సైబర్ వలకు చిక్కిన పోలీసు అధికారులు
ప్రభుత్వం ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సామాన్యులు మాత్రమే కాదు, విద్యావంతులు, సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారులు కూడా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సైబర్ మోసారికి గురై భారీగా నష్టపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పని చేసే ఒక ఇన్ స్పెక్టర్ ను సైబర్ నేరగాళ్లు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక అనుమతులు అంటూ ఆ ఇన్ స్పెక్టర్ నుంచి దశలవారీగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. అదే విధంగా అదే కమిషనరేట్ లో పని చేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ న స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు దాదాపు 39 లక్షల రూపాయల మేర మోసం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్టాక్ ట్రేడింగ్ గ్రూప్‌లో తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట చిన్న మొత్తాలతో లాభాలు వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించిన మోసగాళ్లు, ఆపై పెద్ద మొత్తాల పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఈ ప్రక్రియలో ఆ ఇన్స్పెక్టర్ నుంచి సుమారు రూ.39 లక్షలు వసూలు చేశారు.
అయితే ఆ తరువాత అకస్మాత్తుగా గ్రూప్ అడ్మిన్లు కనిపించకుండా పోవడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇ సైబర్ మోసానికి గురైన ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్లూ కూడా సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న వారు కావడమే ఇక్కడ విశేషం. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అధికారులే ఇలా మోసపోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జరిగిన మోసంపై ఈ ఇరువురు పోలీసు అధికారులూ కూడా సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, ఐపీ అడ్రెసులు, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే ప్రయత్నాలు కొనసాగు తున్నాయి.