బిగ్ బాస్ షో పై ఫిర్యాదు.. హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక

టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు ఎంపిక అయిన వారిలో కొందరికి సమాజంలో విలువ లేదనీ వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   బిగ్ బాస్ బృందం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటోందని  ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని   అభ్యంతరాలు లేవనెత్తారు. సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలన్నారు.  

బంద్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం.. డీజీపీ హెచ్చరిక

బీసీ సంఘాలు శనివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేస్తాయన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు  ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

శ్రీవారికి కొప్పెర హుండీ కానుక

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు అనేక రకాలుగా కానుకలు సమర్పించుకుంటారు.   ధనం.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి భక్తితో సమర్పించుకుంటారు. అయితే తిరపతి సమీపంలోని కొప్పెర‌వాండ్లప‌ల్లె కొప్పెర వంశస్థలు మాత్రం శ్రీవారికి హుండీ సమర్పించడం  వంశపారపర్యంగా వస్తున్న ఆచారం.  అందులో భాగంగానే శ్రీవారికి శుక్రవారం (అక్టోబర్ 17) కొప్పెర హుండీ విరాళంగా అందించారు.   కొప్పెర‌వాండ్లప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌ ఈ   హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందజేశారు. రాగి, ఇత్తడితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంది.  దీని విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుంది. 1821 నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి తమ వంశస్థులు కొప్పెరహుండీలను కానుకగా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ కొప్పెర హుండీ తయారీకి 20 రోజులు పడుతుంది.  

లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలవడం : మావోయిస్టు అగ్రనేత ఆశన్న

చతిస్ గఢ్  సీఎం ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు,   చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో  జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో  పాల్పడ్డ కీలక పాత్రధారి, సూత్రధారి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నఅలియాస్ రూపేష్  లొంగిపోయాడు.  ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు  అధికారులు ప్రకటించారు.  మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద  లొంగుబాటుగా చెప్పవచ్చు.  దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో  ఇదో కీలక మలుపు అంటున్నారు విశ్లేషకులు.  దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్..  తన అనుచరులతో కలిసి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. గన్ను వదిలి రాజ్యాంగాన్ని చేపట్టడానికి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న నిర్ణయించుకోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. వనం వదిలి ఆయన జనం బాట పట్టారు.  ఆయనతో కలిసి  మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరందరిపై కలిపి  సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా తన లొంగుబాటు సందర్భంగా ప్రసంగించిన ఆశన్న.. తమది లొంగుబాటు కాదని చెప్పారు. తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన  తన సహచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృద్యంగా ఉంది.  అనివార్య పరిస్థితుల్లో   ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం కానీ మన పంథాను మరచిపోవడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి  ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆశన్న ఉద్ఘాటించారు. సహచరులంతా ఎక్కడ ఉన్నారో అక్కడే లొంగిపోవడం మంచిదని సూచించారు. ఎవరైనా లొంగిపోదామని భావిస్తే తనను సంప్రదించాలన్నారు.  ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలవడమన్న మాటను  ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పిన ఆశన్న.. ఉద్యమంలో అమరులైన సహచరులకు ఆయన ఈ సందర్భంగా జోహార్లు చెప్పారు.  ఆయన ప్రసంగం విన్న మావోయిస్టు క్యాడర్ కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉన్నారనీ, ఆ తరువాత వారి కళ్లు చెమ్మగిల్లాయని అక్కడున్న అధికారులు తెలిపారు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు. ఇలా ఉండగా శుక్రవారం ఛత్తీస్ గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులలో  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ రూపేష్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్ మాన్ మండవి, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు రాజు సలాం,  వెట్టి అలియాస్ సంతు, సీనియర్ డివిజనల్ కమాండర్‌ రతన్ ఇలాం, రీజనల్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.   ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి కేంద్ర, జోన్, రీజనల్ స్థాయి నాయకులు లొంగిపోవడం భారత మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్ప విజయంగా అభివర్ణించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.  భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకే సారి రెండు వందల మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారన్న ఆయన..  ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న  హింసా మార్గానికి ముగింపు సంకేతమని చెప్పారు.  రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. “ఇది లొంగుబాటు కాదు — ప్రజలతో కలిసిపోవడం” అనే రూపేష్ మాటలు ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అడవుల్లో మారుమ్రోగు తున్నాయి.ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకుం టున్న సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంస్కరణలు భవిష్యత్ ను మారుస్తాయి.. చంద్రబాబు

భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.   ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించి వారితో కొద్ది సేపు ముచ్చటించారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయనీ,  దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇచ్చినట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని చంద్రబాబు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాసరచన. పెయింటింగ్,  వక్తృత్వ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి నందుకు ఆయన వారినిఅభినందించారు. 

బ‌రితెగించ‌డ‌మే బిగ్ బాస్ ఎంట్రీకి అర్హతా!?

ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రైతే సోష‌ల్ మీడియా మీద ఏదో ఒక చెడు వ్య‌వ‌హారంలో బ‌రితెగిస్తారో.. వారికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల‌భిస్తోంది.. అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఈ విష‌యంపై సీపీఐ నారాయ‌ణ ఎప్ప‌టి నుంచో కామెంట్లు చేస్తున్నారు. ఇదొక చెత్త ప్రొగ్రాం దీన్ని బ‌హిష్క‌రించాల‌న్నట్టుగా ఆయ‌న మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాదా సీదా మ‌నుషుల నుంచి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయ్. అదేంటో చూస్తే.. ఒక మాధురి, మ‌రో ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టీ.. వంటి వారి  ఎంట్రీలో అస‌లు అర్ధ‌మే లేదంటున్నారు వీరంతా.  మాధురి ఎవ‌రు? ఆమె ఒక బ‌రితెగించిన మ‌హిళ‌. భ‌ర్త‌ ముగ్గురు పిల్లలు ఉండగా,  మ‌రొకరితో సహజీవనం చేస్తూ ఆధునిక ఆద‌ర్శ దాంప‌త్యానికి అస‌లైన కేరాఫ్ అడ్రెస్ అన్న‌ట్టు పోజులు కొడుతున్నారు. అలాంటి ఆమెను బిగ్ బాస్ లోకి పిల‌వ‌డం ద్వారా ఈ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న‌ట్టు? అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. ఇక అలేఖ్య చిట్టీ.. వ్య‌వ‌హారం. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌మంతా చూసింది అ పికిల్ సిస్ట‌ర్స్ పిచ్చి చేష్ట‌లు. వీరు క‌స్ట‌మ‌ర్స్ తో బిహేవ్ చేసే విధానం ఎంత ఫాల్తు లాంగ్వేజీలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అలాంటి వీరిని బిగ్ బాస్ లోకి పంప‌డం వ‌ల్ల ఏం తెలుస్తుందంటే.. ఇలాగే వ‌ల్గ‌ర్ గా బిహేవ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చు క‌దాని. ఇత‌రులు కూడా ఇలాగే చేయ‌డం మొద‌లు పెడతారు.. దీని ద్వారా ఒక్కోసారి కాపురాలు కూలిపోవ‌చ్చు. ఆపై వారి వారి ఉద్యోగ వ్యాపారాలు నాశ‌న‌మై పోవ‌చ్చ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. కొంద‌రిచ్చే స‌ల‌హా సూచ‌న‌లేంటంటే.. ఇలాంటి వారితో హౌస్  నింప‌డం క‌న్నా ఆయా వ‌ర్గాల్లోని మేథావులను.. హౌస్ కి సెలెక్ట్ చేయ‌డం వ‌ల్ల‌.. వారి మ‌ధ్య సాగే విష‌య పరిజ్ఞానంతో కూడిన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగేలాంటి వాతావ‌ర‌ణం ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఎంతో మేలు. దీని ద్వారా కొత్త విష‌యాలు మ‌రింతగా తెలుస్తాయి. మ‌రి కొంద‌రికి ఆయా విష‌యాల ప‌ట్ల ఒక అవ‌గాహ‌న అంటూ ఏర్ప‌డుతుంది. ఫ‌ర్ స‌పోజ్ ఒక మాదురి ద్వారా ఏం తెలుస్తుంది? పెళ్ల‌యినా స‌రే, ఇత‌ర పెళ్లైన మ‌గాళ్ల‌తో సహజీవనం చేయడం ఎలా? అన్న‌ది నేర్పించ‌గ‌ల‌రామె. అంతే, అంత‌క‌న్నా మించి ఆమెకు ఏదైనా తెలుసా? ఇక ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టి ప‌రిస్థితి కూడా అంతే. ఆ మాట‌కొస్తే హౌసులో ఉన్న ఇత‌ర‌త్రా కంటెస్టెంట్లు కూడా మేథో సంప‌న్నులేం కాదు.. గాలి వాటానికి కొట్టుకొచ్చిన బాప‌తు. కాబ‌ట్టి వీరు, వీరి మాట‌లు, చేత‌ల‌ను చూసే వారు ఏం నేర్చుకుంటారు? అన్న ప్ర‌శ్న‌కు తలెత్తుతోంది. మ‌రి చూడాలి బిగ్ బాస్ ఈ దిశ‌గా ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

కొడిగడుతున్న నక్సలైట్ ఉద్యమం

దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంత్య దశకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. వరుస ఎన్ కౌంటర్ లలో కీలక నేతలు సహా  వందల మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు అగ్రనేతల సహా వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయువుపట్టులాంటి ఛత్తీస్ గఢ్ నుంచే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటంతో మావోయిస్టు ఉద్యమం ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలు హతమవ్వడం,  అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఆయుధాలు అప్పగించి లొంగుబాట పడుతున్నారు. బుధ గురు (అక్టోబర్ 15, 16) వారాలలో ఛత్తీస్ గఢ్ లో మొత్తం  258 మంది మావోలు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చిన వారు సమాజంలో గౌరవంగా బతికేలా సౌకర్యాలు కల్పించి అన్నివిధాలుగా సహకారం అందిస్తామనీ, అలా కాకుండా ఆయుధాలు విసర్జించకుండా పోరాటమే బాట అనే వారిపై చర్యలు తప్పవనీ అమిత్ షా హెచ్చరించారు. ఇలా ఉండగా శుక్రవారం (అక్టోబర్ 17)న   దండకారణ్యం ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు నేతలు సహా రెండు వందల మంది  ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.  బస్తర్ లో సీఎం ఛత్తీస్ గఢ్ సమక్షంలో ఆ లొంగుబాటు కార్యక్రమం జరగనుంది. అర్ధ శతాబ్దంగా ప్రభుత్వాలకు పెను సవాల్ గా నిలిచిన మావోయిస్టు  ఉద్యమం ఇప్పుడు కొడిగట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.  ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, స్థానిక ప్రజల నుంచి మద్దతు కరువవడం, ప్రభుత్వ నిర్బంధం కూడా మావోయిస్టులు లొంగుబాట పట్టడానికి కారణమని అంటున్నారు.

జగమంత కుటుంబం.. జగమేలిన ఆనందం

తోపుడుబండిపై తిరుగుతూ గ్రామాన్ని పలకరించి పులకరించిన వృద్ధురాలు పూర్తిగా మంచానికే పరిమితమై బతుకు బండి నడిపిస్తున్న ఓ వృద్ధురాలికి.. తన ఊరంతా ఒక సారి చూడాలన్న కోరిక కలిగింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలోనూ ఆమెలో తన ఊరంతటినీ కళ్లారా చూసుకోవాలన్న తపన రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వృద్ధాప్యంలోనూ ఆమెకు ఆ ఊరిపట్ల ఉన్న మమకారానికి ముగ్ధులైన వారు ఆమె కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. అంతే ఓ తోపుడు బండిలో ఆమెను కూర్చోపెట్టి ఊరంతా తిప్పారు. ఇక ఊరు ఊరంతా ఆమెను పలకరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడారు. దారి పొడవునా ఆమెను పలకరిస్తూ వెంటనడిచారు. కొన్ని ఇళ్ల ముందు ఆమె తోపుడుబండిని ఆపించి మరీ తన పరిచయస్తులను, ఆత్మీయులను పలకరించారు. ఇక ఊరిలో అందరూ ఆమె దగ్గరకు వచ్చి పలకరించారు. ఇలా దారంతా ఆనందభాష్పాలు రాలుస్తూ ఆమె మధురానుభూతి పొందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపల్లిలో జరిగింది. ఊరిపట్ల అంతులేని మమకారాన్ని పెంచుకుని ముదిమి వయస్సు లోనూ ఊరంతా తోపుడుబండిపై కలియదిరిగిన ఆమె పేరు శ్రీరాముల నర్సమ్మ. ఆమె వయస్సు 90 ఏళ్లు. కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లు ఇలా ఆత్మీయులంతా వెంటరాగా ఆమె తోపుడుబండిపై కూర్చుని గ్రామమంతా కలియదిరిగి, స్నేహుతులు, బంధువుల ఇళ్ల ముందు ఆగుతూ ఆత్మీయ పలకరింపులు, మధురానుభూతుల నెమరవేతలకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకోవడానికీ, ఆమె కోరిక ఈడేర్చడానికి కుటుంబ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.  గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పట్టపగలే గొంతు కోసి హత్య.. ప్రేమోన్మాది ఘాతుకం

పట్టపగలే 20 ఏళ్ల మహిళను దారుణంగా గొంతు కోసి హతమార్చిన సంఘటన బేంగళూరు నగరంలో గురువారం జరిగింది. ప్రేమ పేరుతో వెంటపడి తిరస్కారానికి గురైన ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళఊరులోని శ్రీరాంపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం జరిగింది.   వివరాల్లోకి వెడితే.. యామిని ప్రియ అనే 20 ఏళ్ల యువతిని విఘ్నేష్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యామినిప్రియ అతడి ప్రేమను నిరాకరించి, వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో పగ పెంచుకున్న విఘ్నేష్  దారి కాచి యామినిప్రియను దారుణంగా హత్య చేశాడు.   బనశంకరిలోని ఒక కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్న యామిని ప్రియ కాలేజీలో పరీక్ష రాసి మధ్యాహ్నం వేళ తిరిగి ఇంటికి వస్తుంగా.. బైక్ పై వెంబడించిన విఘ్నేష్ మల్లేశ్వరంలోని మంత్రి మాల్ సమీపంలో  ఆమె కళ్లల్లో సాల్ట్ పౌడర్ చల్లి అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విఘ్నేష్ కోసం గాలిస్తున్నారు.  

షేర్లలో ఇన్వెస్ట్ చేయొద్దు.. బంగారం.. బంగారం బిస్కెట్లు కొనండి!

చాలా మంది షేర్లలో   పెట్టుబడులు పెట్టి.. సమయం, సొమ్ము వృధా చేసుకుంటారు కానీ.. గోల్డ్ బాండ్స్ లో  ఇన్వెస్ట్ చేస్తే.. ఆ రిటర్న్సే వేరుగా ఉంటాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. ఇదిగో ఆర్బీఐ ఎస్జీబీ అనే గోల్డ్ బాండ్లు. ఇవి ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున లాభాల బాట పట్టించాయి. ఆర్బీఐ 2017 అక్టోబర్ 9, 11వ తేదీల్లో గోల్డ్బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి  ఇప్పుడు 338 శాతం లాభాలను తెచ్చి పెట్టింది. అప్పట్లో గ్రాము బంగారం రూ. 2, 866 గా ఉండేది. అదే గ్రాము ధర ఇప్పుడు రూ. 12, 567గా నిర్ణయించింది ఆర్బీఐ. దీంతో ఎనిమిదేళ్లలో ఒక గ్రాముకు 9, 701 రూపాయల ఆదాయం వచ్చిందంటే గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ మెంట్ తో వచ్చే లాభాలకు ఆకాశమే హద్దు అనిపించక మానదు. ప్రస్తుతం బంగారం ధర పైపైకి ఎగబాకేదే తప్ప తగ్గేది కాదు. దీంతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారంతా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాభాల బాట పడుతున్నారు. కళ్లు మూసుకుని చేయాల్సిన ఇన్వెస్ట్ మెంట్లు గోల్డ్ లో పెట్టుబడులు పెట్టడమే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. 2015 నవంబర్ లో ఈ గోల్డ్ బాండ్లను రిలీజ్ చేసింది ఆర్బీఐ. వీటి కాల పరిమితి 8 ఏళ్లు. అయిదేళ్లు నిండాక రిడెమన్షన్ చేసుకోవచ్చు. లేదా పూర్తి కాల పరిమితి ఉంచుకోవచ్చు. రిడెమన్షన్ టైంలో గ్రామ ధర నిర్ణయించేందుకు ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ నిర్ణయించే సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అయితే 2024 తర్వాత కేంద్రం ఈ బాండ్లను రిలీజ్ చేయలేదు. కారణం బంగారం పై ఎక్కువ మొత్తం రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తున్నది కాబట్టి.  అయితే చాలా మంది బులియన్ ఎక్స్ పర్ట్స్  ఇప్పుడు గోల్డ్ బాండ్లు లేవు కనుక బంగారం బిస్కెట్లు, డాలర్లను కొని పెట్టుకోమని సూచిస్తున్నారు. 

ఈ కేరళ మహిళ నిజాయితీకి ఫిదా కావాల్సిందే!

ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా కావాలని అనుకునే వారు కోకొల్లలు. నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి ఆలోచించకుండా అప్పనంగా వచ్చే సొత్తుకోసం ఆశపడేవారి సంఖ్య అనంతం. అటువంటి సమాజాంలో ఒక నిరుపేద మహిళ చూపిన నిజాయితీ అందర్నీ ఫిదా చేస్తున్నది. తాను స్వయంగా పుట్టెడు కష్టాలలో ఉన్నా.. నిజాయితీని వీడలేదు. ఆ మహిళ పేరు స్మిజామోహన్. కేరళలో లాటరీ టికెట్లు అమ్మి పొట్టపోషించుకుంటోంది.   ఆమె తన వద్ద అమ్ముడుపోని లాటరీ టికెట్లు కొన్ని ఉన్నాయనీ, వాటిని కొనుగోలు కొనమనీ తన రెగ్యులర్ కస్టమర్లను కోరింది. వారిలో చంద్రన్ అనే క్లయింట్ ఒక టికెట్ కొనేందుకు అంగీకరించాడు. ఫోన్ లోనే అతడు టికెట్ కొనడానికి అంగీకారం తెలిపి.. తనకు నచ్చిన ఒక లాటరీ టికెట్ ను ఎంచుకున్నాడు.  ఆ కొనుగోలు కూడా అరువుమీదే చేశాడు. అంటే తరువాత డబ్బులు ఇస్తానన్నాడు. ఇదంతా మౌఖిక లావాదేవీయే. తాను ఎంచుకుని కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు అతడు ఇంకా డబ్బు కూడా చెల్లించలేదు.   సరే అతడు కొన్న టికెట్ కు ఆరు కోట్ల రూపాయల భారీ బంపర్ బహుమతి గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మజా మోహన్.. క్షణం ఆలస్యం చే యకుండా ఆ టికెట్ కొనుగోలు చేసిన చంద్రన్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపి.. అదే రోజు అతడి ఇంటికి వెళ్లి అతడు అరువుపై మాట మాత్రంగా కొన్న లాటరీ టికెట్ ను అతడికి అందజేసింది.  ఈ విషయం తెలియగానే స్మిజా మోహన్ నిజాయితీని ప్రశంసిస్తూ ఆమెకు అసంఖ్యాకంగా ఫోన్ లు వచ్చాయి. దీనిపై స్పందించిన స్మిజా..  నిజాయితీయే అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. కస్టమర్లు లాటరీ టికెట్ కొనడానికి వెచ్చించే సొమ్మతోనే తాను జీవిస్తున్నానని పేర్కొంది.  ఇంత తృణప్రాయంగా కోట్ల రూపాయలను కాదనుకుని నిజాయితీ, చిత్తశుద్ధి ప్రదర్శించిన స్మిజా మోహన్ సంపన్నురాలు కాదు. నిజానికి నిరుపేద. ఆమెకు డబ్బులు చాలా చాలా అవసరం. ఆమె పెద్ద కుమారుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో  బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. చిన్నకుమారుడికి క్యాన్సర్. తన పిల్లల చికిత్సకు ఆమెకు డబ్బు ఎంతో అవసరం. అయినా తనది కాని సొమ్ము కోసం ఆమె ఇసుమంతైనా ఆశపడలేదు. ఆమె నిజాయితీకి అంతా ఫిదా అవుతున్నారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శుక్రవారం (అక్టోబర్ 17) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (అక్టోబర్ 16) శ్రీవారిని మొత్తం 61 వేల 521 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 101 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.  

రకుల్, సమంత, తమన్నాజూబ్లీహిల్స్ ఓటర్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రముఖ హీరోయిన్ల ఓటర్ ఐడీ కార్డులు నెట్టింట వైరల్ గా మారాయి. రకుల్ ప్రీత్ సింగ్, తమన్న, సమంతలు జూబ్లీహిల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్నారంటూ వారి ఓటర్ ఐడీకార్డులు సోషల్ మీడియాలో కనిపించడ సంచలనం సృష్టించింది.  దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి విచారించగా.. వేరే వ్యక్తుల ఎపిక్ నంబర్ల తో వీరి ఫొటోలు పెట్టి ఎవరో  నకిలీ  ఓటర్ ఐడీ కార్డులను తయారు చేసినట్టు తేలింది. ఈ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులపై సీరియస్ అయిన హైదరాబాద్ ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీటిని ఎవరు తయారు చేశారు? సోషల్ మీడియాలో ఎవరు పోస్టు చేశారు? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇలా వార్నింగ్.. అలా డిలీట్

 చిన్నారులతో అసభ్యంగా మాట్లాడిస్తూ   వీడియోలు తీసే యూట్యూబర్లు,  ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు సజ్జనార్ వార్నింగ్ తో వెన్నులో వణుకు పుట్టింది.  ప్రేమికుల పేరుతో చిన్నారులను, మైనర్లను తీసుకువచ్చి తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ వ్యూస్, లైక్స్ కోసం నైతికతకు తిలోదకాలిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్న యూట్యూబర్లకు సజ్జనార్ ఓ ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అటువంటి చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.    మీరు ఫేమస్ అవ్వడానికి చిన్న పిల్లల భవిష్యత్తును ఎందుకు ఫణంగా పెడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని హైదరాబాద్ సిపి ప్రశ్నించారు. ఇలా అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ సిపి ఆగ్రహించారు. సమాజ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఇంటర్వ్యూలను చేయాలి. కానీ ఇలా యువతను, మైనర్ల ను తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదంటూ హెచ్చరించారు.  మైనర్లతో అసభ్యక రమైన కంటెంట్ చేసిన వాటిని తక్షణమే తొలగించకుంటే..  కఠినమైన చర్యలు తీసుకోవ డం జరుగుతుం దని సజ్జనార్ తన ట్వీట్ లో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయి అటువంటి వాటిని వెంటనే డిలీట్ చేశారు.   ఇంస్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ కూడా డిలీట్ చేశారు.

రాజకీయ నేతల కోసం రేవ్ పార్టీ!

హైదరాబాద్ శివారు ప్రాంతం మంచాల లో రేవ్ పార్టీ   కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మంచాల శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీని ఓ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతల కోసం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  విశ్వసనీయ  సమాచారం మేరకు  రాచకొండ పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లు అమ్మాయిలతో డ్యాన్సు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.   అలా దొరికిన వారిలో  బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీక్కర్ ఉన్న ఓ కారను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న లొంగుబాటు

రెండు రోజుల్లో 258 మంది నక్సలైట్ల లొంగుబాటు.. అమిత్ షా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నక్సల్స్ కీలక నేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయిన ఒక రోజు వ్యవధిలోనూ ఆశన్న లొంగుబాటు జరగడం విశేషం. ఈ లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమానికి తేరుకోలేని దెబ్బతగిలినట్లేనని పరిశీలకులు అంటున్నారు. వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇక కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.   బుధవారం (అక్టోబర్ 15) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా మరో 60 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇక అదే రోజు ఛత్తీస్ గడ్ లోని వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. ఇలా లొంగిపోయిన వారిలో   దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నేతలు రాజమన్ మండావి, రాజు సలామ్ కూడా ఉన్నారు.  ఇది జరిగిన 24 గంటల వ్యవధిలో ఆశన్నఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఆశన్న చాలా కాలంగా సాయుధ పోరాటం కంటే చర్చలే మేలు అంటూ పలు లేఖలు విడుదల చేసినట్లు చెబుతున్నారు.  ఒక   ఇంటర్వ్యూలో కూడా ఆశన్న తుపాకీ ద్వారా కాదు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. .  ఇక ఈ రోజు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగుజిల్లా లక్ష్మీదేవి పెట. ఈయన 1989లో ఆజ్ణాతంలోకి వెళ్లారు.   తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక దాడుల్లో ఆశన్న కీలక పాత్ర పోషించారు.   1999లో హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో ఘట్‌కేసర్ వద్ద మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసుల్లో ఆయన నిందితుడు.అలాగే  2003లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్స్ దాడికి నాయకత్వం వహించింది కూడా ఆశన్నే.  కాగా ఛత్తీస్ గఢ్ లో గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ లొంగుబాట్ల వివరాలను అమిత్ షా స్వయంగా వెల్లడించారు. గత రెండు రోజుల్లో మొత్తం 258 మంది ఆయధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ పరిణామం నక్సలిజంపై పోరాటంలో   ప్రధాన విజయంగా అభివర్ణించారు.  

మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు

ఆపరేషన్‌ కగార్‌ మావోయిస్టు పార్టీకి తేరుకోలేని దెబ్బ కొట్టింది. కొడుతోంది. అర్ధ శతాబ్దపు చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్, లీడర్ కకావిలకమౌతోంది.  వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన కీలక నేతలు లొంగు బాట పడుతున్నారు.  ఒకరి తర్వాత ఒకరుగా  మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో లొంగిపోయారు.  రో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న లొంగుబాట పట్టారు.  తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్  దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్ర‌భాత్‌ అలియాస్ బీపీ లొంగిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్..   అనారోగ్య సమస్యలతో పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు.   ఇక మావోయిస్టుగా బండి ప్రకాష్ ప్రస్థానం చూస్తే.. బండి ప్ర‌కాష్‌ మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రి గ్రామానికి చెందిన వారు. ఆయ‌న తండ్రి రామారావు  సింగ‌రేణి కార్మికుడే. ప్రకాష్ 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో   నిందితుడు కావడంతో పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్ సబ్ జైలు త‌ర‌లించారు. అయితే మావోయిస్టు నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి ప్రకాష్ సబ్ జైలు నుంచి తప్పించు కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.  అప్ప‌టి నుంచి బండి ప్రకాష్ అజ్ఞాతంలోనే గ‌డిపారు. ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా బండి ప్రకాష్ పేరు వినిపించేది.   పలుమార్లు ఆయన ఎన్ కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు పార్టీ బండి ప్రకాష్ కు   సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరణ బాధ్యతను అప్పగించింది. దీంతో ఆయన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)   పునరుద్దరించడం కోసం రిక్రూట్ మెంట్ సైతం చేపట్టారు.  పోలీసుల ఎన్ కౌంటర్ల కారణంగా ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అయితే మంచిర్యాల జిల్లా లో జరుగు తున్న పరిణామాలపై సికాస పేరుతో లేఖలు విడుదల చేయడం ద్వారా ఆయన సికాస ఉనికిని కాపాడారని అంటారు.  ఇక పోతే వైఎస్  రాజశేఖరరెడ్డి  హయాం లో మావోయిస్టుల తో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బండి ప్రకాష్ ప్రకాష్ అధ్యక్షత వహించాడు. అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు.  ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి కార్మిక స‌మాఖ్య ఒక వెలుగు వెలిగింది. సింగ‌రేణిలో కార్మికులు ఎన్నో హ‌క్కులు సాధించ‌డంలో బండి ప్ర‌కాష్ ది కీల‌క‌పాత్ర‌.   దాదాపు 41 ఏళ్ల కిందట అజ్ణాతంలోకి వెళ్లిన బండి ప్రకాష్ పై   పై తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. బండిప్రకాష్    పేర్లతో

వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కద్దు.. యూట్యూబర్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

యూట్యూబర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యూస్ కోసం చిన్నారుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి వీడియోలు చేస్తే సహించేది లేదని హచ్చరించారు.  ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యూస్, లైక్ లతో పాటు సోషల్ మీడియాలో  ఫేమస్ అవ్వడానికి చిన్నారుల భవిష్య త్తును పణంగా పెట్టడం  సమంజసం కాదంటూ పోస్టు చేశారు. చిన్నారులతో  అసభ్యకర మైన కంటెంట్ చేస్తూ సభ్య సమా జానికి  ఏం సందేశం ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయాలంటూ హితబోధ చేశారు. అందుకు భిన్నంగా  చిన్నారులతో అసభ్య కంటెంట్ వీడియోలు చేసి..  వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి చిన్నారు ల  యువతను పెడ దోవ పట్టించొద్దని హెచ్చరించారు. .  అటువంటి వీడియోలు  బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, చట్ట రీత్యా నేరం కూడా అని పేర్కొన్న ఆయన ఇటువంటివి  పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి వారిపై తక్షణమే వీటిని తొలగించకుంటే..  లేదంటే  కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్  ఇచ్చారు. అలాగే భవిష్యత్ లో ఎవరైనా సరే ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడి యోలపై  స్థానిక పోలీసులతో సమాచారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోస్టల్ cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.   పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచి..  సానుకూల వాతావరణం కల్పించి సరైన పద్ధతిలో విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

నవ్యాంధ్రలో నవశకం.. మోడీ చేతుల మీదుగా 13429 కోట్ల పనులకు శ్రీకారం

నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకం మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రూ. 13, 429 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. . కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదికపై నుంచి పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు.  నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలలో పనులకూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో వీటిని చేపడుతున్నారు. ఇవి భవిష్యత్తులో మరో రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయన్నది అంచనా.  రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 960 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కూడా మోడీ ఈ సందర్భంగా  శంకుస్థాపన చేశారు. అలాగే   రూ. 1,140 కోట్లతో చేపట్టనున్న ఆరు రోడ్డు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందులో పీలేరు –కల్లూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి,  కడప-నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు విస్తరణ, జాతీయ రహదారి-165పై గుడివాడ - నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జి, జాతీయ రహదారి -716 పై కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై  వంతెన, జాతీయ రహదారి -565పై నిర్మించిన కనిగిరి బైపాస్, జాతీయ రహదారి -544డీడీలోని ఎన్ గుండ్లపల్లి పట్టణంలో నిర్మించిన బైపాస్ ఉన్నాయి. అదే విధంగా రూ. 1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో కొత్తవలస–విజయనగరం నాల్గో రైల్వే లైన్, పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్‌లు  ఉన్నాయి. కొత్తవలస-బొద్దవర,సిమిలిగుడ- గోరాపూర్‌ డబ్లింగ్‌ విభాగాల పనులు పూర్తి కావడంతో  మోడీ వాటిని  జాతికి అంకితం చేశారు.   అదే విధంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన శ్రీకాకుళం–అంగుల్ నేచురల్ గ్యాస్  పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 1,730 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ 422 కిలోమీటర్ల పైప్‌లైన్ ఆంధ్రప్రదేశ్‌లో 124 ఒడిశాలో 298 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇక చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటును కూడా మోదీ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పారు. అదే విధంగా కృష్ణా జిల్లా నిమ్మలూరులో  రూ. 360 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  నెలకొల్పిన అధునాతన నైట్ విజన్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.