2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

  2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉందని  దేశ జీడీపీలో  తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నామని తెలిపారు.  2047 నాటికి భారతదేశ జీడీపీ 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించామని పేర్కొన్నారు. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రమని తెలిపారు ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించామని సీఎం అన్నారు.  చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందామని తెలిపారు. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.  తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించామని సీఎం తెలిపారు. తెలంగాణ అన్ స్టాపబుల్ అని అన్నారు. దీంట్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.  

సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ జె. శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక చెల్లదని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం అందులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్దరామయ్యకు నోటీసులిచ్చింది.  సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చ జరుగుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  

ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్

  ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో కౌంటర్  దాఖలు చేయాలని ఆమ్రపాలిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమెను ఏపీకి బదిలీచేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఆమ్రపాలికి స్వాపింగ్‌ వర్తించదని డీవోపీటీ వాదించింది. హరికిరణ్‌ రిజర్వ్‌ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్‌ వర్తించదని వివరించింది. ఈ క్రమంలో క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం : గవర్నర్

  తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ రంగారెడ్డి జిల్లా కందుకూరులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ సమిట్‌ను నిర్వహిస్తోంది.  ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతు వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని తెలిపారు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా  ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందని గవర్నర్ ఆశభావం వ్యక్తం చేశారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.  గ్లోబల్ సమ్మిట్ జరిగే ఫ్యూచర్ సిటీ డ్రోన్ వీడియో ఆకట్టుకుంటోంది. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. మరోవైపు రైజింగ్ సమ్మిట్‌లో నటుడు అక్కినేని నాగార్జున పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు అన్నపూర్ణ స్టూడియోస్‌ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని నాగ్ వెల్లడించారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను,  చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.  ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సమ్మిట్ స్టాళ్లను పరిశీలించారు.ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీనటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.  

గోవా అగ్ని ప్రమాదం.. పర్యాటకం పడకేనా?

అస‌లే  గోవా  టూరిజం అంతంత మాత్రం. దానికి తోడు ఇలాంటి అగ్నిప్ర‌మాదాలు కూడా తోడ‌వ‌డంతో మ‌రింత  త‌గ్గుముఖం ప‌ట్టేలా  క‌నిపిస్తోంది. ఇంత‌కీ  ఈ ఫైర్ యాక్సిడెంట్ డీటైల్స్ ఏంటో చూస్తే.. గోవాలోని బిర్చ్ నైట్ క్ల‌బ్ లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది  పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించడం. ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే దారులు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా  ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.   దీంతో నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై బీఎన్ఎస్ లోని ప‌లు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు స్థానిక పోలీసులు.  ఇక ఈ నైట్ క్లబ్ కు లైసెన్స్ ఇచ్చిన అర్పోరా-నాగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.  అస‌లే గోవా ప‌ర్యాట‌కం అంతంత మాత్రం. ఈ స‌మ‌యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో ఆ కాస్త టూరిజం కూడా ప‌డ‌కేయ‌డం  ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  అసలింతకీ  గోవా టూరిజం ఎందుకు త‌గ్గింద‌ని ఈ సంద‌ర్భంగా  ఒక ప‌రిశీలిస్తే..  ధరల పెరుగుదల ఒక ప్రధాన కారణంగా చెబు తున్నారు.  దానికి తోడు ఇక్క‌డికొచ్చే టూరిస్టులపై స్థానిక ఆటో, క్యాబ్ మాఫియా ప్ర‌భావం కూడా ఎక్కువ‌ గానే ఉంద‌ని అంటారు. ఇక  బీచ్‌లలో పరిశుభ్రత లోపించడం, పర్యాటకులతొ అనుచిత ప్రవర్తన వెర‌సీ గోవాకు  ప్ర‌త్యామ్న‌యంగా థాయ్ ల్యాండ్ వంటి ప్రాంతాల‌కు వెళ్తున్నారు ప‌ర్యాట‌కులు. గోవాను ప్ర‌స్తుత కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తీర్చిదిద్ద‌డంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌లం చెంద‌డం కూడా గోవాకు పర్యటకుల రాక గణనీయంగా తగ్గడానికి ప్రధాన   కార‌ణాల్లో ఒక‌టిగా భావిస్తున్నారు.  ఇక్క‌డ ఆటో క్యాబ్ మాఫియా ఆగ‌డాలపై  కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువుత్తుతున్నాయి. ఉబ‌ర్, ఓలా వంటి చౌకైన యాప్ లు.. అందుబాటులో లేకుండా చేయ‌డం  ప‌ట్ల కూడా చాలా మంది టూరిస్టులు  అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. ఇక గోవాలో స్థానికుల నిర‌స‌న కూడా ఒక కార‌ణంగా తెలుస్తోంది. ప‌ర్యాట‌కుల వ‌ల్ల స్థానిక జీవ‌న శైలి బాగా దెబ్బ తింటోంద‌ని.. భూముల ధ‌ర‌లు కూడా  ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని స్థానికులు అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వీరు  త‌ర‌చూ ఆందోళ‌నలకు దిగుతున్నారు.   ఇది కూడా గోవా పట్ల పర్యాటకుల విముఖతకు ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది.  కొన్ని నివేదికల ప్రకారం, గత 10 ఏళ్లలో విదేశీ పర్యాటకుల దాదాపు సంఖ్య 93శాతం తగ్గింది.  అయితే 2025లో దేశ విదేశీ ప‌ర్యాట‌కుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని చెబుతున్నారు స్థానిక అధికారులు. అయితే ఇది క‌రోనా ముందు కాలంతో పోలిస్తే చాలా చాలా త‌క్కువ‌  కరోనాకు ముందు గోవా టూరిజం బ్ర‌హ్మాండంగా ఉండేది. కోవిడ్  త‌ర్వాత విదేశీ  ప‌ర్యాట‌కం  గ‌ణ‌నీయంగా  ప‌డిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా అత్య‌ధిక తీర ప్రాంతం గ‌ల రాష్ట్ర‌మే. మ‌రి గోవా కి మాత్ర‌మే అంత‌గా టూరిస్టులు ఎందుకు వ‌స్తారంటే ఇక్క‌డ నీరెండ ఎక్కువ. అదే ఏపీ స‌న్ రైజింగ్ స్టేట్ కాబ‌ట్టి ఎండ  తీవ్ర‌త ఎక్కువ‌. దానికి తోడు గోవా స్థానికులు సైతం విదేశీ జీవ‌న శైలిని ఏమంత  అభ్యంత‌ర పెట్ట‌రు. న‌డిరోడ్డుపై శృంగారం మ‌ద్య మాంసాదుల  సేవ‌నం ఇంకా ఎన్నో విదేశీ లైఫ్ స్టైల్ ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు. అయితే గోవాపై బీజేపీ ప‌ట్టు పెరిగాక‌.. ఇక్క‌డ త‌ర‌చూ నిర‌స‌న‌లు ఆందోళ‌న‌లు పెట్రేగ‌డమే  విదేశీ టూరిస్టుల‌ రాక‌డ గ‌ణ‌నీయంగా తగ్గడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు ఇలాంటి సిలిండ‌ర్ పేలుడు ఘ‌ట‌న‌లకు సంబంధించిన వార్త‌లు సైతం గోవా టూరిజాన్ని  మ‌రింత దెబ్బ తీసేలా తెలుస్తోంది. శనివారం (డిసెంబర్ 6)అర్థరాత్రి ప్రమాదం జరిగినప్పుడు నైట్‌క్లబ్‌లో సుమారు 100 మంది వరకూ ఉన్నారని, సిలెండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మంటలు చెలరేగగానే పలువురు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరుగులు తీశారని, ప్రవేశద్వారం ఇరుకుగా ఉండటంతో కొంద‌రు వంటగదిలోనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల సిగపట్లు

కడప జిల్లాలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మంగారి మఠం. ఇప్పుడు ఆ ఆలయ మఠ పీఠాధిపతి వ్యవహారం.. వివాదాలు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఉత్కంఠ రేపుతోంది. పీఠాధిపతి స్థానం నాకంటే-నాకే అంటూ పూర్వ పీఠాధిపతి మొదటి భార్య, రెండవ భార్య కుమా రుల మధ్య నెలకొన్న పోటీ.. నిత్యం వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పడు ఈ పరిణామాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి. కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. 2021 వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికీ ఇవ్వాలన్నదే పీటముడిగా మారింది. ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఆధ్యాత్మికతకంటే కుటుంబ వివాదాలే భక్తులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయట. నాటి పీఠాథిపతి వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతి.. తన కుమారుడు వెంకటాద్రినే తదుపరి పీఠాధిపతిగా కొనసాగించాలని కోరుతుంటే..  రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుడు గోవిందస్వామినే పీఠాధిపతి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా నానిన ఈ వివాదం కాస్తా కోర్టు వరకూ చేరింది. అయినా ఫలితం మాత్రం రాలేదు. సీన్ కట్ చేస్తే ధార్మిక సంఘాలు ఎంట్రీ కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది. నాటి పీఠాధిపతి వెంకటేశ్వరస్వామికి మారుతి మహాలక్ష్మి భార్య కాదని.. మొదటి భార్య కుమారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఓ మహిళపై అమానవీయంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టి చిత్రీకరించడం ఏంటని రెండోభార్య మారుతిమహాలక్ష్మి నిలదీస్తున్నారు. ఇదే సమ యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కంటే చావే మేలంటున్నారు. అందుకే తనను రాళ్లతో కొట్టి చంపేందుకు అనుమతి ఇవ్వాలని ఏకంగా పోలీసులను కోరడం చర్చనీయాంశంగా మారింది. అటు మఠాన్ని అభివృద్ధి చేయాల్సి న బ్రహ్మంగారి వారసులు పీఠాధిపతి పదవి కోసం ఇలాంటి పనులు చేయడమేంటని భక్తులు ఆశ్చర్యపోతున్నారు.  ఏదీ ఏమైనా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కావాలంటే  కొన్ని అర్హతలుండాలి. వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంథాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ నేర్పించే సమర్థత ఉండాలంటున్నారు భక్తులు.

ఇట్ ఈజ్ అఫీషియల్ నౌ.. పలాశ్ తో స్మృతి మంధానా వివాహం రద్దు

మ్యుజీషియన్ పలాశ్ ముశ్చల్ తో మహిళా క్రికెటర్ స్మృతి మంధానా వివాహం రద్దైంది. ఈ విషయాన్ని స్మృతి మంధానా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. పలాశ్ తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు.  ముందుగా నిర్ణయించిన మేరకు గత నెల 23న మంధానా, పలాశ్ ల వివాహం జరగాల్సి ఉంది. అయితే మంధానా  తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని ఆ రోజు ప్రకటించారు. అప్పటి నుంచీ స్మృతి మంధానా వివాహంపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ తెర దించుతూ తాజాగా స్మృతి మంధానా తమ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఊగాహానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. తన వివాహం చుట్టూ జరిగిన చర్చ తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఈ విషయానికి ముగింపు పలకాలని ఆమె కోరారు. తమ కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇస్తూ తన వివాహం విషయంలో ఊగాహాన సభలకు ముగింపు పలకాన్నారు.   ఇలా ఉండగా.. ఈ వివాహం నిశ్చితార్ధం తరువాత రద్దు కావడానికి పలాశ్ ముశ్చల్ వ్యవహారమే కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పలాశ్ ముచ్చల్ పెద్దగా పెద్దగా పేరు లేని మ్యూజిక్ డైరక్టర్. చాలా కాలంగా స్మృతితో ప్రేమలో ఉన్నారు.  ఈ క్రమంలోనే వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తరువాత  పలాశ్ ముశ్చల్ వ్యవహారశైలిపై పలు అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డాన్స్ మాస్టర్ తో ఎఫైర్, మరో మోడల్ తో అభ్యంతరకర చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆకారణంగానే పెళ్లి రద్దు అయినట్లుగా తెలుస్తోంది.

ఛత్తీస్ గఢ్ లో 12 మంది మావోల లొంగుబాటు

నక్సల్స్ విముక్త భారత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన పలు ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అలాగే భారీగా మావోలు ఆయుధాలను విసర్జించి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అలా లొంగిపోయిన వారిలో  అగ్రనేతలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   తాజాగా మరో 12 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని   ఛత్తీస్ గఢ్ లోని ఖైరాగఢ్ జిల్లా  కుమ్హీ   గ్రామంలో  12 మంది మావోలు ఆయుధానలతో సహా  లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు  రామ్‌ధేర్ మజ్జీ, డివిజన్ కమిటీ సభ్యులు చందు ఉసేండి, లలిత, జానకీ, ప్రేమ్, ఏరియా కమిటీ సభ్యులు రామ్‌సింగ్ దాదా, సుకేశ్ పొట్టం, ప్లటూన్ పార్టీ మెంబర్లు లక్ష్మి, శీలా, సాగర్, కవత, యోగిత ఉన్నారు.  

హైదరాబాద్ లో ట్రంప్ రోడ్డు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ కు ముందు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంలోని రోడ్లకు గ్లోబల్ ఐకాన్ ల పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, ప్రతిభామంతుల  గౌరవార్థం రాష్ట్రంలోని పలు ప్రధాన రహదారులకు వారి పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే..  ఓ ఆసక్తికరమైన, పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చే సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న హై ప్రొఫైల్ రహదారికి  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు మరియు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్రం ఇప్పటికే లేఖలు రాసింది.  అక్కడ నుంచి అనుమతి లభించి ఈ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం జరిగితే..  అమెరికా వెలుపల ఒక సిట్టింగ్ అధ్యక్షుడి పేరు మీద వెలిసిన తొలి రోడ్డు మార్గం ఇదే అవుతుంది.  ఇక పోతే.. రావిర్యాల ప్రాంతంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రేడియల్ రింగ్ రోడ్డుతో  కలిపే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి, ప్రజాహితానికి రతన్ టాటా చేసిన  సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.   అలాగే.. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు గౌరవంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ రహదారికి గూగుల్ స్ట్రీట్ గా నామకరణం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి  గ్లోబల్ కనెక్టివిటీ, పెట్టుబడులకు ద్వారాలు తెరవడమే కాకుండా,  బ్రాండ్ తెలంగాణను అంతర్జాతీయ వేదికపై బలోపేతం చేయడానికి దోహదపడుతుందంటున్నారు. 

మంచు తెర మాటున లంబసింగి.. మన్యానికి పోటెత్తుతున్న పర్యాటకులు

శీతాకాలంలో మంచు తెరల మధ్య మన్యం అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లా చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మంచు వానలా కురుస్తోంది. ఈ సందర్భంగా మన్యం అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అటువంటి అద్భుత అనుభవాన్ని పొందేందుకు పర్యాటకులు మారేడుమిల్లి, లంబసింగి ,తాజంగి డ్యాం, చెరువులు వ్యానo, వ్యూ పాయింట్, కొత్తపల్లి జలపాతం, వంజంగి వ్యూపాయింట్, అరకు చూడటానికి  పర్యాటకులు క్యూ కడుతున్నారు. లంబసింగిలో ఆదివారం 7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజులలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. చలిలో మన్యం అందాలను  ఆస్వాదించేందుకు ఓ వైపు పర్యాటకులు పోటెత్తుతుండగా, మరో వైపు  చలి, మంచు కారణంగా ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా   చిన్నపిల్లలు వృద్ధులు చలికి ఎక్స్ పోజ్ కాకుండా ఉండటం మేలని చెబుతున్నారు. 

మేడ్చల్ జిల్లాలో రియాల్టర్ హత్య

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కాప్రా సాకేత్ కాలనీలో సోమవారం (డిసెంబర్ 8) ఉదయం వెంకటరత్నం అనే రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు.  తన ఇంటి నుంచి బైక్ పై బయలుదేరిన వెంకటరత్నంను   సాకేత్ కాలనీలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్  వద్ద  గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. ముందుగా రివాల్వర్ తో కాల్పులు జరిపి, ఆ తరువాత విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత మార్చారు.  సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఘటనాస్థలంలోని బుల్లెట్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.  ఇలా ఉండగా హతుడు వెంకటరత్నంపై  గతంలో దౌలి పేట పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్ ఉందనీ, అలాగే ఓ జంట హత్యల కేసులో కూడా నిందితుడని తెలు స్తోంది.  కాగా ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వెంకట రత్నం హత్య కు సంబంధించి అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  

గ్లోబల్ సమ్మిట్ గెస్టులకు తెలంగాణ చిరుతిళ్లు

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిథులు, విశిష్ఠ  అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ కోసం ప్రత్యేక కిట్ ను రూపొందించింది.   ఉదయం నేపాల్‌, బ్యాంకాక్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల ఆదివారం (డిసెంబర్ 7) ఉదయమే వచ్చిన  ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి తోడ్కోని వెళ్లింది. అక్కడ నుంచి వారికి కేటాయించిన హోటల్స్ కు తరలించింది. అక్కడ వారికి ఈ ప్రత్యేక కిట్ ను అందజేసింది. ఈ కిట్ లో తెలంగాణ చిరుతిళ్లు సకినాలు, చెక్కగారెలు, నువ్వుల లడ్డూ, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు, బాదమ్‌కీ జాలి వంటివి ఉన్నాయి. ఇలా ఉండగా తెలంగాణ రైజిగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే వారిని ఆహ్వానించేందుకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చెందిన వంద మంది అధికారులతో ఒక బృందాన్ని నియమించింది.  ఇక  సమ్మిట్‌ జరిగే సమయంలో హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ, పాయా, మటన్‌ కర్రీతో పాటు వెజ్‌, నాన్‌వెజ్‌కు సంబంధించిన పలు వంటలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాలకు చెందిన వంటలను కూడా సిద్ధం చేస్తోంది.  

అభినవ కృష్ణదేవరాయులు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఉడుపిలో అభివన కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం చేశారు.  కర్ణాటకలోని ఉడుపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి  సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కల్యాణ్‌కు ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ తాను ఈ కార్యక్రమానికి సత్యాన్వేషిగా వచ్చానని చెప్పారు.   పాలన, సేవ, బాధ్యతలే నిజమైన నాయకత్వానికి ప్రతీకలన్నారు.   వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరిం చారు.  జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, తీసుకునే ప్రతి నిర్ణయం, ఎదుర్కొని ప్రతి సంశయంలోనూ భగవద్గీత మనకు తోడ్పడుతుందన్న పవన్ కల్యాణ్,  నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, ఐడెంటిటీ క్రైసెస్, ఫెయిల్యూర్ ఫియర్ వంటి వాటితో యుద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధానికి ఏ మాత్రం తీసిపోదనీ, ఈ యుద్ధంలో గెలవడానికి అవసరమైన  మానసిక బలం, మనోస్థైర్యాన్ని అందించేది భగవద్గీత  మాత్ర మేనన్నారు.     మన భారతమాత ఎన్నో దండయాత్రలను ఎదుర్కొని, తట్టుకుని నిలబడిందంటే, అది ఆయుధాలతో కాదు, సంపదతో కాదు, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాల వల్లనేనన్నారు.  సనాతన ధర్మం మూఢనమ్మకం కాదనీ,  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి గా పవన్ కల్యాణ్ అభివర్ణించారు.  

మూడు విమానాలకు బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైన వేళ.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదరింపు తీవ్ర కలకలం సృష్టించింది. విదేశాల నుంచి వస్తున్న మూడు విమానాలకు ఒకే రోజు ఒకే సారి బాంబు బెదరింపు ఈమెయిల్ రావడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కన్నూర, ఫ్రాంక్ పర్ట్, లండన్ ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ మూడు విమానాలకు సోమవారం (డిసెంబర్ 8) ఈ మెయిల్ ద్వారా బాంబు బెదరింపులు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తనిఖీలు చేపట్టారు.  విమా నాశ్రయ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్మెంట్‌ అత్యవసర ప్రోటోకాల్‌ను అమల్లోకి తీసుకువచ్చాయి. మూడు విమానాలు ఎలాంటి ప్రమాదం లేకుండా శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ అయ్యాయి. ల్యాండింగ్‌ అనంతరం ప్రయాణికులందరిని  విమానం నుంచి దింపి, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ జోన్‌లకు ఈ విమానాలను తరలించారు.   ఇదిలా ఉండగా, మూడు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.   విమానా శ్రయం పరిధిలో అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, మొత్తం ఏరియాను హై అలర్ట్‌లో ఉంచారు.ఈ ఘటనపై  వింగ్‌ ఇప్పటికే విచారణ చేపట్టింది, బెదిరింపు ఇమెయిల్‌ పంపిన వివరాలు తెలుసుకునే పని ప్రారంభించింది.  

అమెరికాలో లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  అమెరికాలో పోలీసులు అడ్డుకున్నారు. డల్లాస్ లో ఎయిర్ పోర్టు నుంచి ఆయన బటయకువస్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల పాటు అమెరికాలో చదవి, రెండేళ్లు వాషింగ్టన్ డీసీ లో ప్రపంచ బ్యాంకులో కొలువు చేసిన లోకేష్ కు అప్పట్లో ఎప్పుడూ ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని  తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విమానాశ్రయంలో లోకేష్ ను అడ్డుకున్నారు.  సాధారణంగా దేశాధినేతలు, ప్రపంచ కప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచి వచ్చే క్రీడాకారులకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అటువంటి సమయాలలో పోలీసులు ఆయా సెలబ్రిటీలను విమానాశ్రయం నుంచి వేరే మార్గం గుండా బయటకు తీసుకు వెడతారు. అశేష అభిమాన జనం రావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వారిని భద్రంగా పంపేందుకు ఇలా చేస్తారు. ఇప్పుడు లోకేష్ ను అమెరికాలో పోలీసులు అలాగే అడ్డుకుని ఆయన వేరే మార్గం గుండా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకు వెళ్లారు. ఇది అమెరికాలో కూడా లోకేష్ కు అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో తెలియజేస్తున్నది. పోలీసులు తనను అడ్డుకుని వేరే మార్గం ద్వారా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువచ్చిన విషయాన్ని తెలుగు డయాస్పోర సమావేశంలో లోకేష్ స్వయంగా చెప్పారు.   డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని, ఈ అభిమానం అపూర్వమనీ, మరువలేననీ లోకేష్ అన్నారు. 

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం

  తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేటి మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ,  ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు  సిద్దం చేశారు.  వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దంచేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.  సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.  ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.

జగన్‌పై ఎంపీ వేమిరెడ్డి ఫైర్

  అప్పన్న ఫ్యామిలీకి  సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై మాజీ సీఎం జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్ నాపై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవరి సూచనతో నేను సాయం చేశానో నాకు స్పష్టంగా తెలుసు. వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన అప్పన్నకు మానవతా దృక్పథంతో సాయం చేశాను. నేను చేసిన సహాయం నిజమా కాదా అనేది దేవుడే సాక్షి. సాయం కోసం ఎవరైనా వస్తే ఇప్పటికీ నాకు తోచినంతగా ఆదుకుంటున్నాను. ప్రతి నెలా నేను సహాయం చేసే వారి జాబితాలో చాలామంది ఉంటారు. ఈ విషయం ఆయనకూ తెలుసు. నేను సేవా భావంతోనే సాయం చేస్తుంటాను. అయితే సేవ చేసినా నిందలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనం చేసిన మంచిని, చేసిన సేవను దేవుడికే తెలుసు. జగన్ కామెంట్స్ తనను బాధించాయనే కారణంగా ఇప్పుడు ఈ విషయాలు వెల్లడిస్తున్నాను’’ అని వేమిరెడ్డి తెలిపారు.  

హిందూ మతంపై కుట్రలు : విజయసాయిరెడ్డి

  హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిడులకు వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.  దేశం కోసం, ధర్మం కోసం హిందువులందరూ ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష..శ్రీరక్ష అని ఓ యాంకర్ మతమార్పిడులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. హిందూ ధర్మం కోసం అన్ని సామాజిక వర్గాలు ఒకటి అవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన బీజేపీకి చేరువయ్యేందుకు ఇలాంటి ట్వీట్ చేశారని కామెంట్స్ చేశారు.