హోరా హోరీగా మారిన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు...

  రాష్ట్ర ప్రజలు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఆయా పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ లు కౌంటింగ్ హాల్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్, పద్మావతి రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు,విజయం ఎవరిదో ఈ రోజు తెలియనుంది. ముఖ్యంగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్వోతో పాటు కేంద్రం పంపించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులతో పాటు వంద మంది సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. దాదాపు మొత్తం పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేసి ఇరవై రెండు రౌండ్స్ గా ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఒక్కొక్క రౌండ్ అయితే దాదాపు ఇరవై నిమిషాల సమయం తీసుకుంటున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరి కొద్దిసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశం కన్పిస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత సర్వీస్ ఓట్లు నూట ఒక్క సర్వీస్ ఓట్లున్నాయి. ఆ సర్వీస్ ఓట్లను లెక్కించిన తరవాత ఆ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినటువంటి ఈవీఎంలని ప్రత్యేక పహారా మధ్య ఈ కౌంటింగ్  కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ ఈవీఎంలన్నీ తెరచి  ఏజంట్ల సమక్షంలో రౌండ్స్ వారిగా లెక్కిస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇప్పటికే ప్రభుత్వం పై ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలకు దీటుగా ఈ స్థానాన్ని గెలిచి సరైనటువంటి జవాబు ఇవ్వాలనే ఉత్సాహంతో టిఆర్ఎస్ ఉంది. అలాగే హుజూర్ నగర్ ఆవిర్భవించి తాను మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగువ సారి తన భార్య గెలుపుతో అక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్  కూడా భావిస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరేలా ఉంది.

ఉత్కంఠంగా మారిన మూడు రాష్ట్రాల కౌంటింగ్

ఎన్నికల కౌంటింగ్ మొదలైన సందర్భంగా అందరిలో ఉత్కంఠత వాతావరణం నెలకొంది.హర్యానాలో మొత్తం తొంభై శాసన సభ స్థానాలకు గాను ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హర్యానాలో కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికంగా దృష్టి పెడితే, కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చి చూస్తే హర్యానాలో పోలింగ్ డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు నుంచి అరవై ఎనిమిది శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవిలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక మహారాష్ట్ర శాసన సభలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బిజెపి నూట అరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే మిత్ర పక్షం శివసేన నూట ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నూట నలభై ఏడు స్థానాల్లో ఎన్సీపీ నూట ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి.వాళ్ళ వ్యూహాలు నిజమైతాయో లేదో వేచి చూడాలి.

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ రైతులు

తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు నీట మునిగాయి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరకాలం నుంచి పండించిన పంటలు వర్షానికి ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంటలన్నీ కూడా నేల పాలయ్యాయి. మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షాలకు పంట నష్టపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓ వరిపొలం కురుస్తున్నటువంటి వర్షాలకు, గాలులకు ఒక్కసారిగా అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి. ఈ విధంగా వరి పొలమే కాకుండా మొక్కజొన్న, ప్రత్తి మరియు కూరగాయల పొలాలు కూడా నాశనం అయ్యాయి. అకాల వర్షం వల్ల బాగా దెబ్బతింటుంది రైతాంగం అని దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏదైనా నష్ట పరిహారం చెల్లించి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులకు కన్నీటినే మిగిల్చాయి, ఈ వర్షం ఇంకా ఐదు రోజుల పాటు కురవనుంది. అప్పులు చేసి మరీ పంటలపై పెట్టుబడులు పెట్టి పంట చేతికందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వర్షం నిరాశే మిగిల్చింది. అకాలంగా వచ్చిన వర్షం రైతులను అప్పుల పాలు చేయడమే కాక కొందరి రైతులకు బ్రతకడానికి కష్ట తరంగా మార్చింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు తమని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్పెషల్ కోర్టులో హాజీపూర్ కేసు....

మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. స్కూల్ కి వెళ్ళీ చదువుకోవల్సిన విద్యార్ధులను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భువనగిరి జిల్లా హాజీపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్తే వరుస హత్యల కేసులో విచారణ ప్రారంభించింది భువనగిరి స్పెషల్ కోర్టు. ఈ నెల పద్నాలుగు నుంచి పధ్ధెనిమిది వరకు ట్రైల్ నడిచింది. చార్జ్ షీట్ కాపీలతో పాటు డిఎన్ఎ ఫోరెన్సిక్ రిపోర్ట్ లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. చార్జిషీట్ లో మూడు వందల మంది సాక్షులున్నారు,సాక్షులు సహా బాధిత కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లను కోర్టు రికార్డ్ చేసింది. మరో నలభై ఐదు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు రేప్ మరియు మర్డర్ కేసులలో  శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేసు హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు. దాదాపుగా ముగ్గురు విద్యార్థులను పదవ తరగతి విద్యార్ధితో పాటుగా ఏడవ తరగతి విద్యార్ధులు మొత్తం ముగ్గురు విద్యార్థులను కూడా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఎదురయ్యింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు కూడా ఇప్పటికే  సిద్దం అయ్యింది. ఆ స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ ఈ నెల 14 వ తేదీన హజిపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు ట్రయల్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు దాఖలు చేసిన ఈ మూడు కేసుల చార్జిషీట్ లతో పాటుగా దాదాపు మూడు వందల మంది సాక్ష్యాలను ఈ మూడు కేసుల్లోని చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును దాదాపుగా టెక్నికల్ సాక్ష్యాలతో పాటుగా అతను చేసినటువంటి హత్యాచారాలకు సంబంధించి ఫిజికల్ సాక్ష్యాలు కూడా పోలీసులు వివిధ రూపాల్లో రాబట్టారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాబు

ఉపాధి హామీ నిధులు రెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు చంద్రబాబు. టిడిపి హయాంలో చేపట్టిన నరేగా పనులపై వైసిపి ఎన్నో ఆరోపణలు చేసిన ఒక్కదాన్ని కూడా నిరూపించలేక పోయిందని అన్నారు. కేంద్రం ఇప్పుడు నిధులు విడుదల చేసిన వైసిపి ప్రభుత్వం విడుదల చేయడం లేదని చంద్రబాబు విమర్శించారు. 5-8-2019 ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు, 8-7-2019 ఆరు వందల నలభై ఒక్క కోట్లు, 9-4-2019  మూడు వందల అరవై కోట్లు మొత్తం కలిపి పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు. మన వాట ఆరు వందల పదిహేను కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. రెండూ కలిపితే మొత్తం 2460  కోట్ల రూపాయలు  డబ్బులున్నాయి. ఆ డబ్బులు మొత్తాన్ని కూడా మూడు రోజులలో తమ అకౌంట్ లో వేయాలని, డబ్బులు పంచాయతీలోకి వెళ్ళిపోవాలి అని ఆయన సూచించారు, మూడురోజులలో అకౌంట్ లోకి డబ్బులు జమకాకపోతే కనుక పన్నెండు శాతం వడ్డీతో ఇవ్వాలని చంద్రబాబు తెలియజేశారు.దానిపైననే ఇప్పుడు గొడవ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తమ అకౌంట్ లోకి డబ్బులు రావాలని , ఇప్పుడు సర్పంచ్లు లేక పోయినాకనీసం పంచాయతీల ఎకౌంట్ కి అయిన రావాలి అని ఆయన వెల్లడించారు. పంచాయతీ అకౌంట్ నుంచి మొదట ఎవరు వచ్చి పనులు చేస్తారో  వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దొంగ లెక్కలు రాయడంలో ఆరితేరిన జగన్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు చంద్రబాబు. రంగులు ఎక్కడ పడితే అక్కడ వేయడం కాదని వారి ముఖాలకు వేసుకుంటే అరాచకాల చేస్తోంది వారేనని జనం గుర్తుపడతారని కామెంట్ చేశారు. ప్రతి ఒక్క ఊరిలో సిమెంట్ రోడ్లు వేశామని, మురికి కాలువలు కట్టామని,బిల్డింగ్స్ కట్టామని, స్మశానాలు కట్టామని,ఏడు లక్షల పంటకుంటలు తవ్వితే అన్ని పంటకుంటలకు నీళ్లు సంవత్సరానికి పదిసార్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. పదిసార్లు వచ్చాయి కాబట్టి భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, కరువు తీరిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత వరకు ఒక తట్ట మట్టి వేయలేదు ఇరిగేషన్ లో రంగులు మార్చారు ప్రధాన వాళ్ల ముఖాలకే రంగులేసుకోవటమే సరిపోతుంది. వీళ్ళు దొంగల కింద చలామణి అవుతారు కాబట్టి వాళ్ళు ముఖానికి  వేసుకొని తిరిగితే పబ్లిక్ గుర్తుపడతారు జాగ్రత్తగా ఉండాలని  బాబు భావాన్ని వెల్లడించారు.

టీడీపీ, జనసేన వార్నింగ్ తో అలర్టైన జగన్... ఇసుక కొరతను తీర్చేందుకు కొత్త మార్గాలు

ఇసుక కొరతపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం, మరోవైపు టీడీపీ, జనసేనలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇసుక లభ్యతను పెంచేందుకు అధికారులతో చర్చించారు. అయితే, నదుల్లో ప్రవాహ ఉధృతి ఇప్పటికీ తగ్గకపోవడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా ఇసుక రీచ్ లు ఉన్నప్పటికినీ కేవలం 69 చోట్ల మాత్రమే ఇసుక వెలికి తీయగలుగుతున్నామని వివరించారు. దాంతో, ముఖ్యంగా మూడు నెలల కాలానికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో కూడా ఇసుక రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం జగన్‌.... గ్రామ సెక్రటేరియట్ల పర్యవేక్షణలో తవ్వకాలు జరపాలని సూచించారు. అలాగే 20 కిలోమీటర్ల పరిధిలోనే ట్రాక్టర్లు ద్వారా ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఇసుక వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని, ఒకవేళ ఎవరైనా నిల్వచేసే చర్యలు తీసుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

మున్సిపోల్స్ కు ఎప్పుడైనా రెడీ... ఎన్నికల సంఘానికి కేసీఆర్ సందేశం

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే... అప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా... ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సంసిద్ధతను తెలియజేయడంతోపాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అలాగే, వార్డుల విభజన, ఓటర్ల జాబితాల ప్రకటన పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల సేకరణ వంటి అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయన్న కేసీఆర్... వార్డుల వారీగా రిజర్వేషన్స్‌ వేగంగా ఖరారు చేయాలని ఆదేశించారు.

కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలపై రాజీ... జగన్ పై పవన్ ఘాటు విమర్శలు...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ ను సీబీఐ కేసుల భయం వెంటాడుతోందన్న పవన్.... అసలు అవినీతి కేసులున్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే... రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కేసుల భయంతోనే రాష్ట్ర అవసరాల గురించి, రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని పవన్ విమర్శించారు. తనపై ఉన్న కేసుల కారణంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీపడుతున్నారని ఆరోపించారు. ఇక, రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. సొంత చిన్నాన్న హత్య కేసు ఏమైందని నిలదీశారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్.... సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, మరి ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైందని పవన్ ప్రశ్నించారు. ఇక, ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికుల రోడ్డునపడ్డారన్న జనసేనాని... నవంబర్ మూడున విశాఖలో పెద్దఎత్తున నిరసన చేపడతామన్నారు.

ఆర్టీసీ సమ్మెకు పరిష్కారమెప్పుడు? హైకోర్టే అటోఇటో తేల్చేయనుందా?

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుల చర్చలు జరిపేందుకు ముందుగా డిమాండ్లపై మరోసారి సమీక్ష, పరిశీలన జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఏర్పాటుచేసిన కమిటీ.... కార్మికుల డిమాండ్లపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా... మిగిలిన 21 డిమాండ్లపై అధ్యయనం చేస్తూ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. బస్ భవన్లో సుదీర్ఘంగా సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ... కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తప్ప... మిగతా అంశాలపై ఈడీ కమిటీ దృష్టిపెట్టింది. ప్రతి డిమాండునూ క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న కమిటీ... వాటిని అమలుచేస్తే ఆర్టీసీపై ఎంత భారం పడుతుందనే దానిపై నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రతి డిమాండుకూ రెండు రకాల సమాధానాలు సిద్ధంచేస్తోన్న అధికారులు.... హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నాయంటోన్న ప్రభుత్వం... ఇతర డిమాండ్లపై మాత్రం కమిటీ నివేదిక ఆధారంగా చర్చలు జరపాలని నిర్ణయించింది. అక్టోబర్ 28లోపు కార్మికులతో చర్చలు జరిపి ఆ సారాంశాన్ని తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో... ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈడీ కమిటీ సూచనలు సలహాల మేరకు హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా... ఒకట్రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరిపి న్యాయస్థానానికి నివేదించనుంది. అయితే, కార్మికులతో చర్చలు జరపాలంటూ హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీకి ఆదేశించడంతో... అతని ద్వారానే తాము చెప్పదల్చుకున్నది న్యాయస్థానానికి తెలపాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రభుత్వ వెర్షన్ ఇలాగుంటే, ఆర్టీసీ విలీనం డిమాండ్ పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రభుత్వం అవసరమైతే ఆర్టీసీ సమ్మె ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని సవాలు విసిరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్యాయమని ప్రజలు తేల్చితే తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరతామన్నారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ కి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని అశ్వద్ధామరెడ్డి డిమాండ్ చేశారు. తామెప్పుడూ విలీనం కాకుండా మిగిలిన డిమాండ్లపై చర్చకు వస్తామని చెప్పలేదన్నారు. అయితే, చర్చల్లేవ్‌ అని ఒకసారి... విలీనం మినహా చర్చలకు ఓకే అని మరోసారి ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోందని మండిపడ్డారు. అయితే అటు ప్రభుత్వం... ఇటు కార్మిక సంఘాలు మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుండటంతో... మరి ఈనెల 28న హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదిఏమైనా హైకోర్టు సీరియస్ గా జోక్యం చేసుకుంటేనే తప్ప సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.

తిరుపతిలో మద్య నిషేధం సాధ్యమేనా? టీటీడీ నిర్ణయంపై ప్రభుత్వ రియాక్షనేంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా తిరుపతిలోనూ మద్యపాన నిషేధం అమలు చేయాలని బోర్డు మీటింగ్ లో తీర్మానించింది. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని టీటీడీ బోర్డు మీటింగ్ లో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అంటే కేవలం తిరుమల మాత్రమే కాదని... పేరులోనే తిరుమల, తిరుపతి కలిసి ఉన్నాయని బోర్డు వ్యాఖ్యానించింది. అయితే, ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితి నెలకొందని, కొందరు ఏకంగా కొండపైకే మద్యాన్ని తీసుకొస్తున్నా పట్టుకోలేని పరిస్థితి ఉందని, ఇక తిరుపతిలోనూ మద్యం నిషేధం అమలు చేస్తే నియంత్రించడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో మద్యాన్ని నిషేధిస్తే స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు. మరి, తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలన్న టీటీడీ బోర్డు నిర్ణయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తిరుపతిలో మద్యపానాన్ని నిషేధించాలన్న నిర్ణయాన్ని పక్కనబెడితే.... గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ వేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకోనున్నట్లు పాలక మండలి ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు చేశారంటూ విజయసాయిరెడ్డితోపాటు రమణదీక్షితులుపై గతంలో టీటీడీ పరువునష్టం దావా వేసింది. అయితే, ఆ దావాను ఉపసంహరించుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

హుజూర్ నగర్ బైపోల్ రిజల్ట్... 14 టేబుళ్లపై కొనసాగుతోన్న కౌంటింగ్

తెలంగాణతోపాటు ఏపీలోనూ తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో మరికాసేపట్లో తేలిపోనుంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లో హుజూర్‌నగర్‌ బైపోల్ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితం రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తలపడిన హుజూర్‌నగర్‌ బైపోల్ లో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉండటంతో, కౌంటింగ్‌పై కాంగ్రెస్‌లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మబోమంటోన్న ఉత్తమ్ దంపతులు... విజయం కాంగ్రెస్‌దేనన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీ అసలు డిపాజిట్టే రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..

  భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం పై వెలసిన ఉగ్రవాద శిబిరాలు లాంచ్ పాడ్ లను ధ్వంసం చేసిన తర్వాత పలుమార్లు దాడులకు పాల్పడింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం మోర్టార్ షెల్స్ తో కాల్పులు జరిపింది. పేలకుండా భారత భూభాగం పైకి వచ్చి పడిన మూడు మోర్టార్ షెల్స్ ను సరిహద్దు భద్రతా జవాన్ లు పేల్చివేశారు. సరిహద్దు లోని పూంచ్ సెక్టార్ పరిధిలో గల కర్మార గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. భారత సైన్యం రెండు రోజుల క్రితం భారీ కాల్పులతో పీవోకే లోని ఉగ్రవాద శిబిరాలను సైనిక పోస్టులను ధ్వంసం చేసినా పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల గుండా ఉగ్రమూకల్ని పంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్ము కశ్మీర్ లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ముష్కరులు హతం కాగా ఒక సైన్యాధికారి నేలకొరిగాడు. ఎల్.వో.సీ వెంట పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆగస్టులో గుజర్ వర్గానికి చెందిన ఇద్దరి సోదరులను చంపడంలో వీరి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ లోకి చొరబడటానికి ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు, సరిహద్దు దాటేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలని గుర్తించడానికి డ్రోన్ లు వినియోగిస్తున్నారు. కేమెరాలతో కూడిన డ్రోన్ లను ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, హుసేన్ వాలా సెక్టార్ లలో భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఈ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలు మోహరించారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ కూడా వీరికి సహకారం అందిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు భద్రతా బలగాలు ఇప్పటి వరకూ మూడు డ్రోన్ లను కూల్చివేసినట్లుగా అధికారులు ప్రకటించారు.  

బిసిసిఐ అధ్యక్షుడిగా రంగంలోకి దిగిన దాదా...

  ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయి బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అరవై ఐదేళ్లలో ఇదే తొలిసారి.టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ పగ్గాలను అందుకున్నారు. బుధవారం బిసిసిఐ ముప్పై తొమ్మిది వ బాస్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ముప్పై మూడు నెలల సీఓఏ పాలనకు ఫుల్ స్టాప్ పడనుంది. బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ తొమ్మిది నెలల పాటు పదవిలో ఉండనున్నారు. లోధా నిబంధనల ప్రకారం క్రియాశీలకంగా వరుసగా ఆరు సంవత్సరాలకు మించి పదవిలో ఉండరాదు. ఇప్పటికే గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదా జులై వరకే బిసిసిఐ అధ్యక్ష పదవిలో ఉంటారు. నిజానికి బీసీసీఐ ఎన్నికలు బుధవారం జరగాలి. కానీ పోటీ లేకపోవటంతో బీసీసీఐ టాప్ పోస్ట్ కు దాదా మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. బీసీసీఐ వార్షిక సమావేశంలో దాదా బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతను స్వీకరించారు. కార్యదర్శిగా అమిత్ షా కొడుకు జైషా, ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్ కు చెందిన మహిమ్ వర్మా, కోశాధికారిగా కేంద్రమంత్రి బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధుమాల్, మరో కోశాధికారిగా కేరళకు చెందిన జయేశ్ జార్జి సంయుక్త కార్యదర్శి గానూ బాధ్యతలు స్వీకరించారు. టీమిండియా కెప్టెన్ గా తనదైన ముద్ర వేసిన గంగూలీ బిసిసిఐని ఎలా నడిపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. బిసిసిఐకి మునుపటి ఇమేజ్ ను తీసుకురావటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను మరింత మెరుగుపరచడం, ఐసీసీలో బిసిసిఐ పరపతిని పెంచటం ఇలా అనేక సవాళ్లు గంగూలీ ముందున్నాయి. దీంతో తొమ్మిది నెలల పార్ట్ టైమ్ లో బిసిసిఐని గంగూలీ ఎలా ఎదురుకుంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.పూర్తిస్థాయి బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం చివరిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో విజయనగరం మహారాజు విజయానంద గజపతి రాజుకే దక్కింది. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా రెండు వేల పద్నాలుగులో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. కానీ కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక విధుల్లో ఉన్నారు. ఇక పై దాదా తన ముందున్న సవాళ్లని ఎలా ఎదురుకుంటాడో అనేది వేచి చూడాలి.

భారీ వర్షాలకు కర్ణాటక లో పన్నెండు మంది మృతి...

  కర్ణాటకను భారీ వర్షాలు ముంచెస్తున్నాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహంలో వాహనాలు సైతం కొట్టుకు పోతున్నాయి. మైసూరు, కొడుగు, చిక్ మంగళూర్, శివమొగ్గ లో భారీ వర్షాలు పడ్డాయి.  ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వందలాది గ్రామాలు నీట మునిగిపోయి అపార నష్టం వాటిల్లింది. ప్రధాన పంటల్లో ఒకటైన ఉల్లి పంట పూర్తిగా నీటిపాలైంది. ఇక ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలుచోట్ల వరద నీరు పంట భూములు ఊళ్లను ముంచేస్తోంది. పొంగిపొర్లుతున్న వరద నీటిలో వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. అటు అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కుండ పోత వర్షం వల్ల వరద నీరు ఊళ్లను ముంచేస్తోంది. దీంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు నీటిలో గడపాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో ఆరు బయటే గడపాల్సిన పరిస్థితి.  అధికారులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. భారీ వరదల వల్ల పలు ప్రాంతాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో రహదారులు వంతెనలు వరద నీటిలో కొట్టుకు పోతున్నాయి. రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నడీలను అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఇటీవలి కాలంలో తాము ఇలాంటి వర్షాలు చూడలేదని అక్కడి జనం చెప్తున్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇరు వర్గాల భేటీ తర్వాత ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రానుందా...

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కొస్తుందా. కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య  కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా. ఇరువర్గాలూ మెట్టు దిగడానికి అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి బస్ భవన్ వర్గాలు.ఇరువర్గాల మధ్య ఆర్టీసీ విలీనంపైనే పీటముడి నెలకొని ఉంది. విలీనానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే మిగిలిన అంశాలకు అంగీకరిస్తే విలీనంపై కార్మిక సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నాటికి  సమస్య పరిష్కారం అవుతుందని హై కోర్టు ఆశాభావం వ్యక్తం చేసిన నేపధ్యంలో కమిటీ సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.కోర్టు ఉత్తర్వులు అందితే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.కార్మికుల డిమాండ్ లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.రెండురోజుల్లో ఎండీకి నివేదిక ఇవ్వనుంది నిన్న దీని పై ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ హై కోర్టు ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.కార్మికులు మెట్టు దిగడానికి అవకాశం ఉందా విలీనం డిమాండ్ మినహాయిస్తే కార్మి కుల డిమాండ్ లో ప్రధానమైనవేంటి, కార్మికుల సమ్మె కు ఎలా ముగింపు పలకవచ్చని అంశాల పై ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది.మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరింది బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేపట్టారు.అఖిల పక్ష పార్టీ లు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నేతలు కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ కొద్ది సేపట్లోనే బస్ భవన్ లో భేటీ అవుతుంది. కోర్టు సూచించినటువంటి ఇరవై ఒక్క అంశాలు ముందుగా కార్మిక సంఘాలన్ని కలిసి టీఎంయూ ఆధ్వర్యంలో నలభై రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.

ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి ప్రశంసా పత్రాలు...

  ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ మల్కాజిగిరి లోని మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్థానికులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని తీర్మానం చేశారు. గత పది రోజులుగా కాలనీ లోని ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్లాస్టిక్ ని వాడద్దు, ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించాలంటూ మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సదస్సుకు హాజరైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాట్లాడుతూ, రెండు వేల జూట్ బ్యాగ్స్ ను ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లతో ఇరవై నిమిషాల పాటు సమయాన్ని గడిపి ప్లాస్టిక్ మీద అవగాహన తీసుకురావటం జరిగిందన్నారు. రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు మోదీగారి పుణ్యమా అంటూ ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పటం వల్ల ప్రతి ఒక్క డిపార్టుమెంటు, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్టిక్ మీద యుద్ధం మరల మొదలు పెట్టారని అన్నారు. ఇది చాలా సంతోషంగా అనిపించింది అని ఇటీవలె పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు వారం రోజుల నుంచి ప్లాస్టిక్ విసర్జన కార్యక్రమం మొదలుపెట్టారని ఇది చాలా కష్ట తరంగా ఉందని అన్నారు. ఎందుకంటే గ్రామాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో పప్పు ఉప్పు వేసుకుంటున్నారని, వాటివల్ల క్యాన్సర్ వస్తుందన్నా కూడా తొందరగా వాళ్ళు ఎలాంటి అవగాహన చేసుకోలేకపోతున్నారన్నారు.

జనాలు చనిపోతున్నా పట్టించుకోరా... తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్!!

  తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ సోకి పలువురు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తెలిపింది.

బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజు మృతదేహం లభ్యం

  కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. బోటు నుంచి వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజుతో పాటు బోటులో ప్రయాణించిన వరంగల్ కు చెందిన పర్యాటకుడు కొమ్ముల రవీందర్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన ఆరు మృతదేహాలు ఎవరివన్నది నిర్ధారించాల్సి ఉంది. మొత్తం మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే మహిళది. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వెలికితీసిన వశిష్ట బోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోటు ఏసీ క్యాబిన్ లో ఉన్నాయి. బోటు గల్లంతైన రోజునే గల్లంతయిన వాళ్లంతా ఏసీ క్యాబిన్ లో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకొని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారిలో పన్నెండు మంది జాడ తెలియాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది బయటపడటంతో మిగిలిన నలుగురి జాడ కోసం బోటు ఉన్న ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు.మృత దేహాలు బాగా కుళ్ళీపోయి ఉండటంటో ఎవరివో గుర్తించటం చాలా కష్టంగా మారింది. మృతుల బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాదకర వాతావరణం నెలకొంది.

తప్పని తిప్పలు.. కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం

  జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది, గంగాధర క్రాస్ రోడ్స్ లో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ప్రయాణ సమయంలో బస్సు లో అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు నిలిచిపోవడంతో కిందకు దిగి తోసి ప్రయాణికులు చమటలు కక్కారు. తాత్కాలిక డ్రైవర్ కావటంతో నానా పాట్లు పడ్డారు, తమ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు, దీంతో వారికి డబ్బులు తిరిగి చెల్లించారు. తాత్కాలిక డ్రైవర్ లతో అటు ప్రమాదాలు జరుగుతూ ఉండగా ఈరోజు సాంకేతిక లోపంతో బస్సులు ఆగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. సమస్యలైతే ఉత్పన్నమవుతూనే ఉన్నాయి, వీటి పరిష్కారం దిశగా అధికారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకైతే అటు ప్రభుత్వం గానీ అధికారులు గానీ తాత్కాలిక డ్రైవర్ లు, కండక్టర్ లతోనే బస్సులు నడిపిస్తున్నారు. నిన్న కరీంనగర్ నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వేములవాడకు వెళుతుండగా ఆ బస్సు వెంకట్రావుపేట దగ్గర డీజిల్ లేక ఆగిపోయింది. తాజాగా ఈ రోజు కరీంనగర్ జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సు గంగాధర ఎక్స్ రోడ్ దగ్గర సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది. బస్సు అలా రోడ్ మద్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు బస్సులు నడిపిస్తున్న వారంతా తాత్కాలిక డ్రైవర్లు కావడంతో బస్సులో వచ్చే సాంకేతిక లోపాలను అప్పటికప్పుడు బాగుచేసే నైపుణ్యం ఉండదు కాబట్టి ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.