పశువుల చావడిగా మారిన ప్రభుత్వ పాఠశాల......
posted on Oct 22, 2019 @ 12:48PM
కర్నాటక సరిహద్దుల్లోని ఆదోని మండలంలో ఉన్న ఎడవల్లి ఓ మారుమూల పల్లె. ఈ ఊరికి బస్సు ఆటోల రవాణా సౌకర్యం లేదు. ఈ ఊరు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువు చెప్పేందుకు టీచర్లు ఆదూరు నుంచి సంతెకుడ్లూరుకు ఆటో లేదా బస్సులో రావాలి. అక్కడి నుంచి ఒక కిలో మీటర్ కాలి నడకన ఎడవల్లికి చేరుకోవాలి. సంతెకుడ్లూరుకు ఎడవల్లికి మార్గమధ్యలో వాగు ఉండటం రోడ్డు గుంతలు గుంతలుగా ఉండటం వల్ల వాహనాలేవీ ఈ గ్రామానికి రావు. కాబట్టి ఈ ఊరికి ఎవరైనా వచ్చి పోవాలంటే ఒక కిలో మీటరు నడవాల్సిందే. కాలి నడకన స్కూలుకు రావాల్సి వస్తోందని టీచర్లు ఈ పాఠశాలకు రావడం మానేశారు. దీంతో స్కూల్ గత మూడేళ్ల నుంచి మూతబడింది. బడి మూత పడిన చదువుకోవాలనే తపనతో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు బుడి బుడి అడుగులతో ఇంగల్ దహాల్ స్కూలుకు రోజూ మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు.
వర్షాకాలంలో అయితే మార్గమధ్యలోనే వాగులూ వంకలూ దాటుకుని బడికి వెళ్తున్నారు. ఇక హైస్కూలు పిల్లలైతే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దహరివాణం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. రోడ్డు రవాణా సౌకర్యం లేదన్న కారణంతో టీచర్లు బడికి రాకపోయినా ప్రభుత్వం స్కూలు మూసేసినా విద్యార్థులు మాత్రం పొలాల మధ్య నడుచుకుంటూ అష్టకష్టాలూ పడి చదువుకుంటున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక నాయకులు ఇటీవలే ఊరికి రోడ్డు వేయించారు. డబ్బులున్న విద్యార్థులు ఏడాదికి మూడున్నర వేలు కడుతూ జీపులో వెళ్తున్నారు. డబ్బులు లేని పేద విద్యార్ధుల కాలి నడకనే స్కూల్ కు వెళుతున్నారు. లోకల్ నాయకుల ఊరికి రోడ్డయితే వేయించారు. కానీ పాఠశాలను ఎందుకు తెరిపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఎద్దులు కట్టేస్తూ పాకశాలగా మార్చారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూతబడిన స్కూల్ ను తెరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.