వాలంటీర్లపైనే జగన్ ఆశలు.. గెలిపించేస్తారనే!
posted on Nov 19, 2023 7:09AM
ఏ రాష్ట్రంలో లేని వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తన చేత, తన కొరకు, తానే తీసుకొచ్చిన ఈ వ్యవస్థ వలన తనకూ, తన పార్టీకీ తప్ప ఇంకెవరికీ ఎటువంటి ప్రయోజనం లేని, ఉండని, ఉండకూడని విధంగా జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలకు లబ్ది చేకూర్చడం, ప్రజలపై వైసీపీ నేతలు పెత్తనం చేసేందుకు ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతున్నది. అప్పుడప్పుడు ఈ వాలంటీర్లు పలుచోట్ల బెదిరింపులు, అరాచకాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రామ వాలంటీర్లు, పట్టణ, వార్డు వాలంటీర్లు అందరూ కలిసి ఏపీలో సుమారు 2.7 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ వాలంటీర్ల చేతులే మీదగా ప్రజలకు చేరవేస్తున్నారు. ఏ పథకం లబ్దిదారుడికి అందాలన్నా ఆయా వాలంటీర్ చేతుల మీదగా సచివాలయ ఉద్యోగులు అమలు చేయాల్సి ఉంది. అందుకే సీఎం జగన్ ఇప్పుడు ఈ వాలంటీర్లనే నమ్ముకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వాలంటీర్లే తనను గెలిపిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నట్లు చెబుతున్నారు.
గడప గడపకు కార్యక్రమం నుండి ఇప్పుడు జరుగుతున్న వైసీపీ సామజిక బస్సు యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల వరకూ ఎక్కడ చూసినా వాలంటీర్లే కనిపిస్తున్నారు.. వారి ప్రస్తావనే వస్తున్నది తప్ప వైసీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ కనిపించడం లేదు. అసలు ఎన్నికలంటేనే పార్టీలకు, క్యాడర్ నాయకులు ముఖ్యం. వారు లేకుండా ఏ పార్టీ బ్రతికి బట్టకట్టడం అసాధ్యం. ఓ సామాన్య పౌరుడిని కార్యకర్తగా మలచాలన్నా, ఓటరుగా తీసుకురావాలన్న ప్రభావితం చేసే సత్తా వీరికే ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఎన్నికలనగానే ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లి స్థానిక స్థితి గతుల ఆధారంగా రాజకీయం చేస్తాయి. కానీ అదేంటో వైసీపీ మాత్రం వాలంటీర్ల జపం చేస్తుంది. నేతలు, క్యాడర్ పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారో.. దూరం పెడుతున్నారో కానీ.. వైసీపీ కార్యక్రమం అంటే వాలంటీర్లే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కాగడాపెట్టి వెతికినా వైసీపీ కార్యక్రమాలలో ఆ పార్టీ క్యాడర్ కనిపించదు. ద్వితీయ స్థాయి నేతలూ ఉండరు. వాలంటీర్లు పథకాలు దక్కవు సుమా అని బెదరించి జనాలను ఆ కార్యక్రమాలకు రప్పించినా.. వారు ఏదో వచ్చామన్నట్లు వచ్చి వెంటనే తిరిగి వెళ్లిపోతున్నారు. అందుకే అధికార పార్టీ కార్యక్రమాలన్నీ జనం లేక వెలవెలపోతున్నాయి.
జగన్ మాత్రం జనం వస్తే ఎంత, రాకపోతే ఎంత వాలంటీర్లు ఉన్నారుగా ప్రజల చేత వారే ఓట్లు వేయిస్తారు అని నమ్ముతున్నారా? ఆ భ్రమల్లోనే గడిపేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ పూర్తిగా వాలంటీర్ల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకొచ్చింది? అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. నిజానికి వైసీపీలో ద్వితీయ స్థాయి నేతలు అసంతృప్తితో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. నేనాలుగున్నరేళ్లలో తమకు ఒరిగింది ఏమీ లేదన్న భావన వారిలో బలంగా ఉంది. వైసీపీ సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేసిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు నేతలతో పనిలేకుండా వాలంటీర్లే సర్వం అన్న పరిస్థితి ఉంది. దీంతో స్థానిక నేతలకు పని లేకుండా పోయింది. పోనీ అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఆ ఒక్కటీ అడగొద్దని మంత్రులే తేల్చి చెప్పేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో చిన్నా చితకా పనులు ఏమైనా చేసినా వాటి తాలూకా బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా, ఆ పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాలైన పరిస్థితి. ఆ కారణంగానే పార్టీపై నేతలు అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగానే వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు కూడా అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక క్వారీలు, సెటిల్మెంట్లతో అందిన వరకు సర్దుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. కానీ, అభివృద్ధి పనులే లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలకు దక్కిందేమీ లేదు. కానీ, పార్టీ కార్యక్రమానికి ఖర్చు పెట్టాల్సింది వాళ్ళే కావడంతో ఇప్పుడు వాళ్ళే మొహం చాటేస్తున్నారు. గత ఎన్నికలకు పెట్టిన ఖర్చే దండగ అనుకుంటుండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్కడ నుండి తేవాలని వాపోతున్నారు. దీంతో నేతలెలాగూ పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ కాలేకపోవడంతో వాలంటీర్లే దిక్కుగా మారారు. జగన్ కూడా వాలంటీర్లే గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తూ.. క్యాడర్ ను, నేతలనూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకూ ఫథకాలు అందవు జాగ్రత్త అంటూ వాలంటీర్లు జనాలను బెదరించగలరు కానీ, ఎన్నికలలో ఓటు వేయించగలరా? అంటే అసాధ్యమని పరిశీలకులు అంటున్నారు.