ఈ కేరళ మహిళ నిజాయితీకి ఫిదా కావాల్సిందే!

ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా కావాలని అనుకునే వారు కోకొల్లలు. నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి ఆలోచించకుండా అప్పనంగా వచ్చే సొత్తుకోసం ఆశపడేవారి సంఖ్య అనంతం. అటువంటి సమాజాంలో ఒక నిరుపేద మహిళ చూపిన నిజాయితీ అందర్నీ ఫిదా చేస్తున్నది. తాను స్వయంగా పుట్టెడు కష్టాలలో ఉన్నా.. నిజాయితీని వీడలేదు. ఆ మహిళ పేరు స్మిజామోహన్. కేరళలో లాటరీ టికెట్లు అమ్మి పొట్టపోషించుకుంటోంది.  

ఆమె తన వద్ద అమ్ముడుపోని లాటరీ టికెట్లు కొన్ని ఉన్నాయనీ, వాటిని కొనుగోలు కొనమనీ తన రెగ్యులర్ కస్టమర్లను కోరింది. వారిలో చంద్రన్ అనే క్లయింట్ ఒక టికెట్ కొనేందుకు అంగీకరించాడు. ఫోన్ లోనే అతడు టికెట్ కొనడానికి అంగీకారం తెలిపి.. తనకు నచ్చిన ఒక లాటరీ టికెట్ ను ఎంచుకున్నాడు.  ఆ కొనుగోలు కూడా అరువుమీదే చేశాడు. అంటే తరువాత డబ్బులు ఇస్తానన్నాడు. ఇదంతా మౌఖిక లావాదేవీయే. తాను ఎంచుకుని కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు అతడు ఇంకా డబ్బు కూడా చెల్లించలేదు.  

సరే అతడు కొన్న టికెట్ కు ఆరు కోట్ల రూపాయల భారీ బంపర్ బహుమతి గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మజా మోహన్.. క్షణం ఆలస్యం చే యకుండా ఆ టికెట్ కొనుగోలు చేసిన చంద్రన్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపి.. అదే రోజు అతడి ఇంటికి వెళ్లి అతడు అరువుపై మాట మాత్రంగా కొన్న లాటరీ టికెట్ ను అతడికి అందజేసింది.  ఈ విషయం తెలియగానే స్మిజా మోహన్ నిజాయితీని ప్రశంసిస్తూ ఆమెకు అసంఖ్యాకంగా ఫోన్ లు వచ్చాయి. దీనిపై స్పందించిన స్మిజా..  నిజాయితీయే అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. కస్టమర్లు లాటరీ టికెట్ కొనడానికి వెచ్చించే సొమ్మతోనే తాను జీవిస్తున్నానని పేర్కొంది. 

ఇంత తృణప్రాయంగా కోట్ల రూపాయలను కాదనుకుని నిజాయితీ, చిత్తశుద్ధి ప్రదర్శించిన స్మిజా మోహన్ సంపన్నురాలు కాదు. నిజానికి నిరుపేద. ఆమెకు డబ్బులు చాలా చాలా అవసరం. ఆమె పెద్ద కుమారుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో  బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. చిన్నకుమారుడికి క్యాన్సర్. తన పిల్లల చికిత్సకు ఆమెకు డబ్బు ఎంతో అవసరం. అయినా తనది కాని సొమ్ము కోసం ఆమె ఇసుమంతైనా ఆశపడలేదు. ఆమె నిజాయితీకి అంతా ఫిదా అవుతున్నారు.  

ఆర్టీసీ బస్సులో సినిమాకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు

  ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అందరూ కలిసి బస్సులో ప్రయాణించి ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకుని సినిమాను వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ‘పూలే’ సినిమాను హిందీ భాషలో తెరకెక్కించగా 2025 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు.  జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమా నిర్మితమైంది. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలన కోసం పూలే చేసిన పోరాటం, మహిళల హక్కుల కోసం ఆయన సాగించిన ఉద్యమాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టుగా తెరపై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు పూలే సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశం అందించే చిత్రమని తెలిపారు. ఆ నాడు కుల వివక్షను తట్టుకుని సమ సమాజం కోసం వేసిన పునాదుల ఫలితాలను ఈరోజు అనుభవిస్తున్నామని తెలిపారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు

టెంపో డ్రైవ‌ర్ టు...శంఖ్ ఎయిర్ ఓన‌ర్ వ‌ర‌కూ

  ఇటీవ‌ల కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్ర‌వ‌ణ్ కుమార్. దీంతో ఈయ‌న దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నారు. ఒక టెంపో డ్రైవ‌ర్ స్థాయి నుంచి విమాన‌యాన సంస్థ ఓన‌ర్ వర‌కూ ఎలా ఎదిగాడ‌న్న‌దే ఇప్పుడు అంద‌రి ముందున్న ప్ర‌శ్న‌. మ‌ధ్య త‌ర‌గ‌తి విమాన యాన క‌ల‌ను ఎలాగైనా స‌రే సాకారం చేయాల‌న్న దృక్ప‌థంతో శ్ర‌వ‌ణ్ ఈ రంగంలో అడుగు పెట్టిన‌ట్టు చెబుతున్నారు. యూపీ నుంచి వ‌స్తోన్న తొలి విమాన‌యాన సంస్థ‌ను ప్రారంభించారు. శ్ర‌వ‌ణ్ తొలుత సిమెంట్, స్టీల్, ర‌వాణా రంగాల్లో వ్యాపారాలు చేశారు. 2026లో దేశీయ విమాన సేవ‌లు ప్రారంభించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు శ్ర‌వ‌ణ్. శ్ర‌వ‌ణ్ విశ్వ‌క‌ర్మ నేప‌థ్యం ఏంటో చూస్తే సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చారు. చిన్న‌త‌నంలోనే చ‌దువుకు విరామం ప్ర‌క‌టించి టెంపో న‌డ‌ప‌టం స్టార్ట్ చేశారు. తొలుత లోడ‌ర్ గా త‌న కెరీర్ మొద‌లు పెట్టారు శ్ర‌వ‌ణ్. ఆ త‌ర్వాత అంచ‌లంచెలుగా ఎదిగి  ర‌వాణా నుంచి స్టీల్ కి ఆపై సిమెంట్, మైనింగ్ రంగాల్లో విజ‌య‌వంత‌మైన  వ్యాపార నిర్వ‌హ‌ణ  చేశారు. శ్ర‌వ‌ణ్ చిన్న‌ప్ప‌టి క‌ల విమాన‌యానం. దీంతో ఈ రంగంలో అడుగు పెట్టి శంఖ్ ఎయిర్ ప్రారంభించారు. దీని ప్ర‌ధాన  ల‌క్ష్యం.. మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలాంటి ధ‌ర‌లు. సామాన్యులు కూడా ఎంతో సాదా సీదాగా విమాన‌యానం చేసేయ్య‌డ‌మే శ్ర‌వ‌ణ్ త‌న ముందు పెట్టుకున్న టార్గెట్. తొలిగా మూడు ఎయిర్ బ‌స్సుల‌తో శ్ర‌వ‌ణ్ త‌న శంఖ్ ఎయిర్ ని  ప్రారంభించారు. లక్నో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కనెక్ట్ చేయడం, పండుగల సమయంలో కూడా ధరలు పెరగకుండా చూసుకోవడం. త‌న ప్ర‌యారిటీస్ గా పెట్టుకుందీ సంస్థ‌.   ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి విమాన యాన సంస్థ‌లు ఎన్నో పుట‌కు రావ‌ల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంది.. కార‌ణం మొన్న‌టి ఇండిగో వ్యవ‌హారం చూస్తూనే ఉన్నాం. ఈ సంస్థ గుత్తాధిప‌త్యం కార‌ణంగా దేశ‌మే స్తంభించి పోయిన ప‌రిస్థితి  క‌నిపిస్తోంది. కాబ‌ట్టి.. యువ కేంద్ర మంత్రి తెలుగు తేజ‌మైన రామ్మోహ‌న నాయుడి అధ్వ‌ర్యంలో శ్ర‌వ‌ణ్ లాంటి మ‌రి కొంద‌రు ఈ రంగంలోకి రావాల‌ని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు శంఖ్ ఎయిర్- శ్ర‌వ‌ణ్  అంటూ ఆల్ ఓవ‌ర్ ఇండియా కూడా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతోన్న విధం క‌నిపిస్తోంది.

మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

  మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి... ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.  ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.  

సాహితీ స్కామ్ రూ.3000 కోట్ల తేల్చిన సీసీఎస్

  హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాహితీ స్కాంపై సీసీఎస్  పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ స్కాంలో మొత్తం రూ.3000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ కంపెనీ ఎండి సాహితీ లక్ష్మీనారాయణ ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను ఆకర్షించి, అతి తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సాహితీ లక్ష్మీనారాయణను పోలీసులు గుర్తించారు. ఈ సాహితీ స్కాం పై మొత్తం 13 మంది నిందితు లపై అభియోగాలు నమోదు చేశారు. సాహితీ స్కాంలో ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64 కేసులపై సీసీఎస్ ప్రత్యేక బృందం విచారణ కొనసా గిస్తోంది. ఈ స్కాంలో భాగం గా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యధికంగా మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.  ఈ ప్రాజెక్ట్ పేరుతోనే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. శర్వాణి ఎలైట్‌కు సంబం ధించిన 17 కేసులు నమోదు కాగా, ఈ 17 కేసులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించ కుండా, సాహితీ లక్ష్మీనారా యణ తన సొంత ప్రయోజ నాలకు వినియోగించినట్లు సీసీఎస్ విచారణలో వెల్లడైంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ప్రజలను నమ్మించి మోసం చేసిన విధానం పైగా పలు ఆరోపణలు ఉన్నాయి.సాహితీ స్కాంలో ఇంకా పలు కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సీసీఎస్ అధికారులు తెలిపారు. మిగిలిన కేసులపై దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.  

తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే... తెలుగు జాతికి పురోగతి : సీఎం చంద్రబాబు

  తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం తన లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలుగు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి మాతృభాషగా ఉందని, టెక్నాలజీ సహాయంతో భాషను మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఎన్టీఆర్‌ నుంచి ఆధునిక కవులు వరకు తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులను స్మరించుకున్నారు. తెలుగు భాషే మన అస్తిత్వం, ఐక్యతే మన బలం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు... ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు.  తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ... జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు  చేసిన సేవను మరిచిపోలేం.  సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం.  ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస - యాస, మన సంధులు - సమాసాలు, మన సామెతలు – పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు.  నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఆనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.  

సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి...బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

  శాసన సభలో కృష్ణా జలాల పై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారని  అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు కాపీ అందజేశారు. ఇటీవల అసెంబ్లీలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి  పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు.  అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్ పై సీఎం తప్పుదోవ పట్టించారని, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‍ సూచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కే .పీ వివేకానంద ,కోవాలక్ష్మి ,విజయుడు ,అనిల్ జాదవ్ శాసన సభ కార్యదర్శికి నోటీసులు అందజేశారు  

చైనా మాంజా విక్రయించినా...నిల్వ ఉంచినా కఠిన చర్యలు : సీపీ

  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా గాలిపటాల పండుగ ఉత్సాహం వెల్లివిరుస్తున్న వేళ, ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగం, నిల్వపై ఎలాంటి ఉపేక్ష ఉండదని నగర పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పక్షుల ప్రాణాలకు, అమాయక వాహనదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్న ప్రమాదకరమైన ఈ మాంజాను పూర్తిగా అరికట్టేందుకు నగర పోలీసు యంత్రాంగం సమాయత్త మైందని సీపీ వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కచైనీస్ మాంజా నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని జోన్లలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తం గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములు, గుట్టుగా నిల్వ చేసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే వెంటనే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయను న్నట్లు పేర్కొన్నారు.అంతే కాకుండా నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చైనీస్ మాంజా రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసుల పైనా కూడా నిఘా పెంచి నట్లు సీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఏజెన్సీ యజమానుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చైనీస్ మాంజా కేవలం మానవ ప్రాణాలకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోం దని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాంజా మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతూ భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకులు, మెటాలిక్ పదార్థాల పూత ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడం, పిల్లల వేళ్లు కోసుకుపోవడం వంటి దుర్ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు మెటాలిక్ మాంజా కారణంగా విద్యుత్ షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.  తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారా లతో చేసిన మాంజానే ఇచ్చి, సురక్షితంగా గాలిపటాలు ఎగురవేయాలని కోరారు.నగర పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిషేధిత చైనీస్ మాంజాను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచు తామని సీపీ స్పష్టం చేశారు.  

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పులు

  అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని  జేడీ వాన్స్‌ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్‌ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్‌ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. జేడీవాన్స్‌ సెలవుల అనంతరం ఆదివారమే ఆయన వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా సీక్రెట్ సర్వీస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు  

జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే?

బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఐఐబీఓఎస్) సమ్మెకు పిలుపు నిచ్చింది. ఈ సమ్మె కారణంగా జనవరి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. అదెలాగంటే.. జనవరి 24  నాలుగవ శనివారం,  , 25 ఆదివారం రావడం ఆ మరుసటి రోజు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో వరుసగా మూడు రోజలూ బ్యాంకులకుసెలవు. ఇక 27 మంగళవారం   సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు అందుబాటులో ఉండవు.   

ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్....500 కొబ్బరి చెట్లు దగ్ధం

  అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు. సమీపంలోని కొబ్బరి తోటలను మంటలు అంటుకుని...500 కొబ్బరి చేట్లు కాలిపోయినట్లు అంచన వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. చుట్టుపక్కల 5 కి.మీల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.  ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంటలను త్వరితగతిన అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా, ఉత్పత్తిని పెంచే పనుల్లో భాగంగానే ఈ లీకేజీ జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గ్యాస్‌ లీక్ ఘటనలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని  జిల్లా కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ వివరాలను తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు