అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్ మోల్ అనిల్ అంబానీపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  సీబీఐ   కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.  రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తన  వ్యాపార కార్యకలాపాల కోసం ముంబైలోని స్పెషలైజ్డ్ ఎస్‌సీఎఫ్ బ్రాంచ్ నుండి రూ.450 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ పొందింది. ఈ రుణం మంజూరులో భాగంగా కంపెనీ సకాలంలో వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, భద్రత, ఇతర నిబంధనలను పాటించడం వంటి  ఆర్థిక క్రమశిక్షణను   రిలయెన్స్ హోం ఫైనాన్స విఫలం కావడంతో  బ్యాంకు 2019లోనే  ఈ లోన్ అకౌంట్ ను నిరర్థక ఆస్తిగా బ్యాంక్ వర్గీకరించింది. నిబంధనలు గుర్తుచేసినా, పర్యవేక్షణ చేసినా కంపెనీ పదేపదే డిఫాల్ట్  అవ్వడంతో ఫిర్యాదు చేసింది.  తీసుకున్న నిధులను  ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించి దుర్వినియోగం చేశారని ఆడిట్ గుర్తించింది.   అయితే ఈ ఆరోపణలపై రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.  

మరో పోలీస్ అధికారిపై వేటు వేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ లో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం,  భూవివాదాల్లో జోక్యం వంటి వాటికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సీపీ సజ్జనార్  ఇటీవల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిదే. ఆ క్రమంలోనే  తాజాగా కూల్సుంపుర ఏసీపీ మునావర్‌పై చర్య తీసుకున్నారు.  ఆయనను తక్షణమే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో  అనచితంగా వ్యవహరించారన్న  పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్  పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల విచారణలో కుల్సంపుర ఏసీపి మునావర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలడంతో ఆయన పై చర్యలు తీసుకున్నారు.  మునావర్  సిబ్బందిపై దురుసు ప్రవర్తన, తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసే విధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు కూడా కమిషనర్ దృష్టికి వచ్చాయి. దీనిపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో హైదరాబాద్ సిపి సజ్జనార్.. కుల్సంపుర ఏసిపి మునావర్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఇంతకుముందే టప్పాచబుట్ర ఇన్‌స్పెక్టర్ అభిషిలాష్, కూల్సుంపుర ఇన్‌స్పెక్టర్ సునీల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల పనితీరు, వ్యవహారశైలిపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ అన్ స్టాపబుల్ మాత్రమే కాదు..అన్ బీటబుల్!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన   తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో  భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వచ్చే పాతికేళ్లలో తెలంగాణను  దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రం గా తెలంగాణ అన్న లక్ష్యంతో కృషి చేయాలన్న ఆశయం మహోత్కృష్టమైనదన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో    భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో   ప్రసంగించిన దువ్వూరి సుబ్బారావు.. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో   ఆర్థిక కార్యదర్శిగా,  ఖమ్మం కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.   ఇప్పుడు తాను హైదరాబాద్ వాడిననీ, తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు.   తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్  అంటున్నానని చెప్పారు.   చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.  2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించడానికి,   ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలన్న దువ్వూరి సుబ్బారావు, ఇది నిజంగా ఒక చాలెంజ్, కొంచం కష్ట సాధ్యమే అయినప్పటికీ ఇంతటి గొప్ప లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ ను అభినందిస్తున్నాన్నారు. హైదరాబాద్ ను అద్భుత నగరంగా అభివర్ణించిన దువ్వూరి సుబ్బారావు,  ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది కానీ,  ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కిందట  ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు, ప్పుడు అందరూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారనీ, దీన్ని బట్టే  తెలంగాణ గొప్పతనం ఏంటో అఅర్ధం చేసుకోవచ్చని దువ్వూరి అన్నారు.   తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమన్న ఆయన  సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమ లుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించిందనీ,  ఇప్పుడిక తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.    

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో లోకేష్ భేటీ.. ఏఐ డేటా సెంటరే కాదు..ఇంకా ఎన్నో

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో భేటీ అయ్యారు.  గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే కూడా పాల్గొన్న ఈ భేటీలో  ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు, ఉద్యోగ కల్పనకు సంబంధించి చర్చ జరిగింది. ముఖ్యంగా విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఏఐ డటా సెంటర్ పనుల పురోగతిపై ఈ భేటీలో సమీక్షించారు.     విశాఖ ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అనుబంధంగా   విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకో సిస్టమ్ ను  రాష్ట్రంలో నెలకొల్పడానికి గూగుల్ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.   అలాగే ఆంధ్రప్రదేశ్‌లో  డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పై కూడా మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని సుందర్ పిచాయ్ ను కోరారు.  ప్రస్తుతం గూగుల్ సంస్థకు చెందిన డ్రోన్ విభాగం  వింగ్స్ డ్రోన్‌లు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని  హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ఏపీ ఏరోస్పేస్  టెక్నాలజీ విభాగంలో పారిశ్రామికీకరణను సాధించే అవకాశం ఉంది.   భారతదేశంలో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతో పాటు, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా దేశీయ స్టార్టప్‌లకు తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాపిటల్ హోదాను బలోపేతం చేయనున్నాయి. ఈ కీలక భేటీ ఆంధ్రప్రదేశ్ లో  ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏరోస్పేస్ వంటి ఫ్యూచర్‌స్టిక్ టెక్నాలజీలలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్‌లో ముఖ్యమైన గమ్యస్థానంగా రూపాంతరం చెందేందుకు లోకేష్ దృష్టిసారించినట్లు అవగతమౌతుంది.   ఆంధ్రప్రదేశ్‌కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో  మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను   వివరించారు. శాంటాక్లారాలోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో  భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీకి అపార అవకాశాలు, అనుకూల వాతావరణం ఉందన్నారు.  విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్   యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే.. ఐఐటీ తిరుపతి లేదా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో  ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు.  రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, యూనివర్సిటీలలో  ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్" స్థాపించాలని కోరారు. అలాగే చిప్ డిజైనింగ్ దిగ్గజం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరితో  సమావేశమైన లోకేష్ ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్విడియా టెక్నాలజీతో ఒక  స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్  ప్రారంభించాలని ప్రతిపాదించారు. అలాగే రాష్ట్రంలో డీప్‌టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు, మోంటార్ సహకారం అందించాలనీ,  ప్రభుత్వ అధికారులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని  కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన  ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరి,  ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు!

తెలంగాణలో అత్యంత కీలకమైన సీఎంవో, లోక్ భవన్ లకు బాంబు బెదరింపు మెయిల్ కలకలం రేపింది. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి వచ్చిన ఈ బెదరింపు ఈమెయిల్ లో ముఖ్యమంత్రి కార్యాలయం, లోక్ భవన్ లను బాంబులతో పేల్చివేయాడానికి కుట్ర జరుగుతోందని హెచ్చరిక ఉంది.  విశ్వసనీయ సమాచారం మేరకు వాసుకిఖాన్ పేరుతో ఈ ఈమెయిల్ వచ్చింది.  ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్‌ను వెంటనే ఖాళీ చేయాలని,  పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.  ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన గవర్నర్ కార్యాలయం, ఈ నెల 3న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి నిజంగా ఎవరు? వాసుకి ఖాన్ పేరు అసలుదా? ఇది కేవలం భయపెట్టేందుకా? లేక మరేదైనా కుట్రలో భాగమా? అన్న అనుమానాల దృష్ట్యా సైబర్‌ నిపుణుల సహాయంతో పంజాగుట్ట పోలీసులు ఇమెయిల్ సోర్స్ మరియు ఐపీ వివరాలను ట్రాక్ చేస్తున్నారు. భద్రతా సంస్థలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.సీఎంవో, లోక్ భవన్ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారని తెలిసింది.

సోనియాగాంధీకి కోర్టు నోటీసులు.. ఎందుకంటే?

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియాగాంధీ దేశ పౌరసత్వం తీసుకోవడానికి ముందే.. దేశంలో ఓటుహక్కు పొందారన్న విషయంపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇప్పుడు సోనియాకు నోటీసులు జారీ చేసింది.  భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ  కోర్టును ఆశ్రయించారు. దీంతో  సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.  ఇటలీ పౌరురాలైన సోనియా గాంధీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1983 ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం లభించింది.  అంతకు మూడేళ్ల ముందే.. అంటే 1980 నాటికే  సోనియాగాంధీ పేరు ఢిల్లీ  ఓటరు జాబితాలో  ఉందని పిటిషనర్ ఆరోపించారు. భారత పౌరసత్వం పొందకముందే దేశంలో ఓటరుగా నమోదు కావడం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషన్ పేర్కొన్నారు.  ఓటు హక్కు కోసం సోనియా గాంధీ నకిలీ పత్రాలు సమర్పించి ఉండొచ్చని ఆరోపించారు. 1980లో సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చిన తర్వాత తిరిగి 1982లో తొలగించారని, ఆపై 1983 జనవరిలో తిరిగి ఓటరు జాబితాలో చేర్చారని పిటిషనర్ ఆరోపిం చారు.

డాన్ బ్రాడ్ మన్ వరల్డ్ రికార్డ్.. 87ఏళ్లుగా పదిలం

టెస్ట్ క్రికెట్ చరిత్రలో సర్ డాన్ బ్రాడ్ మన్  అద్భుత ఆటగాడిగానే కాదు.. ఎన్నో ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన గోప్ప క్రికెటర్. రికార్డులు అన్నవి బ్రేక్ అవుతూ ఉంటాయి. డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అయితే డాన్ బ్రాడ్ మన్ వరుసగా ఆరు టెస్టుల్లో  ఆరు సెంచరీల రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.  1937 జనవరి 1న ఇంగ్లండ్‌పై మొదలైన సెంచరీల ప్రవాహం.. 1938 జులై 22 వరకు కొనసాగింది. ఈ 87 ఏళ్లలో మరే ఇతర బ్యాటర్ కూడా వరుసగా ఆరు మ్యాచుల్లో సెంచరీలు చేయలేకపోయారు. అయితే ఈ అరుదైన ఘనతకు  ఒకింత చేరువగా వచ్చిన వాళ్లు లేకపోలేదు. ప్రస్తుత టీమ్ ఇండియా కోచ్.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వరుసగా ఐదు టెస్టుల్లో ఐదు సెంచరీలు చేశాడు. అలాగే సౌతాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్, పాకిస్థాన్ కు చెందిన  మహ్మద్ యూసుఫ్ కూడా వరుసగా 5 మ్యాచుల్లో సెంచరీలు చేశారు. అయితే డాన్ బ్రాడ్ మన్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. చూడాలి మరి మరో 13 ఏళ్లు బ్రాడ్ మన్ రికార్డు అన్ బ్రేకబుల్ గా మిగిలి.. శతాబ్దపు రికార్డుగా రికార్డు పుటల్లో నిలిచిపోతుందేమో.

ఐపీల్ మినీ వేలం.. వెలవెల బోతుందా?

ఐపీఎల్ 2026 మెగా టోర్నీ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మినీ వేలం ఈ నెల 16న అబుదాబీ వేదికగా జరగనుంది. వేలం కోసం అప్లై చేసుకున్న 1,355 మందిలో  కేవలం 350 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ఇందుకు సంబంధించిన జాబితా  ప్రకటించింది. ఇందులో బీసీసీఐ అనూహ్యంగా 1,005 మంది పేర్లను జాబితా నుంచి తొలగించింది. 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది.  350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది  అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది. మొదట బిడ్డింగ్ ప్రక్రియ.. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, పేసర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా క్యాప్డ్ ఆటగాళ్లతో వేలం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా ఇదే వరుస క్రమంలో వేలం జరిగే అవకాశముంది. నివేదికల ప్రకారం ఓ ఫ్రాంచైజీ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ పేరును జాబితాలో చేర్చమని కోరడంతో అతడికి జాబితాలో స్థానం దక్కిన్నట్లు తెలుస్తోంది. డికాక్ గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి.. మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.  కాగా ఇటీవల వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు.  రానున్న ఆక్షన్‌లో క్వింటన్ డికాక్ కనీస ధర రూ.కోటి ఉండనున్నట్లు సమాచరాం. అయితే గత వేలంతో పోల్చుకుంటే అతడి ధర 50 శాతం తగ్గింది. గతంలో కేకేఆర్ అతడిని రూ.2కోట్లకు దక్కించుకుంది.

తెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్.. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది.  సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం (డిసెంబర్ 8) అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక హైదరాబాద్ నగరం సైతం చలిగుప్పెట్లో వణుకుతోంది. నగర పరిధిలోనూ పలు ప్రాంతాలలో సింగి ల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.  శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది.   మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

ఎనిమిదో రోజూ కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. ఇక హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు కూడా భారీగా రద్దయ్యాయి. మంగళవారం (డిసెంబర్ 9) దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.   దేశీయ విమానయాన సంస్థ ఇండిగో  నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి  . విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానా శ్రయంలో మొత్తం 58 విమానాల రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు , హైదరాబాద్‌కు రావాల్సిన 14 విమాన సర్వీసులు ఉన్నాయి.  

ఏపీలో జడ్ స్కాలర్ డెవలప్ మెంట్ సెంటర్!

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  సాగుతున్న ఆయన పర్యటన కు సానుకూల స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగానే నారా లోకేష్ క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో  దిగ్గజ సంస్థ అయిన  జడ్ స్కాలర్  సీఈవో జే చౌదరితో  నారా లోకేష్ భేటీ అయ్యారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్లయింట్లు వస్తున్నారనీ, వారంతా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారనీ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్  ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన తమ సంస్థ బెంగుళూరులో మేజర్ ఇంజనీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్, కోర్ ప్లాట్ ఫాం డెవలప్ మెంట్ సెంటర్ నిర్వహిస్తోందనీ,  భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, , టెలికం ప్రొవైడర్లతో కలిసి భాగస్వామ్యాలను విస్తరిస్తున్నామనీ చెప్పారు. సురక్షితమైన డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం అగ్రశ్రేణి భారతీయ బ్యాంకులు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పడమే కాకుండా నారా లోకేష్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. సంస్థ సహచర బృందంతో చర్చించి సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు మళ్లీ బాంబు బెదిరింపు కలకలం

శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి మరో సారి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.   న్యూయార్క్‌కు చెందిన జాస్పర్ పకార్ట్  అనే వ్యక్తి పేరిట వచ్చిన ఈ మెయిల్‌  తో అప్రమత్తమైన విమానాశ్రయాధికారులు సెక్యూరిటీని అలర్ట్ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.   శంషాబాద్‌ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్‌ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్‌ లో  జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. బెదిరింపు మెయిల్ అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సీఐఎస్ఎఫ్, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ఎయిర్పోర్ట్ లోపలి, బయటి ప్రాంతాలు, పార్కింగ్‌, కార్గో, రన్‌వే పరిసరాల్లో విస్తృతం గా తనిఖీలు చేపట్టాయి. అమెరికా బౌండ్‌ విమానాలకు అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.ఈ మెయిల్‌ మూలం, పంపిన వ్యక్తి వివరాలపై సైబర్‌ క్రైమ్‌ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగు తున్నప్పటికీ అధికారులు  భద్రతను   కట్టుదిట్టం చేశారు. ఒకవైపు వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్, మరోవైపు విమానాల  రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో  గందరగోళ పరిస్థితి నెలకొంది.  

సీఎం కాన్వాయ్ కి తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17వ జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలిపోయిన టైర్ ను మార్చి వాహనాన్ని సిద్ధం చేశారు. అలాగే వాహనానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు చేర్చి మళ్లీ కాన్వాయ్ లో చేర్చారు.  రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి అపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా,  దేశ వ్యాప్తంగాసంచలనం సృష్టించిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ రవి విచారణకువిచారణకు కోర్టు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదనీ, ఆయన కస్టడీని పొడిగించాలనీ ఆ రివిజన్ పిటిషన్ లో పేర్కొన్నారు.   ఐబొమ్మ రవిపై  నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు  ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి  కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.  మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను ఐదు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ రివిజన్ పిటిషన్ లో కోరారు.  ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తండేల్’, ‘హిట్’ వంటి భారీ చిత్రాల పైరసీకి సంబంధించి కీలక సమాచారాన్ని రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు.  ఇందు కోసం అదనపు కస్టడీ అవసరమని పేర్కొన్నారు.   పైరసీ చేసిన ఫైళ్ల సోర్స్ లు, రవి అందుకున్న టెక్నికల్ సహాయం, సర్వర్లు, విదేశీ ఐపీ అడ్రెసులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందన్న సైబర్ క్రైమ్ పోలీసులు, రవి నిర్వ హించిన నెట్‌వర్క్‌లో ఎంత మంది భాగస్వా ములు ఉన్నారు? సినిమాల డిజిటల్ కాపీలు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఎలాంటి ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారు? అనే విషయాలపై ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు.  కాగా పోలీసుల రివిజన్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. 

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌...తొలి రోజు భారీ పెట్టుబడుల వెల్లువ

  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి   వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత  కైలాష్ సత్యార్థితో, బాలల హక్కులు, విద్య, మరియు యువత సాధికారత అంశాలపై చర్చించారు. కొరియా ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రానిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు,  అమెజాన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.  అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్ మరియు రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపింది. ఐకీయా సంస్థ ప్రతినిధులతో సమావేశమై, టెక్స్టైల్ మరియు ఫర్నిచర్ తయారీ రంగాల్లో MSME భాగస్వామ్యంపై చర్చించారు.   వియత్నాం‌కు చెందిన ప్రముఖ సంస్థ VINGroup ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.  ఎలక్ట్రానిక్స్ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ స్థాపనపై చర్చించారు. SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశమై, స్టార్టప్ ఫండింగ్ మరియు MSME ఫైనాన్స్ అంశాలపై చర్చించారు.  మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు వేర్‌హౌజింగ్ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు.యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఉన్నత విద్యా భాగస్వామ్య MoU కుదిరింది. వంతార కన్జర్వేటరీ ప్రాజెక్ట్‌పై MoU సంతకాలు జరిగాయి.  చివరగా  ఆసియాన్ దేశాల రాయబారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.  ఫస్ట్ రోజు భారీగా ఎంవోయూలు కుదిరాయి. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. డీప్‌ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్‌ రంగంలో జీఎంఆర్‌ గ్రూప్‌తో రూ.15 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.  

వెంటపడ్డ వీధి కుక్కలు...నిండు ప్రాణం బలి

  వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి. ఇలాంటి విషాద సంఘటనపై స్పందించిన సుప్రీంకోర్టు వీధి కుక్కలను అక్కడ నుంచి తరలించాలని ,వీధుల్లో ఆహారం పెట్టకూడదని ఆదేశించింది .అయినా ఎక్కడ కూడా వీధి కుక్కల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో తాజాగా సోమవారం వీధి కుక్కలు వెంట పడ్డ ఘటన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో చోటు చేసుకుంది.   మోటారు సైకిల్ వెలుతున్న ఓ వ్యక్తిని కుక్క వెంబడించడంతో భయపడిన వ్యక్తి వేగంగా వెలుతూ ఆలయాన్ని ఢీ కొనడంతో మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన ట్రాఫిక్ ఎస్.ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. రాయచోటి పట్టణం  గాలివీడు రోడ్డులో నివాసం వుంటున్న  షేక్ పజిల్ (28) అనే వ్యక్తి కి  కడప రోడ్డులో ఫర్నీచర్ షాపు వుంది. ఆ షాపును ఇటీవలే చిత్తూరు రోడ్డుకు షిప్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వుండడంతో షిప్టింగ్ పనులు ముగించుకొని  సోమవారం తెల్లవారు జామున 2.45  గంటల సమయంలో మోటార్ సైకిల్ పై ఇంటికి బయలు దేరారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అపోలో మెడికల్ స్టోర్ వద్ద అతన్ని వీధి కుక్క వెంబడించాయి.  దీంతో  కుక్కల బారి నుండి తప్పించుకోవాలన్న  భయాందోళనకు గురై వేగంగా వెలుతూ సమీపంలో రెండు అడుగుల డౌన్ లో వున్న  రామాలయం గోడను ఢీ కొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   మృతుడు జీవనోపాధి కోసం సౌదీ కి వెళ్లగా పెళ్లి చేసుకోవాలని మూడు నెలల క్రితమే ఇండియాకు రావడం, అంతలోనే ఇలా జరడం పట్ల  కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. *ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా. భారత అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు వీధి కుక్కలపై సీరియస్ అయింది. ఆమేరకు వాటిని వీధుల్లో లేకుండా షెల్టర్ లకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అంతేకాదు ఇటీవల వాటిని  తరలించేందుకు ఇచ్చిన ఆదేశాలపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా కోరింది .అయినా కూడా అధికారులు వీధి కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు కనిపించడం లేదు . రాయచోటిలో జరిగిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

  ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లతో ఈ కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫోటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్టీఆర్  పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటో, పేరును వాడిన వారిపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు.  ఈ మేరకు పిటిషన్‌ను జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఇవాళ విచారించారు. ఎన్టీఆర్‌ ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కింద మూడురోజుల్లో చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది.  ఆ రోజున సవివరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జస్టిస్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరా తెలిపారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జే సాయి దీపక్‌ వాదనలు వినిపించారు. అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించడం, ట్రోల్స్‌ చేయకుండా.. అలాగే, బిజినెస్ అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు గానీ, ఫొటో గానీ ఉపయోగించకుండా కోర్టును ఆశ్రయించారు. గతంలోనూ టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు నటులు నాగార్జున, అజయ్‌ దేవ్‌గన్‌,, ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ సహా పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  

వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నది : సీఎం చంద్రబాబు

  గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని..ఆదాయం తగ్గినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అన్ని వ్యవస్ధలను చక్కదిద్దుతూ అభివృద్ధిని కొనసాగిస్తు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టీ అనేక విజయాలను చవిచూసిందని.. కానీ 2024 విజయం నమ్మకం, విశ్వాసం మీద వచ్చిందని తెలిపారు.  సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్‌గా ఉంటారో తాము అంతే టెన్షన్‌గా ఉంటామని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నది అని ముఖ్యమంత్రి అన్నారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.  అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.టైమ్ ఇచ్చినా DGCA ప్రమాణాలను ఇండిగో పాటించలేదని తెలిపారు. దీంతో విమానాలు రద్దు అయ్యాయి..ఇబ్బందులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. పైలట్లకు విశ్రాంతి అవసరం.. నా హెలికాప్టర్ కూడా నిబంధనల మేరకు కొన్ని గంటలే ప్రయాణం చేస్తుందని చంద్రబాబు తెలిపారు.  

పెళ్లికి నిరాకరణ...మరదలను గొంతు కోసి హత్య చేసిన బావ

  హైదరాబాద్ నగరంలో రెండు వేరు వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురికావడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గుర వుతున్నారు.  ఈరోజు ఉదయం తన పాపను స్కూల్ దగ్గర వదిలి పెట్టి వెళుతుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ముషీరాబాద్ పరిధిలో ఓ దుండగుడు ఏకంగా ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన బాపూజీ నగర్ బస్తీలో ఈరోజు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక అగంతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల మైనర్ బాలికను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హతమార్చిన ఘటన స్థానికులను భయబ్రాం తులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలసకు చెందిన పవిత్ర కుటుంబం హైదరాబాదు నగరానికి వచ్చి ముషారాబాద్ పరిధిలో నివాసానికి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వరసకు  మేనత్త కొడుకు ఉమా శంకర్  అమ్మాయి పవిత్ర ఇంటికి వచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో గొడవ చేశాడు... అబ్బాయి పవర్తన బాగోలేదని తెలిసిన పవిత్ర కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ళు నిరాకరించడంతో ఆగ్రహంతో  మేన బావ ఉమా శంకర్ వెంటనే పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్లి చాకు తీసుకువచ్చి  అమ్మాయి పవిత్ర తల్లిదండ్రుల ముందే పవిత్ర  గొంతు కోసి... పలుమార్లు పొడిచి.. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు.. తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై పవిత్ర అక్కడి కక్కడే మృతి చెందింది.  సంఘటన జరిగిన వెంటనే బోద్ధనగర్, వారాసిగూడ SHOలు సహా పోలీసు సిబ్బంది తో పాటు క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పెళ్లికి నిరాకరించినందుకు కోపంతో పవిత్ర మేనబావ ఉమాశంకర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు  పరారీలో ఉన్నాడు.పవిత్ర హత్య కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు ఉమాశంకర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.  పరిసర ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ తో సహా సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.ఈ ఘటనతో బాపూజీ నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువతి హత్యపై ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని త్వరగా పట్టుకో వాలని కోరుతున్నారు.