తొలి ప్రసంగంతోనే సిక్సర్ కొట్టేసిన షర్మిల.. ఇక వైసీపీ బౌన్సర్లకు రెడీ అవ్వాలి!
posted on Jan 23, 2024 9:02AM
ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిల సిక్సర్ కొట్టేశారు. ఇక ముందు తన పొలిటికల్ బ్యాటింగ్ ఎలా ఉండబోతోందో తేటతెల్లం చేసేశారు. సొంత అన్న అన్న ముఖమాటం ఏ మాత్రం ఉండదని చాటారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, అలా జగన్ సర్కార్ పై విమర్శల బాణాలు సంధించారు. జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అడుగంటిందని దుయ్యబట్టారు.
తొలిరోజే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు షర్మిల విమర్శల దాడి మరింత తీవ్రం అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం విభేదాలున్నా.. అటు అన్న జగన్ కానీ, ఇటు చెల్లి షర్మిల కానీ పరస్పర విమర్శలు చేసుకోలేదు. ఎదురుపడినా కొద్దిగా ముభావంగా ఉన్నా, పలకరింపులు, చిరునవ్వులు, కరచాలనాలు, ఆలింగనాలతో తమ అనుబంధం చెక్కు చెదరకుండా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అంతెందుకు నిన్న మొన్న షర్మిల కుమారుడి పెళ్లి నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరయ్యారు. ఎక్కువ సమయం గడపక పోయినా.. ఆ కార్యక్రమానికి వెళ్లి మేనల్లుడిని ఆశీర్వదించి, చెల్లిని అభినందించి, ఆత్మీయంగా హగ్ చేసుకుని ఫొటో దిగారు. అయితే ఇలాంటి మర్యాద ప్రదర్శనలు ఇక ముందు అన్నా చెల్లెళ్ల మధ్య ఉంటాయా అంటే డౌటే అంటున్నారు పరిశీలకులు.
షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వెంటనే అన్న జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే వచ్చే నెల 17న జోధ్ పూర్ లో జరగనున్న షర్మిల కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యే అవకాశాలు మృగ్యం అంటున్నారు. ప్రస్తుతం షర్మిల జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల ఉధృతి రానున్న రోజుల్లో మరింత తీవ్రం అవ్వడం ఖాయం షర్మిల తన ప్రభుత్వాన్నీ, తననూ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం జగన్ కు రాజకీయంగా చేసే నష్టం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా ఇక షర్మిల విషయంలో ఉపేక్షించకుండా దాడి ప్రారంభించడం ఖాయమని అంటున్నారు. అందుకే జగన్ మేనల్లుడి పెళ్లికి హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు. కొందరైతే రాజకీయం దారి రాజకీయందే.. అందు కోసం బంధుత్వాన్ని వదులుకుంటారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిశీలకులు మాత్రం వైఎస్ వివేకా హత్య తదననంతర పరిణామాలు, సొంత బాబాయ్ కూతురిని కూడా కాదని, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ వత్తాసు పలుకుతూ వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ఇక అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేది రాజకీయ యుద్ధమే తప్ప బంధుత్వం కాదని అంటున్నారు.
ఇప్పటికే షర్మిల వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. యధా ప్రకారం వైసీపీ సోషల్ మీడియా కు మాత్రమే సాధ్యమయ్యే బూతులతో వెల్లువెత్తుతున్న పోస్టులు గమనిస్తే.. షర్మిల విషయంలో మెహమాటం లేకుండా వ్యవహరించమని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయా అనిపించకమానదు. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల చేసిన విమర్శలన్నీ రాజకీయమైనవే. జాబ్ క్యాలెండర్, మూడు రాజధానులు, రాష్ట్ర అభివృద్ధి, పోలవరం వంటి అంశాలను లేవనెత్తి జగన్ వైఫల్యాలను ఎత్తి చూపారు. మణిపూర్ హింసాకాండను ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక క్రైస్తవుడిగా కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. ఆమె చేసిన ఏ విమర్శలోనూ తప్పుపట్టాల్సినదేమీ లేదు. పైగా గత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం, జనసేన ఈ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. చేతనైతే వీటిపై సమాధానం ఇవ్వాలి కానీ.. షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆమె విమర్శలకు వెనుక చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ అనుమతి లేకుండా రావని పరిశీలకులు అంటున్నారు.
తనను, తన విధానాలను విమర్శింస్తే జగన్ సహించరు. అలా విమర్శించేవారు తనవారైనా, పరాయి వారైనా ఆయనకు ఒక్కటే. ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఇప్పుడు షర్మిల పైనా అదే చేస్తున్నారు. చేస్తారు. సొంత చెల్లి అయినా సరే తన విధానాలను వ్యతిరేకిస్తే జగన్ సహించరనీ, ఉపేక్షించరనీ చెప్పడానికి వైసీపీ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులే నిదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు. దీంతో ముందు ముందు వైసీపీ నుంచి షర్మిలపై విమర్శల దాడుల తీవ్రత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే మేనల్లుడి వివాహానికి కూడా జగన్ డుమ్మా కొట్టడం ద్వారా చెల్లెలు అన్న సెంటిమెంట్ నాకే లేనప్పుడు మీకు మొహమాటం ఎందుకు రెచ్చిపొండి అని సంకేతాలు ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.