బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహిస్తున్న ఉద్యోగులు...
posted on Oct 22, 2019 @ 4:44PM
ఆగస్ట్ 30న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు జాతీయ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఏఐబీఈఏ, బిఈఎఫ్ఐ ఈ రెండు యూనియన్ లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆగస్ట్ 30న ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంకుల విలీనం గురించి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన డిమాండ్లను చేస్తూ హైదరాబాద్ కోటి లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సమ్మెకు దిగారు.
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగుల హెడ్ రాంబాబు మాట్లాడుతూ, ముప్పైవ తేదీన ఫైనాన్స్ మినిస్టర్ డిక్లేర్ చేసినటువంటి బ్యాంకుల విలీనాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని, దీంతో పాటుగా నాలుగైదు డిమాండ్స్ కూడా ఇంకా ఉన్నాయని అన్నారు. బ్యాంకుల విలీనం గురించి ఆలోచిస్తున్న పభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి ఋణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించని వ్యక్తులందరూ కూడా ఈ దేశంలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వాళ్ళదగ్గరి నుంచి ఆ డబ్బును రికవరీ చేద్దామనేటువంటి తాపత్రయం మాత్రం ప్రభుత్వాల దగ్గర కనిపించట్లేదని ఉద్యోగులు ఆరోపించారు.
ఇంకా అటువంటివారికి ఒక లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాచుకున్నటువంటి జనరల్ ఫండ్ లో నుంచి తీసుకుని వెళ్లి కార్పొరేట్ రంగానికి దోచిపెట్టేటువంటి విధానానికి తెర తీశారని తెలిపారు. ఇలా బ్యాంకుల విలీనాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయని, ఈ విలీనాల వల్ల మరల కార్పొరేట్ రంగానికి మరింత విరివిగా లోన్లు ఇవ్వడం జరుగుతాయని, చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటిది సఫలం కాదని అన్నారు.
అదే విధంగా డిపాజిట్ ల మీద ఇచ్చేటువంటి వడ్డీ రేటు సంవత్సర సంవత్సరానికి తగ్గుకుంటూ వచ్చి 6.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ విధంగా ఇండస్ట్రీకి రావలసిన బకాయిలన్నీ కూడా ఇవ్వాలంటూ సమ్మెకు దిగారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది సమ్మెలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు ఉన్నప్పటికీ ఉద్యోగులెవరూ బ్యాంకులకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు.