ఉగ్రవాదంపై అమెరికా అపేక్ష.. ఉపేక్ష ఎందుకు?
నార్కో టెర్రరిజం అంటూ ఒక దేశాధ్యక్షుడినే అత్యంత అమానవీయంగా ఆ దేశంపై మెరుపుదాడి నిర్వహించి మరీ అరెస్టు చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల విషయంలో ఎందుకు అపరిమితమైన ఆపేక్ష చూపుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కర్తా, కర్మా, క్రియా తానేనన్నట్లుగా అమెరికా ఎందుకు అనవసర ఆడంబరం, అనవసర పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది?
ఈ ప్రశ్నలకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ ఇలా తయారైందన్న బదులు వస్తుంది. అమెరికా తొలుత ఇలా ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ అమెరికాను తమతో పాటు పాల్గొనాల్సిందిగా కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించడమే కాదు.. కనీసం బ్రిటన్ కు మిత్రదేశంగా ఉండటానికి కూడా ముందుకు రాలేదు. అయితే కానీ ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ ఘటన జరిగిందో ఆనాటి నుంచి అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది.
అక్కడి నుంచీ తమ దేశ భద్రతకు ఆయుధ తయారీని ఒక ప్రామాణికంగా పెట్టుకుంది. దానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తత్తి చేసిన ఆయుధాల నిల్వ భారీగా ఉండటంతో.. ప్రపంచంలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడికి తగుదునమ్మా అంటూ వెళ్లి, ఆ దేశ సమస్యల్లో వేలు పెట్టి.. తన ఆయుధాల విక్రయానికి ఆ సమస్యలను అలంబనగా చేసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే వియత్నాం, గల్ఫ్, సిరియాయుద్ధాలు. ఆ మాటకొస్తే భారత్- పాక్, రష్యా- ఉక్రెయిన్, చైనా- తైవాన్ ఇలా ఏ రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడ్డా తనదైన శైలిలో.. జోక్యంొ చేసుకుంటూ తనకు తానే ప్రపంచ దేశాలకు పెద్దన్న అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అమెరికా వ్యవహారశైలి ఎలాంటిదో ఒక దళారి పశ్చాత్తాపం వంటి పుస్తకాలు చదివితే మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతగా ప్రపంచ రాజకీయాలను శాసించడం ప్రారంభించింది అమెరికా. ఇక ఇంధనం కారణంగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకానొక వ్యసనం కూడా అమెరికాకు పట్టుకుంది. దీంతో ఆయా చిన్నా చితకా దేశాల వెంట పడడం.. వాటి సహజవనరులపై కన్నేయడం అమెరికాకు పరిపాటిగా మారింది. చివరికి గల్ఫ్ దేశాలపైనా అమెరికా ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వారి పెట్రో డాలర్లన్నీ తమ ట్రెజరీల్లో భద్రంగా ఉంచుకుని.. ఆపై వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అంతగా ఇతర దేశాల్లో కాళ్లు, వేళ్లు, తలా దేర్చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించడం అమెరికాకు రివాజైపోయింది. తమ మాట వినని దేశాల్లో కుల మత విద్వేషాలను రాజేసి మరీ వాటిని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. అనుకున్న ఫలితం సాధించడం అమెరికా తన అగ్ర నాయకత్వంలో ఒక భాగం చేసుకుంది. ఈ విషయంలో అమెరికాకు చైనా, రష్యా, భారత్ లు కూడా మినహాయింపు కాదు.
ఇవాళ వెనిజువెల విషయంలో నార్కో టెర్రరిజం పేరిట ఆ దేశ అధ్యక్షుడు మదురో ని అరెస్టు చేసిన అమెరికా.. పాక్ లో ఉగ్రవాదం వెయ్యి తలలు వేస్తున్నా కిమ్మనడం లేదంటే.. ఏమనుకోవాలి. స్వయానా అమెరికా కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర బాధిత దేశాల్లో ఒకటి. అయినా అమెరికా పాక్ ఒంటిపై ఈగ వాలకుండా కాపాడటమే కాకుండా, ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి భారీ రుణాలతో ఆదుకుంటోంది. కానీ అదే అమెరికా వెనిజువేలా అధ్యక్షుడు మదురో పై 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఉందనీ, అందుకే అరెస్టు చేశామనీ చెప్పుకుంటోంది. కానీ, హఫీజ్ సయీద్ వంటి వారిపైనా ఇలాంటి రివార్డ్ లే ఉన్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు? పాకిస్థాన్ కి అమెరికా ఇప్పిస్తున్న వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లోన్ల నుంచి మసూద్ అజర్ వంటి టెర్రరిస్ట్ బాసులకు భారీగా నిధులు అందుతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీని గాజాలో దింపేందుకే ఈ నజరాలు, సానుభూతి అని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అమెరికా ధ్వంస రచన ఇంకెంత కాలం సాగుతుందో చూడాలంటున్నారు అంత ర్జాతీయ వ్యవహారాల నిపుణులు.