హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

  గత పదేళ్ల పరిపాలనలో బీఆర్‌ఎస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో  పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.   వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన పరిస్థితి.. కానీ ఈనాడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రేవంత్ స్ఫష్టం చేశారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని.. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణమని తెలిపారు.  2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాదని రూ. 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా.. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని. రేషన్‌ కార్డుల్లో కొత్తవారికి చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించామని తెలిపారు.హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మార్చి 31 లోగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వ వద్దు. పనితనం ఉన్న వాడు నాయకుడు కావాలి తప్ప… పైసలతో పదవులు కొనుక్కునే పరిస్థితి రావద్దు. అది  గ్రామాల భవిష్యత్ కు మంచిది కాదని సీఎం తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనకు కొనసాగింపుగా గ్రామాల్లో ప్రజా పాలన తెచ్చుకోవాల్సిన తరుణం వచ్చింది. మంచి వ్యక్తులను, సమర్థులను, గ్రామ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉన్నవాళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి గురించి జిమ్మేదార్ తీసుకుని మంత్రులను కలిసి, సమస్యలను వివరించి, ఒప్పించి, మెప్పించి, పరిష్కరించే ఓపిక ఉన్న నాయకుడు గ్రామ సర్పంచ్ గా ఉండాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, లొంగకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని రేవంత్ తెలిపారు.    

పుతిన్, జిన్ పింగ్, మోడీ...వీరి మ‌ధ్య పోలికేంటి!?

  ప్ర‌పంచంలోనే ప్ర‌స్తుతం సుదీర్ఘ  కాలంగా  ఒక దేశాన్ని ఏలుతున్న ప‌వ‌ర్ఫుల్ లీడ‌ర్స్ లో పుతిన్ అగ్ర స్థానంలో నిలుస్తారు. ఆయ‌న గ‌త పాతికేళ్లుగా ర‌ష్యాను అధ్యక్ష హోదాలో ప‌రిపాలిస్తున్నారు.1999 చివరలో తాత్కాలిక అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన పుతిన్, 2000 నుండి 2008 వరకు, 2012 నుంచి ఇప్పటి వరకు ఆయ‌నే ఆ దేశాధ్య‌క్షుడిగా కొనసాగుతున్నారు, 2020 రాజ్యాంగ సవరణలతో 2036 వరకు పదవిలో ఉండేందుకు వీలు కల్పించారు. దీంతో సుమారు 36, 37 ఏళ్ల పాటు పుతిన్ ర‌ష్యాను పాలించిన రికార్డు క్రియేట్ చేయ‌నున్నారు. ఇక అత్య‌ధిక కాలం అతి పెద్ద దేశాన్ని పాలించిన వారెవ‌ర‌ని  చూస్తే వారిలో జిన్ పింగ్ త‌ర్వాతి స్థానంలో నిలుస్తారు. జిన్‌పింగ్ 2012 నుండి చైనాకు అధ్య‌క్షుడిగా ప‌ని చేస్తున్నారు, 2013లో ఆయ‌న‌ అధ్యక్షుడయ్యారు. 2018లో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాల పరిమితిని తొలగించారు, దీంతో ఆయన జీవితకాలం పాటు పాలించే అవకాశం ఉంది, ఆయన ప్ర‌స్తుతం పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జిన్ పింగ్ కొంత కాలం క‌నిపించ‌క పోయే స‌రికి ఆ  త‌ర్వాతి  అధ్య‌క్షుడెవ‌ర‌న్న చ‌ర్చ న‌డిచింది. ఇక మోడీ సంగ‌తి చూస్తే  వీరిక‌న్నా కాస్త  లేటుగా భార‌త‌దేశ ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌గా.. ప్ర‌స్తుతం మూడో మారు ప్ర‌ధాన‌మంత్రిగా  ఎన్నికై.. నాన్ స్టాప్ గా భార‌త‌దేశాన్ని ఏలుతున్నారు.  పుతిన్, జిన్ పింగ్, మోడీకి ద‌గ్గ‌ర పోలిక ఏంటంటే అప్ర‌తిహ‌తంగా ఎక్క‌డా త‌మ పాల‌నాకాలాన్ని   బ్రేక్ చేసుకోకుండా ప‌ని చేస్తూ రావ‌డం. అయితే పుతిన్, జిన్ పింగ్ కి ఉన్న వెస‌లుబాటు మోడీకి  లేక పోవ‌డం మైన‌స్. ఇక్క‌డ సుదీర్ఘ అధ్య‌క్ష పాల‌న అంటూ ఉండ‌దు. అప్ప‌టికే మోడీ  ప్రాతినిథ్యం వ‌హించే బీజేపీకి.. 75 ఏళ్ల వ‌యో ప‌రిమితి కూడా  ఉంది. అయితే మోడీ విష‌యంలో ఈ నిబంధ‌న‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది సంఘ్ ప‌రివార్.  భార‌త్ కి మ‌ల్లే ర‌ష్యా చైనాల్లో ఎన్నిక‌ల  వ్య‌వ‌స్థ‌లున్నా.. అవి అధ్య‌క్ష  పీఠాన్ని క‌దిల్చే ప‌రిస్థితి ఉండ‌దు. ఒక్క‌సారి రాజ్యాంగ  ప‌ర‌మైన  మార్పు చేస్తే ఇక ఆయా అధ్య‌క్షులు లైఫ్ లాంగ్ ఉండ‌గ‌ల‌రు. అదే భార‌త్ అమెరికాల‌లో అలాక్కాదు.. ఇక్క‌డ ప్ర‌తి నాలుగైదేళ్ల‌కు ఎన్నిక‌లుంటాయి. దీంతో ఈ రెండు దేశాల్లో గెలుపోట‌ములు ప్ర‌భావితం చేస్తుంటాయి వీరి వీరి పాల‌నా కాలాల‌ను.  ట్రంప్ కి కూడా నాన్ స్టాప్ గా అమెరికా అధ్య‌క్షుడిగా ఉండాల‌న్న కోరిక ఉంటుంది కానీ, అక్క‌డి రాజ్యాంగం అందుకు అనుమ‌తించ‌దు. ఇక మోడీ ఇక్క‌డ కూడా స‌రిగ్గా జ‌మిలీ ఎన్నిక‌లు, అధ్య‌క్ష పాల‌న వంటివి తీసుకురావాల‌ని చూస్తున్నారు.  కానీ భిన్న‌త్వంలో ఏక‌త్వంతో కూడుకున్న భార‌త దేశంలో అలాంటి మార్పుల‌కు అవ‌కాశ‌ముందా? అంటే చాలా చాలా  క‌ష్ట‌త‌రంగా చెప్పాల్సి ఉంటుంది. అప్ప‌టికీ మోడీ మూడోమారు కూడా  ప్ర‌ధానికావడం  ప‌ట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలో ఈసీని  మేనేజ్ చేస్తున్నార‌న్న కామెంట్లు చేస్తుంటారు.  ఇక ఫైన‌ల్ గా ఒక మాట ఏంటంటే సుదీర్ఘంగా అధ్యక్ష స్థానంలో ఉండే పుతిన్, జిన్ పింగ్, మోడీ వంటి  వారికి ఒక ర‌క‌మైన  ప్రైవేట్ లైఫ్ ఉండ‌క పోవ‌చ్చు. ఎప్పుడూ అధికార ప్ర‌భావంలో ఉండ‌టం.. ఎంతైనా వారికి ఇబ్బంది  క‌ర‌మైన ప‌రిణామ‌మే. అను నిత్యం నిఘా క‌ళ్ల మ‌ధ్య జీవించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల చిన్న‌పాటి  రెస్ట్  తీసుకోడానికో ఏమో జిన్ పింగ్ కొన్నాళ్ల పాటు క‌నిపించ‌క పోవ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా  పెద్ద అల‌జ‌డికి కార‌ణ‌మైంది. మోడీకంటే వ్య‌క్తిగ‌త జీవితంలో భాగంగా పెళ్లాం పిల్ల‌లే  లేరు. దీంతో ఆయ‌న ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ కోరుకోక పోవ‌చ్చ‌ని అంటారు విశ్లేష‌కులు. ఇక ఆహార‌పు అల‌వాట్లు శారీర‌క ధారుడ్యం వంటివి కూడా వీరికి స‌మ‌స్యాత్మ‌క‌మే. పుతిన్ ఎక్క‌డికి వెళ్లినా ఆ యా ప్రాంతాల‌కు చెందిన ఆహారాన్ని స్వీక‌రించ లేరు. అది ప్రొటోకాల్. ఆయ‌న వెంట ఆయ‌న ఆహారం  స‌మ‌కూర్చి పెట్టే చెఫ్ లు సైతం వ‌స్తారు. ఎందుకంటే ఎక్క‌డ ఏ ఫుడ్ పాయిజ‌న్ క‌లుస్తుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఆయ‌న్ను బ‌య‌ట ఆహారం ఏదీ తిన‌నివ్వ‌రు. అంటే, పిచ్చాపాటిగా తిర‌గ‌డం గానీ ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని  ఆస్వాదించ‌డంగానీ వీరికి వీలు కాద‌న్న మాట‌. ఇక ఈ స్థాయిలో ఉండే  వారికి వ‌య‌సు ఎలాగూ మీద ప‌డే ఉంటుంది  కాబ‌ట్టి జిహ్వ‌చాప‌ల్యం పెద్ద‌గా ఉండ‌క పోవ‌చ్చు. కానీ ఏది ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న కోరిక‌లు వారికి సాధ్యం కాద‌నే చెప్పాల్సి ఉంటుంది. మ‌రి మీరేమంటారు.  

తీపి గురుతులు.. గురువుల బెత్తం దెబ్బలు.. మంత్రి ఆనం

చిన్ననాడు గురువులు కొట్టిన బెత్తం దెబ్బలు ఎప్పటికీ తీపి గురుతులుగామిగిలిపోతాయని ఏపీ దేవా దాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాడు గురువుల చేతిలో బెత్తం దెబ్బలే ఇప్పుడు తాము ఉన్నత  స్థాయికి ఎదగడానికి కారణమని పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.   నెల్లూరు జిల్లా, చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం (డిసెంబర్ 5)న జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం (పేరెంట్ టీచర్ మీటింగ్) లో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ వీడియోను ఆయన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చూపారు.  ఆ వీడియోలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత రంగాల్లో మంచి గుర్తింపు పొందిన వారందరూ, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలి వద్దకు వచ్చి, ఆమెతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, తాము ఆనాడు తిన్న బెత్తం దెబ్బలను అరచేతులను చూపించి మళ్లీ  కొట్టమని అడగడం వంటి మధురమైన దృశ్యాలను విద్యార్థులకు మంత్రి చూపించి, బెత్తం దెబ్బల మాధుర్యాన్ని, గురువులకు, విద్యార్థులకు ఉన్న అవినావభావ అనుబంధాన్ని నేటితరం విద్యార్థులకు వివరించారు. విద్యార్థులందరూ గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో ముందుకు సాగితే విజ యాలను అందిపుచ్చుకోవాలని  దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా వీడియోను మంత్రి ఆనం  వివరించిన తీరు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. 

గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్‌లో భారీ బందోబస్తు

  హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో మొత్తం 6,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమ్మిట్ ప్రధాన వేదిక పరిసరాల్లో భద్రతను కఠినం చేస్తూ, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వేదిక వరకు ప్రత్యేక బందోబస్తు అమలు చేస్తున్నారు.  ఇప్పటికే ప్రధాన వేదికను పోలీసు ఆధీనంలోకి తీసుకుని, ప్రతి మూలా మూలా పై నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు.  వేదికకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే అనుమతిస్తామని సీపీ స్పష్టం చేశారు. సమ్మిట్ రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రెండు రోజులపాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు పనిచేయను న్నాయి. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు.ప్రధాన వేదికతో పాటు పరిసర ప్రాంతాలన్నింటిని ఒకే చోట నుండి పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  

మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవిని మరో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పోలీసుల దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారించిన కోర్టు.. మూడు కేసులలో కేసుకు ఒక రోజు చొప్పున ఐబొమ్మ రవిని పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు మొత్తం నాలుగు కేసులలో ఐబోమ్మ రవి కస్టడీని కోరగా, కోర్టు మాత్రం మూడు కేసులలోనే కస్టడీకి అనుమతించింది. మరో కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు శనివారం (డిసెంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం (డిసెంబర్ 6) కస్టడీలోకి తీసుకోనున్నారు.  అదలా ఉంటే ఐబొమ్మ రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారించనుంది.  

మావోయిస్టుల సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగం.. మల్లోజుల

మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని ఒక విఫల ప్రయోగంగా అభివర్ణించారు ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన మావోయిస్టు పార్టీ సిద్ధాంత కర్త, పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు. తాజాగా ఒక జాతీయ వార్తా సంస్ధకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మల్లోజుల సంచలన విషయాలు వెల్లడించారు. గత అర్ధ శతాబ్దంలో పార్టీ చేసిన తప్పుల వల్లే ఉద్యమం నీరుగారిపోయిందనీ, మావోయిస్టు సాయుధ పోరాట పంధా ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందనీ చెప్పారు.  ఇక ఇప్పుడు ఇంకా ఉద్యమంలో ఉన్న మావోయిస్టలకు మిగిలిన ఏకైక మార్గం ఆయుధాలు వీడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడమేనని మల్లోజుల అన్నారు.   గత మేలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మరణించిన పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారన్న మల్లోజుల, ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఆయన ఎన్ కౌంటర్ లో హతమయ్యారని చెప్పారు.  ఆ తరువాత తాము సామూహికంగా లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామన్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని, ఆచరణను మార్చుకోవడంలో  మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు.  ఇప్పటికైనా మావోయిస్టులు  తప్పుడు విధానాలు పక్కన పెట్టి ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని అన్నారు. తన అర్ధశతాబ్దపు అజ్ఞాత జీవితాన్ని స్వర్ణ అధ్యాయంగా అభివర్ణించిన మల్లోజుల.. అడవి బిడ్డలతో మమేకమై వారి హక్కుల కోసం పోరాడటం సంతృప్తినిచ్చిందన్నారు. తనను ఉద్యమ ద్రోహిగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్న వారిని తాను పట్టించుకోనన్నారు. 

విమానాల రద్దు.. కొత్త జంట ఏం చేసిందంటే?

  ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ కొత్త జంటపైనా కూడా పడింది. బెంగళూరులో పని చేసే టెకీలు క్షీరసాగర్, సంగమ దాస్ నవంబర్ 23న పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి హుబ్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో తమ సొంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా పాల్గొనాల్సి వచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోటలు నెట్టింట వైరల్‌గా మారాయి. విమానాల రద్దు కారణంగా తాము రిసెప్షన్ కి రాలేకపోయా మంటూ వివరణ ఇచ్చారు...మరోవైపు పని కోసం కువైట్ వెళ్లాల్సిన లక్ష్మి (తిరుపతి) హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాత్రంతా తీవ్ర అవస్థలు పట్టుతు ఉండి పోయారు. 

హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

  హైడ్రా కమిషనర్ రంగనాథ్‌  తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్ధలంలో యథాతస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ కోర్టు ఆదేశాలను పట్టించలేదని సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించిన కమీషనర్ వెళ్లలేదు.  దీంతో నాన్ బెయిల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు. గత నెల 27న జరిగిన విచారణకు హాజరు కాలేకపోయినందుకు కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తీవ్ర వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చినందున విచారణకు హాజరుకాలేకపోయానని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు.  అక్టోబర్ 31న దీనిని విచారించిన హైకోర్టు, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే, బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రంగనాథ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్ధానం నవంబర్ 27న విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఆరోగ్య రంగాల్లో ఆహార భద్రత,లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు ప్రధాని మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.శుక్రవారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోదీ భేటీ అయ్యారు.  రెండు రోజుల పర్యటన కోసం గురువారమే భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.  గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. 

పుష్ప సినిమా తరహాలో భారీగా నగదు రవాణా

  సికింద్రాబాద్‌లో ఓ ముఠా సినిమా ‘పుష్ప’ స్టైల్లో పథకం రచించి హవాలా డబ్బు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ అయ్యారు. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వెళ్లుతున్న కారును ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ వేగం పెంచి... కారుతో సహా ముందుకు దూసుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమారు 15 కిలోమీటర్ల వరకు కారును చేజ్ చేసి.. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం పోలీసులు కారు మొత్తం తనిఖీలు చేశారు.  మొదట్లో పెద్దగా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. కారు డిక్కీ, టైర్ల లోపల, బనెట్ కింద, సీట్లలో వేరువేరు రహస్య గుహలు ఏర్పాటు చేసి, అందులో భారీ మొత్తంలో డబ్బును దాచి పెట్టిన విధానాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.  అనంతరం పోలీసులు వాహనాన్ని పూర్తిగా ఓపెన్ చేయించి తనిఖీ చేయగా, వివిధ బండిల్స్‌గా దాచిన మొత్తం ₹4 కోట్ల హవాలా నగదు బయటపడింది. డబ్బు మూలం, గమ్యం, ముఠా నెట్‌వర్క్ వివరాల కోసం పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. సినిమా రీతిలో డబ్బు రవాణా – పోలీసుల పరుగుపరుగుల చేజ్ – చివరకు భారీ నగదు స్వాధీనం… సికింద్రాబాద్‌లో ఈ ఘటన పెద్ద కలకలం రేపుతోంది.  

విమానాల రద్దు సమస్యకు చెక్.. ఆ నిబంధనను ఉపసంహరణ

ఇటీవలి కాలంలో  ఇండిగో విమానాలు వరుసగా రద్దు  కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుపటి మార్గదర్శకాల్లో పైలట్లకు తప్పనిసరిగా  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయరాదు అన్న కండీషన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది.  అయితే ప్రస్తుతం కొనసాగుతున్న  ఆ నిబంధనను సమీక్షించి  ఉపసంహరించింది. ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లాల్సిన మొత్తం 155 ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

విమానానికి బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్

శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు పెద్ద సంఖ్యలో ఇండిగో విమా నాలు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతోనే విమానాశ్రయంలో నిన్న రాత్రి నుంచీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇకే 526 విమానానికి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోనే కాకుండా, టెర్మినల్ లో కూడా తనిఖీలు నిర్వహించారు.  విమానాల రద్దుతో తీవ్ర అసహనంతో ఉన్న ప్రయాణీకులు ఈ తనిఖీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఓ వైపు విమానాల రద్దుపై ప్రయాణీకులు నిరసనలు, నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగుతోంది. మరో వైపు  బోర్డింగ్ పాస్ గేట్ వద్ద బైఠాయించి పలువురు నిరసనకు దిగారు. మొత్తంగా విమానాశ్రయం అంతా కిటకిటలాడుతోంది. ప్రయాణీకులకు కూర్చునే స్థలలం కూడా లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఈ సమయంలో టెర్మినల్ అంతటా ప్రయాణికులు భారీగా కిటకిటలాడు తున్నారు. కుర్చీలు లేకపోవడంతో పలువురు నేలపై కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భిగానే భద్రతా తనిఖీల వ్యవహారంలో  కొందరు ప్రయాణీకులు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  ఇలా ఉండగా ఈ రోజు ఇప్పటి వరకూ   హైదరాబాదు నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు, రావాల్సిన 61 విమానాలు రద్దయినట్లు సమాచారం. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది మంది ప్రయా ణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎమిరేట్స్ విమానంలో ఉన్న ప్రయా ణికులందరినీ భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రత్యేక ప్రాంతాలకు తరలించగా, విమానం మొత్తాన్ని బాంబ్ స్క్వాడ్ సూక్ష్మంగా పరిశీలించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  అదనపు సిబ్బందిని మోహరించారు. 

ముంబై విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. వివిధ విమానాల ద్వారా బ్యాంకాక్‌ నుండి  ముంబైకి చేరుకున్న స్మగ్లర్ల నుంచి   26 కోట్లు విలువ చేసే 26 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. వేరువేరు విమానాల ద్వారా బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న వీరు.. లగేజ్ బ్యాగులు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు, వ్యక్తిగత వస్తువులలో దాచి అక్రమంగా తీసుకువచ్చిన విదేశీ గంజాయి అధికారుల తనిఖీల్లో బయటపడింది.  దీంతో  ఈ 9 మందినీ అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి స్మగ్లింగ్ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు.  

శంషాబాద్ విమానా శ్రయంలో అయ్యప్పల ఆందోళన

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.  గురువారం (డిసెంబర్ 4)  సాయంత్రం బయలు దేరాల్సిన ఈ విమానం శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విమానం జాప్యంపై ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అయ్యప్ప స్వాములు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.    ఈ క్రమంలోనే స్వాములు  బోర్డింగ్ గేటు ముందు  బైఠాయించి నిరసన తెలియజేశారు.  తమ ప్రయాణానికి వెంటనే ప్రత్యామ్నాయ   ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే భోజనం–వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కిడ్నీ రాకెట్ కేసు.. ఏ2 డాక్టర్ పార్థసారథి లొంగుబాటు

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో  కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి గురువారం మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తలిసిందే. కాగా లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి రెడ్డికి న్యామూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.    కిడ్నీ విక్రయం కోసం గత నెల 9న విశాఖకు చెందిన యమున  అనే యువతికి ఆపరేషన్ చేస్తుండగా ఆమె మరణించడంతో ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది.    విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సూరిబాబు భార్య యమున   కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.  విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో యమునకు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె మరణించారు. వెంటనే ఆమె   మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. యమున భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.   ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  A1 డాక్టర్ ఆంజనేయులు, మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మదనపల్లె ఎస్బిఐ కాలనీ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఏ 2 నిందితుడు, బెంగుళూరు కి చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లైంది.  

అఖండ2 సినిమా టికెట్@ రూ.5లక్షలు.. కొన్నదెవరో తెలుసా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అఖండ-2 సినిమా మానియా జోరుగా ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా అఖండ తాండవం చూడటం కోసం అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. అయితే.. ఈ రోజు విడుదల కావలసిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది.  అది పక్కన పెడితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టికెట్ ఐదు లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.  అలా కొనుగోలు చేసింది మరెవరో  కాదు..  ఎమ్మెల్యే జగన్ మోహన్.  ఈ సందర్భంగా ఆయన ఓ అభిమానిగా ఈ సినిమా  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.   బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  

కోహ్లీ మానియాతో ఊగిపోతున్న విశాఖ

విశాఖపట్నం మొత్తం కోహ్లీ మానియాతో ఊగిపోతున్నది. విశాఖ వేదికగా  దక్షిణాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరగనున్న మూడో వన్డే సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ విశాఖ వాసులు ఈ వన్డేపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే కోహ్లీ రాంచీ, రాయ్ పూర్ లలో జరిగిన తొలి వన్డేలలోనూ శతకాలు బాది.. తాను మళ్లీ పూర్వపు కోహ్లీ మాదిరిగా పరుగుల వేట ఆరంభించానని చాటోడో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.   విశాఖ వన్డే మ్యాచ్ వీక్షించాలన్న ఆసక్తి ఒక్క విశాఖ వాసుల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి స్పందన నభూతో అని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం  తొలి దశ టికెట్ల అమ్మకాలు గత నెల 28న  ప్రారంభమయ్యాయి. అయితే అప్పుడు టికెట్ల కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆఫ్ లైన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయక తప్పదేమోనని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే ఎప్పుడైతే రాంచీ, రాయ్ పూర్ లలో కోహ్లీ సెంచరీ చేశాడో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. కోహ్లీ ఫామ్ లో ఉండటం, విశాఖ మైదానంలో కోహ్లీకి అద్భుత ట్రాక్ రికార్డు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖలో కోహ్లీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ లలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువ అని ఆలోచించకుండా అభిమానులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొనేశారు. అంతేనా గురువారం భారత జట్టు విశాఖ చేరుకుంది. ఈ జట్టు రాకకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి చూశారు.   

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

  తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.  ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,  టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  

భారత్‌కు చేరుకున్న పుతిన్...అపూర్వ స్వాగతం పలికిన మోదీ

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీ చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ  సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధాని ప్రోటోకాల్‌ను ప్రక్కకు పెట్టి పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.  ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్‌ గౌరవార్థం రాత్రి ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. మొత్తం 8 మంది మంత్రుల బృందంతో పుతిన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ట్వీట్ చేసింది. అత్యంత పటిష్ఠ భద్రత మధ్య పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది.