న్యూ ఇయర్ వేడుకల్లో జీరో డ్రగ్స్ విధానం..అధికారులకు సీపీ సజ్జనార్ ఆదేశం
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎటువంటి ఉదాశీనతా వలదని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టాలన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 26)న హెచ్-న్యూ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భం గా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించిన తరువాత దాడులు చేసి కేసులు నమోదు చేయడం కాదనీ, తక్షణమే అంటే ఇప్పటి నుంచే హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించి డ్రగ్స్ వినియోగానికి అవకాశం లేకుండా చేయాలన్నారు. అలాగే సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా పెట్టాల న్నారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, డ్రగ్ ఎడిక్ట్స్ పై నిఘా ఉంచాలని ఆదే శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమయ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యూఇయర్ సందర్భంగా కీలకమైన ప్రాంతాలలో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారి కేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేడు కలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీసులంతా సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.