబడ్డ వీడియోల తాలూకూ తాడేపల్లిలో క్యాష్ డంప్ లు ఎవరివి? వాటిలో దాగిన డబ్బు ఎవరిది? ఇక మొన్న పట్టుబడ్డ 11 కోట్లు. ఇవాళ వాటికి సాక్ష్యంగా వెలుగు చూసిన వెంకటేష్ నాయుడు వీడియోలు... ఏంటిదంతా? మధ్యలో ఇలాగే ఒక సారి ఒక చెక్ పోస్టులో 8 కోట్లకు పైగా పట్టుబడ్డ డబ్బు ఎవరిది? అన్నీ లెక్కలు నిదానంగా తేలుతాయ్. ఇప్పటి వరకూ మద్యం కేసుల్లో చిక్కని వారు లేరు. కేజ్రీవాల్ అయితే ఏకంగా సీఎంగా ఉండగానే అరెస్టయ్యారు. మా. ము (మాజీ ముఖ్యమంత్రి) అయిన జమోరె కూడా అరెస్టవ్వక తప్పదని అధకారులు అంటున్నారు.