లైఫ్ పార్ట్నర్ ను ఉపయోగించుకునే వాళ్లు ఎలా ఉంటారంటే..!
posted on Jan 4, 2025 @ 9:30AM
ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాముల పాత్ర చాలా ప్రత్యేకమైనది. జీవితంలో ఒక దశ వచ్చాక బయటి నుండి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు. వారితోనే ఇక జీవితం అనుకోవాల్సి ఉంటుంది. కష్టం, నష్టం, సుఖం, బాధ.. ఇలా అన్నీ వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాగడం చాలా అరుదు. ఎందుకంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలలో పెరిగిన వ్యక్తులు ఒకచోట కలసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమే.. కానీ ఇద్దరూ నిజాయితీగా ఉండే వ్యక్తులు అయితే సమస్య ఎక్కువ ఉండదు. కానీ ఒకరు కుటిల మనస్తత్వం కలిగిన వారు అయితే వారితో బంధం సాగడం కష్టమే కాదు.. అలాంటి వారు తమ భాగస్వామిని వాడుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారో.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటే..
అపరాధ భావం..
లైఫ్ పార్ట్నర్ తప్పు చేసిన భావనను వ్యక్తం చేయడం ద్వారా తన పార్ట్నర్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే.. తన అవసరాలను, తన సంతోషానికి తగిన విధంగానూ తన పార్ట్నర్ లేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. దీనికి తగిన కారణాలను కూడా వ్యక్తం చేస్తారు. దీంతో పార్ట్నర్ కోసం మారిపోయే అమాయకులు ఉంటారు. ఇలా మారిపోగానే తమ అవసరాల కోసం వాడేసుకుంటూ ఉంటారు.
ఎమోషనల్ బ్లాక్మెయిల్..
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చాలా దారుణమైన చర్య. ఇది మనిషిని నేరుగా ఏమీ అనకుండా తమకు నచ్చినట్టు మార్చుకునే మార్గం. తన భాగస్వామిని తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వారు చెప్పిన మాట వినకపోతే కోపంగా ఉండటం, విచారంగా ఉండటం, అదే పనిగా బాధపడటం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వారికోసం మారిపోతారని వారికి తెలుసు.
అబద్దాలు..
అబద్దాలు జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం. ఇవి చాలా సహాయపడతాయి. జీవితాలను నిలబెడతాయి. కొన్ని పనులను సులభతరం చేస్తాయి. ఎదుటివారికి నష్టం జరగనంతవరకు అబద్దం చెప్పడం తప్పేమీ కాదు.. కానీ భాగస్వామి అబద్దాలు చెప్పడం ద్వారా తన పార్ట్నర్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారు. తప్పు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా తప్పు దారిలో పార్ట్నర్ ను తీసుకెళతారు. దీనివల్ల వారు లాభపడి, పార్ట్నర్ ను వాడుకుంటారు.
గ్యాస్ లైటింగ్..
గ్యాస్ లైటింగ్ చాలామందికి తెలియదు కానీ.. ఇది మనిషిని మానసికంగా గందరగోళానికి గురి చేసే చర్య. ఏదైనా మర్చిపోయినట్టు, ఏదైనా గుర్తులేనట్టు, మతి భ్రమించిందని నమ్మించేట్టు, జ్ఞాపకశక్తి క్షీణించిందని చెప్పడం, పిచ్చి పట్టిందని నమ్మేలా చేయడం.. అబద్దాలు చెబుతున్నారని నిందలు వేయడం, అనుమానించడం, మనుషులలో కలవనీయకుండా ఒంటరిగా ఉంచడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం చేయడం.. ఇలాంటివి చేసి మనిషిని మానసికంగా ఆలోచలు లేకుండా, వారు ఎప్పుడూ ఇతరుల ముందు మాట్లాడకుండా చేస్తారు. ఇలాంటివి చేసే వారు తమ భాగస్వామిని చాలా దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు.
*రూపశ్రీ.