రాష్ట్రంలో అధికారులకు ఇదేం ఖర్మ?
posted on Nov 27, 2023 8:44AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులతో తమ పార్టీ ఎన్నికల ప్రచారం చేపడుతున్నది. వై జగన్ నీడ్స్ ఏపీ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్యక్రమాన్ని రూపొందించిన వైసీపీ, ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో జరిపిస్తున్నది. నవంబర్ 9 నుండి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలలో మొదలైంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒక్కరూ కనిపించడం లేదు. ఎక్కడిక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి జగనే మళ్ళీ ఎందుకు కావాలో వివరిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి వివరించి.. ఈ పథకాలన్నీ ఉండాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలని చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఒక్కో తలకి ఎంత సంక్షేమం అందించారో ప్రజలకు తెలియజేసి వారి ఇంటిపై వైసీపీ జెండా ఎగరేయాలని.. ఇంటికో జెండా కూడా పంచిపెడుతున్నారు.
అయితే ఇలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్ ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకొనే నిర్ణయం తీసుకోవడాన్ని మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారి లేదా అధికారిణిని సీఎం జగన్ చివరికి ఒక పార్టీ కార్యకర్తగా మార్చేశారంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం అంటే ప్రజల సొమ్ము సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేయడమే అవుతుందని అంటున్నారు. కలెక్టర్ నుండి వాలంటీర్ వరకూ అందరికీ జీతాలుగా అందేది ప్రజల సొమ్మే. కానీ వారితో ఇలా పార్టీ ప్రచారం చేయించడం అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులంటే కేవలం ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. పౌరుడు ఏ పార్టీ కార్యకర్త అయినా, ఏ పార్టీ సానుభూతిపరుడైనా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అమలు చేయాలి. అలాగే ఏ పార్టీకీ ప్రచారం చేయకూడదు. అధికార పార్టీకి అయినా సరే లబ్ది చేకూరేలా ప్రవర్తించకూడదన్నది రాజ్యాంగం విస్పష్టంగా చెబుతోంది. కానీ, ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఉద్యోగులను సొంత పార్టీ ప్రయోజనాలను అడ్డగోలుగా వాడేసుకుంటోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రజల వద్దకు వెళ్లిన వైసీపీ నేతలను ప్రశ్నించిన ప్రజలు.. ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ?, సబ్సీడీలు ఎందుకు ఆపేశారు? ఉపాధి ఏమైంది? అంటూ ప్రశ్రిస్తున్నారు. నిలదీస్తున్నారు. అసలు మీరెందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కానీ, అధికారులు తమకేమీ తెలియదని.. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు.
అయితే, అసలు పార్టీ ప్రచారానికి అధికారులను వాడుకోవాల్సిన దుస్థితి వైసీపీకి ఎందుకొచ్చింది? చట్టాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఇంత గుడ్డిగా అమలు చేయాల్సిన అవసరం ఏముందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు నేతల మొహం మీదనే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో వైసీపీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కాదని అధికారుల పార్టీ ప్రచారం కోసం ప్రజల వద్దకు పంపిస్తోంది. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ప్రభుత్వం చెప్పినట్లు ఆడడం, ప్రభుత్వ సేవలో తరించేందుకు సిద్ధపడిపోవడం విస్తుగొల్పుతోంది. సంఘాలు, కమిటీలతో దేన్నైనా వ్యతిరేకించే ఉద్యోగులు ఇలా అధికార పార్టీ ప్రచారం కోసం నిస్సహాయంగా ప్రజల చీదరింపులను భరించడానికి కూడా వెరవకపోవడం వారి దైన్యస్థితికి అద్దం పడుతోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇలా తమతో బలవంతంగా పార్టీ ప్రచారం చేయడాన్ని వారు ర్ణించుకోలేకపోతున్నారు. పంటిబిగువన అసంతృప్తిని, ఆగ్రహాన్ని దాచుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఆడమన్నట్లల్లా ఆడుతున్నామని వారు ప్రైవేటు సంభాషణల్లో దాపరికం లేకుండా చెబుతున్నారు.