వివేకా కేసులో మరో ట్విస్ట్

  మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవరుగా మారిన దస్తగిరిని  బెదిరించిన ఫిర్యాదుపై కడప సెంట్రల్ జైల్లో కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. బుధవారం దస్తగిరిని, ఆయన  భార్య షబానాను  విచారించారు. ఈ కేసులో సాక్షిగా పులివెందుల ఇన్చార్జి  మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశారు.  2023 నవంబర్ 28 దస్తగిరిని కడప జైల్లో వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించినట్లు, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే  20 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు మాట వినకపోతే బయటకు వచ్చాక చంపేస్తామని బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ నియమించింది. ఈ మేరకుకడప జైల్లో మూడోసారి విచారణ చేపట్టారు. కమిటీ విచారణకు వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఆయన భార్య షబానా హాజరయ్యారు. సాక్షిగా బిటెక్ రవి స్టేట్‌మెంట్ కడప జైల్లో విచారణకు బిటెక్ రవి సాక్షిగా హాజరయ్యారు. బీటెక్ రవి, దస్తగిరిని చైతన్య రెడ్డిని బెదిరించిన సమయంలో ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో కడప సైంట్రల్ జైల్లో దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్  చైతన్య రెడ్డి బెదిరించిన కేసులో సాక్షిగా విచారణకు  బీటెక్ రవి హాజరయ్యారు.‌  విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి ఉన్న సమయంలో 2023  నవంబర్  14 నుంచి 29 వరకు  నేను రిమాండ్ ఖైదీ గా ఉన్నానని,నవంబర్ 28 న వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో సెంట్రల్ జైల్లోకి వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో నేను స్వర్ణముఖి బ్యారక్‌లో  ఉన్నానని, దస్తగిరి నాఎదురుగా బ్లాక్‌లో  ఉన్నాడని,నా బ్యారక్ ఎదురుగా చైతన్య రెడ్డి ఉండడం గమనించానని అన్నారు. దస్తగిరి బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్ళడం నేను చూశానని అన్నారు. కేసులో ముద్దాయిగా ఉన్న దస్తగిరిని అదే కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిని జైల్లోకి అనుమతించడం ఆ రోజే జైలర్ ప్రకాష్ ను ప్రశ్నించానని తెలిపారు. వివేకా హత్య కేసులో దస్తగిరిని తమ అనుకూలంగా మారకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తర్వాత తెలిసిందని అన్నారు.  దస్తగిరిని బెదిరించిన సమయంలో నేను జైల్లో ఉన్నా కాబట్టి నన్ను సాక్షిగా విచారణకు పిలిచారని, జరిగిన ఘటనపై నాకు తెలిసిన విషయాలు విచారణ కమిటీ ముందు మొత్తం వివరించానని బీటెక్ రవి పేర్కొన్నారు. దస్తగిరిని బెదిరించిన కేసులో సాక్షిగా నా స్టేట్మెంట్ రికార్డు చేశారని, 40 నిమిషాల పాటు విచారణ చేశారని అన్నారు. చైతన్య రెడ్ఢి మెడికల్ క్యాంపు పేరుతో జైల్లోకి అనుమతించడం పై ఆరోజే జైలర్ ప్రకాష్ ను ప్రశ్నించానని, ఇంత సమస్య అవుతుందని అనుకోలేదని జైలర్ చెప్పాడని అన్నారు. నా తరువాత దస్తగిరినీ కూడా విచారించారని ఆయన తెలిపారు.

అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  అమెజాన్‌ సంస్థకు కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్‌లో  రూ.80వేలు చెల్లించి  ఐ ఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టగా..ఐ ఫోన్ 15ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయ్యిందని బాధితుడు వీరేష్  పేర్కొన్నాడు. పలు మార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో బాధితుడు జిల్లా కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు.  దీంతో బాధితుడికి ఐ ఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు  రీఫండ్ చేసి రూ. 25 వేలు బాధితుడికి  చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 21కు వాయిదా వేసింది.గతంలో ఎన్నడు లేని విధంగా ఈ పండుగ సీజన్‌లలో ఆన్ లైన్ కష్టమర్లకు ఉహించని షాక్ లు తగిలాయి. తాము ఆర్డర్ చేసిన వస్తువలకు బదులు ఇతర వస్తువులు, నకిలీ వస్తువులు పెద్ద మొత్తంలో రావడం సంచలనంగా మారుతున్నాయి

సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ

  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో నిందితులు డాక్టర్ నమ్రత తోపాటు కళ్యాణి, సంతోషిని, నందినిని  చంచల్ గూడ  మహిళ జైలులో ఈడీ అధికారులు విచారించారు. సృష్టి కేసు వెలుగులోకి రావడంతో ఈడి అధికారులు రంగం లోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పురు షుల జైల్లో ఉన్న డాక్టర్ నమ్రత కుమారుడు జయంతి కృష్ణ ను కూడా విచారిస్తున్నారు. ఈ కేసు లో పెద్ద మొత్తంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లుగా ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి  ఫెర్టిలిటీ వ్యవహా రానికి సంబంధించి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు... డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో పెద్ద ఎత్తున అక్రమా లకు పాల్పడినట్లుగా ఈడి అధికారులు గుర్తించారు.  డాక్టర్ నమ్రత ఆర్థిక పరిస్థితి బాగాలేని వారిని టార్గెట్‌ చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి.... పిల్లల్ని కొనుగోలు చేసేది. అనంతరం తన వద్దకు సరోగసితో పిల్లలు కావాలని వచ్చేవారిని నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు తీసు కుంటూ.... అప్పుడే పుట్టిన శిశువులను వారికి ఇచ్చి..మీ బిడ్డే అంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడింది...డిఎన్ఏ టెస్ట్‌లో తమ బిడ్డ కాదని తెలిసిన వెంటనే దంపతులు నిలదీసి అడగడంతో డాక్టర్ నమ్రత తన కొడుకు లాయర్ జయంతి కృష్ణతో కలిసి బెదిరింపులకు గురి చేసేది.  దీంతో సరోగసి పేరుతో  ఈ దందా గుట్టు చప్పుడు  కాకుండా కొనసాగింది. అయితే ఓ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రత వ్యవహార మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు మరియు కళ్యాణి నందిని, సంతోషి వారందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. అయితే ప్రస్తుతం చంచలగూడ  జైల్లో ఉన్న వీరందరినీ ఈడి అధికారులు విచారిస్తున్నారు. వీరందరిని ఈడీ అధికారులు ఈనెల 28వ తేదీ వరకు విచారణ చేయనున్నారు.

పోక్సో కోర్టు సంచలన తీర్పు... నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

  తెలంగాణలో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు గురజాల చందుకు 32 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.తీర్పు ప్రకారం, నిందితుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పానగల్లు కు చెందిన నిందితుడు గురిజాల చందు పై 2022లో నల్గొండ టూటౌన్ పీఎస్ లో పోక్సో కేసు నమోదైంది.  అప్పటి నుంచి స్థానిక పోక్సో కోర్టులో విచారణ కొనసాగగా, బుధవారం ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి పూర్తి సాక్ష్యాధారాలు,సైంటిఫిక్ ఎవిడెన్స్ పరిశీలించిన అనంతరం  తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలనే ఆదేశాలు కోర్టు ఇచ్చింది.  

దుబాయ్‌లో ఎంబసీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

  ఆంధ్రప్రదేశ్-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని సీఎం చంద్రబాబు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. పెట్టుబడుల సాధనకు, నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ముఖ్యమంత్రి దుబాయ్ చేరుకున్నారు.  ఈ సందర్భంగా దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు.  గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిధ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్ 15 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని సీఎం వారికి వివరించారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు.  యూఏఈ దేశాల సావరీన్ ఫండ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. యూఏఈ -ఏపీ పారిశ్రామిక బంధం ధృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు చెందిన వివిధ సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని అన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని... యూఏఈలోని వివిధ సంస్థలను ఆ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయిలోని భారత ఎంబసీ ప్రతినిధులకు సీఎం తెలిపారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని.. భారత్ ను పెద్ద ఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని చేస్తున్న కృషే కారణమని ముఖ్యమంత్రి తెలిపారు.  విద్య వైద్య రంగాల్లో యూఏఈ ఆసక్తి ట్రేడ్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ సతీష్ కుమార్ శివన్ వివరించారు. ఇరుదేశాల పరస్పర పెట్టుబడులతో బంధం మరింత బలపడిందని సీఎంకు వివరించారు. మూడేళ్లలో 50 శాతం మేర ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం యూఏఈ టెక్నాలజీ రంగంపై ఎక్కువగా వ్యయం చేస్తోందని భారత్ నుంచి వచ్చే నిపుణులకు భారీ ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు.  ప్రస్తుతం యూఏఈ నాన్ ఆయిల్ ఎకానమీ వైపుగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై యూఏఈ 2017లోనే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని సీఎంకు సతీష్ కుమార్ శివన్ తెలిపారు. మరోవైపు యూఏఈలో 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ పెట్టిందని ఇందులో 50 శాతం గత ముడేళ్లలో వచ్చినవేనని యూఏఈలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఏ.అమర్నాధ్ తెలిపారు.  భారత్ లోని విద్య వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపుతోందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ పార్క్ లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాధ్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంకు సాదర స్వాగతం దుబాయ్‌లోని అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. యూఏఈలో తెలుగువాళ్లు ఉన్నారని...వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దుబాయ్ లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు.  అంతకు ముందు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దుబాయిలో ఉన్న తెలుగు వారు.. ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలియచేశారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని సీఎం అప్యాయంగా పలకరించారు.  

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల పై ట్రంప్ ప్రకటన నిజమేనా?

అమెరికా అధ్యక్షుడు చేసే ప్రకటనలు చాల సార్లు ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆయన భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని పదే పదే చెప్పుకున్నారు. ఆయన అలా చెప్పుకున్న ప్రతి సారీ బారత్ ఖండిస్తూనే వచ్చింది. అయినా ట్రంప్ తన వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో కూడా ట్రంప్ అదే తీరున వ్యవహరిస్తున్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ట్రంప్ గతంలో కూడా ప్రకటించారు. ఆ సందర్భంగా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది కూడా, భారత్ వినియోగదారుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చమురు ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలన్నది పూర్తిగా తమ అభీష్టమనీ ఇండియా స్పష్టం చేసింది. అయినా కూడా ట్రంప్ మరో6సారి రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసేసుకుందని ఆయన ఏకపక్షంగా ప్రకటన చేసేశారు. ఇకపై భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కోనుగోలు చేయబోదని ట్రంప్ చెప్పేశారు. వైట్ హౌస్ లో దీపావళి వేడుకల సందర్భంగా  ఆయనీ విషయం తెలిపారు. తాను భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్ లో సంభాషించాననీ, ఆ సందర్భంగా భారత్ నిర్ణయాన్ని మోడీ తనకు చెప్పారనీ ట్రంప్ అంటున్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇండియా నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు.   రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు భారత్, అమెరికాలు చిత్తశుద్ధితో కలిసి పని చేస్తున్నాయన్న ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇప్పటికే భారత్ చాలా వరకూ తగ్గించిందని.. ఈ తగ్గింపున భవిష్యత్ లోనూ కొనసాగిస్తుందని ట్రంప్ చెప్పారు.   ట్రంప్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేయడం వరకూ వాస్తవమే. ఎందుకంటే తనకు ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ కు మోడీ బుధవారం (అక్టోబర్ 22) ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించడం లేదా నిలిపివేయడంపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  దీంతో ట్రంప్ ప్రకటనలో విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 

డీఎస్పీ జయసూర్య...మంచి అధికారి : డిప్యూటీ స్పీకర్

  పశ్చిమ గోదావరి భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాటను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై నేపథ్యంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారం జయసూర్య మంచి అధికారి అని కొనియాడారు. ఆయన గురించి డిప్యూటీ సీఎం పవన్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. అయితే గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం సహజమని, 13 ముక్కలాట నేరం కాదని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంలో ఎలాంటి పేకాట, జూదం లేవని చెప్పారు.  ఈ అంశంలో కూటమి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డీఎస్పీ జయసూర్య తీరుపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన పరిధిలో జూద శిబిరాలు పెరిగిపోయాయని.. సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ జయసూర్య వ్యవహరించారనే ఆరోపణలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో వెంటనే భీమవరం డీఎస్పీపై శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ సందర్శంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని  ఎస్పీ తెలిపారు.  

అంతర్జాతీయ స్థాయికి ఏపీ అక్వా..!

ఆంధ్రప్రదేశ్ లో అక్వా సాగును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా కుదేలైన ఆక్వారంగానికి జవసత్వాలు వచ్చేలా ఏపీ రొయ్యలను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేలా ఒప్పందం కుదిర్చిన నారా లోకేష్ ఇప్పుడు ఆక్వాసాగులో అత్యాధునిక పద్ధతులను తీసుకువచ్చేందుకు ఆ రంగంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉష్ణమండల ఆక్వాసాగులో ముఖ్యమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలలో నిష్ణాతుడైన  జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (సీఎస్ టీఎఫ్ఏ) విభాగాధిపతి జెంజర్ తో చర్చల సందర్భంగా  ఏపీలో రొయ్యల సాగు సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎస్టీఎఫ్ఏ  ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను రాష్ట్ర రైతులకు అందించాలని కోరారు. భారత్‌లో ప్రధానంగా ఉత్పత్తి అయ్యే ఆక్వా రకాలలో   బ్లాక్ టైగర్ రొయ్యలలో వ్యాధి నిరోధకత, వృద్ధిరేటును పెంచడానికి జన్యుపరమైన మెరుగుదలకు అవసరమైన సహకారం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేలా వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ అప్టిమైజేషన్ వంటి పద్ధతులకు ప్రోత్సాహం అందించడంపై జెంజర్ అవసరమైన మద్దతు అందిస్తారు.  ఇక పోతే ఏపీ అక్వా రైతులకు   ఆధునిక సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని లోకేష్ ఈ సందర్భంగా జెంజర్ ను కోరారు. అలాగే ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు  అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు. ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా  జెంజర్‌ను కోరారు. మొత్తంగా ఈ భేటీ ద్వారా ఏపీ అక్వా సాగులో నాణ్యత, ఉత్పాదకతపెంపొందించేందుకు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, ఆధునిక సాంకేతికతను వినియో గించుకోవడానికి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.  

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  తెలంగాణలో అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు.  చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై  వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీంఅసిఫాబాద్ జిల్లాల్లోని తనిఖీ కేంద్రాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ అక్రమాలు జరుగుతున్నట్లు వారు గుర్తించారు. నిరంతర అవినీతి ఆరోపణలు, వాహనదారులు చెక్‌పోస్టుల వద్ద ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.    

రెండేళ్లలో ఉస్మా‘నయా’ ఆస్పత్రి.. సీఎంరేవంత్

ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై రేవంత్ బుధవారం (అక్టోబర్ 22) తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం అవసరాలకు తగ్గట్టుగా ఉండాలనీ, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు తగినట్లుగా గదులు, ల్యాబ్ లు ఇతర రూమ్ లు ఉండాలని సీఎం ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.  ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల వేగ‌వంతానికి వైద్య ఆరోగ్య శాఖ‌, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారుల‌తో  వెంటనే స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని  ఆదేశించారు. ఈ క‌మిటీ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌తి ప‌ది రోజుల‌కోసారి  స‌మావేశ‌మై  స‌మ‌స్య‌లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు.    ఉస్మానియా  ఆస్పత్రి  భవన నిర్మాణం పూర్తయ్యాక అక్క‌డి బందోబ‌స్తు.. ట్రాఫిక్ విధుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ముందుస్తుగానే త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పోలీసు   ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. ఆసుప‌త్రికి వివిధ ర‌హ‌దారుల‌ను అను సంధానించే ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌టి నుంచే రూపొందించాల‌ని ఆర్ అండ్ బీ అధికారుల‌ను ఆదేశించారు.  హైద‌రాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుప‌త్రులు, మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌తి నిర్మాణానికి ఒక అధికారిని నియ‌మించాల‌ని, అలాగే ఈ నిర్మాణాలను నిరంతరం అంటే 24X7 పర్యవేక్షించేలా ఆ అధికారికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. నిర్మాణాల‌పై 24x7 ఆ  అధికారి ప‌ర్య‌వేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు.  

నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా

  ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రాకు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన పిప్పింగ్‌ సెర్మనీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా 2016లో సుబేదార్‌గా సైన్యంలో చేరారు. అనంతరం 2021లో మేజర్‌గా పదోన్నతి పొందగా, 2022లో ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్రం ఆయనను సత్కరించింది. ఇప్పుడు మేజర్‌ నుంచి లెఫ్టినెంట్‌ కల్నల్‌గా మరింత ఉన్నత హోదా అందుకున్నారు. అథ్లెటిక్స్‌లో అసాధారణ విజయాలు సాధించి, లక్షలాది యువతను ప్రేరేపించిన సేవలకు గుర్తింపుగా నీరజ్‌ చోప్రాకు ఈ అరుదైన గౌరవం దక్కింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని 2021లో అందుకున్న నీరజ్‌ చోప్రా.. 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. భారత దేశానికి కీర్తి తెచ్చిన ప్రముఖ క్రీడాకారుల సరసన ఇప్పుడు నీరజ్‌ చోప్రా కూడా చేరాడు. గతంలో మిల్కా సింగ్‌, పీ.టీ. ఉషా, ధ్యాన్‌చంద్‌, సీ.కే. నాయుడు, గుర్మీత్‌ సింగ్‌లకు కూడా లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా లభించింది.

త‌మిళ‌నాట ద్ర‌విడ పార్టీల మ‌ధ్య‌ గూగుల్ గొడ‌వ‌

  గూగుల్ డేటా సెంట‌ర్ విశాఖ‌కు వ‌స్తుంద‌ని తెలిసిందో లేదో.. డీఎంకే, అన్నాడీఎంకే మ‌ధ్య మాట‌ల మంట‌లు చెల‌రేగుతున్నాయ్. దానికి తోడు.. లోకేష్ సైతం ఇందులో అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టుగా మాట్లాడ్డంతో ఆ మంట‌లు మ‌రింత చెల‌రేగుతున్నాయ్. ఇంత‌కీ అన్నాడీఏంకే వాద‌నేంటి? లోకేష్ ఏమంటున్నారో చూస్తే.. మ‌ధురైకి చెందిన సుంద‌ర్ పిచాయ్, గూగుల్ డేటా సెంట‌ర్ కి విశాఖ‌ను కేంద్రంగా చేస్కోవ‌డమేంటి? మ‌న‌కు మాత్రం విశాఖ త‌ర‌హా స‌ముద్ర తీరం లేదా? అన్న‌ది అన్నాడీఎంకే వాద‌న‌. సుంద‌ర్ పిచాయ్- త‌మిళ‌నాడు త‌న బ‌ర్త్ ప్లేస్ అయినా స‌రే అలాంటి ఆలోచ‌న రాకుండా చేసింది డీఎంకేనే.. అందుకు అధికార పార్టీ స‌మాధానం చెప్పి తీరాల్సిందే అన్న‌ది అన్నాడీఎంకే నాయ‌కుల వాద‌న‌. వీరిలా కొట్టుకుంటూ ఉంటే, లోకేష్ క్రాస్ ఎంట్రీ ఇచ్చి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే, పిచాయ్ త‌మ సంస్థ కోసం భార‌త్ ని ఎంపిక చేసుకున్నారు. అందుకే విశాఖ‌ను సెలెక్ట్ చేశార‌ని అన్నారు. దానికి తోడు స్టాలిన్ స‌ర్కార్ చేష్ట‌లు కూడా ఇటీవ‌ల ఏమంత స‌జావుగా లేవు. గూగుల్ థియ‌రీకి. స్టాలిన్ స‌ర్కార్ ఫిలాస‌ఫీకీ చాలానే తేడా ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏకంగా హిందీ సినిమాలు ఇక్క‌డ ఆడ‌టానికి వీల్లేని విధంగా ఒక చ‌ట్టం తేవ‌డానికి ప్ర‌య‌త్నించింది. అంటే ఇక్క‌డ హిందీ భాషే కాదు, ఆ సినిమాలు కూడా నిషిద్ధ‌మే అన్న‌ది స్టాలిన్ తీసుకురావ‌డానికి చేస్తోన్న య‌త్నం. ఒక‌ర‌కంగా చెబితే ఇది భారత స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం. విరుద్ధం. అదే త‌మిళ‌నాడుకు చెందిన ఏ ఒక్క‌రూ ఇక్క‌డ ఉండ‌టానికి వీల్లేద‌ని ఉత్త‌రాదిలోని హిందీ రాష్ట్రాల వారు ఆలోచిస్తే.. ప‌రిస్థితేంటి? హ్యుంద‌య్ కంపెనీనే తీస్కుంటే బార్న్ ఇన్ త‌మిళ‌నాడు స‌ర్వ్ నేష‌న్ అన్న స్లోగ‌న్ తో త‌న కార్ల త‌యారీ చేస్తుంటుంది. అలాంటి హ్యుంద‌య్ కార్ల‌ను హిందీ వాళ్లు మేము తోల‌డానికి ఒప్పుకోమంటే ఆ కంపెనీ ఏం కావాలి??? ఇలాంటి ఎన్నో స‌మ‌స్య‌లకు కేంద్రంగా త‌న ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు స్టాలిన్. దానికి తోడు స‌నాత‌న ధ‌ర్మంపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం. మ‌ర‌లాంట‌పుడు ఆ రాష్ట్ర అధికారిక చిహ్నంలోని గోపురాన్ని తీసేయ్యాల్సింది. అది చేసేందుకు ధైర్యం చాల‌దు. రీసెంట్ గా విజ‌య్ స‌భ తొక్కిస‌లాట‌కు కార‌ణం స్టాలిన్ స‌ర్కార్ నిర్వాక‌మే అన్న కామెంట్లు చిన్న పిల్ల‌లు కూడా చేస్తున్నారు.  అలాంటి త‌మిళ‌నాడును న‌మ్మి 15 బిలియ‌న్ డాల‌ర్లు.. దీన్నే భార‌తీయ క‌రెన్సీలో చెబితే అక్ష‌రాలా ల‌క్షా 20 వేల కోట్ల‌కు పైమాట‌. ఇంత మొత్తం తీస్కొచ్చి ఇక్క‌డ ధార‌బోసి.. ఆపై కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం అంద‌క అల్లాడ్డం క‌రెక్టు కాద‌ని భావించారేమో.. మ‌ధురైకి చెందిన పిచాయ్.. విశాఖే ఇందుకు క‌రెక్ట‌ని భావించిన‌ట్టున్నారు. ఈ విష‌య‌మే సింపుల్ గా లోకేష్.. పిచాయ్ భార‌త్ ను ఎంపిక చేసుకున్నార‌నే చిన్న కామెంట్ లో ఏర్చి కూర్చి పెట్టి వ‌దిలార‌ని అంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. దానికి తోడు త‌మిళ‌నాడులో ద్ర‌విడ వాదం ఎక్కువ‌. ఇంకా గ‌ట్టిగా మాట్లాడితే క‌మ‌ల్ వంటి వారు ఏకంగా ఈ ఆరు రాష్ట్రాలు ద్ర‌విడ దేశంగా ఏర్ప‌డాల‌న్న‌ వాద‌న కూడా చేస్తుంటారు. గూగుల్ గ్లోబ‌ల్ మైండ్ సెట్ కి, ఇలాంటి విభ‌జ‌న వాదానికి పొంత‌న లేక పోవ‌డంతో.. పిచాయ్ ఈ డెసిష‌న్ తీస్కున్న‌ట్టుగా త‌న సింగిల్ లైన్లో చెప్పుకొచ్చారు లోకేష్.

లక్ష డాలర్ల ఫీజు మినహాయింపు.. ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసా?

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (ఇండిమర: కరెన్సీలో దాదాపు 8 కోట్ల 30 లక్షలు) ఫీజు విషయంలో   స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది.  యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి,  లేదా  అక్కడే పని చేస్తూ ఒక కంపెనీ నుంచి మరో  కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదు. ఇది నిస్సందేహంగా భారీ ఊరటేనని చెప్పవచ్చే. అయితే ఇందుకూ కొన్ని మినహాయింపులూ, షరతులు ఉన్నాయి.  ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించి తీరాలి. అలాగే ఈ ఏడాది  సెప్టెంబర్ 21వ తేదీకి ముందు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన వారికి కూడా పాత నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది. అంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందదు. ఇప్పటికిప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే అమెరికాలో 3లక్షల 30 వేల మంది భారత విద్యార్థులు ఉన్నారు. అంటే అక్కడకు వెళ్లి చదువుకుంటున్నారు. వారిలో లక్ష మందికి పైగా  ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో స్టెమ్ కోర్సులు చదివి మూడేళ్ల వరకూ అమెరికాలో పని చేసే అవకాశం ఉన్న విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించినట్లే.  అంతే కాదు కంపెనీల యాజమాన్యాలు కూడా వీరికి హెచ్-1బీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తాయి.  

మనుషుల్ని భయపెట్టే కుందేళ్లున్నాయి.. ఎక్కడంటే?

కుందేలు అనగానే భయంభయంగా చూసే చూపులు గుర్తుకొస్తాయి. మనిషి అలికిడి వినిపిస్తే చాలు గుంతులేస్తూ పరుగులెత్తే పొడుగు చెవుల బెదురు జీవి చెవులపిల్లి. అయితే జపాన్ లోని ఆ దీవిలో మాత్రం కుందేళ్లు ఇందుకు భిన్నంగా ఉంటాయి. విప్లవ కవి వంగపండు ప్రసాదరావు రాసినట్లు సెమరపిల్లులు శంఖమూదినట్లు.. మనిషి అలికిడి వినిపిస్తే చాలు చుట్టుముట్టేస్తాయి. మనిషినే భయంతో పరుగులెత్తేలా చేస్తాయి. ఇంత పిసరు భయం లేదు. పైపెచ్చు సంఘటిత శక్తికి తిరుగే లేదన్నట్లు వేల సంఖ్యలో మందలు మందలుగా వచ్చి ఎదుట నిలుస్తాయి. అన్నికుందేళ్లు దాడి చేసినట్లుగా మీదమీదకి రావడం చూస్తే కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరే భయంతో వణకాల్సిందే. కుందేళ్లేమిటి.. మనుషులను బెదరించడమేంటి అనుకుంటున్నారా? ఆగండాగండి.. అక్కడికే వస్తున్నా.. జపాన్ లోకి కుందేళ్ల దీవిలో కుందేళ్లకు భయమంటే ఏంటో తెలీదు. జపాన్ లోని ఒకోనిషిమా దీవినే కుందేళ్లు అంటారు. గతంలో ఈ దీవిని విషవాయువుల మీద పరిశోధనలకు వినియోగించేవారు. ఆ తరువాత దానిని పట్టించుకున్న వాళ్లే లేరు. అదిగో అలాంటి దీవిలో ఎవరో కొన్ని కుందేళ్లను వదిలారు. అనతి కాలంలోనే వాటి సంతతి వందలు దాడి వేలకు వేలు పెరిగింది.  వాటిని చూడడానికి జనం రావడం మొదలైంది. పెద్దగా సమయం తీసుకోకుండానే ఆ కుందేళ్ల దీవి ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.  జపాన్ సర్కార్ కూడా దీనిని కుందేళ్ల అభయారణ్యంగా భావించి, ఆ దీవిలో చెత్త వేయడాన్ని నిలిపివేసింది. విషవాయువుల ప్రయోగాలను అంతకు ముందే ఆపేసింది. అంతే కాదు.. ఆ దీవిలోకి పెంపుడు జంతువులను తీసుకువెళ్లడాన్నీ నిషేధించింది. కుందేళ్లకు ఆహారం అందించడానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడ పెరిగిన, పెరుగుతున్న కుందేళ్లకు తమ సహజసిద్ధ గుణమైన భయం మాయమైంది. స్వేచ్ఛగా ఆ దీవే తమ సామ్రాజ్యం అన్న ధీమా వచ్చేసింది. ఆ దీవికి వచ్చే పర్యాటకులు కేందేళ్లకు ఆహారం తీసుకురావడం సహజం కదా? ఆ ఆహారం కోసమే మనిషి అలికిడి వినిపిస్తే చాలు వేల సంఖ్యలో కుందేళ్లు ఆ మనిషిని చుట్టుముట్టేస్తాయి.  ఆ కుందేళ్ల దీవిని సందర్శించిన వారు అక్కడి కుందేళ్ల ధైర్య సాహసాలకు సంబంధించిన ఫొటోలూ, వీడియోలూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా దీవి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ జపాన్ లోనే అతి ప్రధానమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.  

ఆధార్ లింక్డ్ టీష‌ర్టులెక్క‌డైనా చూశారా!?

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు.. ఊరే మెచ్చిన ప‌నివాడు.. అన్న ముత్తు సినిమాలోని  పాట వినే ఉంటాం. అయితే ఇక్క‌డ అంద‌రూ మొన‌గాళ్లే. అంద‌రూ ప‌నివాళ్లే.. కావాలంటే ఈ ఆధార్ ముద్రిత టీష‌ర్టును చూడండీ.. మీకిట్టే తెలిసిపోతుంది. అరే ఇదేదో భ‌లేగుందే.. అని మీకూ అనిపించింది కదూ.. అయితే మీరీ స్టోరీ త‌ప్ప‌క తెలుసుకోవ‌ల్సిందే. ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లా న‌క్క‌ల‌ప‌ల్లి మండ‌లంలోని.. రాజ‌య్య పేట గ్రామంలో బ‌ల్క్ డ్ర‌గ్ ఫ్యాక్ట‌రీ వ్య‌తిరేక ఉద్యమం జ‌రుగుతోంది. మొన్నామ‌ధ్య వీరు హోం మంత్రి అనిత‌ను అట‌కాయించ‌డంతో పాటు.. జిల్లా క‌లెక్ట‌ర్ని సైతం త‌మ ఊరికే ర‌ప్పించిన ఘ‌నులు.  అయితే ఈ గ్రామ ఆందోళ‌న‌కారులు.. త‌మ ఊరిలోకి మ‌రెవ‌రూ రాకూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టుకున్నారు. అంటే ఈ గ్రామ ఉద్య‌మంలో మ‌రే ఇత‌ర అసాంఘిక, రాజ‌కీయ శ‌క్తులు లోప‌ల‌కు రాకూడ‌ద‌నుకున్నారో ఏమో.. మా మూమెంట్ ఎక్స్ క్లూజివ్ అన్న ముద్ర వేయాల‌నే అనుకున్నారో తెలీదు గానీ,  ఒక రూలైతే పెట్టుకున్నారు.  అంతా బాగుంది కానీ.. ప్ర‌తి సారీ వీడు మ‌నూరోడూ.. వీడు మ‌నూరోడు కాడ‌ని ఎలా తెలుసుకోవ‌డం?.. అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. అరెరే పెద్ద చిక్కే వ‌చ్చిందే అని బ్ర‌హ్మానందంలా ఫీల‌య్యి.. ఎట్ట‌కేల‌కు ఇదిగో ఈ టీష‌ర్టు ఐడియా అమ‌లు చేశారు. దీంతో ఎస్ ఇలాంటి ఆధార్ ప్రింటెడ్ టీష‌ర్టు  మ‌నం త‌ప్ప మ‌రే ఊరోళ్లూ వేస్కోర‌ని క్రేజీగా ఫీల‌య్యి.. ఇదిగో ఇలా త‌మ టాలెంట్ చూపించార‌న్న‌మాట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లు, ఔట‌ర్ ఐడీలు మాత్ర‌మే చూసిన జ‌నం.. ఇదిగో ఈ ఊరోళ్లు ఆధార్ లింక్డ్ టీష‌ర్టుల‌ను చూసి.. ఈ ఊరోళ్లంతా భ‌లే టాలెంటెడ్ గా ఉన్నారే.. అంటూ స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు ఈ ప‌రిస‌ర ప్రాంత వాసులు.

జగన్ దీపావళి వేడుకల వెనుక అసలు రహస్యం ఇదేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది దిపావళి సంబరాలలో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా బాణ సంచా కాల్చి సందడి చేశారు. సతీసమేతంగా ఆయన దీపావళి సంబరాలు చేసుకుని బాణసంచా కాల్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత బెంగళూరులోని తన యహలంక ప్యాలెస్ లో సతీమణి భారతితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. ఎందుకంటే జగన్ బహిరంగంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్న సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కాగా జగన్ దీపావళి పండుగను జరుపుకున్న విషయాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా షేర్ చేశారు.  గతంలో ఎన్నడూ ఇలా ఒక హిందూ పండుగను జగన్ దంపతులు జరుపుకున్న సందర్భం లేదు. అసలాయన హిందూ పండుగలు జరుపుకోవడానికి పెద్దగా ఇష్టపడరన్న ప్రచారం ఉంది. దేవాళయాలకు వెళ్లినా అక్కడ తీర్థం, ప్రసాదం వంటివి స్వీకరించడానికి జగన్, ఆయన కుటుంబం విముఖత చూపుతారన్న ప్రచారం కూడా ఉంది. అటువంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన సతీసమేతంగా దీపావళి వేడుక జరుపుకోవడం తనపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపివేసుకోవడానికేనని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 

రాష్ట్రపతి ముర్ముకు తృటిలొ తప్పిన ప్రమాదం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలొ బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ల్యాండ్ అయిన తరువాత ఒక పక్కకు ఒరిగిపోయిన హెలికాప్టర్ ను నిముషాల పై ముందుకు నెట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురక్షితంగా హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఈ సంఘటన కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో బుధవారం (అక్టోబర్ 22) జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   రాష్ట్రపతి నాలుగు రోజుల కేరళ పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరి కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ద్రౌపది ముర్ము యథావిథిగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ సంఘటన జరిగిన తరువాత ఆమె ముందుగా నిర్ణయించిన కార్యక్రమం మేరకు అక్కడ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. 

చంద్రబాబు దుబాయ్ పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలక్ష్యంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఆ లక్ష్య సాధనలో బాగంగానే ఈయన మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోసం బుధవారం (అక్టోబర్ 22) ఉదయం అమరావతి నురంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి యూఏఈ యాత్రకు బయలుదేరారు. విశాఖలో ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన భాగస్వామ్య సదస్సుకు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులు హాజరు కానున్నారు.  తన యూఏయూ పర్యటనలో కూడా చంద్రబాబు  వివిధ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. విశాఖ  భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన వారిని ఆహ్వానిస్తారు. ఇక పోతే తన యూఏఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు  దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అలాగే తన పర్యటన తొలి రోజు అయిన బుధవారం చంద్రబాబు  ఐదు సంస్థల ప్రతినిధులతో  భేటీ అవుతారు. ఇక రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.  అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్‌లో  తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.  తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు.  

ఆపరేషన్ సిందూర్ హీరోలకు వీర చక్ర పురస్కారాలు

దేశ రక్షణలో   విశిష్ఠ‌ సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన  భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది.  ఆపరేషన్ సిందూర్  సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక  వీర చక్ర  పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988  మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్‌కు వీర చక్ర లభించింది. అదే విధంగా అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్‌కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాకు కూడా ఈ పురస్కారం వరించింది. భారత వైమానిక దళం నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువుల   గగనతలంలోకి చొచ్చుకు వెళ్లి నిర్దేశిత లక్ష్యాలను  ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్‌ పట్నీ, అలాగే  అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటలాంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, సంక్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్‌లకు  వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.