పొలాల్లో నాటుకోళ్లు వదిలి వెళ్ళిన దుండగులు.. ఎగబడ్డ జనం

  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి  సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపోవడంతో అక్కడి ప్రజలు కోళ్ల కోసం ఎగబడ్డారు. రోడ్డంతా కోళ్లతో నిండిపోవడంతో ఆసక్తిగా వాటిని పట్టుకునే హడావుడి సాగింది.  డీసీఎం వ్యాన్‌లో వచ్చిన దుండగులు ఎలుకతుర్తి మండలం మోడల్ స్కూల్ వద్ద  పొలాల్లో వదిలారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతుండగా, అధికారులు వెంటనే స్పందించారు. నాటు కోళ్లను పట్టుకున్న వారు అవి తినకూడదని హెచ్చరించారు. ఆ కోళ్లను పరీక్ష నిమిత్తం వరంగల్‌కు పంపించాలని సూచించారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ఎవరు తినకూడదని సోషల్ మీడియా ద్వారా అధికారుల విజ్ఞప్తి చేశారు.  

ఒలంపిక్స్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ లేనట్లే!

  అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే, 2028 ఒలింపిక్స్‌లో మాత్రం దాయాదుల పోరు జరిగే అవకాశాలు కన్పించట్లేదు. ఐసీసీ రూపొందించిన కొత్త రూల్స్‌తో భారత్‌-పాక్‌ మ్యాచ్‌జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా చేర్చిన సంగతి తెలిసిందే.  2028లో లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని నిబంధనలు రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా, ఓషియానియా, యూరప్‌, ఆఫ్రికా రీజినల్స్‌లో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది.  ఇక ఆతిథ్య దేశానికి చోటు దక్కనుంది. ఆరో జట్టును క్వాలిఫయర్‌ రౌండ్‌ ఏర్పాటుచేసి నిర్ణయిస్తారు. ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్‌, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్‌ నుంచి ఇంగ్లాండ్‌ జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టును ఎంపిక చేయనున్నారు.  ఇక, ఆరో స్థానం కోసం క్వాలిఫయర్‌ పోటీలపై త్వరలోనే ఐసీసీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌ గ్లోబల్‌ ఈవెంట్‌ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు ఒక్కో రీజియన్‌ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్‌ రౌండ్‌ నిర్వహించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్‌ ప్రకారం పాక్‌కు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  అదే జరిగితే ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఉండకపోవచ్చంటున్నారు.128 ఏళ్ల తర్వాత 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌కు చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి, చివరిసారిగా 1900 సంవత్సరంలో క్రికెట్‌ నిర్వహించారు. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రిటన్‌ విజేతగా నిలిచింది.  

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ ఆంక్షలు జారీ

  జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 9  సాయంత్రం 6 గంటల నుంచి   11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు ఉంటాయిని నోటిఫికేషన్ విడుదల చేశారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు..  ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజవర్గంలో పరిధిలోని మద్యం దుకాణాలు , రెస్టారెంట్‍లు, క్లబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలో ఎవ్వరూ బాణాసంచా పేల్చొద్దని  సీపీ వీసీ సజ్జనార్ సూచించారు.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం...ఆ ఇద్దరిపై కేసు

  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారు.  పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. .వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్‌ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు పోలీస్ అధికారులు కారకులు. అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్‌లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.  

నో డౌట్.. తెలంగాణలో కింగ్ మేకర్ టీడీపీయే!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప  ఎన్నిక రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేంటి.. జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేదుగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం ఎంత ప్రబలంగా ప్రభావం చూపుతుందన్న విషయం తేటతెల్లమౌతూ వస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండా పట్టని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే  ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్ర పురోభివృద్ధిని చూసిన జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కే ఓటేస్తారన్న ధీమాను కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు.  అయితే దీనిపై రేవంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నందుకు తెలుగుదేశం మద్దతు దారులు బీఆర్ఎస్ కు ఓటేస్తారా? లేక బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడానికి ప్రయత్నించినందుకు ఓటేస్తారా? అంటూ నిలదీశారు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ తెలుగుదేశం జపంతో జూబ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి ఈ రోజుకూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు, ప్రాబల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమికబుల్ గాజూబ్లీ ఉప ఎన్నికలో పార్టీని పోటీకి దూరంగా ఉంచి ఉండొచ్చు కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కూడా పోటాపోటీగా తెలుగుదేశం మద్దతుదారుల సపోర్ట్ కోసం పోటీపడుతున్న తీరు గమనించిన ఎవరికైనా తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం, పట్టు ఎంత బలంగా ఉన్నాయో అవగతమౌతుంది.  

48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

  పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 48 మంది శాసన సభ్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం తెలిపారు.  నోటీసులు తీసుకున్న  శాసన సభ్యులకు వివరణ తర్వాత చర్యలకు వెనకాడబోమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని తెలిపారు. ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తెలిపారు. విశాఖలో ఈ నెల 14,15 సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడుపులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి  తెలిపారు. హైదరాబాద్‌ స్థాయిలో భారీ ఈవెంట్లు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈవెంట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తోందని, ఇటీవల జరిగిన తమన్‌ మ్యూజికల్‌ నైట్‌, విజయవాడ ఉత్సవ్‌, ఇళయరాజా మ్యూజికల్‌ నైట్‌ వంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఓవైపు ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఏపీ వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని సీఎం చెప్పారు.  నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని అభివర్ణించారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీలు నెలాఖరులోగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపారు. పార్లమెంటు కమిటీల ఏర్పాటుపైనా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  

మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

  తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను అధికారులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక అధికారులతో కలిసి పవన్ మొక్కలు నాటారు.  అడవిలో నాలుగు కిలోమీటర్లు  డిప్యూటీ సీఎం పవన్  ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు.   

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ పాత్ర కీల‌కం : సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్

  శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిరక్ష‌ణ‌లో ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ విభాగ సిబ్బంది పాత్ర కీల‌క‌మ‌ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ అన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. హైద‌రాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో శ‌నివారం జ‌రిగిన సెరిమొనియల్ ప‌రేడ్‌లో హైద‌రాబాద్ సీపీ  పాల్గొన్నారు. సిబ్బంది నుంచి ఆయ‌న గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.  ఈ సంద‌ర్భంగా సీపీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్రగల సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ విభాగానికి మంచి పేరు ఉందని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇత‌ర ఉద్యోగాల‌తో పోలిస్తే పోలీస్ ఉద్యోగం చాలా భిన్నంగా ఉంటుంద‌న్నారు. కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ఆరోగ్య ప‌రిరక్ష‌ణపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. చెడు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాలని, ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలన్నారు.  ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా నైపుణ్యాన్ని నేర్చుకోవాల‌ని, వృత్తి రీత్యా పోలీస్ శాఖ‌లో వ‌స్తోన్న నూత‌న పోక‌డ‌ల‌ను అందిపుచ్చుకోవాల‌న్నారు. కాగా, ఏఆర్ కు చెందిన 1044 మంది ఈ పరేడ్ ని నిర్వహించారు. అందులో సిటీ సెక్యూరిటీ గార్డు, స్వాఫ్ట్, క్వీక్ రియాక్షన్ టీమ్, సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  ప‌రేడ్ అనంత‌రం ఏఆర్ సిబ్బందితో నేరుగా సీపీ  మాట్లాడారు. ప‌నితీరుతో పాటు క్షేత్ర‌స్థాయిలో త‌లెత్త‌తున్న ఇబ్బందులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకురాగా, వాటిని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కరించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.  తర్వాత సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణాన్ని సందర్శించారు. క్రెచ్, ఆర్మ్స్ అండ్ అమ్మునిషన్ స్టోర్ రూమ్, ఆర్మ్స్ వర్క్ షాప్, బ్యారక్స్ వంటి అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంత‌రం హెడ్ క్వార్ట‌ర్స్‌లోని అధికారుల‌తో సమీక్షా స‌మావేశం నిర్వ‌హించి.. మెరుగైన పోలీసింగ్ కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి , అదనపు డీసీపీలు ఎన్. భాస్కర్, బి. కిష్టయ్య , టి. కరుణాకర్ , డి. సంజీవ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులకు అమెరికా వీసా లేదు..ఇదెక్క‌డి ట్రంప‌రిత‌నం దేవుడా!

  ఇది స‌మంజ‌స‌మేనా? షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు, ఊబ‌కాయులు ఎక్క‌డ లేరు? అమెరికా నిండా ఊబ‌కాయులే ద‌ర్శ‌న‌మిస్తారు మ‌న‌కు. అంత‌గా అమెరికా త‌గిన ప‌ని పాట లేక ఊబ‌కాయుల‌తో నిండి పోయింద‌ని చెబుతాయి అక్క‌డి జ‌న జీవ‌న  దృశ్యాలు.  హైద‌రాబాద్ కి డ‌యాబిటిస్ క్యాపిట‌ల్ గా పేరుంది. అలాగ‌ని హైద‌రాబాద్ గ్రోత్ ఎక్క‌డైనా ఆగిపోయిందా? హైద‌రాబాద్ లో షుగ‌ర్ ఉన్న వాళ్లెవ‌రూ ప‌ని చేయ‌డం  లేదా? ఇక్క‌డెవ‌రికీ ఉద్యోగాలు రావ‌డం లేదా? ఆయా యాజ‌మాన్యాలు వీరికి జాబ్స్ ఇవ్వ‌డం లేదా?  షుగ‌ర్ అన్న‌ది లైఫ్ స్టైల్లో ఒక భాగం. ఫుడ్ క‌ల్చ‌ర్ ద్వారా వ‌స్తుంది. ప‌ని ఒత్తిడిలో ఆహారం ఆల‌స్యంగా తీస్కున్నా, జంక్ ఫుడ్ అధికంగా తీస్కున్నా.. ఊబ‌కాయంతో పాటు షుగ‌ర్ కూడా వ‌స్తుంది. దానికి తోడు ఇప్పుడు ఇండియాలో కూడా ఫుడ్ అవేర్నెస్ బాగా పెరిగింది. ఆపై మిల్లెట్ ఫుడ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. దీంతో ఊబ‌కాయం, దాని ద్వారా వ‌చ్చే షుగ‌ర్ కంట్రోల్ చేసుకునే య‌త్నం ఒక య‌జ్ఞంలా సాగుతోంది.  దొరికిందే సందుగా భావించి ఇలా ప్ర‌తి చిన్న విష‌యాల‌కూ వీసాలు ఇవ్వ‌న‌ని  మారం చేయ‌డం అన్న‌ది అమెరికాకే అత్యంత ప్ర‌మాద‌క‌రం. కార‌ణ‌మేంటంటే, అమెరికాలో ప‌ని చేయ‌గ‌లిగిన వ‌య‌సుగ‌ల వారి శాతం బాగా తక్కువ‌. దానికి తోడు ట్రంప్ తుగ్ల‌క్ చ‌ర్య‌ల కార‌ణంగా.. 1960ల కాలం త‌ర్వాత వ‌ల‌స బాగా త‌గ్గింద‌ని చెబుతున్నాయి అక్క‌డి గ‌ణాంకాలు. ఈ క్ర‌మంలో ఇలాంటి పిచ్చి చేష్ట‌ల వ‌ల్ల‌.. మ‌రింత వ‌ల‌స త‌గ్గే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. దీని ద్వారా అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ మ‌రింత కుంటు ప‌డే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.  ఇప్ప‌టికే  హెచ్ 1 బీ వీసా మీద ల‌క్ష డాల‌ర్ల ఫీజు అంటూ దాడి  చేసి ఆ త‌ర్వాత దాన్ని స‌వ‌రించారు.. ఇప్పుడు చూస్తే బీపీ, షుగ‌ర్, ఒబేసిటీ ఉన్న వారికి కూడా వీసా ఇవ్వ‌మ‌ని అంటే న‌ష్టం వారికి కాదు అమెరికాకే ఎక్కువ క‌లుగుతుంద‌న్న మాట వినిపిస్తోంది. షుగ‌ర్ ఏమంత చెడ్డ రోగం కాదు. దాని ద్వారా ఇక్క‌డెవ‌రూ ప్రాణాలు కోల్పోవ‌డం లేదు. అందుకంటూ కూడా కొత్త మందులు వ‌చ్చేశాయ్ కూడా. కాబ‌ట్టి షుగ‌ర్ ఈజ్ నాటే డేంజ‌ర‌స్ డిసీజ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవ‌ర్ లైఫ్ స్టైల్ క‌మ్ ఫుడ్ హ్యాబిట్స్. వీటిపై దృష్టి సారిస్తే చాలు మొత్తం దానిక‌దే స‌ర్దుకుంటుంది.

షుగ‌ర్‌కి చిట్టి చిట్కాల‌తో...పోగొట్టే భార‌తీయ ఆయుర్వేదం

  భార‌త ఆయుర్వేదం ఉసిర‌కాయతో షుగ‌ర్ ని కంట్రోల్ చేయ‌గ‌ల‌దు. ఈ విష‌యం గుర్తించింది ఇక్క‌డి ఆయుర్వేద వైద్య లోకం. ఆంగ్లంలో ఆమ్లాగా పిలిచే ఉసిరిలో విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరగడాన్ని ఉసిరి తగ్గిస్తుందని కొన్ని స్టడీస్‌ సూచిస్తున్నాయి. అంత సింపుల్ షుగ‌ర్ కంట్రోల్ చేయ‌డం భార‌త్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌. భార‌త్ తో ఉన్న మ‌రో ఫెసిలిటీ ఏంటంటే ఇక్క‌డ వైద్యులు అమెరికా నిండా ఉన్నారు. వీరు అత్యంత గొప్ప నైపుణ్యంతో అమెరికా ఆరోగ్య సంరక్ష‌ణ చేస్తున్నారు. ఇలాంటి వారు రాకుండా క‌ట్ట‌డి చేస్తే అక్క‌డి జ‌నారోగ్యానికే ప్ర‌మాదం. ఇప్ప‌టికే అమెరికాలో టైప్ టూ డ‌యాబెటిస్ నియంత్ర‌ణ కోసం మౌంజారో తో పాటు, టైప్ 1 డ‌యాబెటీస్ కంట్రోల్ చేయ‌డం కోసం స్టెమ్ సెల్ ఆధారిత చికిత్స కూడా ప‌రిశోధ‌న‌లో ఉంది. కొత్త మందులు ఆవిష్క‌ర‌ణ‌తో పాటు గుండె జ‌బ్బుల ప్ర‌మాదం త‌గ్గించే మందులు, జీవ‌న శైలి మార్పు చేర్పుల‌లోనూ భార‌తీయ వైద్య నిపుణుల‌ది కీల‌క పాత్ర‌.    ఇలాంటివేవీ గుర్తించ‌కుండా  రాజ‌కీయ కార‌ణాల‌తో ఎలాగైనా స‌రే భార‌తీయుల‌ను ఇరుకున  పెట్టాలి. మ‌న దారికి తెచ్చుకోవాల‌న్న కుట్ర కొద్దీ తీస్కునే నిర్ణ‌యాల‌తో అమెరికాకు చేటు తేవ‌డానికి ట్రంప్ అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని అంటున్నారు అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.

మిరపచెట్టుకు వంకాయలు?!

 బ్రహ్మం తాత తన కాలజ్ణానంలో చెప్పారో లేదో.. కానీ మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలూ కాసిన వింత ఒకటి కలకలం రేపుతోంది. ఓ రైతు తన పొలంలో మిరపతోట వేస్తే.. ఆ తోటలో ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులు వంకాయలు, టమాటాలూ విరగకాశాయి. ఈ వింత చూడడానికి ఆ గ్రామస్తులే కాక చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తండోపతండాలుగా వచ్చారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్ల పాడులో జరిగింది. గ్రామానికి చెందన  ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరపతోట వేశారు. అయితే ఆ మిరపతోటలోని ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులుగా టమాటా, వంకాయలు  కాసాయి.  ఈ వింత చూసిన జనం దైవలీల అంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది. కొందరు హేతువాదులు మాత్రం దీని వెనుక ఏదో శాస్త్రీయకారణం ఉందంటున్నారు. సరే విషయం ఏంటో తేల్చడానికి వ్యవసాయ అధికారలు రంగంలోకి దిగారు. మిరపచెట్టుకు వంకాయలు, టమాటాలు కాయడంపై వారు పరిశించి, పరిశోధించి కారణమేంటో తేల్చడానికి రెడీ అయిపోయారు.  

ప్రజాదర్బార్ లో పోలీసులతో కొలికపూడి వాగ్వాదం

నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారా అనిపించేలా వ్యవహరించే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. శనివారం ప్రజాదర్బార్ లో సైతం అదే తీరున వ్యవహరించారు. శనివారం (నవంబర్ 8) తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు హాజరైన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ రసాబాసగా మారింది. ఇంతకే విషయమేంటంటే.. ఇటీవల మంత్రి లోకేష్ ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొని తీరాల్సిందే అని ఆదేశించిన నేపథ్యంలో శనివారం తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు శ్రీనివాసరావు హాజరయ్యారు. అయితే ప్రజా దర్బార్ కు తిరువూరు సీఐ హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనానికి గురైన ఆయన ఎస్ఐను సీఐ గైర్హాజరుకు కారణమేంటంటూ నిలదీశారు. నూజివీడు కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున సీఐ ప్రజాదర్బార్ కు రాలేకపోయారని ఎస్ ఐ ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందని కొలికపూడి.. ప్రజాదర్బార్ కంటే కోర్టుకు హాజరు కావడం ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సీఐ కోర్టుకు వెళ్లారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపించాలి అంటూ ఎస్ఐని అడిగారు. ఆ దశలో ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు ప్రజాదర్బార్ ను నిలిపివేశారు. ఆయన తీరు పట్ల ప్రజా దర్బార్ కువచ్చిన వారు  విస్తుపోయారు. ప్రజార్బార్ కు వచ్చి పోలీసులతో పంచాయతీ ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి మరో సారి వివాదాస్పదంగా మారింది.  

బీహార్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం

బిహార్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. ఈ నెల 11 రెండవ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇందు కోసం ఆయన శనివారం (నవంబర్ 8) పట్నాకు వెళ్లారు. ఆయన బీహార్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.  ఎన్డీఏకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన  బీహార్ ఎన్నికల్లో మిత్ర పక్షాల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి లోకేష్ బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం  ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.  గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.   ఇప్పుడు బీహార్ లో  ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కాకుండా లోకేష్ వెడుతున్నారు.  కాగా బీహార్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రనంలో పర్యటించనున్న లోకేష్ పనిలో పనిగా పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అలాగే పట్నాలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. శనివారం సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి. ఆ తరువాత ఆదివారం  (నవంబర్ 9)  పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం  పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.    

అమ్మకానికి ఆర్సీబీ!?

ఐపీఎల్‌   ఛాంపియన్.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి అంగట్లో ఉంది. ఈ జట్టు త్వరలో చేతులు మారనుంది.  ఆర్సీబీ ఫ్రాంచైజీ సేల్‌కి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆర్సీబీ టీమ్ ఓనర్.. డియాజియో కంపెనీ దీనిపై క్లారిటీ ఇచ్చింది.   బ్రిటీష్ డిస్టిలరీస్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో.. ఆర్సీబీ జట్టు అమ్మకానికి సంబంధించి  ఇప్పటికే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా.. ఆర్సీబీ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికానుంది. యూఎస్‌ఎల్‌కు.. ఆర్సీబీ టీమ్ ఎంతో విలువైన, వ్యూహాత్మక ఆస్తి అని సంస్థ సీఈవో తెలిపారు. ఇది తమ ఆల్కబెవ్ వ్యాపారానికి ప్రధానం కాదన్నారు. సంస్థలో.. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించే ఉద్దేశంతోనే.. కంపెనీ తన ఇండియా పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తోందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కోర్ బిజినెస్.. ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ టీమ్ తమ కోర్ బిజినెస్ అయిన లిక్కర్ బిజినెస్‌కి సంబంధించింది కాదని చెబుతోంది. అందువల్లే.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతోంది. అయితే.. ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు అన్నది వచ్చే  ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు తేలనుంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉండటం, అపారమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండటం వల్ల.. ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్‌లో భారీ విలువ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఫ్రాంచైజీ విలువ  16 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. ఐపీఎల్ మెన్స్ టీమ్‌తో పాటు విమెన్స్ ప్రీమియర్ లీగ్ టీమ్ కూడా ఈ డీల్‌లో భాగమే! ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో.. అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యు గ్రూప్, అదార్ పూనావాలా సహా మరికొన్ని సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనక పూర్తయితే.. ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద ఫ్రాంచైజీ యాజమాన్య మార్పుల్లో ఒకటిగా నిలిచిపోనుంది.  వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా.. ఇటీవలే దాదాపు 17 వేల కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయ్. అదానీ గ్రూప్‌తో పాటు ఓ ఢిల్లీ బిజినెస్ టైకూన్ కూడా ఆర్సీబీ టీమ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా రేసులో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా.. అదార్ పూనావాల ఆర్సీబీ యాజమాన్య హక్కుల కోసం బాగా ప్రయత్నిస్తున్నస్టు సమాచారం.  2010లో లీగ్ విస్తరణ సమయంలోనే అదార్ తండ్రి సైరస్ పూనావాల ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. కానీ.. అప్పుడు దక్కలేదు. మళ్లీ.. ఇప్పుడు ఆర్సీబీని కొనేందుకు  ప్రయత్నిస్తున్నారు.  2008లో ఐపీఎల్‌ ఆరంభ సమయంలో.. యూబీ గ్రూప్ అధినేత విజయ్‌ మాల్యా.. బెంగళూరు ఫ్రాంఛైజీని దక్కించుకున్నాడు. ఆ తర్వాత.. 2016లో మాల్యాని ఆర్థికి ఇబ్బందులు చుట్టుముట్టాయ్. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దాంతో.. భారత్‌లోని తన అనుబంధ సంస్థ యునైటెడ్‌ స్పిరిట్స్‌ ద్వారా మాల్యా మద్యం కంపెనీతో పాటు బెంగళూరు ఫ్రాంచైజీని కూడా డియాజియో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ టీమ్‌ని మెయింటైన్ చేసింది. 2008లో విజయ్ మాల్యా ఆర్సీబీని 76 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 2014 నాటికి.. డియాజియో యూఎస్ఎల్.. ఆర్సీబీలో మెజారిటీ వాటాని కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణతో.. డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం.. ఈ టీమ్‌ని.. యూఎస్‌ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఈ ఏడాది సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీనిని.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 4న.. బెంగళూరులోని చినస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో.. 11 మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. దాంతో.. ఆర్సీబీ నిర్వహణపై ప్రెజర్ పెరిగింది. అప్పటి నుంచే.. ఆర్సీబీ విక్రయంపై చర్చలు మొదలయ్యాయ్. మరోవైపు.. షేర్ హోల్డర్లు కూడా నాన్ కోర్ వ్యాపారాన్ని వదలిపెట్టాలని డియాజియోపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

హైద‌రా.. బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ ఎవ‌రంటే?!

కేటీఆర్, కిష‌న్ రెడ్డిలను హైద‌రాబాద్ బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ గా అభివ‌ర్ణించారు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి. వీరు హైద‌రాబాద్ కి రావ‌ల్సిన  ప్ర‌తి దానినీ ఆపేస్తున్నార‌ని విమర్శించారు.  గుజ‌రాత్, ఢిల్లీ, యూపీల్లో స‌బ‌ర్మ‌తి, య‌మున‌, గంగా న‌దుల ప్ర‌క్షాళ‌న  చేయొచ్చు.. ఇక్క‌డి మూసీనీ చేయొద్దా అని అడుగుతూ మూసీతో పాటు మెట్రో విస్త‌ర‌ణ‌కు సైతం కి కిష‌న్ రెడ్డి అడ్డు త‌గులున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్  ని అరెస్టు చేయ‌డ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ని అడిగితే అనుమతి  ఇవ్వ‌డం లేద‌ని.. కాళేశ్వ‌రం కేసులో కేసీఆర్, హ‌రీష్ ల‌ను అరెస్టు చేయ‌మ‌ని ఈ కేసుపై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయ‌మ‌ని కోరితే.. ఢిల్లీ పెద్ద‌ల్లో క‌ద‌లిక లేదని.. దీన్నిబ‌ట్టీ వీరి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఎలాంటిదో ఒక‌సారి  చూసుకోవ‌చ్చనీ అన్నారు రేవంత్. ఇక హైడ్రా, ఈగ‌ల్ మీద కూడా ప‌డి ఏడుస్తున్నార‌నీ.. హైడ్రా కార‌ణంగా క‌బ్జాల‌కు గురైన వేల కోట్ల రూపాయ‌ల చెరువులు, కుంట‌లు, నాలాలు ఇప్పుడిప్పుడే వెలికి వ‌స్తున్నాయ‌ని.. అదే వారి కాలంలో చివ‌రికి బ‌తుక‌మ్మ కుంట కూడా క‌బ్జా పెట్టార‌ని.. త‌మ హ‌యాంలో ఇవ‌న్నీ  వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని అన్నారు సీఎం రేవంత్. వారి జ‌మానాలో ఇవన్నీ క‌బ్జాల‌కు గురై చిన్న చినుకు ప‌డితే హైద‌రాబాద్ చెరువు అయిపోయేద‌ని.. అన్నారు రేవంత్. కేటీఆర్ హ‌యాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్ర‌గ్స్ దొరికేలాంటి క‌ల్చ‌ల్ ఏర్ప‌డింద‌ని.. ఆయ‌న హ‌యాంలో ప‌బ్ క‌ల్చ‌ర్ పెరిగినంత మ‌రెక్క‌డా పెర‌గ‌లేద‌నీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీయే ఇందుకు ప్ర‌త్య‌క్ష  సాక్ష్య‌మ‌న్నారు రేవంత్. దీంతో ఈగ‌ల్ ప‌నితీరుపై కూడా కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారనీ విమర్శలు గుప్పించారు.  గోవాలో లింకులు కూడా త‌మ ఈగ‌ల్ తీగ‌లాగి మొత్తం డ్ర‌గ్స్ నెట్ వ‌ర్క్ ని వెలికి తీస్తుంటే కేటీఆర్ తిక‌మ‌క అయిపోతున్న‌ారని విమర్శించారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీల వ్య‌వ‌హారం చూస్తే వీరు వ్యాపారం చేస్తూ, ప్ర‌జాసేవ  చేస్తున్న వారికి మ‌ల్లే పోజులు కొడుతున్నార‌ని, వారు అడిగిన అడ్డ‌గోలు అనుమ‌తులు తాము నిరాక‌రించ‌డం వ‌ల్లే ఈ యాగీ చేస్తున్నార‌నీ,  ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇచ్చేదే నాణ్య‌మైన విద్య అందివ్వ‌డానికి అలా జ‌రుగుతుందా లేదా చూడ్డం కూడా త‌ప్పేనా? ఇదే అద‌నుగా భావించి పిల్ల‌ల చ‌దువుగానీ మ‌ధ్య‌లో ఆగితే అంతే తేలిగ్గా వ‌ద‌ల‌మ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. విడ‌త‌ల వారీగా వారికి నిధులు మంజూరు చేస్తామ‌ని అన్నారు. వీరి ఆగ‌డాల‌కు మంద‌కృష్ణ‌, ఆర్ కృష్ణ‌య్య తోడ‌వుతున్నార‌నీ, ఇక్క‌డ నెల‌కు రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ‌ం రూ.18,500 కోట్లు మాత్ర‌మే. 6 వేల కోట్ల‌కు పైగా.. కేసీఆర్  చేసిన అప్పుల‌కు ఆర్బీఐ చెప్పా పెట్ట‌కుండానే లాగేసు కుంటోంది. ఇక ఆరు వేల కోట్ల రూపాయ‌లు ఉద్యోగుల జీత, భ‌త్యాలు. మిగిలిన ఖ‌ర్చుల‌తో సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చే దారి క‌నిపించ‌క‌, కొత్త అప్పులు పుట్ట‌క నానా అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తోంది. ఎవ‌రైనా ఇంత‌క‌న్నా మించిన పాల‌న చేస్తామ‌ని ముందుకొస్తే వారికే ఈ మొత్తం పాల‌న అప్ప‌గించేస్తాం ముందుకు రావ‌చ్చ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేవంత్.గోపీనాథ్ కుటుంబ వ్య‌వ‌హారం తాను కూడా మీడియాలో చూశాన‌నీ.. ఒక వేళ అందులో ఏదైనా లోటు పాట్లు ఉంటే బండి సంజ‌య్ ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేయిస్తామ‌న్నారు.  

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ఆందోళన కారణమేంటంటే?

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (నవంబర్ 7) రాత్రి నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.  రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన వన్ 984 విమానం సాంకేతిక లోపాలు కారణంగా చెబుతూ తీవ్రజాప్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. శనివారం (నవంబర్ 8) ఉదయానికి కూడా విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడం, సరైన సమాచారం ఇవ్వకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు పడుతున్నారు. విమానం ఎప్పుడు టేక్‌ఆఫ్ అవుతుందనే విషయంపై సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపో వడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం (నవంబర్ 8) ఉదయం కూడా పలు విమానాలు రద్దు కావడం, టేకాఫ్ కు తీవ్ర జాప్యం జరగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో పరిస్థితి  ప్రయాణీకుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది.   హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6ఇ051, అలాగేముంబైకి వెళ్లాల్సిన 6ఇ245 వి మానాలు రద్దు కాగా, పలు విమానాలు ఆలస్యం అయ్యాయి.   దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  శుక్రవారం (నవంబర్ 7)  ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌  వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  విమానాల రద్దు, జాప్యం జరుగుతుండటంతో అసలేం జరుగుతోందంటూ ప్రయాణీకులు అధికారులను నిలదీస్తున్నారు.  

అద్వానీకి చంద్రబాబు బర్త్ డే విషెస్

బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు  లాల్ కృష్ణ అద్వానీ శనివారం (నవంబర్ 8) తన 98వ జన్మదినం జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. అద్వానీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.   1927 నవంబర్ 8వ తేదీన జన్మించిన అద్వానీ దేశంలో బీజేపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి భారతీయ జనతాపార్టీని అభేద్యంగా తీర్చిదిద్దడంలో అద్వానీ పాత్ర అత్యంత ముఖ్యమైనది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.  చంద్రబాబును బీజేపీకి విశ్వసనీయ మిత్రుడిగా అద్వానీ ఎప్పుడూ చెబుతుంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్వానీ హాజరైన సంగతి తెలిసిందే.  

తెలంగాణ సీఎం రేవంత్ కు మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పలు పార్టీల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రేవంత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎంకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం

  నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అతి వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఎనిమిది మందీ సురక్షితంగా బయటపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా పడిదగ్ధం కావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.