సొమ్మసిల్లి పడిపోయిన కవిత
posted on Nov 18, 2023 @ 1:10PM
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొమ్మసిల్లి పడిపోయారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కవిత.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు.. కవిత రాయికల్ మండలం, ఇటిక్యాలలో పర్యటించారు .
ఇటీవల మంత్రి కెటిఆర్ ఎన్నికల ప్రచార వాహనంపై నుంచి పడిపోయారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మంత్రి కేటీఆర్ చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రచార రథంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. వాహనం పైనుంచి పడిపోయారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది.