హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎదురవుతున్న అవాంతరాలు...

  హుజూర్ నగర్ పోలింగ్ జరుగుతోంది. మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ పద్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బిజెపి నుంచి రామారావు, టిడిపి నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం మూడు వేల మూడు వందల యాభై మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 53 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు సమాచారం. కానీ అధికారికంగా పోలింగ్ శాతం రావాల్సి ఉంది. అయితే తొలి గంటలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ప్రధానంగా నేరేడుచర్ల మండల కేంద్రంలోని చింతబండ లోని ముప్పై ఒకటి, ముప్పై మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించడంతోటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల బయటనే వేచి చూసిన పరిస్థితి ఉంది. అయితే టెక్నికల్ సిబ్బందిని పిలిపించి ఈవిఎంలను నడిపించే  పరిస్థితిలో అధికారులు ఉన్నారు.  మఠంపల్లి మండలంలో ఒక చోట మాత్రం వెలుతురు సరిగా లేని కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ లోని నూట అరవై ఎనిమిదిలో సరైన వెలుతురు లేక గుర్తులు సరిగా కనిపించటం లేదని చెప్పి ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో దానిని సరిదిద్దే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ గుర్తు ఎక్కడ ఉందనేది చీకటి ఉన్న నేపథ్యంలో మాత్రం సరిగా కనిపించటం లేదని చెప్పే అక్కడ ఒక ఓటర్ ఆరోపణ చేశారు.దానిని సరిచేసే ప్రయత్నాలలో అధికారులు ఉన్నారు.

ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్న నేతలు...

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పదహారు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై యొక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తిపూర్ లోకసభ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి.  నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా ప్రతినిధులను ఓటు వేసి ఎన్నుకోవటం ఓటర్ల హక్కు అని మోహన్ భగవత్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక హర్యానాలోని దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుస్తీ క్రీడాకారిణి బబితా ఫోగట్ బలాలీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జా హిస్సార్ లోని యశోదా పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ ఓటువేసారు. బీజేపీ కూటమికి మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఫడ్నవీస్ తోనే జనం ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సతీమణి కంచన్ తో కలిసి నాగపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారీ మహారాష్ట్రలో అధికారంకి వచ్చేది కాంగ్రెస్ ఎన్సీపీ కూటమేనని సూలే ధీమా వ్యక్తం చేశారు.  హర్యాణలోని బాద్ షాపూర్ లో ఉన్న రెండు వందల ఎనభై ఆరువ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించటంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర లోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో రెండు వందల ముప్పై ఐదు మంది మహిళలే ఉన్నారు. మరోవైపు హర్యానాలోని తొంభై స్థానాలకు గాను పదకొండు వందల అరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. ఇందులో నూట నలుగురు మహిళలు. మహారాష్ట్రలో రెండవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ తన ప్రధాన మిత్రపక్షమైన శివసేనతో కలిసి బరిలోకి దిగింది. మరోవైపు గత వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో పోటీలో నిలిచాయి. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో పాటు పలు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. దాదాపు పద్నాలుగు వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలిచారు.  హర్యాణలో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండోసారి కూడా విజయ ఢంకా మోగించాలన్న పట్టుదలతో ఉంది. ఐఎన్ఎల్డీ నుంచి వేరుపడి చౌతాలా కుటుంబీకులు స్థాపించిన జన్ నాయక్ జనతా పార్టీ తొలిసారి పోటీ చేస్తూ సత్తాచాటాలి అన్న సంకల్పంతో ఉంది. ఐఎన్ఎల్డీ కూడా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మూడు వందల డెబ్బై ఐదు మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో ఉన్నారు.ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తమ పార్టీ నేతల ప్రయత్నాలు సఫలీకృతమైయ్యయా అన్నది వేచి చూడాలి.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోలీసులు నిజంగానే ప్రేక్షక పాత్ర వహించారా?

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై  వివిధ పార్టీలు చాలా ఆసక్తి చూపించాయి.ఎవరికి తగ్గ రీతిలో తమ దైన శైలిలో ప్రచారాలతో ముందుకుపోయారు పార్టీ నేతలు.ప్రచారల గడువు ముగిసిన తరువాత కూడా అధికారులు ఎంత నిఘా పెట్టినా హుజూర్ నగర్ లో జరగాల్సిన కార్యక్రమం జరిగింది. రాత్రికి రాత్రే ఎవరికి కావాల్సిన సరుకు వారికి చేరిపోయింది. కోట్లాది రూపాయల డబ్బును పార్టీలు పంచేశాయి. పీపాలకు పీపాల మద్యాన్ని తాగించేశాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నోట్ల కట్టలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి ఒకెత్తయితే చివరి రెండ్రోజులు ఒకెత్తు అన్నట్టుగా ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నించాయి. ఒక్క శనివారం రాత్రే సుమారు ముప్పై ఐదు కోట్లు పంపిణీ చేశారు. హోరాహోరీ తలపడుతున్న రెండు పార్టీలు కేవలం మద్యానికే ఆరు కోట్లు ఖర్చు చేశాయి. మండల స్థాయి నాయకులకు చెక్కుల ద్వారా డబ్బులు అందించగా వారు ముందుగా శనివారం రాత్రికి రాత్రే పంపిణీ పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల స్థానిక వ్యాపారులు పెట్టుబడిదారుల వద్ద చేబదులుగా తీసుకుని స్థానిక నేతలకు అందజేశారు.  మరోవైపు హుజూర్ నగర్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన డబ్బును వివిధ సంఘాల నేతలు వారి అనుచరులకు అప్పగించారు. వారంతా ఆ కొద్ది మొత్తాన్నే ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుల మాదిరిగా వచ్చి ఎంచుకున్న ప్రాంతాలకు డబ్బు సంచులను చేరవేశారు. అరవై మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీ చొప్పున నియమించిన ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలో వారిని కీలకం చేశాయి. ఒక ప్రధాన పార్టీ ఓటర్ కు వెయ్యి రూపాయలు పంచగా, మరో పార్టీ ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చింది. మరోవైపు డబ్బులిస్తూనే కొందరు కార్యకర్తలు ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారు. కళ్లేపల్లి మైసమ్మ, దుప్పలపల్లి మైసమ్మ దేవతల వద్ద మొక్కి తెచ్చామని డబ్బులు తీసుకున్న వారు తాము చెప్పిన గుర్తుకు ఓటు వేయాలని లేదంటే ఆ దేవతల ఆగ్రహానికి గురవుతారు అంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటు ఎన్నికల కమిషన్ సిబ్బంది, ఇటు నిఘా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినపడుతున్నాయి.ఇక పార్టీ నేతల ప్రయత్నాలు సఫలం అయ్యాయో లేదో ఫలితాల నాడే తేలనుంది.

ప్రాణమున్నంతవరకు టీడీపీలోనే... ఒక్క మాటతో తేల్చేసిన యూత్ ప్రెసిడెంట్...

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారాన్ని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దేవినేని అవినాష్... అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే... ఇలాంటి అసత్య ప్రచారానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్న దేవినేని అవినాష్... ఇసుక కొరతతో లక్షలాది కార్మికులు రోడ్డునపడ్డా పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఇసుక కార్మికుల కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, ఆకలి బాధ తీర్చుకోవడానికి చివరికి చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. ఇక, తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉండే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. అలాగే తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ఆంక్షలు విధించారని నిప్పులు చెరిగారు. ఇసుక కొరతపై అక్టోబర్ 24న దీక్షలు చేపట్టనున్నట్లు  దేవినేని అవినాష్ ప్రకటించారు.

ఎన్నికలు, ఉపఎన్నికల హోరహోరీ పోరుతో వేడెక్కుతున్న రాష్ట్రాలు...

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

ఓ సామాన్యుడు... వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు... కల్కి కథలు

  ఓ సామాన్య వ్యక్తి... భగవాన్‌గా అవతారమెత్తాడు. కల్కి అసలు పేరు విజయకుమార్. భక్తి ప్రవచనాలు చేసే విజయకుమార్ ఆధ్యాత్మిక గురువుగా మారాడు. శిష్యులను పెంచుకున్నాడు. దేశ విదేశాల్లో శిష్యులు కల్కి గురించి విస్తృత ప్రచారం చేశారు. కల్కి దర్శనంతో అంతా మంచి జరుగుతుందని, రోగాలు నయం అవుతాయని ప్రచారం చేశారు. ఇంకేముంది తండోపతండాలుగా ప్రజలు కల్కి ఆశ్రమానికి క్యూకట్టారు. దాంతో వందల ఎకరాల్లో ఆశ్రమాన్ని విస్తరించారు. పాల రాతితో అందమైన కట్టడాలు కట్టారు. పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక, ధ్యాన భవనాలు నిర్మించారు. క్యూకాంప్లెక్స్లు ఏర్పాటు చేశారు. క్యాష్ కౌంటర్లు నెలకొల్పారు. ఎంతలా అంటే ఆ భవనాన్ని ఒక్కసారైనా చూడాలనిపించేలా సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇక, కల్కికి ఆదరణ పెరగడంతో విజయకుమార్ సతీమణి కూడా రంగంలోకి దిగింది. అమ్మ భగవాన్‌గా భక్తులకు పరిచయమైంది. ఇద్దరూ ఒకేచోట ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆశ్రమానికి వచ్చే విదేశీ భక్తుల నుంచి భారీగా విరాళాలు వసూలుచేసేవారు. దర్శనానికైతే కొంత... పాదాలు మొక్కితే ఇంత అంటూ రకరకాల సేవల పేరుతో డబ్బు వసూళ్లు చేపట్టేవారు. విదేశీ భక్తులైతే తమ ఆస్తుల మొత్తాన్ని ఆశ్రమానికి ఇచ్చేస్తారని తెలిసింది. అలా విదేశీ భక్తులు ఇచ్చిన విరాళాలే వందల వేల కోట్లకు చేరుకున్నాయి. దాంతో ట్రస్ట్ పేర్లు మారుస్తూ, కల్కి ఆశ్రమ ఆస్తులు, లెక్కలు ఉన్నట్లు తేలింది.

వరుస భేటీలతో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశం తుది దశకు చేరనుందా?

  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.

గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... ఐటీ రైడ్స్ లో కల్కి గుట్టురట్టు...

  గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... కిలోలకొద్దీ బంగారం... కోట్ల విలువైన డైమండ్లు... వందల కోట్ల రూపాయల దేశ విదేశీ కరెన్సీ...  వేల కోట్ల అక్రమాస్తులు... ఇదీ కల్కి ఆశ్రమాల్లో పరిస్థితి. ఐటీ దాడుల్లో కల్కి గుట్టురట్టవుతుంది. ఐటీ దాడులతో కల్కి అక్రమ సామ్రాజ్యంలో చీకటి కోణం వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే కాదు... విదేశాల్లోనూ కల్కికి అక్రమ ఆస్తున్నాయని తేలింది. కల్కి ఆశ్రమంతోపాటు 40చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ దాడుల్లో వందల వేల కోట్ల విలువైన ఆస్తులతోపాటు బంగారం, నగదు దొరకడంతో అధికారులే నివ్వెరపోయారు.   కోట్లాది రూపాయలు పోగుపడటంతో కల్కి కుమారుడు కృష్ణాజీ పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వేలాది ఎకరాల భూములు కొన్నారు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్టు కోసం భారీ మొత్తంలో నిధులు సేకరించారు. తరచూ ట్రస్టు పేర్లు మారుస్తూ ఐటీ శాఖను బురిడీ కొట్టించారు. వందల కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్లు రికార్డుల్లో తేలింది. అయితే, నాలుగైదు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా... కల్కి, అమ్మ భగవాన్ మాత్రం ఎక్కడున్నారనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఆశ్రమంలో ఉన్నారా లేరా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే, కల్కి అక్రమాలపై నిగ్గుతేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కల్కి భగవాన్ ఎన్నికలప్పుడు ఓ పార్టీకి కొమ్ముకాశారని... వారికి సొమ్ములిచ్చారని ఆరోపిస్తున్నారు. కృష్ణా దాసాజీ, లోకేష్‌ దాసాజీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని కోరుతున్నారు.  

రెండు వర్గాలుగా విడిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. అసలేం జరుగుతోంది?

  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.

యమదూతల్లా తాత్కాలిక డ్రైవర్లు... ఇప్పటివరకు పదిమంది మృతి...

ఆర్టీసీ సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం... ప్రజల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. ముఖ్యంగా తాత్కాలిక డ్రైవర్లు ప్రజల పాలిట యమదూతల్లా మారుతున్నారు. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బస్సెక్కిన ప్రయాణికులు... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటే... ఇక ప్రజలు రోడ్డుపక్కన నడవాలంటేనే భడుపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. బస్సులు బోల్తాపడటం, చెట్లను, వాహనాలను ఢీకొట్టడమే కాకుండా రోడ్డు పక్కన వెళ్తున్నవారిని సైతం వదలకపోవడంతో ఇప్పటివరకు 10మందికి పైగా మృతిచెందారు. ఇక, గాయపడినవారి సంఖ్య వందల సంఖ్యలో ఉంది. తృటిలో ప్రాణాలతో బయటపడ్డవాళ్లూ చాలా మందే ఉన్నారు. దాంతో ప్రజలు... ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే కాదు... బస్సు వస్తున్నప్పుడు రోడ్డు పక్కన నిలబడాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది.

మోదీకి పూరీ జ'గన్' లేఖ.. ఆయన సినిమా డైలాగ్స్ లాగానే బలంగా తగిలింది!!

  టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసారు. పూరీ జగన్నాథ్ అందరిలా కాకుండా సమాజాన్ని చూసే కోణం కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో జీవితం మరియు సమాజం గురించి చెప్పే మాటలు యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అయితే తాజాగా పూరీ రాసిన లేఖ యువతని ఆలోచనలో పడేలా చేసింది. ప్లాస్టిక్ పర్యావరణానికి హాని, ప్లాస్టిక్ నిషేధించి పేపర్ బ్యాగ్ లు వాడాలని ఎప్పటినుంచో అందరూ చెప్తున్నారు. ఇటీవల మోదీ కూడా.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు కూడా అవును నిజమే కదా.. ప్లాస్టిక్ ని నిషేధించి, పేపర్ బ్యాగ్ లు వాడితే పర్యావరణానికి మంచిదని భావించారు. అయితే పూరీ మాత్రం దీన్ని వేరే కోణంలో ఆలోచించారు. ఏకంగా మోదీకి లేఖ రాసి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినంతమాత్రాన పర్యావరణం బాగుపడదని, అందుకోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. ఒక లేఖ రాసి ట్విటర్ లో షేర్ చేశారు.   'ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య వాతావరణ మార్పు. దానికి ప్లాస్టిక్ వాడకం కూడా ఒక కారణం. కానీ అదొక్కటే కారణం కాదు. వాతావరణ మార్పునకు చాలా కారణాలు ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. 1960 దశకంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల పేపర్ బ్యాగ్‌ల వాడకం తగ్గి.. చెట్లు, అడవులను కొట్టేయడం తగ్గింది. మళ్లీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించి పేపర్ బ్యాగ్‌లు వాడడం మొదలుపెడితే చెట్లను, అడవులను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే అవి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి. అందుకే ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకొస్తే డబ్బులిస్తామని ప్రకటిస్తే.. ప్రజలే ఆ యూనిట్లకు తాము వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తీసుకొస్తారు. ఇలాంటి చర్యలు చేపడితే ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చ' అని పూరీ ఆ లేఖలో పేర్కొన్నారు. పూరీ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే గాక యువతని ఆలోచనలో పడేసింది.

ఆదిలాబాద్ జిల్లాల్లో ఆర్టీసీ సమ్మె పై ఎమ్మెల్యేల మౌనానికి కారణాలు ఏమిటి?

ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృక్తం అవుతున్న నేపధ్యంలో కొన్ని అనుమానాలు మాత్రం అందరినీ వెంటాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు ,వీరెవరూ సమ్మె పై ఇప్పటికీ నోరు విప్పలేదు. మొత్తం ఆరు డిపోల పరిధిలో సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజక వర్గంలోని భైంసా, మంచిర్యాల ,ఆస్ఫాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు నిత్యం సాగుతున్నాయి.నిర్మల్ సిటింగ్ ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇప్పటికీ స్పందించకపోవటం గమనార్హంగా మారింది.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే సొంత నియోజకవర్గంలో పర్యటించిన సమ్మె పై ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదట. ఈ లెక్కన గులాబీ బాస్ కు సొంత పార్టీ ప్రజా ప్రతి నిధుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించడం లేదన్న చర్చ సాగుతోంది.ఆర్టీసి విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆర్టీసీ కార్మికులపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఇతర కార్మిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నుంచి మాత్రమే కాకుండా సాధారణ ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. సమ్మెలో ఉన్నవారి ఉద్యోగం పోయినట్టే అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కూడా ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. పైగా బస్ డిపోలు, బస్టాండ్ ల వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత కారణమవుతోంది. భద్రతా చర్యల పేరిట కొన్ని ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్న అతిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంత నిర్బంధం లేదని అప్పుడు పోలీసులు ఇలాగే చేస్తే తెలంగాణ ఉద్యమం కొనసాగేదా అని ప్రజల్లో చర్చ సాగుతోంది. మొత్తం మీద ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఖరి, కొందరు అమాత్యుల అనాలోచిత వ్యాఖ్యలు మరి కొందరు మంత్రులు మౌన మునులుగా మారడం ఇలాంటివన్నీ టీఆర్ఎస్ సర్కార్ సంకట స్థితిలో ఉందనడానికి నిదర్శనలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.చివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెన్నుదన్నుగా నిలిచే అభిమానుల సైతం మౌనం దాల్చడం గులాబీ పార్టీకి మింగుడుపడని పరిణామంగా మారిందట. ఈ క్రమంలో ప్రస్తుతం మెజారిటీ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అటు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేక ఇటు సమ్మెను ఖండించలేక కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు  దారి తీస్తుందో వేచి చూడాలి.

నిర్మలాపై పరకాల ఎఫెక్ట్... కేంద్రంలో కలకలం రేపుతోన్న కామెంట్స్

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

ఆర్టీసీ సమ్మె ఇంత తీవ్రంగా మారడానికి మంత్రుల మాట వైఖరే కారణమా?

ఆర్టీసీ సమ్మె సందర్భంగా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది అధికార టీఆర్ఎస్ ముఖ్య నేతలు పరిస్థితి. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది.పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించే విషయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతున్నందున అనవసరంగా తిట్లు తినడం దేనికన్న భావనతో నేతలు నోరుతెరవడంలేదంటూ ఆరోపణలు వెల్లువడుతున్నాయి. చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాకు దూరంగా ఉంటున్నారని, మీడియా ప్రతి నిధులు మాట్లాడించాలని చూసినా సమ్మె విషయం తప్ప ఏదైనా అడగాలని జవాబు ఇస్తూ అసలు విషయాన్ని దాటేస్తున్నారు . దాదాపు మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దసరా సెలవుల్లో సమ్మె చేస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమ్మెను తీవ్రంగా పరిగణిస్తూ కార్మికులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించారు సీఎం. సీఎం ఆగ్రహంగా ఉండటంతో రవాణా శాఖ మంత్రి అజయ్ ఇతర మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి వంటి వారు మరింతగా రెచ్చిపోయారు.ముఖ్యమంత్రి మన్ననలనూ పొందాలనుకున్నారేమో గాని వాళ్లు సమ్మె విషయంలో మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా కార్మికులను బెదిరించడం ఏమిటనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ పరిణామం ప్రజల్లో ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతిని పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనని వారికి మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా వారితో సమ్మెలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారన్న అంశం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలంగా వెళ్తోంది. మరీ ముఖ్యంగా తలసాని, ఎర్రబెల్లి, అజయ్ ,మల్లారెడ్డి లాంటి వాళ్లు తమ తమ ప్రాంతాల్లో బలమైన నాయకులైన వీరిని తెలంగాణ సమాజం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. పదవుల కోసమే వీరు టీఆర్ఎస్ లో చేరారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో సమ్మె విషయంలో వీరి స్పందన ప్రభుత్వ అంచనాను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితి టీఆర్ఎస్ కు శరాఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నిజానికి సమ్మె ప్రారంభంలో అతిగా స్పందించి మంత్రులు మరోసారి సెంటిమెంట్ ను తట్టిలేపారు మీరు మాట్లాడిన తర్వాత తాము మాట్లాడుకుంటే కేసీఆర్  ఏమనుకుంటారో అన్న భావనతో మిగతా మంత్రులు స్పందించారు.ఇందులో కొత్తగా మంత్రైన గంగుల కమలాకర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఇంకా పలువురు మంత్రులు సమ్మె విషయంలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.ఏదో మాట వరుసకు సమ్మె వెనుక విపక్షాలు ఉన్నాయని ఆరోపించటం మినహా స్ట్రైక్ ను మాత్రం పూర్తిగా తప్పుబట్టడం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏం మాట్లాడినా అనవసరంగా తలనొప్పి ఎదురయ్యే అవకాశముందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరికొందరు హుజూర్ నగర్ ప్రచారమంటు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.

కేసు మీద కేసు... రిమాండ్ మీద రిమాండ్... చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తాడా?

చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.

జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారిన ఉన్న ఒక్క ఎమ్మెల్యే!!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతాలు సృష్టించకపోయినా, ఎంతోకొంత ప్రభావం చూపుతుందని భావించారంతా. కానీ, జనసేన ఊహించని ఫలితాలు మూట గట్టుకొని చతికిల పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో.. జనసైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, ఫ్యాన్ గాలి బలంగా వీచినా, అధినేత పవన్ ఓడిపోయినా.. రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన తరపున ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా జనసైనికుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రాపాక చర్యలు మాత్రం అటు జనసేనానిని, ఇటు జనసైనికుల్ని కలవరపెడుతున్నాయి. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో.. అధినేత పవన్ తర్వాత రాపాకపైనే అందరి దృష్టి ఉంటుంది. కావున ఆయన జనసేన గొంతుని అసెంబ్లీలో బలంగా వినిపించడమే కాకుండా.. బయటకుండా తన చర్యలతో పార్టీకి లాభం చేకుర్చాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం.. ఆయన చర్యలతో అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూరుతోంది. దీంతో జనసేనాని మరియు జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఆ మధ్య బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ దేవుడంటూ ఆకాశానికి ఎత్తేసారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు  జగనన్న అని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ మాటలు విని అధికార పార్టీలో ఉత్సాహం పెరిగితే.. జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా రాపాక చేసిన మరో పని కూడా జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు 'వైఎస్ఆర్ వాహనమిత్ర' పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని జగన్ ఇటీవల ఏలూరులో ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి రాపాక పాల్గొన్నారు. అంతేకాదు మంత్రితో కలిసి జగన్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ ఘటన రాజీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జనసైనికుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పాలాభిషేకం ఎపిసోడ్ తో రాపాక వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే రాపాక మాత్రం అబ్బే అలాంటిదేం లేదని ఖండించారు. నిజానికి రాపాక వైసీపీలో చేరుతారనే ప్రచారం ఎన్నికల ఫలితాల తరువాత నుంచే మొదలైంది. అయితే రాపాక మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలో చేరితే తన నెంబర్.. 152 అవుతుందని, అదే జనసేనలో ఉంటే తను నెంబర్ 1 గా ఉంటానని లాజిక్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కాస్త తగ్గినా.. ఆయన చర్యలు మాత్రం ప్రచారానికి ఊపిరి పోస్తున్నాయి.  విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా.. అధికార పార్టీ చేస్తున్న పనులను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ మరీ అధికార పార్టీ కార్యకర్తలాగా.. సీఎంని దేవుడుతో పోల్చడం, సీఎం ఫోటోకి పాలాభిషేకం చేయడమే అసలు సమస్య. ఆయన చర్యలతో అటు జనసేనాని, ఇటు జనసైనికులు తలలు పట్టుకునేలా చేస్తున్నారు. మరి రాపాక ఇకనైనా తన తీరు మార్చుకుంటారో లేక కండువానే మార్చుకొని షాకిస్తారో చూడాలి.

ప్రారంభమైన బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు...

  ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధునికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించుకొనాలనే పర్యాటకుల కోసం భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో నడిచే రైలు ఈరోజు ప్రారంభమైంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు పేరుతో ఐ.ఆర్.సీ.టీ.సీ నడిపే ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఎనిమిది రోజుల పాటు బుద్ధుడు నడయాడిన పలు ప్రదేశాలు సహా వివిధ ప్రసిద్ధ ప్రాంతాలను వీక్షించేలా పర్యాటకుల కోసం ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్, నేపాల్ లోని గౌతమ బుద్ధునికి సంబంధించిన పర్యాటక ప్రాంతాల కోసం భారతీయ రైల్వే నడిపే ప్రత్యేక బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ఈరోజు ప్రారంభమైంది. నేపాల్ లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని సహా భారత్ లోని బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధ్ గయ తొలిసారి ధర్మోపదేశం చేసిన సారానాథ్ నిర్యాణం చెందిన కుషీనగర్ వంటి పలు సందర్శనీయ బౌద్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ రైలు పర్యాటక ప్యాకేజీని రూపొందించారు. ఎనిమిది రోజులు ఏడు రాత్రుల పాటు ఉండే ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక యాత్రలో పర్యాటకులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రైలు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత బీహార్ లోని గయ, రాజగిరి, నలందా అక్కడి నుంచి వారణాసి, సారనాథ్ చేరుకుంటుంది. తర్వాత నేపాల్ లోని లుంబినీ అక్కడి నుంచి కుషినగర్ శ్రావస్తి మీదుగా ఎనిమిదవ రోజు ఆగ్రా కు చేరుకోనుంది. ఎనిమిది కోచ్ లతో కూడిన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలులో ఫస్టుక్లాసు లో తొంభై ఆరు, సెకండ్ క్లాస్ లో అరవై ఏసీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్ లలో పూర్తిగా రెస్టారెంట్, డైనింగ్ హాల్ ఉండగా మరో కోచ్ లో వంటగది ఉంది. తేజస్ రైలులో ఉన్న విధంగా పూర్తి సౌకర్యాలతో బెర్తులు ఉన్నాయి, విలాసవంతమైన హోటళ్లను తలపించేలా కంపార్టుమెంట్ లు ఉంటాయి. ఎనిమిది రోజుల యాత్రకు ఒక్కొక్కరికీ ఫస్ట్ క్లాస్ లో లక్షా ఇరవై మూడు వేల రూపాయలు, సెకండ్ క్లాస్ లో లక్ష రూపాయల వరకు చార్జీలుగా వసూలు చేస్తారు. బౌద్ధ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల సందర్శన కోసం ఎక్కువగా తూర్పు, దక్షిణ, ఈశాన్య, ఆసియా దేశాల నుంచి పర్యాటకులు వస్తారని అధికారులు తెలిపారు. రైలులో ఉన్న రెస్టారెంట్ లో పర్యాటకుల అభిరుచిని బట్టి వంటకాలను వడ్డిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్, చైనీస్, థాయ్ సహా పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వంటగదిలో మంటలు రాకుండా కేవలం ఐరన్ ప్లేట్ లను వేడి చేయడం ద్వారా అత్యాధునికంగా వంట చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఏడాదికి పన్నెండు ట్రిప్పులను నడపాలని ఐ.ఆర్.సీ.టీ.సీ భావిస్తోంది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఏడు నెలల్లో ఈ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి కోచ్ కు ఓ భద్రతా సిబ్బంది ఉంటారు, యాత్రలో కాలక్షేపం కోసం బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఓ చిన్న గ్రంథాలయం, పాదాలకు మసాజర్ వంటి సౌకర్యాలను సైతం అందుబాటులో ఉంచారు.

వైసీపీ నాయకులకు బోయ కులస్తుల హెచ్చరిక...

  అనంతపురం జిల్లాలో వాల్మీకి కులస్తులు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ సామాజికవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసిపెట్టేవారు. అంతే కాకుండా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గట్టిగా డిమాండ్ చేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో గంపగుత్తుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. వాల్మీకి కులస్తుడైనప్పటికీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఓటమి పాలవడం, జడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు గుమ్మగట్ట మండలంలో ఐదు వేలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు జేసీ కుటుంబాన్ని కాదని ఒక సామాన్య అధికారైన తలారి రంగయ్యను అనంతపురం ఎంపీగా గెలిపించారంటే బోయ కులస్థుల ఓటు పవర్ ఏ పరిధిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతల ఒక గ్రూప్ గా అదే పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. జగన్ క్యాబినెట్ లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మంత్రిగా అవకాశం లభించటంతో అధికారం రుచి చూడాలని ఆశించిన అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. మంత్రికి అండగా అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య నిలవడంతో వార్ వన్ సైడ్ కాకుండా ఆయన అడ్డు తగులుతున్నారని రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉండే అనంతపురం పార్లమెంటు పరిధిలో తమను ఎదగనీయకుండా కొందరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతారంటూ ఎంపి రంగయ్య వద్ద బోయలు వాపోతున్నట్టు వినిపిస్తుంది.దీంతో గత మూడు నెలలుగా తమ ఆవేదనను దిగమింగుతూ వచ్చిన ఎంపి రంగయ్య వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా అధికార పక్షంలో కొంత మందిని ఓ ఆటాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ ముందే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చంపేవాడు చచ్చేవాడు బోయవాడు, బోయవాడికి బోయవాడికి మధ్య గొడవెందుకు, ఎవడైతే బోయలను ఉసిగొల్పుతాడో వాడి తల తీస్తే తన్నుకు చేయవలసిన అవసరం రాదు అంటూ అనంత ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటి నుంచి తూటాల్లాంటి మాటలు రావటంతో సభలో ఉన్నవారంత నిర్ఘాంతపోయారు.  ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి మాటలు అన్నారంటే ఎంపీలు ఎంతటి ఆవేదన గూడుకట్టుకుని ఉందో అర్థం చేసుకోవాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. స్వపక్షంలోనే మరో సామాజిక వర్గం వారు మాత్రం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బోయలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ తరుణంలో రంగయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్ నెరవేర్చటానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలకు మంత్రి శంకరనారాయణ చీఫ్ విప్ కాపురామచంద్రరెడ్డి వంత పాడారు. మరో మంత్రి జయరాం మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి సామాజికవర్గ పెద్దలు కూడా ఇదే పాట పాడారు. రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించామని ఎస్టీ జాబితాలో కనుక తమను చేర్చకపోతే ప్రస్తుత అధికార పక్షాన్ని కూడా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

పలు కంపెనీల ఉద్యోగుల్ని ఆకర్షిస్తున్న చిన్న జియర్ స్వామి...

  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి పలు రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సేవలను మెచ్చిన పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు స్వామి వారికి ఆకర్షితులవుతున్నారు. స్వామీజీ చేస్తున్న సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కంపెనీల సెక్రటరీలు కోరారు. ట్రస్టు పేరుతో మారుమూల ప్రాంతాల్లో సైతం చినజీయర్ స్వామి చేసిన సేవలను పలు కంపెనీల ప్రతి నిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. హైదరాబాద్ మాదాపూర్ లో వికాస తరంగిణి పేరుతో పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చినజీయర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఇలాంటి సేవలలో భాగస్వాములు కావాలనుకుంటున్నామని కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యంతో పాటు తాగు నీరు అందించడంలో జీయర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచటానికి జీయర్ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంపెనీల సెక్రటరీలు చార్టర్డ్ అకౌంటెంట్ లు అభిప్రాయపడ్డారు.ఇలా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వైఖరిని గొప్పగా మార్చుకోవాలని,తాము తమ జీవితాల్లో పది మందికి సాయం చేస్తూ మంచిగా బ్రతికాలని పలు కంపెనీ నేతలు ఆదేశిస్తున్నారు.