గుజరాత్ జైల్లో టెర్రరిస్టుపై ఖైదీల దాడి

గుజరాత్ జైల్లో ఉన్న టెర్రరిస్టు అహ్మద్ మొహియిద్దీన్  సయ్యద్ పై ఖైదీలు దాడి చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.  ఐఎస్‌కేపీ  ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలన్న కుట్రను ఛేదించిన ఏటీఎస్ పోలీసులు ఆ కుట్రలో కీలకంగా ఉన్న  ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై   జైలులో ఖైదీలు కొందరు   దాడి చేశారు.  అతడిని హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ.. అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారని అధికారులు తెలిపారు.  దీని గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది.  దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు చేపట్టింది.   ఈ నెల 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ( ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్  కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌ అనే వ్యక్తితో టచ్‌లో  ఉండి,  అతడి ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల అటాచ్ కు సిట్ కు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి  పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఆ ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అనుమతించిన మీదట.. ఆస్తుల అటాచ్ మెంట్ కోసం విజయవాడ ఎసీబీ కోర్టును సిట్ ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో వాటిని అటాచ్ చేసింది.   ఇక ఇప్పడు తాజాగా ఈ కేసులో  కీలక నిందితుడైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం  అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.  మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,  కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ గా ఉన్న భాస్కరరెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి, సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్ కు సిట్ అనుమతి కోరింది.   మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం  63. 72 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టిందనీ,  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను తగ్గించి,  లెక్కల్లో చూపకుండా  54.87 కోట్ల పైగా  మొత్తాన్ని  బ్లాక్ మనీగా మలిచారనీ సిట్ నివేదికలో పేర్కొంది.  ఈ నేపథ్యంలోనే నెల్లూరుజిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద  రిజిస్ట్రరైన ఆస్తుల ఆటాచ్ మెంట్  సిట్  ప్రభుత్వ అనుమతి కోరింది.  అలాగే చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం భారీగా మోసపూరిత భూ లావాదేవీలకు పాల్పడిందని సిట్ పేర్కొంది.  వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా  263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకం, లో మోసం జరిగినట్లు నిర్దరించింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి  నల్లధనాన్ని తెల్లగా మార్చారని  సిట్ తన నివేదిక పేర్కొంది.  మద్యం కుంభకోణం నుండి కమిషన్లు, కిక్ బ్యాక్ లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టిందనీ,   అవినీతి నిరోధక చట్టం, , క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని  సిట్ ప్రబుత్వాన్ని కోరింది. ఇందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కు వియవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్  ఉత్తర్వులు జారీ చేశారు. 

హిడ్మా అనుచరుడు రావులపాలెంలో అరెస్ట్

కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు.. వాటికి సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మావోయిస్టుల అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురంలలో జరిపిన సోదాలలో మంగళవారం (నవంబర్ 18) ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం అమలాపురం కు సమీపంలో ఉండే రావులపాలెంటో హిడ్మా అనుచరుడి మధవిహండా సరోజ్ ను అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెంలో ఏం చేస్తున్నాడన్న కోణంలో అతడిని విచారిస్తున్నారు.  ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాటులతో ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు షెల్టర్ కోసం ఏపీని ఎంచుకున్నారా? ప్రణాళిక మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాంపల్లి కోర్టు నుంచి జగన్ ఎక్కడకు వెడతారో తెలుసా?!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (నవంబర్ 20) తన అక్రమాస్తుల కేసు విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆయన తాడేపల్లి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో బేంగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. ఆయన కోర్టులో గంట సేపు ఉంటారు. ఈ మేరకు జగన్ వ్యక్తిగత సిబ్బంది జగన్ నాంపల్లి కోర్టు హాజరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. నాంపల్లి కోర్టు నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెడతారు.  

మావోలూ లొంగిపోండి.. మల్లోజుల పిలుపు

ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం (నవంబర్ 19) విడుదల చేసిన ఓ వీడియోలో.. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయనీ, దేశం కూడా ముందుకు సాగుతోందనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మేలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా పేర్కొంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.  

టెక్‌ శంకర్ సహా ఏడుగురు మావోయిస్టులు హతం

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో  బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు.  మంగళవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించగా మిగిలిన వారు అడవుల్లో దాక్కుని ఉన్నారనే సమాచారంతో  గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన సంయుక్త  కూంబింగ్ లో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి పోలీసులపై కాల్పులు జరిపారనీ, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారనీ లడ్డా వివరించారు.  మృతులలో మావోయిస్టుల ఐఈడీ నిపుణుడు మెట్టూరు జోగారావు అలియాస్‌  టెక్‌ శంకర్  కూడా ఉన్నట్లు తెలిపారు.  ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ముగ్గురు మహిళా మావోయిస్టులు  ఉన్నారన్నారు.    మావోయిస్టు టెక్‌ శంకర్‌   పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించిచాడనీ,  గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక లాండ్ మైన్ లరూపకల్పనలో కూడా  టెక్ శంకర్ దే కీలక పాత్ర అని లడ్డా చెప్పారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగతా సభ్యులను జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మిలుగా గుర్తించారు.  

20న నాంపల్లి కోర్టుకు జగన్

భారీ జనసమీకరణకు వైసీపీ ప్రణాళిక లీక్ వైసీపీ అధినేత వెళ్లేది విచారణా? యుద్ధానికా అంటూ నెటిజనుల సెటైర్లు దాదాపు పుష్కరకాలం కిందట జగన్ పై   సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో చాలా వరకూ దీర్ఘకాలంగా స్దబ్దుగా ఉన్నాయి. ఆ కేసులలో ఎటువంటి కదలికా లేదు. అన్నిటికీ మించి ఆయా కేసుల విచారణకు జగన్ సీబీఐ కోర్టుకు హాజరై కూడా ఏళ్లు గడిచిపోయింది.  అయితే ఇప్పుడు ఆయన అనివార్యంగా సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఇటీవల జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే బెయిలుపై ఉన్న జగన్ దేశం విడిచి వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ అలా అనుమతి మంజూరు చేస్తూ.. లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత సీబీఐ కోర్టుకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. అందుకు అంగీకరించిన జగన్.. లండన్ నుంచి వచ్చిన తరువాత మాత్రం.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు దానిని కొట్టివేయడంతో ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో గురువారం (నవంబర్ 20) ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.  గురువారం (నవంబర్ 20) ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన  నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.  అయితే ఆయన హాజరు ఒక నిందితుడు విచారణ కోసం కోర్టుకు హాజరు అవుతున్నట్లుగా కాకుండా, ఏదో కోర్టు మీదకు దండయాత్రకు వెళుతున్నారా అన్నట్లుగా భారీ జనసమీకరణకు పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ప్రణాళిక లీక్ అయ్యింది. దీంతో పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు. నెటిజనులైతే జగన్ వెళ్లేది విచారణా, యుద్ధానికా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా కోర్టు విచారణకు వెళ్లే సమయంలో సైలెంట్ గా వెళ్లి కోర్టులో హాజరయ్యామా? అన్నట్లు ఉండాలి కానీ, ఇలా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ఏదో యుద్ధానికి వెడుతున్నట్లుగా వెళ్లడం జగన్ కు మాత్రమే చెల్లిందంటున్నారు. ఇలా భారీ జనసమీరణతో వెళ్లడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు ఏర్పడతాయనీ, దీంతో ఇక తదుపరి విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు అన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే కోర్టుల ముందు ఇలాంటి పప్పులుడకవు అంటున్నారు. దీనివల్ల ఆయన కోర్టు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఒక వేళ జగన్ బల ప్రదర్శన వికటిస్తే బెయిలు రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.  

ఆపరేషన్ కగార్ సక్సెస్.. ప్రొఫెసర్ హరగోపాల్

నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యిందని  పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నవంబర్ 18) మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై స్పందించిన హరగోపాల్ హైదరాబాద్ లో మాట్లాడుతూ.. పార్టీలోని భిన్నాభిప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపోర్ట్ లేక పోవడం కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు.  కేంద్ర కమిటీ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాలు ఉన్నాయన్నారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.  

మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎన్ కౌంటర్ లో హతం?

ఛత్తీస్ గఢ్ వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం వంతా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్ల మోత వినిపించేది. నక్సల్ విముక్త భారత్ అంటూ చేపట్టినఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు వరుస ఎన్ కౌంటర్లతో మావోల ఏరివేత చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో ఇక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో  అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం (నవంబర్ 18)న మారేడుమిల్లి అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా బుధవారం ఉదయం ఇదే ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉందన్న ఆయన మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం జరిపిన కూబింగ్ లో  మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు.  ఉండటంతో మంగళవారం ఆపరేషన్‌ చేశామని, మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో  మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయని, 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక బుధవారం ఉదయం కూడా  ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారని తెలిపారు.  మరణించిన ఏడుగురు మావోయిస్టులలో మోస్ట్ వాంటెడ్ దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. 

చలికి తోడు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కోల్డ్ వేవ్ వణికించేస్తున్నది. ఇప్పుడు చలికి తోడు భారీ వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయనున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో  రానున్న రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కారణంగా రానున్న రోజులలో  ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని, దీంతో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. వర్షాలు, చలిగాలులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇలా ఉండగా మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం పది గంటలకు కూడా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక అరకులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు

ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాలో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.  ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడలో  28 మంది నక్సల్స్, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది, కోనసీమ జిల్లాలో ఒక నక్సలైట్ ను పోలీసులు మంగళవారం (నవంబర్ 18)అరెస్టు చేశారు. మొత్తంగా ఏపీలో  మంగళవారం (నవంబర్ 18) ఒక్క రోజే 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ బుధవారం (నవంబర్ 19) కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  విజయవాడలో అరెస్టు చేసిన  వారిలో మావోయిస్టు అగ్ర నేత, మంగళవారం (నవంబర్ 18) ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గెరిల్లా టీమ్ కు చెందిన19 మంది, అలాగే ఇప్పటికీ అజ్ణాతంలో ఉన్న మరో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   ఇక ఏలూరు గ్రీన్ సిటిలో కూడా  15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కాకినాడలో ఇద్దరిని, కోనసీమ జిల్లా అమలాపురంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇలా అరెస్టైన 50 మందీ కూడా ఛత్తీస్‌గఢ్‌ వాసులేనని పోలీసులు తెలిపారు.  

ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ

ఐ బొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది.  ఐ బొమ్మ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున క్రిప్టో ‌తో పాటు హవాలా పద్ధతిలో కూడా సాగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.   మనీ మనీలాండరింగ్  తో పాటు విదేశీ మారకద్రవ్యం రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో  కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.  ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరింది. ఆ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ ప్రకటించింది.. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసి, కేసుకు సంబంధించిన సంపూర్ణ వివరాలు పంపించాలని కోరింది. పోలీసులు ఇప్పటికే నిందితుడు ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని, అతని ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. అదే విధంగా విదేశీ బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రవి ఖాతాలకు చేరినట్టు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ఛానళ్ల ద్వారా నెలకు  15 లక్షల వరకు రవికి చెందిన ఎన్ఆర్ఈ అకౌంట్‌కి బదిలీ అయినట్టు పోలీసు దర్యాప్తులో చేరింది.  ఈ నిధుల మార్గాలు, మూలాలు తదితర అంశాలపైఈడి దర్యాప్తు చేయనుంది. ఐబొమ్మ పైరసీ కేసు సైబర్ క్రైమ్ పరిమితులను దాటినందున,  మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది.  రానున్న రోజుల్లో ఈ  కేసులో మరిన్ని సంచలన విషయాలువెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

వెబ్ సైట్ యూజర్లను బెట్టింగ్ యాప్ లకు మళ్లించాడు!

ఐబొమ్మ, బప్పం   వెబ్ సైట్లతో సినిమాలను పైరసీ చేసిన  రవి.. ఆ వెబ్ సైట్ ల యూజర్లను బెట్టింగ్ యాప్ లకు   మళ్లించాడు.  బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు డొమైన్లను క్రియేట్ చేశాడు. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్ పేట్ లో, మరోటి అమెరికాలోనూ రిజిస్టర్ అయి ఉన్నాయి.  రవి Tradersin.com, Makeindiashop.shop  అనే డొమైన్లు వాడి 1win, 1xbet వంటి బెట్టింగ్​యాప్స్​ప్రమోట్​చేశాడు. ఈ సంచలన విషయాలన్నీ ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.  ఈ రెండు డొమైన్ల ద్వారా ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి డబ్బు వచ్చిందనీ,  ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్​ఫర్​అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.  ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్​సైతం జరిగినట్టు  రవి అ  రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు.   ఐబొమ్మ నుంచి బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడనీ, యూజర్ ఐబొమ్మలో మూవీ చూస్తూ ఉంటే.. పక్కనే పాప్ -అప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింకులు కనిపించేవని, ఆ లింక్ ను యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ రవికి   కమీషన్ వచ్చేదని తెలిపారు.  అయితే.. ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెప్తున్నారు. పోలీసులు ఈ డొమైన్ల ట్రాఫిక్​ను ట్రాక్ చేసి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్​తో రవిని పట్టుకున్నారు.  రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్​సైట్స్​మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడనీ,  ఇది ఆగాలంటే రవిని రిమాండ్​కు తీసుకోవడం అవసరమనీ  పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే ఐపీ, ఒకే ఈ–మెయిల్, ఒకే మొబైల్ నంబర్​కు లింక్ అయినట్టుగా గుర్తించారు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్​ను ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి స్వయంగా చూసుకునేవాడని పేర్కొన్నారు.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను తో పాటుగా ఓటిటి వచ్చే కంటెంట్ మొత్తాన్ని కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  రవిని గుర్తించడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ కీలక పాత్ర పోషించినట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.   విదేశీ పౌరసత్వం పొందడమే అతని క్రిమినల్ ఉద్దేశ్యాన్ని సూచిస్తోందని, దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు తీవ్ర ప్రమాదమని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

ఆత్మాహుతి దాడి కాదు.. బలిదాన ఆపరేషన్.. ఉమర్ నబీ సంచలన వీడియో

దేశాన్ని కుదిపేసిన డిల్లీ ఆత్మహుతి దాడి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఒక ఉగ్రవాది మొబైల్ ఫోన్ లో ఈ వీడియోను ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో ఉమర్ నబీ ఆత్మాహుతి దాడులను సమర్ధిస్తూ మాట్లాడారు. ఆత్మాహుతి దాడిని బలిదాన ఆపరేషన్ గా అభివర్ణించాడు.  ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. ఉమర్ తాను ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి కొన్ని నిముషాల ముందు ఈ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  ఈ వీడియోలో ఉమర్ నబీ తీవ్రవాద సిద్ధాంతాలను వల్లెవేస్తూ యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపించేలా మాట్లాడారు. ఈ వీడియోతో పాటు ఇతర డేటాను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఉగ్రదాడి సూత్రధారులు, వారి నెట్ వర్క్ పేలుడు పదార్థాల సరఫరా మార్గాలు వంటి కీలక అంశాలను వెలికితీ యడానికి దర్యాప్తు మరింత వేగవంతం చేశామని  వెల్లడించారు. దేశమంతటా ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ ఈ వీడియో కీలకంగా మారుతుందని అంటున్నారు. 

ప్రమాదంలో బీఆర్ఎస్ ఉనికి?.. కారణమేంటంటే?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం బీఆర్ఎస్ శ్రేణుల నైతికస్థైర్యాన్ని పాతాళానికి పడిపోయేలా చేసింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడింది. అయినా అసలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రీయాశీల రాజకీయాల నుంచి వెనకడుగు వేసి బాధ్యతలను తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించిన క్షణం నుంచీ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పడిపోతూనే వస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పడు జూబ్లీ ఉప ఎన్నికలలో దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ వైఫల్యాల పరంపరకు పరాకాష్టగా చెబుతున్నారు. సరిగ్గా చెప్పాలంటూ.. గత అసెంబ్లీ ఎన్నికలో పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమై..పార్టీ నడిపే బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించిన తరువాత బీఆర్ఎస్ కు వరుసగా ఇది మూడో ఓటమి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 లోక్ సభస్థానాలలో పోటీ చేసిన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఆ తరువాత కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు తాజాగా జూబ్లీ ఉప ఎన్నిక.. ఈ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పాతిక వేల ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ హ్యాట్రిక్ పరాజయాలతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. కేటీఆర్ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేకపోవడంపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూబ్లీ ఓటమిపై పార్టీ నాయకులు ఎవేవో కారణాలు చెప్పవచ్చు.. తాము అధికారంలో ఉండగా అన్ని ఎన్నికలూ గెలిచామంటూ భుజాలు చరుచుకోవచ్చు.. కానీ ఓటమి ఓటమే... అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించిన గ్రేటర్ పరిధిలోనే వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమిపాలు కావడం కచ్చితంగా పార్టీకి తేరుకోలేని దెబ్బేననడంలో సందేహం లేదు.  ఈ వరుస పరాజయాలు కేటీఆర్ నాయకత్వ పటిమపై సందేహాలకు తావిచ్చాయి. ఆయన నాయకత్వ సమర్థతపై పార్టీలోనే చర్చ మొదలైంది.  ఇక అధికార కాంగ్రెస్ అయితే ఇప్పటికే విఫల నేతగా కేటీఆర్ ను అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నది.  ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే.. బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదంటున్నారు. కేసీఆర్ అనారోగ్యం, పార్టీని నడపలేక కేటీఆర్ సతమతం అందుకు కారణమని అంటున్నారు.  అయితే జూబ్లీ ఓటమిని కేటీఆర్ వైఫల్యంగా చెప్పలేం కానీ, నిస్సందేహంగా ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని మాత్రం చెప్పుకోవాలి. అయితే  పదేళ్ల పాటు తిరుగులేకుండా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడిలా కుదేలు కావడంలో తప్పెవరిది? కేసీఆర్ దా? కేటీఆర్ దా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. నిజానికి జరిగిందేమిటంటే.. పార్టీకి నిజంగా అవసరమున్న సమయంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అందుకు కేసీఆర్ అనారోగ్యమే కారణమైతే అది పార్టీ దురదృష్టంగా భావించాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు అహం అడ్డువచ్చి కేసీఆర్ క్రీయాశీల రాజకీయాలకు దూరమై ఉంటే మాత్రం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సంక్షోభం కేసీఆర్ బాధ్యతగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ కేటీఆర్ కు మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. అయితే అదే జరగడం లేదంటున్నాయి పార్టీ శ్రేణులు.   

తెలంగాణ స్థానిక ఎన్నికలపై తొలగిన సస్పెన్స్!

తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పడు అన్నదానిపై సస్పెన్స్ తొలగిపోయింది. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే జోరులో, ఇదే జోష్ లో ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 9 వ తేదీ వరకూ జరగనున్న ప్రజాపాలన ఉత్సవాల తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి 20 నెలలకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై గత ఏడాదిగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ సస్పెన్స్ తొలగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటున్నారు. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్వల్ప విరామం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  అధికార పార్టీ తొలుత స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సంకల్పించింది. ఆ కారణంగానే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జాప్యం అయ్యాయని చెప్పక తప్పదు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకించడంతో అది వీలు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలుత హైకోర్టును, అటు పిమ్మట సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే.. రెండు చోట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. హైకోర్టు రిజర్వేషన్లలో 50శాతం పరిమితికి కట్టుబడి ఉండాలని సూచించగా, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో  ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఈ నెల 24న సమీక్షించనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో హైకోర్టు ఏం చెబుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  మొత్తం మీద కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం   అనుకూలంగా ఉన్న ప్రజల మూడ్ మారకుండానే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

డిసెంబర్ 9లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!?

తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెయ్యేనుగుల బలం ఇచ్చిందా? అందుకే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం కేబినెట్ లో  ఖాళీగా ఉన్న బెర్తులు భర్తీ చేయడమే కాకుండా.. కొందరు మంత్రుల శాఖల మార్పు, కొందరికి ఉద్వాసన, కొత్త వారికి కేబినెట్ లో చోటు.. ఇలా మొత్తం కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  రేవంత్ కేబినెట్ కొలువుదీరి రెండు సంవత్సరాలు సమీపిస్తున్న నేపథ్యంలో  పాలనలో తన మార్క్ మరింత ప్రస్ఫుటంగా కనిపించేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరతూ  ఇప్పటికే  రేవంత్ పార్టీ హైకమాండ్ కు లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన, అదే సంఖ్యలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది రేవంత్ యోచనగా చెబుతున్నారు. అలాగే కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే ఉద్దేశం ఉందంటున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి పంపి అనుమతి కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగించాలన్నది రేవంత్ ప్రతిపాదనగా చెబుతున్నారు. వారి స్థానంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, మహేష్ కుమార్ గౌడ్, మదన్ మోహన్ రావు, బాలూ నాయక్ లను కేబినెట్ లోకి తీసుకోవాలన్నది ఆ ప్రతిపాదనగా చెబుతున్నారు. అదే విధంగా ఆర్థిక, రెవెన్యూ, హోం, ఐటీ వంటి కీలక శాఖలను సీనియర్లకు అప్పగించాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   జూబ్లీ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదను కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా పరిశీలించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే నెల9 లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

పాట్నాకు చంద్రబాబు, లోకేష్.. ఎందుకంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పాట్నా వెళ్లనున్నారు.  బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వీరిరువురికీ అందిన ఆహ్వానం మేరకు వీరు పాట్నా వెళ్లనున్నారు.   ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన బీహార్ లో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తారు. 

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రెండో సారి కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో  కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో అరెస్టైన నిందితులను రెండో సారి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు జనార్ధన్ రావు, జగన్మోహన్ రావులను 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఈ కేసులో ఏ1 జనార్దన్ ,ఏ2 జగన్మోహన్​లను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం (నవంబర్ 19) నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకూ వీరిని కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ శాఖ విచారించనుంది.   అయితే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాలని కోర్టు షరతు విధించింది. వీరిద్దరినీ గతంలో వారం రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు మరోసారి విచారణకు అనుమతి కోరుతూ ఎక్సైజ్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిగణనలోనికి తీసుకున్న ఎక్సైజ్ కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసింది.  ప్రస్తుతం ఏ1 జనార్ధన్​రావు నెల్లూరు కేంద్రకారాగారం, ఏ2 జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్న సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్ పై విచారణకు విజయవాడ కోర్టు గురువారం (నవంబర్ 20)కి వాయిదా వేసింది.  ఇదే కేసులో అరెస్టైన జోగి బ్రదర్స్ జోగి రమేష్, జోగి రామును పది రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ అబ్కారీ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు తదుపరి వాచారణకు వాయిదా వేసింది. కకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఏ18నానూ, జోగి రాము ఏ19గాను ఉన్న సంగతి తెలిసిందే. వీరిరువురూ కూడా ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.