గాల్లో కలిసిపోతున్న చిన్నారుల ప్రాణాలు, ముఖ్య కారణాలు ఏమైయుంటాయి?...
posted on Oct 22, 2019 @ 2:33PM
హైదరాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి నిర్వాకం కారణంగా ముక్కుపచ్చలారని పసికందు కాలిబూడిదైపోయింది. ఫైర్ సేఫ్టీ రెన్యువల్ చేయకుండా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడింది షైన్ ఆసుపత్రి. ఎక్కడో యూపీ ఆస్పత్రిలో చిన్నారుల చనిపోతే అయ్యో పాపం అనుకున్నాం. గుంటూరు ఆసుపత్రిలో పసికందును ఎలుకలు కొరికేశాయి అని విని తల్లడిల్లిపోయాం. ఇప్పుడు హైదరాబాద్ లో షైన్ ఆసుపత్రి నిర్వాకం నాలుగు నెలల పసికందును బలితీసుకుంది. ఐసీయూలో ఉన్న చిన్నారుల విషయంలో కూడా కేర్ తీసుకోక పోవటం షైన్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. చిన్నచిన్న రూములు కడితే అద్దెలు ఎక్కువ వస్తాయని భవన యజమానులు భావిస్తుంటే, ఆసుపత్రులు కూడా అదే రూటులో వెళుతున్నాయి.
వీలైనన్ని ఎక్కువ పడకలు గదులు ఉంటే పేషెంట్ లను బాధ చేయొచ్చని నిర్ణయమవుతున్నాయి. పన్లోపనిగా నిబంధనలూ, ప్రమాణాలు గాలికొదిలేస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లో షైన్ ఆసుపత్రిది కూడా అదే కథ. కాసుల కక్కుర్తితో ఆసుపత్రి కట్టిన యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలను పట్టించుకోలేదు. కనీసం ఫైర్ సేప్టీ రెన్యువల్ కూడా చేయించుకోకుండా నాలుగు నెలల చిన్నారిని పొట్టనపెట్టుకొంది. షైన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఐసీయూలో ఉన్న నాలుగు నెలల చిన్నారి చనిపోయింది. ఇక్కడే చికిత్స పొందుతున్న మరో నలభై ఒక్క మంది పసిబిడ్డల్ని ఇతర ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చారు. చిన్నారి మరణానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
అయితే అధికారులు మాత్రం ఆసుపత్రిని సీజ్ చేసి అంతటితో సరిపెట్టారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు తూతూ మంత్రపు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారాలు వెతకడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో చిన్నారులు బలైపోతూనే ఉన్నారు. డైలీ కలెక్షన్ ఎంతొచ్చిందా అని లెక్కలేసుకునే షైన్ ఆసుపత్రి ఐసీయూలు చిన్నారుల్ని మాత్రం గాలికొదిలేసింది. ప్రమాదవశాత్తూ ఘోరం జరిగి పోయిందని చెప్పడం చాలా తేలిక, కానీ నాలుగు నెలల అభం శుభం తెలియని పసిపాపను పోగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపు కోతకు వైద్యాన్ని డబ్బుతో కొలిచే డాక్టర్ లు ఆసుపత్రి యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయి అనుకోవటం అత్యాశే అవుతుందని షైన్ ఆసుపత్రి లాంటి ఉదంతాలు చాటి చెబుతున్నాయి.