ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు...

  ఆర్టీసీ సమ్మె పద్ధెనిమిదివ రోజుకు చేరుకుంది.ఆర్టీసీ సమ్మెతో విద్యార్ధులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నిన్నటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ఓ వైపు చెబుతోంది. కానీ గంటల తరబడి వేచి చూస్తున్నా బస్సులు మాత్రం రావడం లేదని ఫలితంగా సమయానికి కాలేజీలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్ధులు అంటున్నారు. దీంతో ప్రజలతో పాటు విద్యార్థులు భారీ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు ఆశించిన స్థాయిలో బస్సులు రావటం లేదు. పూర్తిగా వీళ్లంతా కూడా ప్రైవేటు వాహనాల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితితులు ఉన్నాయి. ప్రయాణికులు ఎంతసేపు వేచిచూసినా కూడా గంటకు ఒక బస్సు మాత్రమే వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్, కాలేజీస్ కి పూర్తిగా ఇరవై రోజులు దాదాపుగా సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలు నిన్నటి నుంచి రీఒపెనింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాలంటే మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అని ప్రభుత్వం ఓ వైపు చెప్తోంది. మరోవైపున తాత్కాలిక కండెక్టర్లు, తాత్కాలిక డ్రైవర్లతో ప్రమాదం జరుగుతున్నాయని చెప్పే ప్రయాణికులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే  వీళ్లంతా కాలేజీలకు స్కూల్స్ కు వెళ్లాలంటే పూర్తిగా ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది.ఇక ఈ సమ్మె పై కేసీఆర్ వీలైనంత త్వరగా స్పందింస్తే కానీ ప్రజలు ఇక్కట్ల నుంచి బయటపడరు.

రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా...

  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఇసుక పాలసీ సామాన్యులకు చుక్కలు చూపిస్తూ దళారులకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి పి.గన్నవరంలో కొందరు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి. నియోజకవర్గంలో ఉన్న నాలుగు ర్యాంపుల్లో సాధారణ ప్రజలకు ఇసుక దొరకటం గగనమైంది .కావాలంటే బ్లాక్ లో కొనుక్కోండి అంటు సలహాలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక దొరక్కపోగా రెట్టింపు ధరకు బ్లాక్ లో కొనాల్సి వస్తోంది. పి.గన్నవరం నియోజక వర్గంలో అధికారికంగా పలు సొసైటీల పేరుతో నాలుగు ర్యాంప్ లకు ఆధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్టర్ ఇసుక ధర పదహారు వందల ఎనభై ఏడు రూపాయలు కానీ ఎక్కడా ఈ ధరకు ఇసుక దొరకటం లేదు. రెండు ర్యాంపుల్లో అధికారిక పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు చక్రం తిప్పుతున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ సేవలు మొరాయించాయి అన్న నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. స్థానికులకు ఆన్ లైన్ తో సంబంధం లేకుండా ఇసుక ప్రభుత్వ ధరకు విక్రయించాలని అధికారులు సూచించారు. ఇదే వారి దోపిడీకి దారి చూపించింది ,స్థానికులకు అమ్ముతున్నట్లు లెక్కల్లో చూపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులకు కావాలన్నా బ్లాక్ లో కొనాల్సిందే. అనధికార స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అధిక ధరలకు అమ్ముతున్నారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా వాహనాలకు జీపీఎస్ అమర్చి అక్రమాల నిరోధిస్తామన్న ఆధికారులు కనుచూపు మేరలో కనిపించడం లేదంటన్నారు. స్థానికంగా ఎవరైనా ఇసుక  కావాలంటే కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ధర చెబుతున్నారు. ప్రజలు కూడా బ్యాంకులు అధికారుల చుట్టూ తిరగలేక అవసరానికి బ్లాక్ లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.  

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలో దూసుకుపోతున్న 'కారు'........

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే విజయం టిఆర్ఎస్ దే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే అంచనాలు తారుమారు అవుతాయని గెలిచేది తామేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతం గానే ముగిసింది. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో కలిపి ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం తగ్గింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించిన వాటి స్థానంలో వేరే ఈవీఎంలు అమర్చి పోలింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలో గుండ్లపల్లి టిడిపి అభ్యర్థి చావా కిరణ్మై హుజూర్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మద్యం తాగిన వారిని ఓటింగ్ లో పాల్గొననివ్వమని అధికారులు ముందే హెచ్చరించటంతో మందు బాబులు కనిపించలేదు. వృద్ధులూ, దివ్యాంగులూ,వృద్ధులు హుషారుగా పోలింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉత్తమ్ చేసిన అభివృద్ధి, పార్టీ ఓటు బ్యాంకు, నాయకులు కలిసి కట్టుగా ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు ఏడు వందల మంది నాయకుల సైన్యం పదిహేను రోజుల పాటు ప్రతి ఓటరును పలకరించడం, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు చివరి రెండు రోజుల్లో తిరుగులేని పోల్ మేనేజ్ మెంట్ కారణంగా ఆధిపత్యం తమదేనని అధికార టీఆర్ఎస్ పూర్తి నమ్మకంతో ఉంది. వర్గాల వారీగా ఓటర్ల ఆకర్షణకు చివరి రెండు రోజుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి అధికార పార్టీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. అధికార పార్టీ చేసిన పోల్ మేనేజ్ మెంట్ ముందు విపక్ష కాంగ్రెస్ విలవిలలాడినట్లు కనిపించింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణం. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా అన్ని పలితాలు అధికార టీఆర్ఎస్ కు అనుకూలం గానే ఉన్నాయి. చాణక్య ఎగ్జిట్ పోల్ లో టిఆర్ఎస్ కు యాభై మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి శాతం, టిడిపికి రెండు పాయింట్ ఒకటి శాతం, బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరా అనే ఏజెన్సీ చేసిన సర్వేలో టీఆర్ఎస్ కు యాభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం, కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం, ఇతరుల కు తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు పోలవుతాయని తెలిపింది.వీసీపీ అనే సంస్థ టీఆర్ఎస్ కు యాభై ఏడు పాయింట్ ఏడు మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం, టీడీపీకి రెండు పాయింట్ రెండు ఒకటి శాతం, బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం, ఇతరులకు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రీసెర్చ్ అండ్ అనాలసిస్ పై పబ్లిక్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎస్ కు నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది, టిడిపికి నాలుగు పాయింట్ ఎనిమిది, బీజేపీకి రెండు పాయింట్ నాలుగు, ఇతరులకు ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.హుజూర్ నగర్ లో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని పోలింగ్ ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో ఒక్కొక్క మండలంలో ప్రజల తీర్పు ఒక్కో విధంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పాలకవీడు, హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చే అవకాశముండగా, మిగిలిన మండలాల్లో టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం పరిమితమైన అని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభావాన్ని చూపిన ట్రక్కు గుర్తుపై పోలింగ్ తర్వాత చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ లో కూడా ట్రక్కు గుర్తుకు ఆరు వేలకు పైగా ఓట్లొచ్చాయి. ఈ సారి ట్రక్కు గుర్తుకు రోడ్ రోలర్ కూడా జతయ్యింది. ఈ గుర్తులు ఎన్ని ఓట్లను కొల్లగొడతాయో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఫలితాల కోసం మరో రెండు రోజులు వేచి చూడాలి. 

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహిస్తున్న ఉద్యోగులు...

  ఆగస్ట్ 30న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు జాతీయ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఏఐబీఈఏ, బిఈఎఫ్ఐ ఈ రెండు యూనియన్ లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆగస్ట్ 30న ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంకుల విలీనం గురించి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన డిమాండ్లను చేస్తూ హైదరాబాద్ కోటి లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సమ్మెకు దిగారు. సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగుల హెడ్ రాంబాబు మాట్లాడుతూ, ముప్పైవ తేదీన ఫైనాన్స్ మినిస్టర్ డిక్లేర్ చేసినటువంటి బ్యాంకుల విలీనాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని, దీంతో పాటుగా నాలుగైదు డిమాండ్స్ కూడా ఇంకా ఉన్నాయని అన్నారు. బ్యాంకుల విలీనం గురించి ఆలోచిస్తున్న పభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి ఋణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించని వ్యక్తులందరూ కూడా ఈ దేశంలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వాళ్ళదగ్గరి నుంచి ఆ డబ్బును రికవరీ చేద్దామనేటువంటి తాపత్రయం మాత్రం ప్రభుత్వాల దగ్గర కనిపించట్లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఇంకా అటువంటివారికి ఒక లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాచుకున్నటువంటి జనరల్ ఫండ్ లో నుంచి తీసుకుని వెళ్లి కార్పొరేట్ రంగానికి దోచిపెట్టేటువంటి విధానానికి తెర తీశారని తెలిపారు. ఇలా బ్యాంకుల విలీనాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయని, ఈ విలీనాల వల్ల మరల కార్పొరేట్ రంగానికి మరింత విరివిగా లోన్లు ఇవ్వడం జరుగుతాయని, చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటిది సఫలం కాదని అన్నారు. అదే విధంగా డిపాజిట్ ల మీద ఇచ్చేటువంటి వడ్డీ రేటు సంవత్సర సంవత్సరానికి తగ్గుకుంటూ వచ్చి 6.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ విధంగా ఇండస్ట్రీకి రావలసిన బకాయిలన్నీ కూడా ఇవ్వాలంటూ సమ్మెకు దిగారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది సమ్మెలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు ఉన్నప్పటికీ ఉద్యోగులెవరూ బ్యాంకులకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు.

ఎట్టకేలకు 'ఆపరేషన్ రాయల్ వశిష్టా' సక్సెస్

  గోదావరిలో టైటానిక్ గా ముగుస్తుందేమో అనుకున్న రాయల్ వశిష్టా బోటు ఒడ్డూకు చేరుతోంది.గడచిన ముప్పై ఏడు రోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నటువంటి రాయల వశిష్ట బోటు కొద్ది సేపటి క్రితమే గోదావరి నదిలో పైకి తేలింది. గత వారం రోజులుగా రాయల్ వశిష్ట ఆపరేషన్ బోట్ కి సంబంధించి ఆపరేషన్ టూ జరుగుతుంది. వారం రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు సత్యం బృందం, రెండో వైపున డీప్ వాటర్ డైవర్స్ ఇద్దరూ కూడా సంయుక్తంగా ఒక అవగాహన తోటి పూర్తిస్థాయిలో బోటు గోదావరిలో ఎక్కడుందని ఒక అంచనా వేసుకుంటూ దానికి సంబంధించి ఐరన్ రోప్ ని కట్టి, లంగర్లను కట్టి లాగే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు కొంత నిరాశ ఏర్పడినప్పటికి కూడా నిన్న కొంత ఆశావాహంగా కనిపించింది. డీప్ వాటర్ డైవర్స్ లోపలకు వెళ్లి ఒక బలమైన వస్తువుకు ఐరన్ రోప్ లు కట్టారు. ఆ కట్టిన సందర్భంలోనే బోటుకు సంబంధించినటువంటి ముందు భాగం  బయటకొచ్చింది. బయటకొచ్చె పరిస్థితిలో కట్టిన రోప్ లు ఊడిపోతున్నా మళ్లీ మళ్లీ ఐరన్ రోప్ లను కట్టారు.చివరకు  బోట్ కు వెనకవైపున ఉన్నటువంటి సాఫ్ట్ భాగంలో బలంగా కూడా ఐరన్ రోప్ ని కట్టారు. ఈ రోజు ఉదయం మళ్లీ ఇక్కడికి వచ్చి ముందు భాగం లో రెండు రోప్ లు కట్టారు. అయితే అది మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల సమయంలో అవి ఊడిపోయినప్పటికి, బలంగా  సాఫ్ట్ భాగానికి కట్టిన రోప్, ఈ బోట్ వెనక భాగానికి ఆ ఐరన్ రోప్ బలంగా దాన్ని పట్టుకుని ఉండటం తోటి క్రమక్రమంగా గోదావరి నదిలోని బోటు ఒడ్డుకొస్తుంది. దీనితో అందరిలోనూ సంతోషం కనిపిస్తుంది. నిన్నటి వరకు ఒక ఉత్కంఠ, నిరాశకు లోనైనప్పటికి కూడా ఈరోజున ఏ పని చేశారో దానికి తగిన ప్రతిఫలం కనిపిస్తోందని ఆనందం అందరిలోనూ ఉంది. అదే విధంగా ఇంకా పన్నెండు మందికి సంబంధించి గల్లంతైనవారికి సంబంధించినటువంటి జాడ తెలియాల్సిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆ ప్రాంతంలో ఎదురుచూస్తున్న నేపధ్యంలో బోటు బయటకు రావడం వారి మనసుల్లోని నిరీక్షణకు ఫలితంగా కనిపిస్తోంది.

ఆర్టీసీ సమ్మెకు అండగా నిలిచిన తాత్కాలిక డ్రైవర్ లు...

  ఈ రోజు ఆర్టీసీ సమ్మె పద్ధెనిమిది వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఇవాళ కూడా డిపో ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా డిపో ముందే కూర్చున్నారు కార్మికులు. ఈ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఉదయం ఐదింటి నుంచే బస్ డిపో ఎదురుగా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి  కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే కార్మికులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిపో ముందు అంటే జెఏసి యొక్క రోజువారి ప్రణాళిక ప్రకారం నిన్న మొత్తం కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఉంది. తాత్కాలిక డ్రైవర్ లు, ప్రైవేటు డ్రైవర్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డూటీలో రావద్దని, తమ పొట్ట కొట్టొద్దని చెప్పి వాళ్లని బ్రతిమిలాడిన ఆర్టీసీ జేఏసీ వారిని సమ్మెకు సహకరించాలని వేడుకుంది. రోజువారి కార్యక్రమాల్లో కూడా ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది.  ఈ సమ్మెను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది కాని ఈ ప్రభుత్వం చర్చలకు మాత్రం పిలవటం లేదని, దయచేసి మేము కోరుకునేది ఒకటేనని తమ న్యాయమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం భర్తిచేయాలని డ్రైవర్, కండక్టర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీలో కొన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించాలని ఇవే వారి యొక్క ముఖ్యమైన డిమాండ్ లు అని ఆర్టీసీ నాయకుడు తెలియజేశారు. ఇప్పటి వరకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు డిమాండ్లతో మేము చర్చ పెడితే కనీసం ఒక్క డిమాండ్ కూడా వినలేదని, కనీసం చర్చలలో మీతో అవసరం లేదు మాకు మేము వేరే రకంగా బస్సులు తిప్పుకుంటాం, తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ తో బస్సులు తిప్పుకుంటామని అనే వైఖరిలో ప్రభుత్వం ఉందని ఆర్టీసీ జేఏసీ వెల్లడిస్తోంది. భగవంతుడి దయ వల్ల ఈ రోజు తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ లు కూడా  తమకు సహకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఇక ఇప్పటి దాకా తాత్కాలిక డ్రైవర్లు పై భరోసా ఉన్న ప్రభుత్వం ఇక సమ్మె పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి.

ముగిసిన 'షా-జగన్' ల కీలక భేటీ... కొంచెం రాష్ట్రం, కొంచెం రాజకీయం!!

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. మొదట ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత పలు అంశాల పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇంకా రావాల్సిన వాయిదా అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిని ఒకసారి హోంమంత్రికి గుర్తు చేశారు. ఎందుకంటే హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది విభజన చట్టాన్ని అమలు చేయడానికి. కాబట్టి హోంశాఖ ద్వారా అమలు చేయాల్సినవి వాటికి సంబంధించిన పురోగతి ఎన్ని అమలయ్యాయి. అమలవుతున్న వాటి పరిస్థితి ఏంటి, ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలేంటి, వీటన్నిటి గురించి కూడా చర్చించినట్టు సమాచారం. దీంతో పాటు పొలిటికల్ సమస్యల విషయానికి వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరు, గతంలో అదే ప్రాజెక్టు గురించి రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు వీటన్నింటిని కూడా ఆయన హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో ఈ పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు రివర్స్ టెండర్ల వ్యవహారాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు. ఆ పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదా అయ్యే పనే చేస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తప్పుబడుతూ దాన్ని రాద్ధాంతం చేస్తున్న వైనం, ఈ విషయం గురించి కూడా మాట్లాడారని సమాచారం అందింది. ఇక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పిపిఎ విషయంలో చోటు చేసుకున్న వివాదం ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటి అని వీటికి సంబంధించి కూడా అని కొంత వివరణ ఇచ్చినట్టుగా మనకు సమాచారమందుతోంది.ఇక వీరీ భేటీకి జగన్ సర్కార్ కు ఏమైనా ఉపశమనాన్ని ఇవ్వబోతోందో లేదో వేచి చూడాలి.

ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ దే ముందడుగు...

  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.

అమిత్ షాతో మాట్లాడటం కుదరలేదు.. విజయసాయిపై జగన్ తీవ్ర అసహనం!!

  వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన జగన్.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నేతలు, సహచర మంత్రులతో అమిత్‌షా కార్యాలయం కోలాహలంగా మారింది. దీంతో అమిత్‌షాతో మాట్లాడేందుకు జగన్‌కి తగిన సమయం దొరకలేదు.  అమిత్‌షాతో పూర్తిగా మాట్లాడే అవకాశం చిక్కకపోయేసరికి జగన్‌ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజానికి అమిత్ షా తో భేటీ జగన్ కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. అపాయిట్మెంట్ దొరకడంతో అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే,  24 గంటలు వెయిట్‌ చేసినా పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదనే అసహనం జగన్‌లో కనిపించిందని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు అమిత్  షాతో అపాయిట్మెంట్ మొదలుకుని భేటీ వరకూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అయితే భేటీ సక్రమంగా జరగకపోవడంతో విజయసాయిరెడ్డిపై జగన్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మరోవైపు.. జగన్‌తో అపాయింట్‌మెంట్లని కేంద్ర మంత్రులు రవిశంకర్‌, ప్రహ్లాద్‌జోషి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అపాయిట్మెంట్ రద్దు చేసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం జగన్ ఢిల్లీ పర్యటన గురించి స్పందించింది. ఏపీ సమస్యలపై అమిత్‌షాకు జగన్‌ వినతిపత్రం ఇచ్చారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, కడప స్టీల్‌ప్లాంట్ లాంటి అంశాలు మెమోరాండంలో జగన్‌ ప్రస్తావించారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

ఐటీ అధికారులను సైతం షాక్ కి గురి చేసిన కల్కి అక్రమాస్తులు...

  కల్కి ఆశ్రమంలో అక్రమాస్తుల లెక్క తేల్చారు ఐటీ అధికారులు. మొదట్లో నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల లెక్కల్లో లేని ఆస్తులున్నట్లు భావించారు. కాని సోదాలు ముగిసేటప్పటికీ అది ఎనిమిది వందల కోట్లకు చేరింది. సోదాల్లో ఐటీ అధికారులు భారీగా నగదు, బంగారం, విదేశీ కరెన్సీతో పాటు పలు డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు రోజులుగా కల్కికి చెందిన నలభై ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం మూడు వందల మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.  తనకు తాను దేవుడిగా చెప్పుకునే కల్కి భగవాన్ వెనకేసుకున్న ఆస్తుల గుట్టును విప్పింది ఆదాయపన్నుశాఖ. ఆయన ఆస్తులు నోట్ల కట్టలు చూసి ఐటీ అధికారులే షాక్ కు గురయ్యారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడొందల మంది అధికారులు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం లోని కల్కి ఆశ్రమంతో పాటు నలభై ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు చిత్తూరులోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆశ్రమం నుంచి ఎవర్నీ బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు సాగిన సోదాల్లో పలు సంచలనాలు బయటకు వచ్చాయి. భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. బాక్సుల్లో కేజీల కొద్ది బంగారం ధగధగా మెరిసే వజ్రాలను ఐటీ అధికారులు గుర్తించారు. నలభై నాలుగు కోట్ల నగదుతో పాటు ఇరవై కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించాయి ఐటీ బృందాలు.వీటితో పాటు తొంభై కేజీల బంగారం బాక్సులను కూడా గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న వజ్రాల విలువ ఐదు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.  వరదయ్యపాళెం ఆశ్రమంతో పాటు కల్కీకి చెందిన వైట్ లోటెస్ ఇతర ప్రాంతాల్లో సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా లెక్కల్లోకి రాని ఆస్తులు గుర్తించారు. దాదాపు ఎనభై ఐదు కోట్ల డబ్బును హవాలా ద్వారా సేకరించినట్టు చెబుతున్నారు. తాను దేవుడి రూపమంటూ చెప్పే విజయ్ కుమార్ అలియాస్ కల్కి భగవాన్ పెద్ద మొత్తంలో నగదును నిల్వ చేయటం అధికారులను సైతం విస్మయపరిచింది. ఐటీ శాఖ ట్యాక్స్ మినహాయింపులను కల్కి భగవాన్ ఆశ్రమం దుర్వినియోగం చేస్తోందంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆశ్రమానికి వచ్చిన సొమ్మును అక్రమంగా పెట్టుబడుల పెడుతున్నారన్న ఆరోపణలతో ఐటి శాఖ రంగంలోకి దిగింది. ఆశ్రమం నిర్వహణ పేరుతో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన కల్కి భగవాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ నిధులను వ్యాపారాల్లో పెట్టుబడుల మీదగా మళ్ళించినట్లు చెబుతున్నారు. అంతేకాదు కల్కి కొడుకు కృష్ణ విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు చైనా, సింగపూర్, యూఏఈలలో కల్కి కుమారుడికి కంపెనీలు ఉన్నట్టు చెబుతున్నారు. ఐటీ శాఖ దాడులు జరిగినప్పటి నుంచి కల్కి భగవాన్ ఆయన సతీమణి కనిపించటం లేదు. ఇప్పటికే కల్కి కుమారుడు కృష్ణ అతని భార్యను ఐటీ శాఖ అధికారులు విచారించారు. గత రెండేళ్లుగా కల్కి భగవాన్ అతని భార్య ఆశ్రమానికి రావడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

గాల్లో కలిసిపోతున్న చిన్నారుల ప్రాణాలు, ముఖ్య కారణాలు ఏమైయుంటాయి?...

హైదరాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి నిర్వాకం కారణంగా ముక్కుపచ్చలారని పసికందు కాలిబూడిదైపోయింది. ఫైర్ సేఫ్టీ రెన్యువల్ చేయకుండా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడింది షైన్ ఆసుపత్రి. ఎక్కడో యూపీ ఆస్పత్రిలో చిన్నారుల చనిపోతే అయ్యో పాపం అనుకున్నాం. గుంటూరు ఆసుపత్రిలో పసికందును ఎలుకలు కొరికేశాయి అని విని తల్లడిల్లిపోయాం. ఇప్పుడు హైదరాబాద్ లో షైన్ ఆసుపత్రి నిర్వాకం నాలుగు నెలల పసికందును బలితీసుకుంది. ఐసీయూలో ఉన్న చిన్నారుల విషయంలో కూడా కేర్ తీసుకోక పోవటం షైన్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. చిన్నచిన్న రూములు కడితే అద్దెలు ఎక్కువ వస్తాయని భవన యజమానులు భావిస్తుంటే, ఆసుపత్రులు కూడా అదే రూటులో వెళుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ పడకలు గదులు ఉంటే పేషెంట్ లను బాధ చేయొచ్చని నిర్ణయమవుతున్నాయి. పన్లోపనిగా నిబంధనలూ, ప్రమాణాలు గాలికొదిలేస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లో షైన్ ఆసుపత్రిది కూడా అదే కథ. కాసుల కక్కుర్తితో ఆసుపత్రి కట్టిన యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలను పట్టించుకోలేదు. కనీసం ఫైర్ సేప్టీ రెన్యువల్ కూడా చేయించుకోకుండా నాలుగు నెలల చిన్నారిని పొట్టనపెట్టుకొంది. షైన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఐసీయూలో ఉన్న నాలుగు నెలల చిన్నారి చనిపోయింది. ఇక్కడే చికిత్స పొందుతున్న మరో నలభై ఒక్క మంది పసిబిడ్డల్ని ఇతర ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చారు. చిన్నారి మరణానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే అధికారులు మాత్రం ఆసుపత్రిని సీజ్ చేసి అంతటితో సరిపెట్టారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు తూతూ మంత్రపు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారాలు వెతకడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో చిన్నారులు బలైపోతూనే ఉన్నారు. డైలీ కలెక్షన్ ఎంతొచ్చిందా అని లెక్కలేసుకునే షైన్ ఆసుపత్రి ఐసీయూలు చిన్నారుల్ని మాత్రం గాలికొదిలేసింది. ప్రమాదవశాత్తూ ఘోరం జరిగి పోయిందని చెప్పడం చాలా తేలిక, కానీ నాలుగు నెలల అభం శుభం తెలియని పసిపాపను పోగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపు కోతకు వైద్యాన్ని డబ్బుతో కొలిచే డాక్టర్ లు ఆసుపత్రి యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయి అనుకోవటం అత్యాశే అవుతుందని షైన్ ఆసుపత్రి లాంటి ఉదంతాలు చాటి చెబుతున్నాయి.

'దీపావళి ఒక వెలుగుల పండగ' అంటూ విమర్శలు చేస్తున్న వేది పండితులు...

దీపావళి అంటే దీపాల వరుస అంతేగానీ టపాసుల మోత కాదంటున్నారు కొందరు వేదపండితులు. సనాతన ధర్మం ఏ రోజు కాలుష్యాన్ని ప్రేరేపించిందని చెబుతున్నారు. నరకాసుర వధ జరిగిన తరువాత దేవ దుందుభులు మోగించి హర్షాతిరేకాలు చేసి నర్తించారని గుర్తుచేస్తున్నారు. ఈ టపాసులన్నీ మధ్యలోనే వచ్చిన ఆడంబరంగా అభివర్ణిస్తున్నారు. వాస్తవంగా టపాకాయలు కాల్చడం వల్ల ఎక్కడా పురాణాల్లో వర్ణింపబడలేదు. నృత్యాలు చేశారని, దేవదుందుభులు వాయించారని, కరతాళ ధ్వనులు చేశారని హర్షాతిరేకాలు ప్రదర్శించారని ఒకప్పుడు అవన్నీ వగైరాలు చేశారని వర్ణనలు ఉన్నాయి. కానీ ఈ విధంగా టపాకాయలు కాల్చమని ఎక్కడా కూడా పురాణాల్లో వర్ణన లేదు. ఈ మధ్య కాలంలో ఇది క్రమంగా పెరిగి పెరిగి ఇది ఎట్లా తయారయ్యిందంటే నేషనల్ ఇన్ కమ్ వేస్ట్ కింద వస్తున్నట్టుగా ఉంటోంది.  దీపావళి నాడు అమ్మవారికి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు దీపాల రంగవల్లులు పేరుస్తారు. కానీ ఇంట్లో అమ్మవారిని భక్తితో పూజించి బయటకొచ్చి అదే అమ్మవారి ప్రతిమ ఉన్న బాణసంచాను కలుస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో పడి పండుగల పేరుతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదన్నది పెద్దల సూచన. నరకాసురుని సంహరించడానికి ఎంత ఇబ్బందుల అయ్యాయో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఈ రోజులలో కాలుష్యం వల్ల జరుగుతుంది. ఇది గమనించి ప్రజలందరూ మన సనాతన ధర్మంలో చెప్పినట్లు ధర్మాలు ఆచరించినపుడు మనకు క్షేమంగా ఉంటుంది. అప్పుడే నిజమైనటువంటి నరక చతుర్దశి చేసుకున్నటువంటి ఆనందం మనకు కలుగుతుంది అని పండితులు వర్ణిస్తున్నారు.  ఇప్పుడు అంతా కూడా రసాయనాలతో చేసినటువంటి టపాసులను వాడుతున్నారు. అలాగ కాకుండా చక్కగా ఇల్లంతా దీపాలు, వీధంతా దీపాలను పెట్టుకుంటే మొత్తం కూడా కాంతితో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. దీపావళి నాడు నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ స్వచ్ఛమైన వెలుగుల స్థానంల్లో కళ్లు జిగేలుమనే కలర్ ఫుల్ లైట్స్ వచ్చాయి. కొవ్వొత్తులు చేరిపోయాయి. దీపం సుభాలను సూచిస్తే కొవ్వొత్తి శోకాన్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నారు కొందరు. బాణసంచ సంబరమే కానీ సంప్రదాయం కాదని అంటున్నారు. ఈ దీపాన్ని వెలిగించడం ఎందుకంటే మనలో ఉన్న పాపం హరించడం కొరకు కాబట్టి అలాంటి దీపాన్ని గనక వెలిగిస్తే "సంధ్యాదీపం నమోస్తుతే" ఏ సమయంలో వెలిగించాలంటే సంధ్యాకాల సమయంలో వెలిగిస్తే హరిస్తుంది అనడానికి నిదర్శనం ఈ దీపావళి పండుగ. టపాసుల కాల్చివేతతో ప్రమాదం ఉందనేది కొందరి మాట.  దీనిలో మరో కోణం కూడా ఉంది. బాణసంచా కాల్చడం సంబరం కాదని సంప్రదాయమని అంటున్నారు బంగారయ్యశర్మ. నరకాసురుడి వధ తర్వాత గంధకంతో చేసిన పదార్థాన్ని పేల్చారని వివరిస్తున్నారు. టపాసుల్ని పెట్టడము వెలిగించటం అనేటటువంటి ఆచారము మనకి ఎప్పడి నుంచో ఉంది అదేమీ కొత్తగా ఇవాళ ఏదో ఈ కంపెనీస్ అన్నీ వచ్చిన తరువాత వచ్చినటువంటిది కాదు. కాబట్టి భారతదేశంలో ఈ రకమైనటువంటి విజ్ఞానం గంథకం వాడీ ఎలా స్ఫోటకం చేయొచ్చో అనేటటువంటి విద్య ఎప్పటి నుంచో ఉంది. రససిద్ధులు మనకి రకరకాలుగా చెప్పబడే ఉన్నాయి. ఎవరి మాట ఎలాగున్నా ఎవరివాదన ఏదైనా రసాయనాలు నిండిన టపాసులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి అన్నది నిజం. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా అన్నది వాస్తవం.మరి ఈ దీపావళి వెలుగుల పండుగగా ఉండబోతోందా లేక మోతలు మోగించేలా ఉండబోతోందా అన్నది చూడాలి.

ఆర్టీసి సంఘాల్లో ఆతృతను నింపిన సిఎం కెసీఅర్ సమీక్ష...

  తెలంగాణ హై కోర్టు ఉత్తర్వుల కాపీ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో సీఎం కే సీ ఆర్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలన్నది నిర్ణయించనుంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఒకవేళ చర్చలు జరిగితే ఎవరి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా  ప్రభుత్వం తేల్చబోతోంది. హై కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో పన్నెండు అంశాలు సులువైనవిగా, ఆర్ధికంగా భారం లేనటువంటివి ఉన్న నేపథ్యంలో చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చల్లో సునీల్ శర్మ ఆర్టీసికి సంబంధించిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ లు పాల్గొంటున్నారు. ఈ చర్చల్లో హై కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పన్నెండు అంశాలే కాక కార్మిక సంఘాలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ముందుకు తీసుకువస్తే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అందరూ ఆతృతగా చుస్తున్నారు. ఒకవైపు కోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది మరోవైపు కార్మిక సంఘాలకు కూడా సర్ధి చెప్పాలి ఈ రెండిటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరిని చర్చలకు పంపాలి అనే అంశాల పై ముఖ్యమంత్రి ఇప్పుడు సమీక్ష జరపనున్నారు. సమీక్ష తరువాత హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని అంశాలపై చర్చించి, అవి ఎంతవరకు సాధ్యమవుతాయి అనే దానిపై మరల ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కె సీ ఆర్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. 

అంచనాలను తలకిందులు చేసిన ఫడ్నవిస్... మరాఠా రాజ్యంలో దేవేంద్రుడి ముద్ర...

  యువకుడు... పైగా అనుభవం లేదు... మరోవైపు శివసేన పోరు... ఇంకోవైపు సీనియర్ల ఆధితప్యం... ఇన్ని అడ్డంకులు అవరోధాల మధ్య... ప్రభుత్వాన్ని నడపడం అతనికి చేతగాదని అంచనా వేశారు. ముఖ్యంగా శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, వారందరి అంచనాలను దేవేంద్రుడు తలకిందులు చేశాడు. ప్రాంతీయ పార్టీల అధినేతల మాదరిగా మరాఠా ప్రజలపై బలమైన ముద్ర వేశాడు. ఒక్క అవినీతి మరకా అంటకుండా పరిపాలన సాగించాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని పరిష్కరించాడు. అంతేకాదు పక్కలో బల్లెంలా మారిన శివసేనను సైతం దారిలోకి తెచ్చుకుని రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అందుకే మహారాష్ట్ర ప్రజలు మళ్లీ దేవేంద్రుడికే పట్టం కట్టారని ఎగ్టిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.    ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లు బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచాయని ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి. మహారాష్ట్ర జనాభాలో 30శాతమున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అత్యంత సాహసంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో... మెజారిటీ మరాఠాల ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని తేల్చాయి. అందుకే, మరాఠా కాంగ్రెస్‌ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి మరాఠాలంతా ఏకపక్షంగా బీజేపీకి సై అన్నారని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక, మోడీ-షా మాయాజాలం ఎలాగూ ఉంటుంది. అలాగే బీజేపీకి పేటెంట్ గా మారిన జాతీయవాదం, హిందూత్వం కూడా మరోసారి మహారాష్ట్ర పీఠం దక్కించుకునేందుకు దోహదపడబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను... మరోసారి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. రాహుల్ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను మాత్రం మరాఠాలు చేరదీయలేదని అంచనా వేశాయి.

అమ్మో మాంసమా! తస్మాత్ జాగ్రత్త....

  కొందరికి ముక్క లేనిదే ముక్క దిగదు అంటారు,కానీ ఈ మధ్య మాంసాన్ని విక్రయిస్తుంటే ప్రజలు అనేక రోగాల భారీ పడుతున్నారు.సాధారణంగా మాంసాన్ని విక్రయించాలంటే ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ ఖచ్చితంగా నిర్ధారించాల్సి వస్తోంది. అది తినటానికి పనికొస్తుందో లేదో ఆయనే నిర్ధారించాలి ఆయన నిర్ధారించిన తరువాతే విక్రయించాలి. కానీ విజయవాడ కబేళాల్లో మాత్రం అలా జరగట్లేదు. అకడ మీట్ స్టాంపింగ్ దందా జరుగుతోంది. ఓ మేకను గానీ,గొర్రెను గానీ స్లాటర్ చేయాలంటే రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు గంటల పాటు  పర్యవేక్షణలో పెట్టాలి. అది ఆరోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాతే స్లాటర్ చేయాలి. ప్రతి కబేలా సెంటరులో పశువైద్యాధికారి పరిశీలించాకే మునిసిపల్ అధికారులు స్టాంప్ వేయాలి. కానీ విజయవాడ కబేళాల్లో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కాసుల కక్కుర్తితో ఇక్కడ స్టాంపింగ్ యధేచ్ఛగా సాగుతోంది. అపరిశుభ్ర ఏరియాలలో ఇష్టం వచ్చినట్టు స్లాటర్ చేస్తున్నారు. దీనివల్ల రోగాల ప్రభావం పడే అవకాశముంది. మేక, గొర్రె అనారోగ్యంగా ఉన్నా కూడా షాపులకు తరలించేస్తున్నారు. ఇక షాపుల్లో పరిస్థితి చెప్పేదేముంది, రోడ్ల పక్కనే ఉంటాయి, ఆరు బయటే మాంసం వేలాడుతూ ఉంటుంది. వాహనాల దుమ్ము, ధూళి అంతా మాంసంపై పడుతూ ఉంటుంది. అసలే నాణ్యత లేని మాంసం వాటి పై దుమ్ము ఇలాంటి మాటన్ తింటున్న వారి పరిస్థితి ఏమిటి అని పరిస్థితి ఆలోచిస్తేనే  అమ్మో అనిపిస్తోంది. అక్కడ ఒక రికార్డు కూడా మేంటైన్ చేస్తుంటారు. ఎవరెవరు ఎన్ని మేకపోతులు కావచ్చు,ఎన్ని గొర్రెపోతులు కావచ్చు, బీఫ్ కావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించి  స్టాంపింగ్ చేసిన తరవాత మాత్రమే విక్రయ కేంద్రాలకు వెళ్తూ ఉంటాయి.ఇలాంటి మాంసాన్ని అధికారులు విక్రయానికి ఎలా అనుమతిస్తారు ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఓల్డ్ బోయిన్ పల్లిలో భారీ చోరీ

  సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మల్లిఖార్జున నగర్ లో భారీ చోరీ జరిగింది. వడ్డీ వ్యాపారం చేసుకుంటున్న సరళ దంపతులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటకి వెళ్ళారు. వేసిన తాళాలు వేసినట్టు ఉండగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు,నగదు మాయం అయ్యాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి దుండగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలు,వెండి,పధ్ధెనిమిది లక్షల నగదు దోచుకెళ్ళారు. ఇంట్లో ఉన్నది అంతా దోచుకు వెళ్ళటంతో సరళ దంపతులు తీవ్ర దిగ్బ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు స్వీకరించారు. దొంగతనం చేసింది ఇంట్లో వాళ్ళా లేక బయటి వారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలాన్ని బేగంపేట ఏసీపీ రామ్ రెడ్డి పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఈ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.   పోలీసులకి ఇంటి యాజిమాన్యం సమాచారం అంధించటంతోటి హుటా హూటీగా పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకున్నారు. పోలీసులు దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత దొంగతనం జరిగిందని తెలుసుకున్న పోలీసులు వివరాలను స్వేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఎక్కడా బ్రేక్ లు లేక పోవటం, తాళాలు పగలుగొట్టి లేకపోవటం ఇటువంటి వివరాలు అన్ని పరిశీలించిన తరువాత అసలు ఈ దొంగతనం ఇంటి దొంగల పనా లేక బయటి వాళ్ళు ఎవరైన వచ్చి చేశారన్నటువంటి కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా తాళాలు పగలకొట్టినట్టు వంటి పరిస్థితి లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయం పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 

విద్యారంగంలోనే అతిపెద్ద డీల్... శ్రీచైతన్య విద్యాసంస్థకు 8వేల కోట్ల ఆఫర్

  తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విద్యాసంస్థ చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. 1986లో విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన శ్రీచైతన్య విద్యాసంస్థను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 700 బ్రాంచ్ లు పైగా కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థల నుంచి ప్రమోటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో వ్యవస్థాపకులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 27శాతం వాటా కలిగివున్న పీఈ గ్రూప్... 2011లో 25 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అయితే, పెట్టుబడి పెట్టి ఎనిమిదేళ్లు దాటడంతో లాభాలతో వైదొలగాలని పీఈ గ్రూప్ నిర్ణయించుకుంది. అదే సమయంలో శ్రీచైతన్య గ్రూప్ ప్రమోటర్స్ కూడా సంస్థ నుంచి బయటికి రావాలని డిసైడయ్యారట. దాంతో శ్రీచైతన్య విద్యాసంస్థను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 700కి పైగా బ్రాంచ్ లు కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థపై బ్రూక్ ఫీల్డ్ అండ్ కల్పథి ఇన్వెస్ట్ మెంట్స్ ఆసక్తి చూపిస్తున్నాయి. ఐటీ ఎడ్యుకేషన్ బిజినెస్ లో సక్సెస్సైన కల్పథి ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ ఈ డీల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కేజీ నుంచి ఇంటర్ వరకు పలు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థ కొనుగోలుకు దాదాపు 8వేల కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 1.1 బిలియన్ డాలర్లకు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్ ఫీల్డ్ అండ్ కల్పథి ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థలు ప్రపోజల్ పెట్టినట్లు చెబుతున్నారు. 1986లో డాక్టర్ దంపతులైన బోపన్న సత్యనారాయణరావు, ఝాన్సీ లక్ష్మీబాయి కలిసి శ్రీచైతన్య విద్యాసంస్థను ప్రారంభించారు. మొదట విజయవాడలో బాలికల కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్దఎత్తున బ్రాంచ్ లను నెలకొల్పారు. కేజీ టు ఇంటర్ సెగ్మెంట్ లో 700కి పైగా స్కూల్స్ అండ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అలాగే, బోర్డు ఎగ్జామ్స్ లోనూ, ఎంట్రన్స్ పరీక్షల్లోనూ... ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక సంచలన విజయాలను శ్రీచైతన్య విద్యాసంస్థ నమోదు చేసింది. అలాంటి పేరున్న విద్యాసంస్థ చేతులు మారనుందనే వార్తలు సంచలన రేపుతున్నాయి. అంతేకాదు విద్యారంగంలో అతిపెద్ద డీల్ గా ఇది భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న శ్రీచైతన్య విద్యాసంస్థ కొనుగోలుకు 8వేల కోట్ల రూపాయలు ఆఫర్ రావడమంటే నిజంగానే ఇది చిన్న విషయం కాదు మరి.

కల్కి ఆశ్రమంలో నిర్వహించిన ఐటీ దాడుల వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు .....

కల్కి ఆశ్రమంల్లో గత ఐదు రోజులుగా దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు లెక్కకు మించిన ఆస్తుల్ని గుర్తించారు. సోదాల్లో ఆశ్రమాల్లో దాచిన నోట్ల కట్టలు కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను వెలుగులోకి తీసుకువచ్చారు. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నలభై చోట్ల ఏక కాలంలో చేపట్టిన తనిఖీల్లో ఇవాళ్టితో ముగించారు. కల్కి ఆస్తులను ఇక్కడే కాకుండా దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఐటి అధికారులు గుర్తించారు. వీటితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్టు రాబట్టారు. ఇక వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన కల్కి, ఎనిమిది వందల కోట్ల రూపాయల పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించారు. మొత్తం ఐదు రోజుల పాటు ఐటీ అధికారులు దాదాపు నలభై ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. సోదాలో ఇప్పటి వరకు కూడా పట్టుబడ్డటువంటి నగదు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు కొద్ది సేపటి క్రితమే మీడియాకు విడుదల చేశారు. మొత్తం ఇప్పటి వరకు కూడా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు అలాగే నలభై కోట్లకు పైగా ప్రపంచం మొత్తం ఇండియన్ కరెన్సీకి సంబంధించిన నగదు ఇందులో ఫారిన్ కరెన్సీ కూడా ఉంది. మొత్తం కలుపుకొని అరవై కోట్ల వరకు కూడా నగదును గుర్తించారు. దాదాపు అరవై ఆరు కోట్ల నగదు ఉంది. అలాగే తొంభై కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ దాదాపు నూట ఐదు కోట్లు ఉంటుందని కూడా ఐటీ అధికారులు తెలిపారు. అలాగే లెక్కల్లో లేనటువంటి నగదుకు సంబంధించి దాదాపు నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలున్నట్టు దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ లు కూడా గుర్తించారు. దీంతో పాటుగా విదేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పట్టుబడ్డటువంటి ఇవన్నీ కూడా లెక్కలో లేనటువంటి ఆస్తులు మాత్రమే. ఇవి కాకుండా ఇప్పటికే ఐటీ చూపించినటువంటి ఆస్తులు వేరే ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి వందలాది కోట్ల రూపాయల నగదు కావచ్చు, బంగారం కావచ్చు వేలాది కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఐటీ అధికారులకు చూపనటువంటి లెక్కలో లేని నగదుగా మాత్రమే వెల్లడించారు. ఇప్పటి వరకు కూడా పూర్తయినటువంటి ఈ దాడుల తర్వాత ఐటీ అధికారుల వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి ఈ కల్కి ఆశ్రమం ప్రతినిధులు కావచ్చు, కల్కి భగవాన్ కావచ్చు వీరెవరూ కూడా ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు, జరిగినటువంటి దాడులకు సంబంధించి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు.ఇక ఈ కేసు పై పూర్తి దర్యాప్తు కొనసాగిస్తూ మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు అధికారులు. 

పశువుల చావడిగా మారిన ప్రభుత్వ పాఠశాల......

  కర్నాటక సరిహద్దుల్లోని ఆదోని మండలంలో ఉన్న ఎడవల్లి ఓ మారుమూల పల్లె. ఈ ఊరికి బస్సు ఆటోల రవాణా సౌకర్యం లేదు. ఈ ఊరు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువు చెప్పేందుకు టీచర్లు ఆదూరు నుంచి సంతెకుడ్లూరుకు ఆటో లేదా బస్సులో రావాలి. అక్కడి నుంచి ఒక కిలో మీటర్ కాలి నడకన ఎడవల్లికి చేరుకోవాలి. సంతెకుడ్లూరుకు ఎడవల్లికి మార్గమధ్యలో వాగు ఉండటం రోడ్డు గుంతలు గుంతలుగా ఉండటం వల్ల వాహనాలేవీ ఈ గ్రామానికి రావు. కాబట్టి ఈ ఊరికి ఎవరైనా వచ్చి పోవాలంటే ఒక కిలో మీటరు నడవాల్సిందే. కాలి నడకన స్కూలుకు రావాల్సి వస్తోందని టీచర్లు ఈ పాఠశాలకు రావడం మానేశారు. దీంతో స్కూల్ గత మూడేళ్ల నుంచి మూతబడింది. బడి మూత పడిన చదువుకోవాలనే తపనతో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు బుడి బుడి అడుగులతో ఇంగల్ దహాల్ స్కూలుకు రోజూ మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. వర్షాకాలంలో అయితే మార్గమధ్యలోనే వాగులూ వంకలూ దాటుకుని బడికి వెళ్తున్నారు. ఇక హైస్కూలు పిల్లలైతే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దహరివాణం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. రోడ్డు రవాణా సౌకర్యం లేదన్న కారణంతో టీచర్లు బడికి రాకపోయినా ప్రభుత్వం స్కూలు మూసేసినా విద్యార్థులు మాత్రం పొలాల మధ్య నడుచుకుంటూ అష్టకష్టాలూ పడి చదువుకుంటున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక నాయకులు ఇటీవలే ఊరికి రోడ్డు వేయించారు. డబ్బులున్న విద్యార్థులు ఏడాదికి మూడున్నర వేలు కడుతూ జీపులో వెళ్తున్నారు. డబ్బులు లేని పేద విద్యార్ధుల కాలి నడకనే స్కూల్ కు వెళుతున్నారు. లోకల్ నాయకుల ఊరికి రోడ్డయితే వేయించారు. కానీ పాఠశాలను ఎందుకు తెరిపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఎద్దులు కట్టేస్తూ పాకశాలగా మార్చారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూతబడిన స్కూల్ ను తెరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.