జగన్ వెంటే జనం.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్ & కో!
posted on Nov 18, 2023 @ 11:47AM
వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు అధికార పార్టీ నేతల మొహం మీదనే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ సామజిక బస్సు యాత్ర కార్యక్రమం అంతా ఖాళీ కుర్చీలకు నేతల ప్రసంగాలుగా మారిపోయింది. అసలీ బస్సుయాత్రకు పార్టీ కేడరే మోహం చాటేసింది. బలవంతంగా తీసుకువచ్చిన జనం కూడా నేతల ప్రసంగాలు ప్రారంభం కాగానే వెళ్లిపోతున్నారు. నేతలు వారిని కూర్చోమని బతిమలాడుకుంటున్న వైనం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పూర్తిగా వైసీపీ పార్టీ సొంత కార్యకమం. ఇందులో అధికారులకు ఎలాంటి పాత్రా లేదు. ఉండకూడదు. కానీ అధికారం ఉంది కదా అని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో జగన్ సర్కార్ నిర్వహిస్తున్నది. అధికారులు ప్రజల వద్దకు వెళ్లి బలవంతంగా జగనే కావాలని చెప్పిస్తున్నారు. వలంటీర్లుగా ఎంపికైన వైసీపీ కార్యకర్తలు జగనే కావాలని చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరించి మరీ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ప్రతి ఇంటిపై వైసీపీ జెండా ఎగరాలని ఆదేశాలిస్తూ.. జగన్ పరిపాలన అమోఘం అనేలా మార్కులు వేయాలని హుకుం జారీ చేస్తున్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని పాతిక ప్రశ్నలతో కూడిన ఒక బుక్ లెట్ ఇచ్చి అందులోని ప్రశ్నలకు ప్రజల నుండి సమాధానాలు తీసుకొని పొందుపరచేలా డిజైన్ చేశారు. ఈ బుక్ లెట్ లో జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయా? లేకుంటే చంద్రబాబు పథకాలు బాగున్నాయా? వంటి ప్రశ్నలు ఉన్నాయి. అలాగే జగన్ పాలన , చంద్రబాబు పాలన ను కంపేర్ చేసి ఎవరి పాలన బాగుందో చెప్పేలా.. పదికి ఎన్ని మార్కులు ఎవరి పాలనకు ఇస్తారనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఈ బుక్ లెట్ తో ప్రజల వద్దకు వెళ్లే ముందే వాలంటీర్లు ప్రజలకు ఏం చెప్పాలో ఆదేశిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వాలని, చంద్రబాబుకు 0 మార్కులు వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారు. అలాగే జగన్ తెచ్చిన పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని బలవంతంగా చెప్పిస్తున్నారు. పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారు. మొత్తంగా జగన్ పరిపాలన సుపరిపాలన అంటూ జనం చేత చెప్పిస్తున్నారు. అలా చెప్పించడమే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం లక్ష్యం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చెప్పిన కాదు కాదు చెప్పించిన వారితో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు.
అంతేకాదు, ఈ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఓ స్టాంపు మరింత ఆసక్తికరంగా ఉంది. ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం అనే అక్షరాలు వచ్చేలా టీడీపీకి వ్యతిరేకంగా రూపొందించిన స్టాంపుపై తాము జగన్ పాలన భేష్ అని చెప్పించిన వారి సంతకం తీసుకొని సర్వే పూర్తి చేస్తున్నారు. అలాగే ఇంటింటికి ఒక వైసీపీ జెండా ఇస్తూ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటిపై వైసీపీ జెండా కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా బెదిరింపులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు జగన్ కావాలనుకుంటే అది వాళ్ళే చెప్పాలి..కానీ వైసీపీ నేతలు ఇలా బలవంతంగా చెప్పిస్తే ప్రయోజనం ఏమిటని నెటిజనులు అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఈగో శాటిస్ ఫై చేయడానికి.. రాష్ట్ర ప్రజలంతా జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పించడానికి అధికారులను పావులుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగనే కావాలని ప్రభుత్వ అధికారులు చెప్పమన్నా.. జగన్ పాలనకు పదికి పది మార్కులేయాలని వాలంటీర్లు బెదిరించినా భరిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళులే అని మనసు చంపుకొని వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఎన్ని సర్వేలు చేసుకున్నా.. జగన్ పాలన సూపర్ అంటూ జబ్బలు చరుచుకోవడానికే తప్ప వాస్తవంగా జగనకు ఆయన పార్టీకీ ఒరిగేదేమీ ఉండదంటున్నారు. పైగా జగనే కావాలని చెప్పాలంటూ జనాలను వాలంటీర్లు బెదిరించడం వల్ల మరింత నష్టం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.