తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్!

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కేటీఆర్ సుప్రీం కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని  కేటీఆర్   ఈ పిటిషన్ దాఖలు చేశారు.  కాగా ఫిర్యాయింపు ఎమ్మెల్యేల విచారణకు తమకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.   కాగా  తమ  పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరుతూ..  కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు కోరారు.చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.  తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ గవాయ్... తాను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాననీ,  ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు  అని వ్యాఖ్యానించారు. వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్‌  విచారణను వచ్చే సోమవారం చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కడపలో విద్యార్థిని ఆత్మహత్య...స్కూల్ వద్ద ఉద్రిక్తత

  కడప జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జస్వంతి హాస్టల్లో ఈ రోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పకుండా రిమ్స్‌కు తరలించారు. దీంతో  జస్వంతి తల్లిదండ్రులు  హాస్పిటల్ కి చేరుకున్నారు. తల్లిదండ్రులకు  పల్స్ లేదని డాక్టర్స్ చెప్పడంతో మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనపడంతో అనుమానస్పదంగా ఉందని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా బాత్రూమ్ లో ఉరి వేసుకుందని చెప్పున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వారే మా పిల్లని హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని  రిమ్స్ మార్చురీకి  తరలించడం జరిగింది .అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు బంధువులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయం స్కూల్ యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చిందని. అయితే విషయం  దాచిపెట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నామని తెలపారని వారు వెల్లడించారు.  

ఆ అధికారులపై కేసు.. వివేకా హత్య కేసులో డాక్టర్ సునీతకు నైతిక విజయం.. భారీ ఊరట!

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి డాక్టర్   సునీతకు ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది.  2019లో తన తండ్రి దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటూ చేస్తున్న న్యాయపోరాటంలో డాక్టర్ సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో  న్యాయం కోసం అవిశ్రా పోరాటం సాగించారు. సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సోదరుడు జగన్  ఉన్న సమయంలోనే ఆమెకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో  పోలీసులు ఆమె, ఆమె భర్తపై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  విచారణలంటూ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సునీత, ఆమె భర్తపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులంటూ కొట్టివేసింది. అంతే కాదు.. ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అప్పట్లో సునీతపై, ఆమె భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులు ఎవరంటే.. అప్పటి  ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి.  ఆ ఇద్దరూ కూడా ప్రస్తుతం పదవీవరమణ చేశారు. అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిరువురిపై శాఖాపరమైన విచారణకు నిర్ణయించిందని చెబుతున్నారు.  ఆ ఇరువురిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకూ  వారి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ఆ తప్పుడు కేసుల నమోదుకు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన వారిని సౌతం గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.    ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు నామోదైంది. లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి సునీత, ఆమె భర్తపై అక్రమ కేసులు నమోదు చేయడం, వేధించడంలో కీలక పాత్ర పోషించిన  అప్పటి ఎఎస్పీ రామకృష్ణారెడ్డి, ఏఎష్పీ రాజేశ్వరరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుపై వారిరువురిపై కేసు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సంవత్సరాల పోరాటం తరువాత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు ప్రస్తుత పరిణామం నైతిక విజయంగా పరిశీలకులు ఆవిర్భవిస్తున్నారు. నాడు తప్పుడు కేసులతో తనను వేధించిన అధికారులే ఇప్పుడు నిందితులుగా బోనెక్కాల్సిరాడమంటే ఇది క చ్చితంగా వివేకా హత్య కేసులో న్యాయం దిశగా పడిన కీలక అడుగుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

  భారత్ మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రిగా సోమవారం  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదలు తెలిపారు.  ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.

మాయ‌మై పోయిండ‌మ్మా అందెశ్రీ అన్న‌వాడూ!

అందెశ్రీ  ఈ పేరు వింటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది.. ప‌ల్లె పాట‌. జ‌నం మాట‌. జాన‌ప‌దులు పాడుకునే  ఆట పాట‌. ఎలాంటి  చ‌దువు చ‌ద‌వు లేకుండానే..  మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు అంటూ ఆయ‌న రాసిన పాట ఏకంగా ఒక పాఠ్యపుస్త‌కంలో సిల‌బ‌స్ గా మారిన ఘ‌న‌త చ‌రిత సొంతం చేసుకుందంటే ప‌రిస్థితి  ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ఇక జ‌య‌జ‌య‌హే  తెలంగాణ అనే రాష్ట్ర గీతం గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇదిప్పుడు ప్ర‌తి  బ‌డిలో పాడుకునే పాట‌గా ప్ర‌తి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి పాడుకోవ‌ల్సిన బాట‌గా మారింది.  వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం దగ్గ‌ర్లోని రేబ‌ర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న  జ‌న్మించారు అందె శ్రీ. ఈయ‌న అస‌లు పేరు అందె ఎల్లయ్య‌. అనాథ‌గా  పెరిగిన ఎల్ల‌య్య తొలినాళ్ల‌లో ప‌శువుల‌ కాప‌రిగా  ప‌ని చేసేవారు. ఆయ‌న ప్ర‌కృతిలోని ఎన్నో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల‌కు ప్రేర‌ణ చెంది పాట‌లు రాసేవారు. అది కూడా  రాయ‌డం తెలీకుండానే ఆశువుగా చెప్పిన  క‌విత్వం పాట‌మ్మ‌గా మారి  అది ప‌ల్లె ప‌ల్లెనా  ప‌ర‌వ‌ళ్లు తొక్కి.. జ‌నం గుండెల‌ను తాకేది. అలా అలా ఇంటిపేరు అందె కి శ్రీ  క‌లుపుకుని అందెశ్రీగా ప్రాచుర్యం పొందారు ఎల్ల‌య్య‌. ఎక్క‌డ ప‌శువుల‌  కాప‌రి ఉద్యోగం? ఎక్క‌డ  ప్ర‌కృతికి ప‌ర‌వ‌శించి పాడిన పాట? ఆపై అది  పాఠ్య‌పుస్త‌కాల‌కు ఎక్క‌డం ఏమిటీ?  కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం నుంచి డాక్ట‌రేట్ అయితేనేమి ఇంకా ఎన్నో ప్ర‌సిద్ధ పుర‌స్కారాల వ‌ర‌కూ సాగిన ఈ పాటల‌ ప్ర‌యాణం తెలంగాణ సాహిత్యంలోనే ఒక ప్ర‌త్యేక అధ్యాయం.   జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ మాతృగీతం రాయ‌డంతో పాటు అందెశ్రీ.. రాసిన గీతాలేంటో చూస్తే.. పల్లెనీకు వందనములమ్మో,మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జన జాతరలో మన గీతం యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని వంటి ఎన్నో పాట‌లు రాశారు.  ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గంగ‌, బ‌తుక‌మ్మ‌, ఆవారాగాడు అంటూ ప‌లు చిత్రాల‌కు గేయ ర‌చ‌న చేశారు అందెశ్రీ. గంగ చిత్రానికి గానూ నంది అవార్డు అందుకోగా, బ‌తుక‌మ్మ చిత్రానికి సంభాష‌ణ‌లు కూడా అందించారు అందెశ్రీ.  2014లో తెలంగాణ ప్ర‌భుత్వం అందెశ్రీ పేరు ప‌ద్మ‌శ్రీకి ప్ర‌తిపాదించింది. అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదులు దక్కాయి. 2015లో వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం ఇచ్చి స‌త్క‌రించారు. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం సైతం ల‌భించింది.   మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీల‌క పాత్ర పోషించారు అందెశ్రీ. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందెశ్రీ.ఇక‌ సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారంతో పాటు అందెశ్రీని లోక్ నాయక్ పురస్కారం సైతం వరించింది. ఇటీవ‌ల సీఎం రేవంత్ చేతుల మీదుగా కోటి రూపాయ‌ల న‌గ‌దు పుర‌స్కారం సైతం పొందారు అందెశ్రీ. ఇలా చెప్పుకుంటూ  పోతే  మ‌ట్టిలో పుట్టిన ఈ తేనె తుట్టెలాంటి పాట అంత‌ర్జాతీయంగాను విస్త‌రించి అక్క‌డా గుర్తింపు పొంది ఎన్నో అవార్డులూ రివార్డుల‌ను పొందింది.  అందెశ్రీ 2025 నవంబర్ 10న అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఇది ప‌ల్ల‌పాటకు విషాద‌క‌ర‌మైన రోజు. చ‌దువుల‌మ్మ త‌ల్లి చింతించాల్సిన రోజు. తెలంగాణ మ‌ట్టిలో మాణిక్యం దిగ‌ంతాల‌కు ఏగిన రోజు. ఓ పాట కాలం మ‌నిషీ, ఆ పాట మ‌ధురాల‌ను మ‌న‌కు అందించిన‌ మ‌నిషీ.. ఇలా దివికేగ‌డంతో తెలంగాణ సాహిత్యం శోక‌సంద్రంలో మునిగిపోయిన రోజుకూడా  ఇదే.   పాట‌ల్లో ఎన్నో తంగేడు పూల‌ను, పాల‌పిట్ల కేరింత‌ల‌ను పూన్చిన ఓ మ‌నిషీ.. నువ్విలా అర్ధంత‌రంగా వెళ్లిపోయి నీలోని మాన‌వ‌త్వాన్ని మాయం చేశావా! అంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు సాహితీ అభిమానులు.

ఉగ్రకుట్ర భగ్నం.. గుజరాత్ లో ముగ్గురు అరెస్టు

అరెస్టైన వారిలో హైదరాబా డాక్టర్ మరో ఘటనలో హరియానా డాక్టర్ నివాసంలో భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం  భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్రం చేశారు.  ఈ సందర్భంగా  ఐఎస్ఐఎస్  తో సంబంధాలు ఉన్న  ముగ్గురిని అహ్మదాబాద్ లో ఆదివారం (నవంబర్ 9) అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల కథనం  అరెస్టు అయిన వారిపై  గత ఏడాదిగా నిఘా పెట్టారు. ఇప్పుడు వారు పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా  అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు మార్పిడి చేసుకోవడానికి గుజరాత్ కు వచ్చారనీ, అలాగే దేశవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లో ఉగ్రదా డులు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారనీ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఉండటం హైదరాబాద్ లో కలకలం రేపింది. హైదరా బాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌  ఫ్రాన్స్‌లోఎంబీబీఎస్  పూర్తి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వైద్యుడైన  తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. సైనైడ్ ను తలదన్నేలాంటి  అత్యంత ప్రమాదకరమైన  రైసిన్  అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది.  మొహియుద్దీన్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్‌లు దిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ పేర్కొంది. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో నివసించే డాక్టర్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే ఆముదం గింజల వ్యర్థాల నుంచి రైసిన్ తయారుచేసినట్లు పోలీసులు గుర్తించారు.  గుజరాత్ లో మొహియుద్దీన్ అరెస్ట్‌తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు   అతడి నివాసంలో తనిఖీలు చేపట్టారు. నగరంలో మొహియుద్దీన్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.  ఇదిలా ఉండగా మరో ఉగ్రకుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి.  ఇంటిలిజెన్స్ బ్యూరో, జమ్ముూకశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 కేజీల ఆర్డీఎక్స్,  ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం, జమ్ముకశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా   భద్రతా సంస్థలు ఈ దాడులు నిర్వహించాయి.  నవంబర్ 6న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కి మద్దతుగా పోస్టర్లు అతికించారనే ఆరోపణలతో డాక్టర్ ఆదిల్ రాథర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు అతడి  నివాసంలోనే భారీ ఎత్తున ఆర్డీఎక్స్ అలాగే  ఏకే 47  లభ్యమయ్యాయి. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతాబలగాల సమాచారం.  

యాదాద్రికి పోటెత్తిన్న భక్తులు.. ఒక్క రోజే రూ. కోటికి పైగా ఆదాయం

కార్తీకమాసం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసంలో  యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రిలో ఆదివారం (నవబర్ 9) ఒక్క రోజు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు రెండు వేల సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ  మొత్తం 1968 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.  వీటిలో యాదగిరి గుట్టలో 1758, పాతగుట్టలో 200 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు వివరించారు. అలాగే ఆదివారం ఒక్కరోజే యాదగిరి గుట్టకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 27లక్షల 43 వేల 220 రూపాయలు, వ్రతాల ద్వారా 19 లక్షల 58 వేల రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 16.96 లక్షల రూపాయలు, కొండపైకి వాహనాల ప్రవేశాల ద్వారా 9 లక్షల 17 వేల రూపాయలు, ఇతరత్రా మరో 8 లక్షల 16వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  

తిరుమలలో తిరుమల శాటిలైట్ కిచెన్ కు వంద కోట్ల విరాళం

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ  తిరుమల అన్న ప్రసాదం ట్రస్ట్ కు వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తిరమలలో నిత్యం దాదాపు రెండు లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాలు తయారు చేయడానికి వీలుగా కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణం కోసం ఆయన ఈ విరాళం ప్రకటించారు. ఈ శాటిలైట్ కిచెన్ ను తాను అన్నదానం ట్రస్ట్ కు అంకితం చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేస్ అంబానీ ఆదివారం (నవంబర్ 9) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనీ విరాళం ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని పేర్కొన్నారు.   ఆ తరువాత ఆయన రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయాన్ని కూడా ఆదివారం (నవంబర్ 9) సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ భక్తుల కోసం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం తొలి విడతగా 15 కోట్ల రూపాయలు అందజేశారు.   అలాగే అదే రోజు ఆయన కేరళలోని గురవాయూర్ కృష్ణ దేవాలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురవాయూర్ లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రికి 16 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన 15 కోట్ల రూపాయల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.  

తుపాకి పట్టి కాల్పులు జరిపిన పవనకల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తుపాకి చేతపట్టి కాల్పులు జరిపారు. ఔను నిజమే.. పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. ఫైరింగ్ విధి విధానాలు, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను అత్యంత ఆసక్తిగా విన్నారు. ఆ తరువాత ఆయన తుపాకి పట్టి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత తుపాకి గ్లాక్ 0.45ను ఉపయోగించారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఫైరింగ్ చేస్తున్న పిక్చర్ ను కూడా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   తాను చెన్నైలో ఉన్న సమయంలో  మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో సభ్యుడినని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పాతరోజులన్నీ గుర్తుకు వచ్చాయంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించడం, ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు 'బుల్స్ ఐ'కి అత్యంత సమీపంలో  తాకాయి. 

జూబ్లీ బైపోల్.. అమలులోకి 144 సెక్షన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రచారం ఆదివారం (నవంబర్ 9)తో ముగిసిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు అధికారులు పూర్తిగా లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించారు. ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నుంచీ.. మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం  వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు మూసి ఉంటాయని తెలిపారు.  ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే  జూబ్లీహిల్స్ నియోజకవర్గంవ నియోజకవర్గ పరిధిలో 144వ సెక్షన్ విధించారు.  దీని ప్రకారం  ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడంపై నిషేధం ఉంటుంది.  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హైచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ క్యాండిడేట్ గా లంకల దీపక్ రెడ్డి పోటీలో  ఉణ్న సంగతి తెలిసిందే.  గ్రేటర్ పరిధిలో  సత్తా చాటాలనీ కాంగ్రెస్, చాటుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకుని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ, రాష్ట్రంలో మరింత బలోపేతం కావడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 

టారిఫ్ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ కూ రెండు వేల డాలర్లు!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అస్తవ్యస్థ, హేతురహిత టారిఫ్ వార్ ను సమర్ధించుకున్నారు. తన టారిఫ్ విధానం కారణంగా వస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే  ప్రతి అమెరికన్‌కు కనీసం 2వేల డాల‌ర్ల‌ చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటన ఇచ్చారు.  ఈ పంపిణీ పరిధిలోకి అధిక ఆదాయం ఉన్న సంపన్నులు రారని పేర్కొన్నారు.  ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.  తన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. అమెరికా టారిఫ్ లను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అభివర్ణించారు.  తన హయాంలోనే  అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని చెప్పుకుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదనీ, స్టాక్ మార్కెట్లలో రికార్డ్ స్థాయి టేడింగ్ జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.  తాను అనుసరిస్తున్న టారిఫ్ విధానం కారణంగా దేశానికి ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన ఈ నిధులతో  జాతీయ రుణాన్ని తగ్గిండమే కాకుండా, ప్రజలకు డివిడెండ్ రూపంలో నగదు అందిస్తానని పేర్కొన్నారు.  అయితే ఈ డివిడెండ్ ను ప్రజలకు ఎలా, ఎప్పటి నంచి పంపిణీ చేస్తారన్న విషయం మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.   మరోవైపు దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ న్యాయపరమైన సవాళ్లను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌లే తన బలమైన ఆర్థిక ఆయుధమని, ఈ విధానం అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా, స్వతంత్రంగా మార్చిందని ఆయన పునరుద్ఘాటించారు.

నేలకూలిన తెలంగాణ సాహితీ శిఖరం

ప్రముఖ  కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ   సోమవారం (నవంబర్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (నవబర్ 10) తెల్లవారు జామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో  కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన  ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.   జనగాం సమీపంలోని రేబర్తి   గ్రామంలో 1961, జులై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్రగీతగా ప్రకటించింది.  తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్రపోషించిన అందెశ్రీని రేవంత్ సర్కార్ ఈ ఏడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్కరించి రూ. కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది.  ఇక ఆయన పలు సినీ గేయాలు కూడా రాశారు. ముఖ్యంగా నారాయణ మూర్తి నటించి, నిర్మించిన పలు సినీమాలకు అందెశ్రీ పాటలు రాశారు.   మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి అద్భుత గీతాలు అందెశ్రీ కలం నుంచి జాలువారినవే. అందెశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారాలను అందెశ్రీ అందుకున్నారు. ఇక 2022 లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది.   అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచిందన్న ఆయన అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. 

అంబటినోట టీటీడీపై ప్రశంసలు.. అన్నప్రసాదం అద్భుతం అంటూ పొగడ్తలు

తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత విషయంలో వైసీపీ హార్డ్ కోర్ నేతలు కూడా ప్రశంసించక తప్పడం లేదు. ప్రత్యర్థుల ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎత్తి చూపడానికీ, వంక పెట్టడానికి ఇసుమంతైనా అవకాశం లేకుండా.. తెగడ్తలు గుప్పిద్దామన్నా నోటినుంచే పొగడ్తలు వచ్చేలా అన్న ప్రసాదం నాణ్యత, రుచి, శుభ్రత ఉంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనమే..నిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, అన్న ప్రాసాదం క్యాంటిన్ లో శుచి, శుభ్రతల గురించి మైమరిచి మరీ పొగడ్తల వర్షం కురిపించారు.  వైసీపీ హయాంలో అన్న ప్రసాదం ఒక్కటే కాదు, చివరాఖరికిరి తరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉందన్న ఆరోపణలు భక్తుల నుంచే వచ్చాయి. అవేమీ రాజకీయ ఆరోపణలకు కావని లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కూడా. వైసీపీ హయాంలో అసలు తిరపతిలో భక్తుల సౌకర్యాలను గురించి పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ, తిరుమల కొండపై పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాల కల్పన ఉందన్న ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నడుస్తున్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.   ఆ క్యాంటిన్ ను నిర్వహిస్తున్న తీరు, అక్కడి శుచి, శుభ్రత, అన్నప్రసాదం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా.. తాను కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో  భోజనం చేస్తున్న వీడియోను  షేర్ చేశారు.  ఆహారం నాణ్యత, నిర్వహణ, పారిశుధ్యం, భక్తులకు అన్నప్రసాదం వడ్డన ఇలా అన్నీ ఏగ్రేడ్ లో ఉన్నాయంటూ ప్రశంసించారు.  ఇదే ప్రశంస వేరే ఎవరినుంచైనా వచ్చి ఉంటే.. వైసీపీ.. రాజకీయం చేసి ఉండేది. ఎల్లో మీడియా ప్రచారం అంటూ ఊరూవాడా ఏకం చేసేసేది.  కానీ ఇక్కడ ఈ పొగడ్తలు వైసీపీ సీనియర్ నాయకుడు, కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు నుంచి వచ్చాయి.   దీంతో వైసీపీకి గొంతులో పచ్చవెలగకాయ పడినట్లు అయ్యింది.  ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీయులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై వారు టీటీడీపై విమర్శ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించకతప్పని పరిస్థితిని అంబటి రాంబాబు పొగత్తలు కల్పించాయి.  

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతలు సైలెంట్ అయ్యాయి. మరోవైపు బీహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు  ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు. పారా మిలిటరీ బలగాలు.. ‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి ఎన్‌సీసీ వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తుమని తెలిపారు 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 103 మంది ఓటింగ్ పూర్తిందని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నెల 11న పోలింగ్.. 14న కౌంటింగ్, ఫలితాల వెల్లడి తాయని తెలిపారు  

మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ...తల్లి సంచలన వ్యాఖ్యలు

  దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది జూన్ 6, 8 మిస్టరీగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణవార్త బయటపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ‘గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తమకు కనీసం సమాచరం ఇవ్వలేదని ఆమె అన్నారు.  తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిషిర సూచన మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు.  అయితే,   కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్‌ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కిడ్నీ మార్పిడి తర్వాత డాక్టర్లు సరైన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్‌లో జాప్యం చేశారని మహానంద కుమారి ఆరోపించారు. అంతేకాకుండా గోపీనాథ్‌కు కేటాయించిన గన్‌మెన్‌లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన కోడలు సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. గోపీనాథ్‌ 3 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి తల్లిగా సమయం ఇవ్వలేదన్నారు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది.  లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్‌తో సునీత వివాహం చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో మా పేరు లేదు. కేటీఆర్‌ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చామని తెలిపారు.

కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

  చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులు తీసుకోచ్చినట్టు ఆయన తెలిపారు. ఇళ్లు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో వివరించారు. గజరాజులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా పవన్.. వాటి విన్యాసాలను తిలకించి ఆహారం తినిపించారు.  అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు., కుంకీ ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు. 

ఓటర్ కార్డులో సునీత భర్త పేరు వేరే ఉంది...బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

  బీజేపీ అంటేనే హిందువు... హిందువు అంటేనే బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పాదయాత్ర చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మ మాట్లాడుతున్నారంటే ఏమనాలి అని  బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.  అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది.... అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్ అని కేంద్ర మంత్రి విమర్శించారు. 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారు. 7సార్లు జైలుకు పోయి వచ్చిన... నీకు నాతో పోలికా? అని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు...అదేనెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిగో ఆధారాలు... కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంజయ్ తెలిపారు.  గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవని ప్రశ్నించారు కేంద్రమంత్రి. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని తెలిపారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందని ఆయన తెలిపారు. విచారణలో ఆమె తప్పుడు  సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిందని బండి సంజయ్ అన్నారు. ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని..ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని సంజయ్ ఆరోపించారు. ఇదిగో ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా...విచారణ జరపించాలని రేవంత్ రెడ్డికి సవాల్  విసిరారు.  2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీతకు చదువుకోలేదని రాసిచ్చారని..2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారని ఆయన తెలిపారు వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారని ఆయన అన్నారు.  గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు...గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. గోపీనాథ్ సుప్తచేతనావస్థలో ఏఐజీ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని రానీయ్యలే....కానీ అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదాని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి ఓటేసి దీపక్ రెడ్డిని గెలిపిస్తే...కేంద్రంతో మాట్లాడి జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాని బండి సంజయ్ తెలిపారు.  

కూలీగా మారి పార పట్టిన మంత్రి నిమ్మల

  ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భవన నిర్మాణ కూలీగా మారి శ్రమదానం చేశారు. పాలకొల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా మంత్రి నిమ్మల లేబర్ మారి కార్మికులతో కలిసి మంత్రి సైతం కంకర, ఇసుక, సిమెంట్‌ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్‌లో వేశారు.  మంత్రి తమతో కలిసి పనిచేయడం చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ నిర్మాణం జరిగిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంట్ పని నోచుకోలేదని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.3 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.