ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు.. జగన్ బేజారు!
posted on Jan 23, 2024 @ 10:20AM
షర్మిల ఎంట్రీతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మరి పోతున్నాయా? ఇప్పటి వరకూ ద్విముఖ పోరుగా ఉన్న పరిస్థితులు త్రిముఖ పోరుగా మారబోతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇంతవరకు ఓ లెక్క షర్మిల ఎంట్రీ తరువాత ఇంకో లెక్క అన్నరీతిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయంటున్నారు.
షర్మిల ఎంట్రీకి ముందు వరకూ తెలుగుదేశం, జనసేన కూటమి, అధికార వైసీపీ మధ్య ముఖాముఖీ పోరుగా వచ్చే ఎన్నికలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషించారు. అయితే షర్మిల ఎంట్రీ తరువాత రాష్ట్రంలో జరిగేది త్రిముఖ పోరే అంటూ తమ విశ్లేషణలను సవరించుకుంటున్నారు.ఇప్పటి వరకూ అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు.అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతూ.. మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని గ్రహించారు. ప్రజలే కాదు సొంత పార్టీ నేతలూ విషయాన్ని గ్రహించారు. అందుకే ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో విభేదించి పలువురు పార్టీకి దూరం అవుతున్నారు.
మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, టీడీపీ జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది. జనసేన, తెలుగుదేశం పొత్తుతో జగన్ వ్యతిరేక పవనాల తీవ్రత మరింత పెరిగింది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ఫైర్ బ్రాండ్ విమర్శలతో అన్న జగన్ కు, వైసీపీకి చెమటలు పట్టిస్తున్నది. ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా కూటమికి రావడం వల్ల జగన్ విజయావకాశాలు సన్నగిల్లిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తుండటంతో చీలే ఓటు ప్రభుత్వ అనుకూల ఓటు అంటున్నారు పరిశీలకులు. జగన్ పార్టీ సొంత ఓటు చీలికతో ఇక గెలుపు అన్నది వైసీపీకి అందని ద్రాక్షగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు వల్ల అంటే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పుంజుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అధకారంలో ఉన్న వైసీపీయే అని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం, జనసేన కూటమికి పడుతుందనీ, షర్మిల చీల్చే ఓట్లు మాత్రం జగన్ పార్టీకి పడే ఓట్లనేనని అంటున్నారు. దీని వల్ల ఇప్పటి వరకూ సర్వేలలో వైసీపీ గెలుచుకుంటుందని చెబుతున్న స్థానాలలో కొన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని విశ్లషిస్తున్నారు.
వాస్తవానికి నిన్న మొన్నటి దాకా అంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేంత వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కనీస గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ వారసురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో.. ఆ పార్టీలో గత పదేళ్లుగా కాగడా పెట్టి వెతికినా కనిపించని జోష్ ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదే జగన్ పార్టీలో పునాదులు కదిలిపోతున్నాయన్న భయాన్ని రేకెత్తిస్తున్నది. మొత్తం మీద షర్మిల ఎంట్రీ వైసీపీ ఓటమిని డిసైడ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటి వరకూ జగన్ పార్టీకి రాయలసీమలో ఉన్న పట్టు షర్మిల ఎంట్రీతో జారిపోయిందని అంటున్నారు. షర్మిల ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయంటున్నారు. షర్మిల ఎంట్రీ జగన్ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. అంటే ఇప్పటి వరకూ జగన్ పార్టీ ఖాతాలో పడతాయనుకుంటున్న సీట్లలో ఎన్నో కొన్ని కాంగ్రెస్ ఖాతాలో పడతాయనీ, దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుచుకునే స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.