కేసీఆర్ పుట్టినరోజుకు ఆశ్చర్యకరమైన ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పండుగరోజు. అందుకే కేసీఆర్ కు మొక్కల పండగతో శుభాకాంక్షలు చెప్పేందుకు గులాబీదళం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ చాలెంజ్ ఊపందుకుంది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని భాగస్వామ్యం చేసింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరు పాల్గొనడంతో అది విశ్వవ్యాప్తమైంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జల విహార్ లు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటుతారు. కేసీఆర్ జీవితక్రమాన్ని వివరించి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల ఎల్ఈడి ప్రదర్శనశాలను హోం మంత్రి మహముద్ అలీ ప్రారంభిస్తారు. ఎంపీ సంతోష్ కుమార్ వికలాంగులకు వీల్ చైర్స్ పంపీణీ చేస్తారు. సీఎం పుట్టినరోజు పురస్కరించుకొని ఎంపీ కేశవరావు భారీ కేక్ కట్ చేయనున్నారు. అటు ఏపీలో టీ ఆర్ ఎస్ నాయకులు ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంధ్రా టీ ఆర్ ఎస్ భవన్ లో కేక్ కటింగ్ చేస్తారు. కేసీఆర్ పుట్టినరోజుకి హైదరాబాద్ లో ఈసారి అంతా సందడిగా మారనుంది. మెట్రో పిల్లర్లపైన ఎటు చూసినా కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగరమంతటా హోర్డింగులు కనిపిస్తున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. వి లవ్ కేసీఆర్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుండగా, పెయింటింగ్స్ చిత్రకళా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. జంటనగరాల్లోని కవలలందరినీ ఒకే చోటుకు చెరిచింది మరో సంస్థ. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈసారి కేసీఆర్ పుట్టినరోజుకు రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్ లో రెండు వేల ఆరు వందల మంది మొక్కలు పట్టుకొని అరవై ఆరు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేసీఆర్ రూపంలో నిలబడ్డారు. ఇక విదేశాల్లో కూడా టీ ఆర్ ఎస్ ఎన్నారై శాఖలు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నాయి.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం!!

దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్యాబినెట్ కేంద్రాన్ని కోరింది. పౌరసత్వ విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని కేంద్రానికి సూచించింది. దీనివల్ల లౌకికత్వం ప్రమాదములో పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్ తరహాలోని సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.  పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాల ఖరారు చేసేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో రాష్ట్రస్థాయి మునిసిపల్ సదస్సు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ సాగడానికి పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ నెల 24న అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి నిర్వహిస్తారు, ప్రతి వార్డుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ప్రతి మునిసిపాలిటీ కార్పొరేషన్ లు, వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే ప్రక్రియను అయిదురోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జీ హెచ్ ఎం సీ కి వెంటనే డెబ్బై ఎనిమిది కోట్లు ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లకు డెబ్బై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండకుండా చూడాలని నిర్ణయించారు. పట్టణ ప్రగతిలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.  రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం వంటి పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్ర రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లు సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణలో లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

స్పాట్ లోనే ప్రాణాలు తీసేస్తున్న కొత్త గేమ్.. ట్రెండ్ అవుతోన్న స్కల్ బ్రేకింగ్...

మీరిప్పటివరకు ఆన్ లైన్ గేమ్స్‌... పబ్‌జీ, బ్లూ వేల్, మోమో చాలెంజ్... బర్త్‌డే బంప్స్‌....లాంటి గేమ్స్ మాత్రమే చూసుంటారు. లేదా, సరదా సరదాగానే కాళ్లతో తన్నడం.... విపరీతంగా కొట్టడం లాంటి ఆటలు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు స్కూళ్లూ, కాలేజీల్లో కొత్త గేమ్ ట్రెండింగ్ అవుతోంది. ఇది అలాంటిలాంటి గేమ్ కాదు. ఒక్కసారి ఆడారో చచ్చినట్లే. అంత మోస్ట్ డేంజరస్ గేమ్ ఇది. సరదా కోసం... కాలక్షేపం కోసం... కోసం ఆడే ఆట ఎంత భయంకరమైనదంటే... కనీసం ట్రై చేసినా ప్రాణాలు మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే, అంత ప్రమాదకరం ఈ గేమ్. స్కల్ బ్రేకింగ్ గేమ్ గా జాతీయ మీడియా పిలుస్తున్న ఈ ఆటలో... ముగ్గురూ కలిసి వరుసగా నిలబడతారు... ముందు, ఆ చివర... ఈ చివర ఉన్నవాళ్లు... పైకి కిందకి ఎరుతారు... ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఎగురుదామని అంటారు... ఇక్కడే గేమ్‌‌లో అసలు ట్విస్ట్‌ ఉంటుంది... మధ్యలో ఉన్న వ్యక్తి పైకి ఎగిరిన వెంటనే... ఇరువైపుల ఉన్న ఇద్దరూ కలిసి... అతని కాళ్లపై తన్నుతారు... అంతే, ఎగురుతున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు. ఇది, వినడానికి, చూడ్డానికి సరదాగానూ... సింపుల్‌గానూ కనిపిస్తున్నా.... వెనక్కిపడినోడి పరిస్థితి మాత్రం అంతే సంగతులు. పబ్‌జీ లేదా ఆన్ లైన్ గేమ్స్ లో ఆటకు బానిసలై మానసిక స్థిమితం కోల్పోయి మృత్యుబాట పడతారు. బర్త్‌ డే బంప్స్‌‌లాంటి గేమ్స్‌లో సున్నితమైన భాగాల్లో దెబ్బలు తగిలి మరణిస్తారు. అయితే, ఈ గేమ్‌లో అలా కాదు. తల వెనుక భాగం పగిలి స్పాట్‌ డెత్‌ అవుతున్నారు. లేదా, మెదడు, మెడ భాగాలు దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. మరికొందరికి రక్త నాళాలు, మెడ నరాలు తెగిపోయి కాళ్లూ చేతులు చచ్చుబడిపోతున్నాయి.  స్కూళ్లూ కాలేజీలు హాస్టల్స్‌లో ట్రెండింగ్‌ అవుతున్న ఈ ఆట మోస్ట్ డేంజరస్ గేమ్‌ అంటున్నారు వైద్యులు. వెనక్కి పడిపోవడం కారణంగా తలలో మెదడు దెబ్బతింటుందని... లేదంటే రక్త నాళాలు పగిలిపోతాయని అంటున్నారు. దాంతో, ఆ వ్యక్తి స్పాట్‌లోనే మరణించే అవకాశముంటుందని చెబుతున్నారు. లేదంటే, మెడ నరాలు పగిలిపోయి మొత్తం నాడీ వ్యవస్థే దెబ్బతింటుందని, దాంతో శరీరం మొత్తం చచ్చుబడిపోతుందని అంటున్నారు. అయితే, ఇలాంటి డేంజర్ గేమ్స్ ఆడకుండా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదకర ఆటల విషయంలో ముందే పిల్లలను అప్రమత్తం చేయాలని చెబుతున్నారు. ఇక, స్కూళ్లూ కాలేజీల్లోనూ డేంజర్ గేమ్స్ విషయంలో స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించాల్సిన అవసరముందంటున్నారు. లేదంటే, సరదా సరదాగా ఆడుకునే ఆటలే పిల్లలు ప్రాణాలు తీసేస్తాయని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో పవన్ ని రంగంలోకి దింపుతున్న బీజేపీ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రాజకీయాలలో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవ లేకపోయినా ఆయన సభలకు వేలాదిమందిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ వాడుకోవాలని.. దాంతో బిజెపి విధానాలనూ జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఇదే విషయం ఇరు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు సూచించారట బీజేపీ జాతీయ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజధాని అంశంపై జనసేనతో కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది బిజెపి. తెలంగాణలో కూడా  పవన్ తో కలిసి పని చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో జనసేనాని సేవలను వినియోగించుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ తో కలిసి పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీకి దీర్ఘకాలంలో నష్టం ఉంటుందంటున్నారు కొంత మంది నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనంలో ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర లీడర్ వచ్చి టిఆర్ఎస్ ను గానీ.. కేసీఆర్ నుగానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుంది అనేది కొంత మంది నేతల వాదన. ప్రస్తుతం బిజెపి రెండు కార్యక్రమాల్ని చేపట్టింది. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తెలంగాణ ప్రభుత్వ పని తీరు, పథకాలను నిశితంగా పరిశీలిస్తూ లోపాలను ఎండగట్టడం ఈ రెండు కార్యక్రమాల్లో పవన్ ను పాల్గొనేలా చేస్తే కొత్త ఇబ్బందులు తప్పవని బీజేపీలో కొందరు చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ ను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల జాతీయస్థాయి నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్ రావుల ప్రభావాన్ని తగ్గించిన వారౌతామని కూడా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచితేనే మంచిదని సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ కారణాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు వల్లనే కాంగ్రెస్ నష్ట పోయిందని ఇప్పుడు పవన్ తో కలిసి వెళ్తే.. అదే పరిస్థితి బిజెపికి ఎదురౌతోందని గుర్తు చేస్తున్నారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణ బీజేపీ వినియోగించుకుంటుందా? లేకా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

కలకలం రేపుతోన్న జగన్ ఢిల్లీ టూర్ డిటైల్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్.... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో చేరబోందన్న ప్రచారంతో... అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో, ఢిల్లీ పరిణామాలపై ఏపీ బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ...నిజంగా ఎన్డీఏలో చేరుతుందో లేదో తెలియదు గానీ, వార్తలు మాత్రం రాజకీయంగా మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ... ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందంటూ విస్తృత ప్రచారం జరుగుతుండటంతో తెలుగుదేశం తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సీబీఐ అండ్ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక, సెక్యులరిజం పేరుతో ముస్లిం మైనారిటీ దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.... ఇకనైనా ముసుగు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం విమర్శలతో డిఫెన్స్‌లో పడిన వైసీపీ.... ఎన్డీఏలో చేరతామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మొదట్నుంచీ జగన్‌కు బీజేపీ రంగు పులిమి, ముస్లిం మైనార్టీ దళితులను వైసీపీకి దూరంగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీతో వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జగకట్టబోదని డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్పుకొచ్చారు. అయితే, తమకున్న సమాచారం ప్రకారం వైసీపీతో ఎలాంటి మైత్రి ఉండబోదని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవదర్... అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ సారధుల మాట ఇలాగుంటే, ఆ పార్టీ టీజీ వెంకటే‌శ్ మాత్రం... ఏమో ఏమైనా సాధ్యమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇదిలా ఉంటే, వైసీపీ.... ఎన్డీఏలో చేరొచ్చంటూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, టీడీపీ అనుకూల మీడియా కావాలనే తన మాటలను వక్రీకరించిందని మంత్రి బొత్స మండిపడుతున్నారు. అయితే, బొత్స మాట మార్చారని, డ్యామేజ్ జరగడంతోనే ఇప్పుడు వైసీపీ నేతలంతా ఖండిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడుతున్నారు. మొత్తానికి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్‌ అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో ఆంధ్రా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

హైదరాబాద్‌ మెట్రోలో... ఆశ నీరుగారిపోతోంది

హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట పొందుతున్న నగర వాసులకు చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకి నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చిన్నచిన్న అవాంతరాలతో వేగంగా గమ్యాన్ని చేరుకోవాలన్న ప్రయాణికుల ఆశ నీరుగారిపోతోంది. ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి హైదరాబాద్ వాసులకు ఊరట కలిగిస్తూ రెండేళ్ల క్రితం అందుబాటులో వచ్చిన మెట్రో రైల్‌ మంచి సత్ఫలితాలను ఇస్తోంది. అయితే, కొత్తగా ప్రారంభించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ రూట్లో మాత్రం మెట్రో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు లేకపోవడంతో తమ గమ్యాన్ని తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు, టికెట్ల కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు క్యూఆర్‌కోడ్ అమల్లోకి తెచ్చినా, చాలా మెట్రో స్టేషన్లలో స్కానర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండుమూడుసార్లకు పైగా స్కాన్ చేసిన తర్వాతే గేట్లు ఓపెన్ అవుతుండటంతో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలతో మెట్రో జర్నీ ఆలస్యమవుతోందని, వాటిని పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

వైసీపీ, బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత!

ఎన్డీయేలో వైసీపీ కలుస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దేవోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఎలాంటి అవగాహన కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే జనసేనతో కలిసి పని ప్రారంభించామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. ఇరు పార్టీలు తమకు విరుద్ధమేనని తమకు టీడీపీతో కానీ వైసీపీతో గానీ ఎలాంటి పొత్తు పెట్టుకునే ఉద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తమకు ఎలాంటి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని కేవలం జనసేనతో మాత్రమే మద్దతుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు సునీల్ తెలిపారు. ఏపీలోని మరో రెండు పార్టీలతో మాకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన తెలివారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వైఫల్యాలతో తప్పుడు విధానాలను అవలంభిస్తొందని ఆయన స్పష్టం చేశారు. తాము ఇండిపెండెంట్ పార్టీగానే ఎదగడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి.. వైసీపీ.. బీజేపీకి మధ్య ఉన్న సంబంధాలను.. ఈ మధ్య నెలకొన్న ఊహాగానాలను సునీల్ దేవోధర్ స్పష్టం చేసినట్లే.

రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ!!

తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ నేత, పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు.  "రామోజీరావు గారికి.. ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను.  చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తో నేను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడాను. ప్రధానమైన ఈ విషయం మీ పత్రికకు ప్రధాన వార్త కాలేదు. మీకు ఇలాంటి మాటలు రుచించవు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అది మీ ఇష్టం– తెలుగు ప్రజల దౌర్భాగ్యం.  అలాగే డాక్టర్‌ వైయస్సార్‌గారిమీద, వైయస్‌ జగన్‌గారిమీద మీ వ్యతిరేకత, శత్రుత్వం ఏనాడూ మీరు దాచుకున్నది లేదు. అలాగని మేం అనని మాటల్ని మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను.  ‘‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’’అని నేను అన్నట్టుగా మీరు హెడింగ్‌ పెట్టారు. నేను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించండి. ఈ హెడింగ్‌ పెట్టటం ద్వారా రెండు వైపులా పదునున్న కత్తిని మాకు వ్యతిరేకంగా వాడాం అని మీరు మురిసిపోతున్నట్టున్నారు. మొదటిది– నేను అనని ఈ మాటల్ని అన్నానని చెప్పటం ద్వారా, పూర్తిగా మా మీద నమ్మకంతో ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన. రెండోది– ఈ వ్యాఖ్యలు మేం చేయలేదని ఖండిస్తే...  కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి మీ మొదటి పేజీలో ప్రచురించిన తీరును చూస్తే  ఈ విషయం అర్థమవుతోంది.  రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రిగారు కలుస్తారన్నది కనీస జ్ఞానం ఉన్నవారికి అర్థం అవుతుంది.  అదే సమయంలో రాజకీయ పార్టీలుగా ఎవరి భావాలు వారికి ఉంటాయి. మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రత్యేక హోదా కోసం 2014నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్‌ కాంగ్రెస్‌గా మా విధానాలు మావి. బీజేపీ విధానాలు వారివి. ఏ సిద్ధాంతాలూ లేని, ఎప్పుడు ఎవరితో అయినా కలిసి, విడిపోయి, మళ్ళీ కలిసిపోయే విధానం మీరు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీది. మేం రాజకీయంగా మా స్వతంత్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటున్నా, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రోజుకో ప్రచారం చేయటం మీ విధానం. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ఎలాగూ ప్రజల్లో పెంచలేరు కాబట్టి మమ్మల్ని చిన్నగీత చేయటానికి మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.  ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి  డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా? ఇందులో జాతీయ ప్రయోజనాలు ఏమన్నా ఇమిడి ఉన్నాయా?  చంద్రబాబుకు 70. మీకు 84.  ఇంత పండు వయసు వచ్చినా రాష్ట్రం గురించి కంటే మీ స్వప్రయోజనాల కోసమే రగిలిపోతున్న మీ వైఖరి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్‌ కంట్రిబ్యూషన్‌ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీ లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదు... ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకూ ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరే ఆలోచించుకోండి.  చివరిగా... మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించటం కోసం మీరు ఎంతటి అసత్యాలయినా పత్రికలో ప్రచురించటం తప్పు మాత్రమే కాదు... నేరం కూడా. మీ స్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది.  – బొత్స సత్యనారాయణ"

అప్పుల కోసం ఏపీ తిప్పలు!!

మనిషికైనా, సంస్థకైనా, ప్రభుత్వానికైనా, ఆర్ధికపరమైన క్రమశిక్షణ లేకపోతే ఎదురయ్యే కష్టాలను ఊహించటం కష్టం. ఒక్కసారి కుప్పకూలిపోతే మళ్లీ కోలుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా ప్రభుత్వమైనా ఆదాయం ఎంత ఖర్చెంత అని లెక్కలేసుకుని ప్రాధాన్యాలకు తగ్గట్లుగా వెళ్తారు. బ్యాంకులు అప్పనంగా ఇచ్చేసాయ్ అని క్రెడిట్ కార్డులు ఓవర్ డ్రాఫ్ట్ లు వాడేస్తే వాడేసినంత కాలం బాగానే వుంటుంది. తిరిగి చెల్లించ లేక దివాలా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదాయాల గురించి పట్టించుకో కుండా అప్పులు చేసి పొజిషన్ లో ఉంది. ఈ ఏడాది ఓ 10 వేల ఆదాయం సంపాదిస్తే వచ్చే ఏడాది 11 వేలు సంపాదించాలి. అలా కాకుండా 10 వేల ఆదాయం వస్తే ఆదాయం తగ్గినట్లే. ఎందుకంటే గతేడాది రూపాయి విలువకు ఈ ఏడాది రూపాయి విలువకు చాలా తేడా వచ్చేస్తుంది. అలా కాదు ఎనిమిది వేలు మాత్రమే సంపాదిస్తే ఆర్థిక పరిస్థితి చితికిపోయినట్లే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇదే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీ ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో ఏపీ సర్కారు ఆదాయం 98,790 కోట్లు. గతేడాది ఇదే ఎనిమిది నెలల కాలానికి వచ్చిన ఆదాయం లక్షా ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటే పది వేల కోట్లు తక్కువ. ప్రజలు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి ఇంత ఆదాయం తగ్గిందంటే ప్రజల అంతకు 10 రెట్లు ఆదాయాన్ని కోల్పోయి ఉంటారు. ఆ లెక్కన ఏపీ ప్రజల మొత్తంగా లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని అంచనా వేయొచ్చు. రాష్ట్ర విభజనప్పుడు ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,000 లు, ఐదేళ్ల తరవాత 1 లక్ష 66 వేలు, ఇప్పుడు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1 లక్షా 20 వేల దగ్గర ఉంది. అంటే కొత్త ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఒక్కొక్కరికీ 40 వేలకు పైగానే ఆదాయం పడిపోయింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించి పోయింది. మొదట ఇసుక కొరత తర్వాత అమరావతి నిలిపివేతతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఉత్పాదక వ్యయం చేయడం మానేసింది. అంటే ప్రాజెక్టులు అభివృద్ధి పనులపై ఖర్చు లేదు. అనుత్పాదక వ్యయంగా భావించే సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వెతుక్కున్న ఒకే ఒక్క మార్గం అప్పులు. అప్పులు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరం అది కూడా పది నెలల కాలంలోనే ఏకంగా 47,100 కోట్ల అప్పు చేసింది. మరో రెండు నెలల కాలంలో మరో పది వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తుంది.

కష్టాల తెలంగాణ.. లక్ష బిల్లులు పెండింగ్!!

తెలంగాణ రాష్రంలో సీఎం కేసీఆర్ పాలన చాలా నిశ్శబ్దంగా సాగుతుంది. పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రం మొత్తం సుమారు లక్ష బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా బకాయలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా అంగీకరించడం విశేషం. పెండింగ్ బకాయిల వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త జి శ్రీనివాసరావు చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులకు మోక్షం లభించడం లేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా ప్రభుత్వం బిల్లుల్ని క్లియర్ చేయలేక పోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన కల్యాణలక్ష్మి, రైతుబంధు బట్టి సంక్షేమ పథకాలకు నిధుల మంజూరు కాలేదు. ఖరీఫ్, రబీ సీజన్ లకు సంబంధించి దాదాపు 3,000 కోట్ల వరకు రైతుబంధు బకాయిలు పేరుకు పోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మూడు లక్షల వరకు కల్యాణలక్ష్మి,, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. పరిశ్రమలకు రాయితీల కింద 1,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. తాత్కాలిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా భారీ ఎత్తున బకాయిలే ఉన్నాయి. అలాగే.. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాల కోసమూ పలువురు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో ఆసరా పింఛన్ లు కూడా ఒకటి రెండు నెలలు ఆలస్యంగా అందిస్తున్నట్లు సమాచారం.  

చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!!

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో ఏపీ అధికార పార్టీ వైసీపీ కలవబోతున్నదని, మెగాస్టార్ చిరంజీవి వైసీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని అన్నారు. తాము బీజేపీకి దగ్గరగా లేమని, అలాగని దూరంగానూ లేమని తెలిపారు. రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ పని చేసేందుకు తమ అధినేత జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇక చిరంజీవి పార్టీలో చేరే విషయమై మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది చిరంజీవి ఇష్టమని, ఒకవేళ ఆయన చేరితే మాత్రం సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని బొత్స చెప్పారు.

వైసీపీకి 3 కేబినెట్ బెర్తులు... ఆ ముగ్గురికి ఛాన్స్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమి త్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో దీనిపైనే చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏలో చేరితే... వైసీపీకి ఇవ్వనున్న కేంద్ర కేబినెట్ బెర్తులపై జగన్ కు అమిత్ షా వివరించినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య అరగంటపాటు జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరాలని జగన్ ను అమిత్ షా ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఒక కేబినెట్ ర్యాంకు... రెండు ఎంవోఎస్ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే నందిగం సురేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయసాయిరెడ్డికి కేబినెట్ ర్యాంక్ తోనూ... మిథున్ రెడ్డి, నందిగం సురేష్ కు సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయని చెబుతున్నారు. అయితే, విజయసాయిరెడ్డిపై సీబీఐ అండ్ ఈడీ కేసులు ఉండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ, విజయసాయికి బెర్త్ దక్కకపోతే ఎస్సీ లేదా బీసీ మహిళకు అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమే, వైసీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో వైసీపీకి పెరగనున్న బలం నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా ఇరు పార్టీలూ భవిష్యత్ అవసరాలు, పరస్పర లబ్ది చూసుకునే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్... ఎన్డీఏలో చేరితే... బాబు నెత్తిపై పాలు పోసినట్లే..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు అనేక కారణాలు వినబడుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ, మండలి రద్దు, హైకోర్టు తరలింపు, రాష్ట్ర సమస్యలు, పెండింగ్ నిధులు, గ్రాంట్లు కోసమే ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఇతర కేంద్ర మంత్రులను జగన్ కలిశారని అంటున్నా... అంతకంటే, ముఖ్యమైన రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందని, అలాగే, కేంద్ర కేబినెట్లోకి వైసీపీ తీసుకోబోతున్నారనేది ఆ ప్రచారం యొక్క సారాంశం. అయితే, ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోవడం ఖాయమంటున్నారు. వైసీపీ... ఎన్డీఏలో చేరి, కేబినెట్ బెర్తులు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశముంది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి కొన్ని లాభాలున్నా.... రాజకీయంగా మాత్రం కొన్ని బలమైన వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశాలు మొండుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే... కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరడం ద్వారా జగన్ అండ్ విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ అండ్ ఈడీ కేసులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కేసుల విషయంలో కొంత ఊరట కలుగొచ్చు. ఇక, టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణను వేగవంతం చేసే అవకాశముంది. అలాగే, టీడీపీ హయాంలో అవినీతి జరిగిందంటున్న వైసీపీ....కేంద్ర ప్రభుత్వంతో కలిసి దూకుడుగా ముందుకెళ్లే ఛాన్సుంటుంది. అయితే, ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లో చేరడం ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశముంది. ఎందుకంటే, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లిం అండ్ క్రిస్టియన్ వర్గాలు... వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ వర్గాలు తెలుగుదేశం వైపు చూసే అవకాశముంటుంది. అంతేకాదు, వైసీపీలోని ముస్లిం ప్రజాప్రతినిధులు, నాయకులు ఇరకాటంలో పడతారు. తమ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల విషయంలో వైసీపీ రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కొమ్ముకాసిన ఓటర్లు దూరమయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది.  ఎన్డీఏ అండ్ కేంద్రంలోకి వైసీపీని ఆహ్వానిస్తే, బీజేపీకి కూడా నష్టాలు ఉంటాయ్. వైసీపీ మిత్రపక్షమైతే... ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి... ఏపీలో ద్వారాలు మూసుకుపోతాయి. అంతేకాదు, ఏపీలో కలిసి పనిచేసేందుకు అవగాహన కుదుర్చుకుని ముందుకెళ్తున్న జనసేన-బీజేపీ బంధానికి బ్రేకులు పడొచ్చు. వీటన్నింటినీ మించి, రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడే నరేంద్రమోడీ విశ్వసనీయతకు మచ్చ వచ్చే అవకాశముంటుంది. విపక్షాలకు ఒక ఆయుధాన్ని అందించినట్లవుతుంది.

బ్రదర్‌ అనిల్‌ కు తప్పిన ప్రమాదం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ బావమరిది, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో అనిల్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. తన కారులో అనిల్, గన్‌మెన్లు, డ్రైవర్‌ ను.. ప్రథమ చికిత్స కోసం విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు.

రేపే తెలంగాణ కేబినేట్ భేటీ.. కీలక నిర్ణయాలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.  ఇప్పటికే పంచాయతీ రాజ్ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక మున్సిపల్ యాక్టు అమలులోకి రాబోతుంది. ఇక రెవిన్యూ చట్టంపైనే కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రెవిన్యూ చట్టంపైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రెవెన్యూ చట్టం మొత్తాన్ని కూడా మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావల్సిన అవసరం ఉంటుంది.అదేవిధంగా రెవెన్యూ చట్టం మార్పుతో పాటు దాని కింద పని చేసే ఉద్యోగులకు సంబంధించి విధులు బాధ్యతలు కూడా మారనున్నాయి. వీటన్నిటిపైనా ఒక క్లారిటీ తీసుకోవడంతో పాటు క్యాబినెట్ లో దీనిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎప్పటి నుంచో లాంచ్ చేయాలనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది అని సమాచారం.  ఇక పట్టణ ప్రగతి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే థర్డ్ టీఎంసీ అదే విధంగా కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఏఏకి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం వైఖరి తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కొన్ని కీలక నిర్ణయాలు లేదంటే కొత్త పథకాలకు సంబంధించిన విషయాలు రేపు ఉండబోయే అవకాశమైతే ఉందని సమాచారం. ఆదివారం రోజు సడెన్ గా క్యాబినెట్ పెట్టారంటే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాల పై కేబినెట్ లో మంత్రులు, ముఖ్యమంత్రి చర్చించే చాన్స్ ఉందని సమాచారం.

జగన్ పై 31... చంద్రబాబుపై ఒకే ఒక్కటి... క్రిమినల్ కేసుల్లో వైసీపీ టాప్.!

సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ తమ అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధుల క్రిమినల్ రికార్డును తమతమ పార్టీ వెబ్ సైట్స్ లో పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే, వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో మొత్తం 86మందిపై కేసులున్నట్లు చెబుతున్నారు. ఇక, టీడీపీ ప్రజాప్రతినిధుల్లో 15మందిపై కేసులున్నట్లు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యధికంగా 31 కేసులు ఉండగా.... అందరి కంటే అతి తక్కువగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఒకే ఒక్క కేసు ఉన్నట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ ముఖ్యమంత్రి) - 31 కేసులు, కన్నబాబు(వ్యవసాయశాఖ మంత్రి) - 3 కేసులు, కొడాలి నాని ( సివిల్ సప్లై మంత్రి) -  4 కేసులు, పేర్ని నాని(I&PR మంత్రి) - 2 కేసులు, అనిల్ కుమార్ (ఇరిగేషన్ మంత్రి) -  కేసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(ఆర్థిక శాఖ మంత్రి) - 2 కేసులు, సురేష్ (విద్యాశాఖ మంత్రి) - 2 కేసులు, గౌతమ్ రెడ్డి(పరిశ్రమల శాఖ మంత్రి) - 3 కేసులు, శంకర నారాయణ (బీసీ సంక్షేమ శాఖ మంత్రి) - 6 కేసులు,  వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (దేవాదాయశాఖ మంత్రి) - 2 కేసులు, మోపిదేవి వెంకటరమణ (పశుసంవర్ధక శాఖ మంత్రి) - 2 కేసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి (అటవీశాఖ మంత్రి) -   2 కేసులు, అంజద్ బాషా (ఉప ముఖ్యమంత్రి) - 3 కేసులు, గోరంట్ల  మాధవ్ (ఎంపీ) - 2 కేసులు, విజయ్ సాయి రెడ్డి(ఎంపీ) - 13 కేసులు, చంద్ర శేఖర్(ఎంపీ) - 4 కేసులు, MVV సత్యనారాయణ(ఎంపీ) - 1 కేసు, రంగయ్య(ఎంపీ) - 1 కేసు, అవినాష్ రెడ్డి(ఎంపీ) - 4 కేసులు, బలశౌరి(ఎంపీ) - 2 కేసులు, బ్రహ్మానందరెడ్డి(ఎంపీ) - 1 కేసు, రఘురామకృష్ణంరాజు(ఎంపీ) - 6 కేసులు, భరత్ (ఎంపీ) - 2 కేసులు, మిథున్ రెడ్డి (ఎంపీ) - 3 కేసులు, ధర్మాన ప్రసాదరావు(     ఎమ్మెల్యే) - 2 కేసులు, దాడిశెట్టి రాజా ( ఎమ్మెల్యే) - 15 కేసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, ఏమేం కేసులు ఉన్నాయో... తమతమ పార్టీ వెబ్ సైట్లలో ఆయా పార్టీలు పెట్టాకే ఫుల్ క్లారిటీ రానుంది.

అమ్మవారి ఆలయం కూల్చివేత.. గ్రామంలో కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఓ వైపు జాతర ఏర్పాట్లు సాగుతూ ఉండగానే ఈ ఘటన జరగడం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలనే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక వ్యక్తి జేసిబీతో వచ్చి ఈ ముఖద్వారాన్ని పడగొట్టేశాడని.. ఆ పడగొట్టిన విషయాన్ని అక్కడ స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వెంటపడి పట్టుకోవటానికి ప్రయత్నించినప్పటికి జేసిబీతో అతడు వేగంగా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానికులు వెల్లడిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగడంతో అంతటా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అమ్మవారి ఆలయంలో మరికొన్ని రోజులలో జాతర జరగనుంది. ఈ జాతరను గ్రామస్థులు చాలా ఘనంగా చేస్తుంటారని తెలుస్తోంది.  ఆ ఆలంయంలో అమ్మవారిని ఊరివాళ్లంతా గ్రామదేవతగా భావిస్తారు.

పురపాలక చట్టంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్ లో తాజాగా కొత్త కలెక్టర్లకు అవగాహన కార్యక్రమంలో జరిగింది. నగరంలోని మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో అదనపు కలెక్టర్ లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచెయ్యని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రూపాయి లంచం లేకుండా 21 రోజులలో ఇళ్లకు పర్మిషన్ లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఏప్రిల్ నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురానుండటం తో మార్చి లోపు దానికి సంబంధించిన అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బి-పాసా తో పాటు మరో రెండు కొత్త యాప్ లను తీసుకువస్తున్నామన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. మెరుగైన పరిపాలన కోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను తెలుసుకొని పని చేయాలని కలెక్టర్ లకు సూచించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఏపీలో పీఠముడిలా మండలి వ్యవహారం!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని  పేర్కొంటూ అసెంబ్లీ మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖిత పూర్వక సమాధానం పంపారు. మండలిలో ఇలాంటి పరిణామాలు జరగడం ఇదే తొలిసారిగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభాధిక్కారణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే కానుంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేవిదంగా రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసన సభ మండలికి వేరు వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసన సభలో వైసీపీకి మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండటం రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టిడిపి పట్టుపడుతున్నాయి. అలాగే.. మండలి కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఆదేశాలను వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బులిటెన్ విడుదల చేయాలనీ రెండ్రోజుల క్రితం మండలి చైర్మన్ ఆయనకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ.. తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి పంపిన సమాధానంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  చైర్మన్ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేక పోతున్నానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పీటముడి పడింది. కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని చైర్మన్ ఆదేశిస్తుంటే దానిని అమలుచెయ్యటానికి కార్యదర్శి నిరాకరించటం ఏపీలో కొత్త ట్విస్ట్.