నకిలీ మద్యం కేసులో సూత్రధారులకు చుక్కలు చూపిస్తాం : మంత్రి కొల్లు

  నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం నాణ్యత లేని, హానికరం కాని పదార్థాలు ఉపయోగించినట్లు తేలిందని మంత్రి పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చుక్కలు చూపిస్తామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానికి మతిచేడి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. రూ.99 బ్రాండ్లు నిలిపివేశామనడం చెప్పడం ఆయన ఆజ్జానానికి నిదర్మనమన్నారు. జనార్థన్ రావు తన ఇంటికి వచ్చినట్లు జోగి రమేశ్ అంగీకరించారని మంత్రి కొల్లు అన్నారు. వాస్తవాలు బయటకు వస్తుంటే జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని పేర్కొన్నారు.  ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను స్కాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా?అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీని తరిమికొట్టారని తెలిపారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. సిట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామని గుర్తు చేశారు.

నిండు గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన కసాయి మామ

  కులవివక్ష మళ్లీ క్రూరరూపం దాల్చింది. ఓ గర్భిణీ ప్రాణాన్ని కూడా క్షమించని అమానుష ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కడుపులో ఎనిమిది నెలల బిడ్డ ఉన్న కోడలిని, కులం పేరుతో ఓ మామ గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళితే దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ (బీసీ కులం) అదే గ్రామానికి చెందిన రాణి (ఎస్టీ కులం)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ కులాంతర వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు అస్సలు నచ్చలేదు. కుమారుడు తన కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, కోపం పీక్‌కి చేరింది. ఇదిలా ఉండగా, రాణి ఎనిమిది నెలల గర్భిణీ అయ్యింది. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో శేఖర్-రాణి దంపతులు ఉన్నారు. అయితే ఈ సంతోషం సత్తయ్యకు నచ్చలేదు. క్రోధంతో రగిలిన అతడు, గర్భిణీ కోడలిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రాణి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

అధికారులు అలసత్వం వహిస్తే సహించం : సీఎం రేవంత్

  ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని ముఖ్యమంత్రి  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని అన్నారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం పేర్కొన్నారు. శనివారం ఉదయం సీఎం నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని చెప్పారు.  అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు.  కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.  

బాల సదన్‌లో రెహమాన్‌పై మరో కేసు నమోదు

  హైదరాబాద్ సైదాబాద్ బాలసదన్‌లో  ఓ చిన్నారి బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన రెహమాన్‌పై మరో కేసు నమోదు అయింది... బాలసదన్ లో పనిచేస్తున్న రెహమాన్ అందులో ఉన్న చిన్నారి బాలుడు పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడిని ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాలుడి తల్లిదండ్రులు అతని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అతనిపై లైంగిక దాడి జరిగినట్లుగా తెలుసుకొని తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.  అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రెహమాన్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే రెహమాన్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సైదాబాద్ పోలీసులు తాజాగా రెహమాన్ పై మరో కేసు నమోదు చేశారు. హోమ్ లో ఉన్న 8 మంది చిన్నారులపై కూడా రెహమాన్ లైంగిక దాడి చేశాడని మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేసినట్లుగా తెలిసింది. కామంతో రగిలిపో తున్న రెహమాన్ హోమ్ లో ఉన్న అభం శుభం తెలియని చిన్నారులను తీసుకువెళ్లి లైంగిక వాంఛ తీర్చుకు నేవాడు. ఈ విధంగా రెహమాన్ 8 మంది చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసి రాత్రి సమయంలో వారిని బాత్రూం లోకి తీసుకువెళ్లి... లైంగిక దాడి చేసి వికృతి కోరికలు తీర్చుకునేవాడు.  మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు రహమాన్ ఫైన ఫోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో రెహమాన్‌పై కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది... చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ హోమ్ కి చెందిన 8 మంది చిన్నారులపై రెహమాన్ లైంగిక దాడి చేశాడని... మరో ముగ్గురిని తనకు సహకరించాలంటూ వేధింపు లకు గురి చేసాడని తెలిపారు.  

ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

  ఢిల్లీలోని ఎంపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్లమెంటు భవనం 200 మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఎంపీలు నివసిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సమాచరం అందుకున్నా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అందులోకి తెచ్చాయి.  అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 1:20 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

  పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా… కంటి చికిత్స హామీ మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొగులయ్య ఇంటి స్థలం సమస్యపై కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్ అనంతరం మొగులయ్య, గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మొగులాయి అన్నారు.  తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు.  దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు.  అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు మాజీ మంత్రి సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు మొగులయ్య కృతజ్ఞతలు ఈ సందర్భంగా మొగులయ్య కేటీఆర్‌తో మాట్లాడుతూ, ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నెర వాయించుకునే తనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతోనే గుర్తింపు దక్కిందని తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత  తనను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించడం వల్లనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇంటి స్థలం వివాదాన్ని పరిష్కరించి, కోర్టు కేసుల విషయంలో సహాయం చేయాలని మొగులయ్య కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు.

స్వచ్ భారత్‌లో అనుకోని అతిథి...చిన్నారుల ఆనందం

  రాష్ట్ర వ్యాప్తంగా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రహసనంలా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం నాడు జరిగిన కార్యక్రమం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా చేస్తున్న నేపథ్యంలో  కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది.  శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో పర్యటిస్తున్న సమయంలో నౌతల కూడలి లో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది.  వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నినదిస్తూ.. సైకిళ్లలతో చిన్నారులు ర్యాలీ చేపట్టడం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు. మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రతీ ఒక్క చిన్నారి మొక్కలను కూడా నాటాలని కోరారు.  సమాజ హితం కోసం చిన్నారులు చేస్తున్న ఈ కార్యక్రమంలో అనుకోని అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రావడంతో ఆ చిన్నారులు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు.

భారత్‌ క్షిపణిలకు పాక్ తప్పించుకోలేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

   భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు చేరాయి. ఉత్తర్‌ప్రదేశ్‌  రాజధాని లఖ్‌నవూలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్  కేవలం ట్రైలర్ మాత్రమేనని పాకిస్తాన్ హెచ్చరించారు.  దాయాదులు దుస్పాహసాని తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్‌ సైన్యం పరాక్రమం అప్రతిహతం. మనకు ఉన్న ఆధునిక క్షిపణి సామర్థ్యాల ముందు శత్రువులు తప్పించుకోలేరని  రక్షణ మంత్రి  అన్నారు.ఇదే సందర్బంగా బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. “తొలిసారి విదేశీ నిపుణులు లఖ్‌నవూకు రానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు దాటుతుంది. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుంది” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

ఉమేష్ చంద్ర హత్యలో ఆశన్న కుట్ర పథకం

అది 1999 సెప్టెంబ‌ర్ 4. స్థలం ఎస్సార్ న‌గ‌ర్ జంక్ష‌న్. ఎప్ప‌టిలాగానే ఐపీఎస్ ఉమేశ్ చంద్ర‌.. త‌న మారుతీ వ్యాన్ లో  డ్యూటీకి బ‌య‌లుదేరారు. ఇంత‌లో అనుకోని ఒక దాడి.   ఎప్ప‌టి నుంచో కాపు కాచిన న‌క్స‌ల్స్ యాక్ష‌న్ టీమ్.. ఒక్క‌సారిగా కాల్పుల మోత మోగించింది. డ్రైవ‌ర్, ఉమేష్ పీఏ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా.. ఆయుధం లేని ఉమేష్ చంద్ర‌.. వెంట‌నే కారు బ‌య‌ట‌కొచ్చి.. న‌క్సల్స్ ని ప‌ట్టుకుందామ‌ని ప్ర‌య‌త్నించారు. క‌ట్ చేస్తే ఆయ‌న ద‌గ్గ‌ర ఆయుధం లేద‌ని గుర్తించిన న‌క్స‌ల్స్.. వెంట‌నే ఆయ‌న మీదకు ఎదురు దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో వెన‌క్కు త‌గ్గిన ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి కాల్పులు జ‌రిపారు. దీంతో ఉమేష్ చంద్ర‌  మ‌ర‌ణించారు. ఈ మొత్తం యాక్ష‌న్ ప్లాన్ వెన‌క కీల‌క సూత్ర‌ధారి మ‌రెవ‌రో కాదు.. శుక్ర‌వారం (అక్టోబర్ 17) లొంగిపోయిన ఆశ‌న్న‌. వీళ్లు మొత్తం మూడు యాక్ష‌న్ టీములుగా ఏర్ప‌డి.. మూడు నెల‌ల పాటు రెక్కీ నిర్వ‌హించి.. ఈ దాడికి పాల్ప‌డ్డారు. అదెంత‌గా అంటే, ఏకంగా ఉమేష్ చంద్ర ఇంట్లోకి కూర‌గాయ‌ల వాళ్ల రూపంలో ఇత‌ర‌త్రా ప‌నివాళ్ల రూపంలో చొర‌బ‌డేంత‌. క‌ట్ చేస్తే ఆయ‌న క‌ద‌లిక‌లేంటి? ఏయే స‌మ‌యాల్లో నిరాయుధంగా వెళ్తుంటారు. ఏ రూట్లో వెళ్తుంటారు వంటి అనుపానుల‌న్నీ ప‌సిగ‌ట్టిన మరీ ఉమేష్ చంద్రను హతం చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఆశ‌న్న నాయ‌క‌త్వంలోనే జరిగింది. కార‌ణ‌మేంట‌ని చూస్తే ఉమేష్ చంద్ర‌కు క‌డ‌ప పులి అన్న పేరుండేది. అంతే కాదు.. ఆయ‌న న‌క్సల్స్ ప్ర‌భావిత ప్రాంతాలైన వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ ప్రాంతాల్లో పోలీసు ఉన్న‌తాధికారిగా ప‌ని చేశారు. న‌క్స‌ల్స్ పై ఉక్కు పాదం మోపారు. ఇది మ‌న‌సులో పెట్టుకున్న న‌క్స‌లైట్లు ఆయ‌న్న హ‌త‌మార్చ‌డానికి చేసిన పథక రచన సూత్రధారి ఆశన్నే.  అయితే ఆశ‌న్న కూడా ఆనాడే పోలీస్ ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయి ఉండేవాడు. అప్ప‌టికీ పోలీసు ఇన్ఫార్మ‌ర్ల ద్వారా ఈ దాడిలో పాల్గొన్న యాక్ష‌న్ టీమ్ స‌భ్యులు వెళ్తున్న ఆటోను అట‌కాయించిన పోలీసులు. వారిని కాల్చి చంపేశారు. అయితే వెన‌కే బైక్ పై మ‌రొక‌రితో వ‌స్తున్న ఆశ‌న్న ఇది గుర్తించి.. అటు నుంచి అటే ప‌రారయ్యాడు. దీంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా, అజ్ణాతంలో గడిపిన ఆశన్ని ఇప్పుడు ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు.  ఇదీ ఉమేష్ చంద్ర మ‌ర‌ణానికి ఆశ‌న్న‌కూ ఉన్న సంబంధం.

నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున అందిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హైకమిషనర్ మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..  స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్  అక్కడ  విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడ అనుసరిస్తున్న  విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.  పర్యటనలో భాగంగా లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు.  అలాగే, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపడంతో పాటు మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను పరిశీలిస్తారు. ఈ నెల‌ 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో  కూడా లోకేష్ పాల్గొంటారు.  24 రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్రశాంతంగా తెలంగాణ బంద్.. ర్యాలీలో జారిపడిన వీహెచ్

బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) జరుగుతున్న తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలూ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా బంద్ లో పాల్గొన్నాయి. ఇక బంద్ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆమె తన నివాసం నుంచి ఆటోలో ఖైరతాబాద్ చౌరస్తా వరకూ వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఇక అంబర్ పేటలో బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహననుమంతరావు జారి పడ్డారు.  బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో  పాల్గొన్న వీహెచ్ ఫెక్సీ పట్టుకుని నడుస్తుండగా అంబర్ పేట వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనను లేవదీసి సపర్యలు చేశారు. అనంతరం ఆయన యథావిధిగా ర్యాలీలో పాల్గొన్నారు.  

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని  తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి  ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు. మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదన్నారు.  జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

      గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లో  సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో  శనివారం చోటుచేసుకుంది.  అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు   అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు వెంటనే కిందకి దిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.  అయితే మూడు బోగీలు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదకారణాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు.  ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది.  

బీసీ సంఘాల తెలంగాణ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు

బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) తెలంగాణ బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్న తెలంగాణ బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం నుంచీ బస్సులన్నీ డీపోలకే పరిమితమైపోయాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము చేయాల్సినన్నీ చేస్తున్నామని ..బంద్‌కు మా మద్దతు ఉంటుందని ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ కూడా బంద్ కు మద్దతు తెలిపింది. ఇక ఈ బంద్ కు నేతృత్వం వహిస్తున్న బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదికకు కన్వీర్ సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్యే  కావడంతో బీజేపీ కూడా బంద్ ను సమర్శించినట్లే అయ్యింది.    

చిట్టీల పేరుతో రూ.150 కోట్లకు టోకరా.. డాక్టర్ దంపతుల నిర్వాకం

చిట్టీల పేరుతో జనాలను 150 కోట్ల రూపాయలకు మోసం చేసిన డాక్టర్ దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుకు ఇద్దరూ వైద్యులే అయినా.. ఆ వృత్తితోనే నమ్మించి జనాలను నిలువునా ముంచేశారు. హైదరాబాద్ నిజాంపేట బండారీ కాలనీ లే ఔట్ లో క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రేష్మ, డాక్టర్ అలీ దంపతులు.. చిట్టీల పేరుతో దాదాపు వంద మందిని దగా చేసి 150 కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తేశారు.    చిట్టీల కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు క్లినిక్ కు వచ్చారు. అయితే అప్పటికే ఈ కిలాడీ దంపతులు బిచాణా ఎత్తేశారు. దీంతో నిలువునా ముంచేశారని గ్రహించిన  బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వైద్య జంటపై ఇప్పటి వరకూ 42 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ కిలాడీ జంట బాధితుల సంఖ్య భారీగానే ఉంటుందని అంటున్నారు. చిట్టీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి పది లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (అక్టోబర్ 18) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (అక్టోబర్ 17) శ్రీవారిని మొత్తం 66 వేల 675మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 681 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది.  

చరమాంకంలో మావోయిస్టు తీవ్రవాదం.. మోడీ

దేశంలో మావోయిస్టు తీవ్రవాదం చరమాంకంలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ నక్సల్ విముక్త దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు మావోయిస్టు తీవ్రవాద పీడ పూర్తిగా తొలగిపోతుందన్నారు.  ఢిల్లీలో శుక్రవారం (అక్టోబర్ 17) జరిగిన ఎన్డీటీవీ   వరల్డ్ సమ్మిట్‌లో మోడీ మాట్లాడారు.  దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి మావోయిజం  శాపంగా మారిందన్న ఆయన.. గత కొన్నేళ్లుగా దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి శకం మొదలైందన్నారు. ఈ ఫలితమే.. కేవలం 72 గంటల వ్యవధిలో 303 మంది మావోయిస్టుల లొంగుబాటు అని మోడీ పేర్కొన్నారు.  వారంతా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని విశ్వసించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. గత కాంగ్రెస్ హయాంలో 'అర్బన్ నక్సల్స్  మావోయిస్టుల ఘోరాలను కప్పిపుచ్చారన్న ప్రధాని.. ఇటీవల మావోయిస్టు బాధితులు ఢిల్లీకి వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి ఏడు రోజుల పాటు ప్రయత్నించారని, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయిన పేద రైతులు, గిరిజనులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ గొంతును ప్రజలకు చేర్చమని వేడుకున్నారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా మావోయిస్టుల దాడుల వల్ల ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో 125 జిల్లాలలో  మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదనీ, ఇప్పుడు వారి ప్రాబల్యం కేవలం 11 జిల్లాలకు పరిమితమైందన్న మోడీ.. వాటిలో కూడా మావోయిస్టుల బలం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడంటే మూడేనని చెప్పారు.   అభివృద్ధి, భద్రతల తమ ప్రభుత్వానికి సమ ప్రాధాన్యతాంశాలన్న ప్రధాని మోడీ  మావోయిస్టుల కంచుకోట బస్తర్‌లో గిరిజనులు ఇప్పుడు 'బస్తర్ ఒలింపిక్స్' నిర్వహిస్తుండటమే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిదర్శనంగా అభివర్ణించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈఏడాది  దీపావళిని ప్రజలు నిర్భయంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకుంటారని మోడీ అన్నారు.