ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కోరికల చిట్టా.. లిస్ట్ భారీగా ఉందిగా!!

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో దాదాపు 100 నిమిషాలసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి నివేదించిన ముఖ్యమంత్రి.. ఈమేరకు లేఖ అందించారు. లేఖలోని అంశాలను ప్రధానికి వివరించిన సీఎం.. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం వైయస్‌.జగన్‌ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు  ఈ యేడాది మార్చి 25, ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రావాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం  నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపిన సీఎం తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా కోరిన సీఎం 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వినతిపత్రంలో వెల్లడించిన సీఎం ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ,పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని,  ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపిన సీఎం కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి తెలిపిన సీఎం దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని,  ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపగలరని ముఖ్యమంత్రి వినతి పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని,  ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి.  ప్రత్యేక హోదా  అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన సీఎం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించిన సీఎం దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరిన సీఎం  రెవెన్యూలోటు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని,  ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,  వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ ప్రధానిని కోరిన సీఎం.  గ్రాంట్లు విడుదల  ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని ముందు ఉంచిన సీఎం.  పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి.  కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని వినతి కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం  రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన సీఎం. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు -- గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు  మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి  కేటాయింపులు కూడా లేవని,  రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని గట్టిగా కోరిన సీఎం.  అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపిన సీఎం. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.  ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.  రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడి.  ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని వెల్లడి.  దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపిన సీఎం. శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సీఎం గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్న సీఎం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్న సీఎం ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందన్న సీఎం తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం.  మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి.

మరో దిశా కేసు నమోదు... కాలేజ్ వద్ద యువతితో అసభ్య ప్రవర్తన!!

విశాఖపట్నం మాడుగుల పోలీస్ స్టేషన్ లో దిశ కేసు నమోదైంది. గోపాలపట్నంలోని కెజె పురం కు చెందిన ఓ యువతి ని అదే గ్రామానికి చెందిన ఎల్లపు గణేష్, బోడ్డెటి అశోక్ పై ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం  చైతన్య కళాశాల వద్ద తనపై వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. దిశ యాప్ ద్వారా యువతి పోలీసులు కు పిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు దిశ యాప్ ని బాగానే ఉపయోగిస్తున్నారు. దిశా యాప్ వచ్చిన తరువాత.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తొలి కేసు నమోదైంది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, వెంటనే ఆమె దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు 7 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి దగ్గరికి చేరుకొని.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చర్యలు తీసుకోవడంతో.. మహిళలకు దిశా యాప్ పై నమ్మకం పెరిగింది. దీంతో ఆపదలో ఉన్నప్పుడు దిశా యాప్ ని ఉపయోగిస్తున్నారు. మొత్తానికి దిశా యాప్ పుణ్యమా అని ఆకతాయిలు గుండెల్లో భయం మొదలైంది.

మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త!

ప్రకాశం జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ నిర్వాకాన్ని ఆర్మీలో పనిచేస్తోన్న ఆమె భర్త బయటపెట్టాడు. వేటపాలెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సునిల్ రాజ్.. ప్రియుడు అబిషేక్ తో కలసి ఉండగా ఆమెను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. భార్యపై వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సునిల్ రాజ్.. ఆర్మీలో పనిచేస్తున్నాడని, కాశ్మీర్ లో ఉంటున్నాడని సమాచారం. కానిస్టేబుల్, అందులోనూ ఆర్మీ ఉద్యోగి భార్య అయ్యుండి ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం ఏంటని ఆమెపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు.. హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ

ఆంధ్రాను కాపాడమని విజయ్‌కు జగన్‌, పీకే చెబుతున్నట్లు పోస్టర్లు విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నట్లు వ్యాఖ్యలు తమిళనాడుని విజయ్‌ కాపాడాలంటోన్న అభిమానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. 'రావాలి విజయ్..కావాలి విజయ్' అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి.   ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము ఏపీకి కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.  కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో  వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు.

విద్యార్థిపై టీచర్‌ ప్రతాపం.. చర్మం ఎర్రగా కందిపోయింది!

హైదరాబాద్ నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్. సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో ప్లాస్టిక్ స్కేల్ తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో.. విద్యార్థి చర్మం ఎర్రగా కందిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోని టీచర్.. రాక్షసంగా అరగంట పాటు కొట్టిందని.. ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలిపాడు.  టీచర్‌ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకొండి అంటూ బెదిరించారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. ‘క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించి.. ఆ టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

అల ఏపీఎస్ ఆర్టీసీలో.. అంతా అయోమయం!!

ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలను నివారించ లేకపోతోంది ప్రభుత్వం. వివిధ వర్గాలు ఇచ్చే రాయితీలు చార్జీల పెంపులో రాజకీయ కోణం వెరసి ఆర్టీసిని నష్టాల్లోనే కొనసాగేలా చేస్తోంది. కొత్త సర్వీసులను నడిపేందుకు ముందుకు రావడం లేదు. దీంతో యాజమాన్యం నష్టాల్ని తగ్గించుకోవటానికే అనేక రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేటు బస్సులను నడిపేందుకు అనుమతించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఆర్టీసీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి అవి చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా బస్సుల్ని నడిపించడం కష్టమనే అభిప్రాయంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఏటా వస్తున్న నష్టాలను అధిగమిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేమని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్, కాలేజీ బస్సులని ఆర్టీసీ రూట్లలో తిప్పేందుకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వివిధ సంస్థల్లో సిబ్బందిని చేరవేసేందుకు నిర్దేశించిన బస్సులకు సైతం అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా విశాఖలో ఈ విధానాన్ని అమలు చేసి వచ్చే ఫలితాన్ని బట్టి రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్ధులను సిబ్బంది చేరవేసే బస్సులు మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో బస్టాండ్ ల నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగేందుకు ఆర్టీసీ అనుమతివ్వనుంది. సమయాన్ని బట్టి రూట్లను ఎంచుకునే అవకాశాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకే ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది ప్రభుత్వంలో విలీనం కావడంతో వారికొచ్చే నష్టం ఉండదనే అభిప్రాయాన్ని కల్పించారు.  ప్రయాణికులని చేరవేయడంలో బస్సుల నిర్వహణ పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సమవేశాలు పూర్తయ్యాకే ముందుకొచ్చే ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సుల నిర్వహణకు అనుమతులు ఇచ్చే అవకాశమున్నట్లు తెలియజేశారు. ఆర్టీసీ ప్రతిపాదన పై కార్మిక సంఘాలు రవాణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం విద్యార్థులు సిబ్బందిని చేరవేసేందుకు మాత్రమే ఆయా బస్సులకు తాము పర్మిట్లు ఇచ్చామని దీనికి విరుద్ధంగా ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు సర్వీసులగా నిర్వహించేందుకు అనుమతులు ఉంటాయి తప్ప స్టేజి క్యారియర్ లుగా తిప్పడం సాధ్యపడదని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలను తాము సమర్థించమని కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉన్న నష్టాలను తుడిచిపెడుతుందో లేని కష్టాలను తెచ్చి పెడుతుందో అర్ధం కాక అందరిలో అయోమయం మొదలైయ్యింది.

ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు.. ఫిబ్రవరి 14న కోర్టుకి హాజరు కావాలి!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావాంగ్‌ ను.. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు.  హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు. నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇంగ్లీష్ మీడియం నిర్ణయానికి 45 వేలకు పైగా పాఠశాలల మద్దతు!!

ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సరైన నిర్ణయమే.. కానీ, తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించడం సరికాదని విమర్శించాయి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అసలు తెలుగు భాషనే మర్చిపోయే ప్రమాదముందని హెచ్చరించాయి. అయినా ఈ విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు. ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంగ్లీష్ మీడియంతోనే మారుతుందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు అందరి ఆమోదం ఉందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తాజాగా ఇదే చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయి. 45 వేల పై చిలుకు పాఠశాలల నుంచి ఈ తీర్మానాలు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం గురించి అంతా సానుకూలంగా నే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను అన్ని సచివాలయంలో ప్రదర్శనకు పెట్టామని మంత్రి తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై!!

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు.   పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై సర్పంచ్‌లదే ఉంటుందన్నారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. సర్పంచ్ స్థానికంగా నివసించాలి, రోజు పంచాయితీ కార్యాలయానికి వెళ్లాలని అన్నారు. తాగునీటి అవసరాలు, ప్రకృతి వైపరిత్యాల నివారణకై సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే.. గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై చేస్తామని మంత్రి హెచ్చరించారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్... స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక,  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15కల్లా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యానికి తావులేకుండా చేయాలని, ఒకవేళ ఏ అభ్యర్ధి అయినా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ దొరికితే అనర్హత వేటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం మూడేళ్ల శిక్షతోపాటు అనర్హత వేటు పడుతుందని గుర్తుచేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13రోజుల నుంచి 15రోజులకు పొడిగించే చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

సినిమా కథ ఎందుకూ పనికి రాదు... ఇతని ప్రేమ ముందు... 

తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ప్రేమికులు ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు... ఇలా అన్నింటినీ దాటతారు. కుటుంబాన్ని ఎదిరిస్తారు. ఎవరు ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా... చివరికి తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంటారు. వికారాబాద్ యువకుడు అలాంటి సాహసమే చేశాడు. తన ప్రేమ కోసం అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ యువకుడి పేరు బొబ్బిలి భాస్కర్... ఉండేది వికారాబాద్... డిగ్రీ వరకు చదువుకున్నాడు... అయితే, భాస్కర్... ఓ ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు... ఆ యువతి... భాస్కర్ కు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మాయే... స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు... ఒకే స్కూల్... ఒకే కాలేజీలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు... అమ్మాయి కూడా భాస్కర్ ను ప్రేమించింది... మొదట స్నేహంగా మొదలైన వీరిద్దరి అనుబంధం... ఆ తర్వాత పీకల్లోతు ప్రేమకు దారితీసింది... ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు ఇద్దరూ... భాస్కర్ ఇంటికి యువతి వచ్చిపోతూ ఉండేది... నువ్వు ముస్లిం అమ్మాయివి... మా ఇంటికి రావొద్దు... మా అబ్బాయిని ప్రేమించొద్దు... అంటూ భాస్కర్ కుటుంబ సభ్యులు చెప్పినా... నేను పెళ్లంటూ చేసుకుంటే... భాస్కరే చేసుకుంటానంటూ తన మనసులో మాటను చెప్పేది... అయితే, ఇద్దరూ డిగ్రీ చదువుతుండటంతో... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుని కలిసి బతకాలని అనుకున్నారు... అలా, రెండు మూడేళ్లు గడిచిపోయాయి... అయితే, వీళ్లిద్దరి ప్రేమకు మతం అడ్డొచ్చింది... భాస్కర్ హిందువు... అమ్మాయిది ముస్లిం... దాంతో, యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు... కానీ, తన ప్రేమను బతికించుకోవాలనుకున్న భాస్కర్... యువతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు.... చివరికి, నువ్వు ఇస్లాం మతంలోకి మారితే, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంటూ యువతి తల్లిదండ్రులు చెప్పడంతో... ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన ప్రేమ కోసం ఏకంగా మతాన్నే మార్చుకున్నాడు.  తన ప్రేయసి చెప్పినట్లుగా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్ గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించడమే కాకుండా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్‌గా మార్చుకున్న భాస్కర్‌ను చూసి అతని తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోయారు. భాస్కర్ కట్టూబొట్టు అంతా ముస్లింలా మారిపోయాడు. ఎంతలా అంటే, భాస్కర్ ను చూస్తే... ఇతను ఇంతకుముందు హిందువు అంటే నమ్మలేనంతగా మారిపోయాడు... అచ్చం ముస్లింలా మాదిరిగా గడ్డం పెంచుకున్నాడు... చాలా మంది ముస్లింలకు సైతంరాని ఇస్లాం ప్రవచనాలను, మహ్మద్ ప్రవక్త సారాన్ని నేర్చుకున్నాడు... మత మార్పిడి కోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ముస్లింగా మారినట్లు మత ధృవీకరణ పత్రాన్ని పొందాడు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకుని యువతి ఇంటికి వచ్చాడు. అయితే, కథ ఇక్కడే కొత్త మలుపు తిరిగింది.  పూర్తిగా ముస్లింగా మారిపోయి, ఎన్నో ఆశలతో యువతి ఇంటికెళ్లిన మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇస్లాం మతం స్వీకరిస్తే కూతురినిచ్చి పెళ్లి చేస్తామన్న యువతి కుటుంబ సభ్యులు... అతనెవరో తెలియనట్లు వ్యవహరించారు. పదేపదే ఇంటికి వస్తున్నాడంటూ మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌‌పై దాడికి పాల్పడ్డారు. ప్రేయసి నిక్కత్ సుల్తాన్‌‌ను కలవకుండా ఆంక్షలు విధించారు. యువతిని నిర్బంధించారు. దాంతో, ఏం చేయాలో దిక్కుతోచక మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ ప్రేమ కథ... ఇక్కడ మరో మలుపు తిరిగింది. భాస్కర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్సీ... యువతిని తమ ముందు హాజరుపర్చాలంటూ వికారాబాద్ పోలీసులను ఆదేశించింది. హెచ్‌ఆర్సీ‌ ఆదేశాలతో నిక్కత్ సుల్తాన్‌‌ను మానవ హక్కుల కమిషన్‌ ముందు హాజరుపర్చారు పోలీసులు. దాంతో, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ నీకు తెలుసా? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అంటూ యువతిని హెచ్‌ఆర్సీ ఛైర్మన్ ప్రశ్నించారు. అయితే, భాస్కర్‌తో తనకెలాంటి సంబంధం లేదని, మతం మార్చుకోమని తాను చెప్పలేదని నిక్కత్ సుల్తాన్ తెలిపింది. అంతేకాదు, భాస్కర్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. తాను భాస్కర్‌ను ప్రేమించలేదని, మతం మారితే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. దాంతో, భాస్కర్ పిటిషన్‌ను హెచ్ఆర్సీ కొట్టివేసింది. నిక్కత్ సుల్తాన్‌ మాటలతో మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌ కంగుతిన్నాడు. తాను ప్రేమించిన యువతి అలా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయాడు... నీకోసమే కదా... ఎన్నో కష్టాలు పడ్డాను... ఎన్ని కష్టాలెదురైనా నీతోనే జీవితం అనుకున్నాను... అంటూ కోర్టు హాల్లో కన్నీరు మున్నీరయ్యాడు... అయితే, తన ప్రేమను గెలిపించుకునేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని, కచ్చితంగా తన ప్రేమను దక్కించుకుంటానని భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ అంటున్నాడు. అయితే, తన ప్రేయసి కోసం ముస్లింగా మారిన భాస్కర్ ను చూసి కోర్టుకొచ్చినోళ్లే కాదు... మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అతని ప్రేమ కథను విని అయ్యో అంటూ చలించిపోయారు.

జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి... మళ్ళీ వెలుగులోకి వచ్చిన మైనర్ బాలిక రేప్ కేసు!

2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. కర్నూలులో నగర శివారు లోని లక్ష్మీ గార్డెన్స్ లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె ప్రీతి. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదివేది. 2017 ఆగస్టు 19 న ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఉరివేసుకుని చనిపోలేదని స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం చేసిన వైద్యులు సైతం 2017 ఆగస్టు 20 న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో బాలికను రేప్ చేసినట్టు నిర్ధారించారు. పెథాలజీ హెచ్వోడీ డాక్టర్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లితండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లితండ్రులు తాలుకు పోలీసు స్టేషన్ లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటుగా అతడి కుమారుల పై ఫిర్యాదు చేశారు. నిందితుల పై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.  ఈ ఘటన పై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరం పై ఉన్న గాయాలను అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థిని పై లైంగికదాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా వుండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లితండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాగా ఎలాంటి న్యాయం జరగలేదు.  దీంతో ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దీంతో ఈ ఘటన పై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఏఎస్పీ పకీరప్ప తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. జస్టీస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ ఈ కేసు మళ్లీ ప్రాణం పోసుకొని బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ వారిలో చిగురించింది. జగన్ సర్కార్ ఇలాంటి కామాందులను శిక్షిస్తుందో రక్షిస్తుందో వేచి చూడాలి.

వైఎస్ జగన్ కు ఉపశమనం కలుగుతుందా.. సీబీఐ కౌంటర్ పిటీషన్ పై సర్వత్రా ఆసక్తి!

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను హైకోర్ట్ ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని గత వారం సిబిఐ కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో సీబీఐ కౌంటర్ పై ఆసక్తి నెలకొంది.  ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది. ప్రధానంగా ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సీబీఐ సరైన టైమ్ లో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో విచారణ ఈ నెల 12 కు వాయిదా వేయడంతో  సిబిఐ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తారో ఆ కౌంటర్ లో ఎటువంటి విషయాలు పొందుపరుస్తారనేది మాత్రం  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు దానిని కొట్టివేసిన నేపధ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనకు  ప్రతి వారం కోర్ట్ కు హాజరు కావాలంటే దాదాపు 60 లక్షల రూపాయల ఖర్చవుతుందని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద నేడు దాఖలయ్యే కౌంటర్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.

ఢిల్లీ పర్యటనకు ముందు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు!!

జగన్ సర్కార్ ఏపీలో మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఆసాంతం సమూలంగా మార్చాలని ప్రవేశపెట్టిన నాడూ నేడూ పధకంతో పాటు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోట్ బుక్స్ ఇవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.  రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా మంత్రి వర్గం ముందుకు ప్రతిపాదనలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీల పై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రి వర్గానికి పంపారు.  కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించగా మంత్రి వర్గంలో ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా ఇక పై 20 రోజులకే కుదించాలని మునిసిపల్ శాఖ నుంచి మంత్రి వర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వెళ్ళింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిని ఏర్పాటు చేయటం ద్వారా 10,000 ల మెగావాట్ల విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు అధికారులు.ఇవాళ జరిగే మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లి పర్యటణలో మోదీని కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించక పోవడం పై మరియు  రైల్వే ప్రాజెక్టుల పై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

పాపం... పొన్నం..! తలకిందులైన పరిస్థితి..!

పొన్నం ప్రభాకర్... ప్రస్తుతం తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... చాలా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం, ఎంపీగా గెలిచిన తరువాత ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకమైన లీడర్‌గా చలామణి అయ్యారు. ఎంపీ ఫోరమ్ కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు కూడా ఉండటంతో పొన్నం ప్రభాకర్‌కు, పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాతే, పొన్నం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.  తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెడుతుంటే, లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పేని అడ్డుకున్నారు పొన్నం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అయినా, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ కోలుకోలేదు పొన్నం. ప్రతీ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బలే తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారున్ని అంటూ పొన్నం మొత్తుకుంటున్నా, ప్రజలు మాత్రం ఆదరించడం లేదు. ఇటు క్యాడర్‌లో మనోస్దైర్యం నింపడంలోను, పొన్నం విఫలమవుతున్నారని అంటున్నారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగిన పొన్నం... ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయారు. సొంత జిల్లాలో కాంగ్రెస్‌ను బతికించుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వరుస ఎన్నికల ఫలితాలు చూస్తే, ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోను పోటీ చేసినా థర్డ్‌ ప్లేసే మిగిలింది. ఇక, మున్సిపల్ ఎన్నికల్లోనూ కరీంనగర్ జిల్లాలో అన్నీ తానై నడిపించారు పొన్నం. తాను అనుకున్నవారికే పొన్నం టికెట్లు ఇచ్చారు. అయినా కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీల్లో, ఎక్కడా కాంగ్రెస్‌కి, అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయారు. ఇక కరీంనగర్ నగర పాలక ఎన్నికల్లో అయితే, పార్టీ ప్రకటించిన మేయర్ అభ్యర్థితో సహా చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో, పొన్నం మీడియా ముందుకే రావడం మానేశారు. మరి పొన్నం సక్సెస్‌ ట్రాక్‌ ఎప్పుడు పడతారో, మళ్లీ తన హవాను ఎప్పుడు నడిపిస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.

కీచక టీచర్... దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు

'ఆచార్యదేవో భవా' అని గురువుకి తల్లి తండ్రి తరువాత స్థానాన్ని ఇచ్చారు మన పెద్దలు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న కొందరు గురువులు తమ నైతిక విలువలను సైతం మరిచిపోయి అత్యంత దారుణాంగా ప్రవర్తిస్తున్నారు. నేటి సమాజంలో చెడు వైపుకు వెళ్ళకుండా కాపాడాల్సిన గరువే తన విలువలను సైతం మరచిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో ఓ కీచక టీచర్ కు దేహశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్లో పాఠాలు చెప్పకుండా విద్యార్ధినులతో అసభ్యకరంగా మాట్లాడడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించటం విసుగు తెప్పించింది. ఈ విషయాన్ని విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టీచర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రకాశం జిల్లాలో  బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి హై స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి.పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354, ఫోక్సో యాక్ట్ సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాకి కలెక్టరే బాస్.. కలెక్టర్లకు ప్రత్యేక నిధులు!

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల పై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై వివరణ ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్లే బాస్ అని స్పష్టంజేశారు. మంచి జరిగినా చెడు జరిగినా వారే భరించాలి అని చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీలో నిధుల కొరత రాకుండా కలెక్టర్ లకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అందులోభాగంగా అత్యవసర పనుల కోసం కలెక్టర్ లకు నిధులు విడుదల చేశారు. ఒక్కో కలెక్టర్ కు కోటి రూపాయల చొప్పున 33 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెప్రగతి తరహాలో పట్టణ ప్రగతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ లకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన చర్యల పై అవగాహన కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్ లు మున్సిపల్ సమావేశం నిర్వహించి మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పట్టణ ప్రగతి కంటే ముందే అన్ని వార్డుల్లో కమిటీలను నియమించాలని కార్యక్రమం కోసం వార్డుకో అధికారిణి ఇన్ చార్జ్ గా నియమించాలనే సూచించారు. పట్టణాలూ నగరాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పార్క్ లు ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలన్నారు. కేబీఆర్ పార్క్ తరహాలో అన్ని పట్టణాలకు రెండు కిలోమీటర్ల దూరంలో నడక కోసం పార్కులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

హోటల్ నిర్లక్ష్యానికి బలైపోయిన చిన్నారి జీవితం...

హైదరాబాద్ బేగంపేట లోని మానస సరోవర్ హోటల్ లో కలుషిత ఆహారం తినడం వల్ల ఎన్నారై కుటుంబం అస్వస్థత పాలైంది. హైదరాబాద్ బేగంపేట లోని ప్రముఖ మానస సరోవర్ హోటల్లో వడ్డించిన పన్నీర్ కర్రీతో రోటీ తినడంతో రెండేళ్ల బాలుడు నిహాన్ ప్రాణాలు కోల్పోయాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవి నారాయణ దంపతులతో పాటు మరో కుమారుడు ఏడేళ్ల వరుణ్ తీవ్ర అస్వస్థత పాలయ్యారు. కేవలం కలుషిత ఆహారం తినడం వల్ల జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో రెండేళ్ల బాబు మృతి చెందగా. వారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా అస్వస్థకు గురై ప్రస్తుతం బేగంపేట్ లోని కిమ్స్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వీసా స్టాంపింగ్ కోసం నిన్న ఉదయం బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వచ్చి మానస సరోవర హోటల్ లో వసతి కోసం దిగి స్టాంపింగ్ కోసం వీసా ఆఫీసుకు వెళ్ళారని సమాచారం. వీసా ఆఫీసు నుంచి వచ్చి భోజనం చేసిన తరువాత నుంచి నలుగురు కడుపు నొప్పి తీవ్ర వాంతులతో అస్వస్థతకు గురి అవ్వగా వారిని తక్షణమే .హాస్పటల్ కి తీసుకువెళ్తున్న దారి మధ్యలోనే చిన్నారి మృతి చెందాడని బంధువులు తీవ్ర ఆవేదనను వెల్లడించారు. తక్షణమే హోటల్ పై కఠిన చర్యలనుతీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  

ఇరకాటంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...కావాలనే కార్నర్ చేస్తున్న వైసీపీ...

2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఉత్తరాంధ్రను వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. కేవలం ఆరు స్థానాలు మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం సీట్లను ఊడ్చిపారేసింది. శ్రీకాకళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం... అలాగే, విశాఖ జిల్లాలో విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలుంటే 28 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకున్నా... అసెంబ్లీ వరకు వచ్చేసరికి అర్బన్ ఏరియాలో తెలుగుదేశం సత్తా చాటింది. అంటే, విశాఖ ఈస్ట్(వెలగపూడి రామక్రిష్ణబాబు), విశాఖ వెస్ట్(గణబాబు), విశాఖ నార్త్(గంటా శ్రీనివాసరావు), విశాఖ సౌత్(వాసుపల్లి గణేష్ కుమార్) నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ జిల్లాలోని రూరల్ ఏరియా మొత్తం వైసీపీ సత్తా చాటితే... అర్బన్ వరకు వచ్చేసరి మాత్రం తెలుగుదేశం తన పట్టునిలుపుకుంది.  అయితే, ఇప్పుడు విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఒకవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా టీడీపీ వ్యతిరేకిస్తుంటే, అందుకు సపోర్ట్ చేయలేక, అలాగని విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా అంగీకరించలేక సతమతమవుతున్నారు. దాంతో, ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుతున్నారు. విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా చేయడం వైజాగ్ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేలకు సమ్మతమో కాదో స్పష్టమైన ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇష్టంలేకపోతే, రాజీనామా చేసి రిఫరెండం కోసం ఉపఎన్నికలకు వెళ్లాలని పదేపదే సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, పార్టీ లైన్‌ను దాటలేక... మరోవైపు, విశాఖను పరిపాలనా రాజధానిగా అంగీకరించలేక సతమతమవుతున్నారు వైజాగ్ టీడీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ నేతల రెఫరెండం సవాల్‌పై విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఎవరికివారు, మౌనంగా జారుకుంటున్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తే, స్థానికంగా వ్యతిరేకత తప్పదు. అలాగని చంద్రబాబు మాటను జవదాటలేరు. పార్టీ స్టాండ్‌ను ఫాలో అవుతూనే పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా వ్యవహరిస్తున్నారు. అయితే, వెలగపూడి రామక్రిష్ణబాబు(విశాఖ ఈస్ట్), గణబాబు(విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు(విశాఖ నార్త్), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్)... ఈ నలుగురిలో గంటా మాత్రమే ధైర్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించగా... మిగతా ముగ్గురూ రాజధాని అంశాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.