బీజేపీ ఎంపీ సుజనాకు మరోషాక్.. 400 కోట్ల ఆస్తుల వేలానికి బ్యాంకు ప్రకటన

అప్పుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసుల పర్వం కొనసాగుతోంది. సుజనా గ్రూపు సంస్ధ అయిన హైదరాబాద్ లోని సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల రూపాయల అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం ప్రకటన జారీ చేసింది. అప్పులను రాబట్టుకునేందుకు వచ్చే నెల 23న సంస్ధకు చెందిన పలు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది. టీడీపీని వీడి బీజేపీలో చేరినా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి సమస్యలు తప్పడం లేదు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్ధలు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు వేలం ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ద్వారా పలు బ్యాంకులు సుజనా గ్రూప్ సంస్ధలకు వేలం నోటీసులు పంపగా.. తాజాగా హైదరాబాద్ లోని సుజనా గ్రూప్ సంస్ధ మెసర్స్ సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల అప్పుల రికవరీకి గానూ సంస్ధకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఇందులో రుణం తీసుకున్నందుకు గ్యారంటెర్లుగా ఉన్న ఎంపీ సుజనా చౌదరితో పాటు వై. జితిన్ కుమార్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్స్ట్స్ లిమిటెడ్, సుజనా క్యాపిటల్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్ తో పాటు మరికొందరి పేర్లను ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.. ఇప్పటికే సీబీఐ నుంచి వివిధ బ్యాంకులకు చెందిన రుణాల ఎగవేత కేసుల్లో నోటీసులు అందుకున్న సుజనా గ్రూప్ సంస్ధలకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. వాస్తవానికి మోడీ తొలిసారి ప్రధాని అయ్యాక టీడీపీ కోటాలో కేంద్రమంత్రిగా వ్యవవహరించిన సుజనా చౌదరి పదవిలో ఉండగానే ఆరోపణలు మొదలయ్యాయి. ఆ తర్వాత సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతకు సంబంధించి ఆస్తుల వేలం నోటీసులు కూడా ఇచ్చింది. ఇందులో విదేశీ బ్యాంకుల రుణాలు కూడ ఉన్న నేపథ్యంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరిపై చర్యలకు వెనుకాడిన సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్దలు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడంతో సుజనాపై కేసుల విషయంలో జోరు పెంచాయి. ఆ తర్వాత వరుసగా సుజనా గ్రూపు సంస్ధల్లో సోదాలు కూడా జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత సుజనా మరో ముగ్గురు ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలో చేరిపోయారు. రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఏ క్షణాన్నైనా సుజనాను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా అప్పట్లో ఉండేది. వాటి నుంచి బయటపడేందుకే సుజనా బీజేపీని ఆశ్రయించారని అంతా భావించారు. కానీ తాజా వేలం ప్రకటనలను బట్టి చూస్తే ఆ పరిస్ధితి లేదని అర్ధమవుతోంది. సుజనా బీజేపీ ఎంపీ అయినప్పటికీ బ్యాంకులు మాత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు, ఒత్తిడి మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.

అమరావతిలో హైటెన్షన్.. డ్రోన్ కెమెరాలతో నిఘా.. రైతుల ఆందోళన!!

రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ, రాజధాని తరలింపుకు ఒప్పుకోబోమని.. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.  రోజురోజుకి ఆ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈరోజు మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమి ఆర్ధిక నేరగాళ్లం కాదని, అరాచకం సృష్టించే వాళ్ళం కాదని ఎందుకు డ్రోన్ లతో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చేసుకుంది. దీంతో మందడంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

9 నెలల్లో జగన్ సర్కార్ 3 పనులు కరెక్ట్ గా చేసింది: లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన, వైసీపీ పైన టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మేం ప్రజా చైతన్య యాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? అని ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందని విమర్శించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. తొమ్మిది నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప జగన్ సర్కార్ చేసిన ఒక్క మంచి కార్యక్రమం లేదని విమర్శించారు.  జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడే మూడు పనులు చేశారన్నారు. అవి ఏంటంటే.. రంగులు వేయడం, దాడులు చేయడం, హామీలపై వెనక్కి పోవడం.. అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఈ మూడే జరుగుతున్నాయని విమర్శించారు. జగన్‌ వల్ల ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోయిందని ఆరోపించారు. 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. జనం గగ్గోలు పెడుతున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రై 9 నెలలైంది.. కానీ ఒక్క ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెట్టే ధైర్యం కూడా లేదని లోకేష్‌ విమర్శించారు. ‘‘నీ కేసులు సంగతేంటి?.. కేంద్రం నిధుల సంగతేంటి?.. హోదా ఏమైంది?.. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని జగన్‌ భయపడుతున్నారు అని లోకేష్ అన్నారు.

నారా వారి ఆస్తులు.. తాత కన్నా మనవడి ఆస్తులే ఎక్కువ!!

మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యలు ఆస్తుల వివరాలను నారా లోకేష్‌ ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలియజేసారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పారు. తన (నారా లోకేష్) పేరు మీదున్న ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. మొత్తం అప్పులు రూ.26.04 కోట్లు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.  

ఆ లేఖ నన్ను కదిలించింది.. అందుకే రూ.కోటి ఇచ్చా: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్‌ ఫోర్స్‌ బ్యాడ్జీతో పవన్‌ను సైనిక అధికారులు గౌరవించారు.  అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్‌ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయలు అందించానని చెప్పారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని పవన్‌ తెలిపారు.

గుంటూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. మరో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వర్గపోరు

గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాల్లో ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి ఎంపీని అక్కడి నుంచి పంపించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా రావడమే దీనికి అసలు కారణం. గుంటూరు జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన నేతలంతా దాదాపు కొత్తవారే కావడంతో వారి మధ్య సఖ్యత కుదరడం లేదు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వైఖరిని నిరసిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు దిగారు. ఈ వివాదం సీఎం జగన్ వద్దకు వెళ్లడం, ఇద్దరినీ పిలిపించి మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. తాజాగా బుధవారం రాత్రి చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వచ్చారు. స్ధానిక నేతల ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయలను స్ధానిక ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు అడ్డుకున్నారు. ఇద్దరూ అధికార పార్టీ నేతలు కావడం, గతంలోనూ వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో పలు వివాదాలు తలెత్తడం జరిగింది. దీంతో ఒకరంటే మరొకరికి పడటం లేదు. స్ధానికంగా ఉన్న సంఘమిత్ర ఇంటికి వచ్చిన ఎంపీ కారును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డగించారు. ఎంపీ అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తోపులాటలో ఓ వ్యక్తి తలకు గాయాలు కూడా అయ్యాయి. పరిస్ధితి ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ కృష్ణదేవరాయలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. స్ధానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది ఎమ్మెల్యే రజనీ అనుచరుల వాదన కాగా... ఎంపీగా తమ నియోజకవర్గం పరిధిలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందనేది ఎంపీ కృష్ణదేవరాయలు వాదన. అయితే వీరిద్దరి మధ్య గతంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే తాజా వివాదం తలెత్తిందని జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి విడదల రజనీకి వైసీపీ అధిష్టానం పెద్దల ఆశీస్సులున్నాయి. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను కాదని గత ఎన్నికల్లో జగన్ రజనీకి టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె సునాయాసంగానే విజయం సాధించారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. అయితే తనకున్న అనుకూలతలను వాడుకుండూ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా రజనీ కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆయన అధిష్టానం పెద్దలకు గతంలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో తన పని తాను చేసుకుపోవాలని భావిస్తున్న ఎంపీ లావు యథావిథిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అదే కోవలో చిలకలూరిపేట రావడంతో వివాదం తలెత్తింది. తాజా వివాదంపై ఇరువర్గాలు వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

డబ్బులు తీసుకొని ఓటేశారుగా.. నీళ్లు రావు పోండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎన్నికల సమయంలో.. మాకు ఏం చేస్తారు? బదులు, మాకు ఎంత ఇస్తారు? అని ఓటర్లు నాయకులను అడుగుతారు. తీరా ఎన్నికలు ముగిశాక.. మాకు అది చేయండి, ఇది చేయండని.. నాయకుల వెంట పడితే.. 'అప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసారుగా, అనుభవించండి' అని సింపుల్ గా ఒక డైలాగ్ కొడతారు. దీంతో ఓటర్లు తెల్లమొహాలు వేస్తారు. తాజాగా తెలంగాణలో అలాంటి సంఘటనే జరిగింది. ‘‘సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేశారా?.. డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. పంటలకు నీళ్లు రావు పోండి’’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. నీళ్లు ఇవ్వమని కోరిన రైతులను ఉద్దేశించి అన్నారు.  సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బుధవారం ఎంపీపీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు, పట్ట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కూటిగల్‌ నల్ల చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, చెరువును నీటితో నింపాలని.. కొండాపూర్‌కు చెందిన పలువురు రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రైతులపై మండిపడ్డారు. సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. తప్పు ఒప్పుకొంటే రెండు పంటలకు నీళ్లు ఇస్తానని అన్నారు. తప్పులు చేయకుండా బతకాలని హితవు పలికారు. కలెక్టరు, మంత్రి స్థాయిలో కొట్లాడి.. ఏడాదికి రెండు పంటలకు నీళ్లందేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

రోజాకు అమరావతి ఉద్యమ సెగ.. నీరుకొండలో కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు

వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు అమరావతి ఉద్యమ సెగ తలిగింది. ఇవాళ నీరుకొండలోని ఎస్.ఎర్.ఎం యూనివర్శిటీలో నిర్వహించిన ఓ సదస్సుకు రోజా హాజరయ్యారు. రోజా యునివర్సిటీకి వచ్చిన విషయం తెలుసుకున్న స్ధానిక రైతులు అక్కడికి చేరుకున్నారు. వర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి వస్తున్న రోజా కాన్వాయ్ కు అడ్డు తగిలారు. టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణితో కలిసి అక్కడికి చేరుకున్న రైతులు అమరావతికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రోజా కారు దిగకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు ఉద్రిక్తత అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రోజాను అక్కడి నుంచి పంపించారు. గతంలో మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులు.. అటుగా వెళుతున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడికి పాల్పడ్డారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతిలోనే రాజదానిని ఉంచాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల రైతులు ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. వైసీపీకి చెందిన నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మందడంలో రైతుల దీక్షా శిబిరానికి వచ్చి వారి సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ కూడా ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని రైతులకు మద్దతుగా సీఎం జగన్ వద్దకు కొందరు రైతులను తీసుకెళ్లి వారి వాదన వినిపించార. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై గుర్రుగా ఉన్న రైతులు సచివాలయానికి వెళ్లే దారితో సీఎం జగన్ తో పాటు మంత్రుల కాన్వాయ్ ను అడుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

ఏపీలోని కార్పొరేట్ కాలేజీలకు మూడిందా? వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ పిల్లల గతేంటి...

ఆంధ్రప్రదేశ్ మరో ఘనత వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వడం లేదని పలు సంస్థలు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. పీపీఏల విషయంలో కోర్టులు క్రమం తప్పకుండా మొట్టికాయలు వేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ పత్రికలు కూడా మన ప్రభుత్వ నిర్వాకాన్ని ఘనంగానే ప్రస్తావించాయి. తాజాగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై పంజా విసరదానికి సిద్ధమయ్యారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది ప్రభుత్వమూ లేక ముఠా నాయకుల శిబిరమో అర్ధం కాక రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కార్పొరేట్  విద్యా సంస్థలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే అమరావతిని, ఐటి పరిశ్రమను, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు విద్యా రంగంపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపోవాలని సాక్షాత్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పద్దతిగా చెప్పారు. సాధారణంగా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అధికారులు అయినా ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిందేనని చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే జరుగుతాయని అందులో 25 శాతం సీట్లు బడుగు వర్గాలకు కేటాయించాలని చెబుతూ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారు రాష్ట్రం వదిలిపెట్టి పోవాలని మంత్రి హుకూం జారీ చేశారు. బుధవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో ప్రయివేటు, కార్పొరేటు కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో జరిపిన సమావేశంలో సదరు హెచ్చరిక జారీ చేయడంతో వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆంధ్రా వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. తెలంగాణ లోని ఆంధ్రా బోర్డర్లలో భవనాలు నిర్మించుకోవడానికి లేదా అక్కడ పెద్ద భవనాలు అనువైన స్థలం ఉంటే అద్దెకు తీసుకోవాలని వెతుకులాట మొదలు పెట్టినట్టు సమాచారం. తమ విద్యార్ధులను తెలంగాణకు తరలించి తెలంగాణ ఇంటర్ బోర్డులో అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణ భూ భాగంలో ఆంధ్రా సరిహద్దుల్లో  కాలేజీలు పెట్టి ఆంధ్రా విద్యార్ధులను చేర్చుకుని, అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి బస్సులు నడుపాలని చూస్తున్నారు. అలా కాకపోతే తెలంగాణ భూ భాగంలోనే అధునాతన హాస్టళ్లు నిర్మించుకోవాలని ప్రణాళికలు చేసుకుంటున్నారని వినికిడి. ఆంధ్ర ప్రాంతంలో ఇక కాలేజీలు నడిపే పరిస్థితులు  ఉండకపోవచ్చునని వారు అనుకుంటున్నారు. తెలంగాణ భూభాగంలో కాలేజీలు ఏర్పాటు చేసి ఆంధ్ర ఏరియాలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండలేని విద్యార్ధులకు ఈ కోచింగ్ సెంటర్లు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టి కాలేజీలు నడుపుతున్న తమకు కూడా కాస్త వెసులుబాటు ఉండాలని, తమపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదని, లేని పక్షంలో తమ దారి తాము చూసుకోక తప్పదని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం సరైనదేనని ఇష్టం ఉన్నవారు ఇక్కడ ఉండండి లేనివారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం తమ పిల్లల భవిష్యత్తు ఏమిటో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

బీజేపీ కీలక భేటీకి ముగ్గురు ఎంపీల డుమ్మా.. జీవీఎల్ తో విభేదాలే కారణమా?

ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుని స్ధానిక సంస్ధల ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న బీజేపీకి స్వయానా ఆ పార్టీ నేతలే షాకిచ్చారు. విజయవాడలో జరుగుతున్న బీజీపీ పదాధికారుల భేటీకి టీడీపీ నుంచి కాషాయ పార్టీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ డుమ్మా కొట్టారు. కేంద్ర బడ్జెట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోముందుగా పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్వయానా పార్టీ ఎంపీలే రాకపోవడం కాషాయదళంలో చర్చనీయాంశమవుతోంది. ఏపీ బీజేపీలో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. కేంద్ర బడ్జెట్ పై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి ఏకంగా పార్టీ ఎంపీలే డుమ్మా కొట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ తో పాటు సీనియర్ నేత పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ మాత్రం హాజరు కాలేదు. వీరు వస్తారో రారో కూడా సమాచారం లేదు. దీంతో ఈ సదస్సుకు హాజరైన బీజేపీ నేతలంతా వీరిపై చర్చించుకోవడం కనిపించింది. కేంద్ర బడ్జెట్ పై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు ముందుగా పార్టీ నేతలకు అవగాహన తప్పనిసరి. ఎంపీలకు అవగాహన ఉంటేనే వారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజలకు బడ్జెట్ లో సానుకూలతలను వివరించే అవకాశం ఉంటుంది. అలాంటిది పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎంపీలే తేలిగ్గా తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పదాధికారుల సదస్సుకు ముగ్గురు బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వర్గంతో ఉన్న విభేదాలు ఇందుకు ప్రధాన కారణం. కన్నా నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న సుజనా వర్గం కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంతో పాటు గతంలో ఆంగ్ల మాధ్యమం అమలు వంటి కీలక విషయాల్లో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో పాటు జనసేనతో పొత్తు తర్వాత పార్టీలో మారిన ప్రాధామ్యాలు, ఇతర అంశాలు కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకూ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతలకూ మధ్య దూరాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుతో ఉన్న విభేదాల వల్లే ముగ్గురు ఎంపీలు ఈ సదస్సుకు రాలేదని కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో పలు విషయాల్లో జీవీఎల్ తో ఈ ముగ్గురు ఎంపీలు విభేధించారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి పార్ట నేతలకు అవగాహన కల్పించేందుకు జీవీఎల్ ఏర్పాటు చేయించిన ఈ సదస్సుకు తాము వెళ్లడం అవసరమా అనే భావనతో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎంపీ-ఎమ్మెల్యే మధ్య వర్గపోరు.. పబ్లిక్ లో ఫైట్.. ఒకరికి గాయాలు!

రాజకీయాలలో సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఈ తరం రాజకీయ నాయకులు.. భుజాన వేసుకొని మరింత ముందుకి తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యర్థుల మీద విమర్శలు, ఎప్పుడూ సొంత పార్టీ వారితో వర్గపోరుతో.. రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.  తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చిలకలూరిలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర వారు ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు ఎంపీ కృష్ణదేవరాయలు వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయులను విడదల ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక వ్యక్తికి తలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు అతి కష్టంమీద ఇరువర్గాలకు సర్ది చెప్పి.. దాదాపు గంటసేపు కష్టపడి.. ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా మర్రి రాజశేఖర్‌ను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే రజినీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సాగుతోంది. 

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం జగన్ పరిశీలించారు. గురువారం ఉదయం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌కు.. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వెలుగొండ నుంచి ఖరీఫ్ పంటలకు సాగునీరు అందిస్తామని జగన్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. మొదటి  టన్నెల్ పనులు ప్రారంభించి 15 సంవత్సరాలైంది. ఇప్పటికి 17 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 1.11 కిలోమీటర్ల తవ్వకాలు జరపాల్సి ఉంది. రెండవ టన్నెల్ పనులు 10.6 కిలో మీటర్ లు తవ్వకాలు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది కిలోమీటర్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తే ఈ యేడాదిలోగా వెలుగొండ ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీరు అందుతాయని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికీ సీఎం జగన్ పర్యటనతోనైనా వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగం అందుకుంటాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.

తీహార్ జైలులో కలకలం.. నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

నిర్బయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నిర్భయ దోషి వినయ్ శర్మ.. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్‌ శర్మ గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు కూడా సమాచారం మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో వినయ్‌ శర్మ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఉరిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది కూడా.. వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఉరిని తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలైన ఆడేలా ఉన్నారు. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఉరి.. మార్చి 3న అయినా వారి మెడకి పడుతుందేమో చూడాలి.

ఓ కీలక చట్టాన్ని సవరించనున్న కేంద్రం.. జగన్ నిర్ణయమే కారణమా?

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక చట్టాన్ని సవరించనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ప్రాజెక్టు వ్యయం తాలూకు సొమ్మును రికవరీ చేసేలా, అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసేలా ఇంధన చట్టాన్ని సవరించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యుదుత్పత్తి సంస్థలు కానీ పీపీఏలను ఉల్లంఘిస్తే వాటిని విచారించేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల నుంచి గత ప్రభుత్వం అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ వాటితో కుదుర్చుకున్న పీపీఎలను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. తమ పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న ఆందోళనతో ఆయా సంస్థలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. తమ తమ దేశాల ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో కేంద్రం ఇరకాటంలో పడింది. పీపీఏల పునస్సమీక్షకు వెళ్లొద్దని జగన్ ప్రభుత్వానికి సూచించింది కూడా. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ పలుసార్లు లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు.  జాతీయ స్థాయిలో 2003 ఇంధన చట్టం అమలవుతుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టంతో పెట్టుబడిదారులకు సంపూర్ణ రక్షణ లభించటం లేదని మోదీ ప్రభుత్వం భావించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఈ చట్టాన్ని సవరించి ప్రత్యేకంగా సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంపూర్ణ భద్రత కల్పించేలా ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కొద్ది రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ విద్యుదుత్పత్తి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలూ ఒక్కసారి ఒప్పందం చేసుకున్నాక వాటిని తూచ తప్పకుండా అమలు చేయాల్సిందేనని లేదంటే ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు ట్రైబ్యునల్ రంగ ప్రవేశం చేస్తుందని ప్రాజెక్టుకైనా వ్యయం రికవరీకి రాష్ట్రాలనూ ఆదేశిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ట్రైబ్యునల్ కు కట్టబెడుతూ బిల్లు ముసాయిదా ఇప్పటికే సిద్దమైందని త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

'రామ జన్మభూమి ట్రస్ట్' చైర్మన్ గా 'నృత్య గోపాల్ దాస్'

అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం దిశగా అడుగులు చకచకా పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో అయోధ్య రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడిగా మహంత నృత్య గోపాల్ దాస్ ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్, కోశాధికారిగా గోవింద్ గిరి నియమితులయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా రామాలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతోందన్నారు ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన మోడల్ లో టెంపుల్ ఎత్తు వెడల్పులో పెరుగుదల ఉంటుందంటున్నారు.  ఆలయ నిర్మాణంలో విరాళాల కోసం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించటానికి సమావేశంలో నిర్ణయం తీసుకుంది ట్రస్ట్. రామమందిర నిర్మాణ పనులు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ రెండువ తేదీ శ్రీరామ నవమి రోజున కానీ.. ఏప్రిల్ 26వ తేదీ అక్షయ తృతీయ రోజున గానీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముందని అన్నారు ట్రస్టు సభ్యులు. ఆలయ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసే యోచనలో ఉంది ట్రస్ట్. కాగా 15రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం కానున్న ట్రస్టు సభ్యులు.. ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీని ప్రకటించే అవకాశముంది. అలాగే.. సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వం తరపున అవినాష్ మహంతి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ జా పాల్గొన్నారు.  

జగన్ సర్కార్ పై మరో అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం!!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు, ఏపీలో విపక్షం విమర్శలే కాకుండా అంతర్జాతీయ స్థాయి పత్రికల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి జగన్ ప్రభుత్వం విమర్శలపాలైంది. మొన్నటికి మొన్న పోలవరం పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటూ జర్మనీ కంపెనీ ఏపీ ప్రభుత్వం పరువు తీస్తే.. తాజాగా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ జగన్ ప్రభుత్వంపై పునరుత్పాదక ఇంధన శక్తి కంపెనీలు చేసిన ఆరోపణలు కాస్త అంతర్జాతీయ మీడియాకెక్కాయి. వాడుకున్న విద్యుత్ కు ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయంటూ అమెరికాలోని ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వ్యాసం రాసింది. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగంపై కథనం రాసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సందర్భంగా ఇండియాలో తాజా పరిస్థితుల గురించి కూడా చర్చించింది. దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన శక్తిపై సీరియస్ గా దృష్టి సారించిందని సౌర విద్యుత్ విషయంలో పెద్ద కలలు ఉన్నాయని చెప్పింది. 2030 నాటికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పెట్టుకుందని వివరించింది.  అయితే ఈ లక్ష్యాలను సాధించడంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్ లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. సోలార్ విద్యుత్ ను అధికంగా వినియోగించుకోవడంలోనే కాదు కంపెనీలకు బకాయిలు చెల్లించే విషయంలోనూ అగ్ర స్థానంలో ఏపీ ఉందంటూ పరువు తీసింది. ఏపీ విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ బిల్లులను సరిగ్గా చెల్లించకుండా వేధిస్తున్నాయని రాసుకొచ్చింది. తక్కువ ధరకు సరఫరా చేయకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తావించింది. ఇప్పటికే పీపీఏలు రివర్స్ టెండరింగ్ నిర్ణయాలపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలన్న నిర్ణయంపై అటు భారత ప్రభుత్వం కూడా ఏపీని తప్పుపట్టింది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని కేంద్ర పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒకటి రెండు సార్లు కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

రాజధాని రాక ముందే విశాఖకు ఝలక్.. ఎయిర్ సర్వీసులు రద్దు చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ప్రజా జీవనంతో పాటు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత నెలకొన్న అనిశ్చితి కారణంగా కీలకమైన పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలతో పాటు పౌర విమానయానం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ సహా దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పుడు పాలన రాజధానిగా ప్రభుత్వం చెప్పుకుంటున్న విశాఖ నుంచి కూడా తమ సర్వీసులను ఉపసంహరించుకునేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో ఎక్కువ మంది ప్రయాణికులు కలిగిన విమానాశ్రయంగా విశాఖ ఎయిర్ పోర్టుకు పేరుంది. పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఇక్కడి నుంచి నిత్యం దేశ, విదేశాలకు సర్వీసులు నడుపుతుంటాయి. రాష్ట్రంలో ఉన్నంతలో రద్దీ విమానాశ్రయంగా చెప్పుకునే విశాఖ ఎయిర్ పోర్టుపైనా తాజా పరిస్ధితుల ప్రబావం పడింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. అమరావతి నుంచి పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినా అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు నడుపుతున్న పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నిత్యం కోల్ కతాకు విమానాలు నడిపే ఎయిర్ ఏషియా సంస్ధ ప్రస్తుతం తాము నడుపుతున్న నాలుగు సర్వీసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అదే కోవలో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా చెన్నై, హైదరాబాద్ సర్వీసులను మార్చి నెల రెండో వారం నుంచి రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. మరో ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ కూడా మార్చి నెలాఖరు నుంచి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే సర్వీసును రద్దు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లే ఇండిగో సర్వీసులకు అనుమతి పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. అమరావతి అభివృద్ధి విషయంలో వైసీపీ సర్కారు వైఖరితో పాటు పారిశ్రామికంగా కూడా పురోగతి లేకపోవడంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేసుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోతుంది కాబట్టి విజయవాడ ఎయిర్ పోర్టుకు ట్రాపిక్ తగ్గడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనూహ్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ తగ్గనుండటం కచ్చితంగా భవిష్యత్తులో పెను ప్రభావం చూపే అంశమే. అసలే ఈ ఏడాది జూన్ నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు ఇప్పటికే భారీ పరిశ్రమలన్నీ రాష్ట్రం దాటి పోతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో విమానయాన సంస్ధలు కూడా తమ సర్వీసులు ఉపసంహరించుకుంటే రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వారి ద్వారా వచ్చే పెట్టుబడుపైనా తీవ్ర ప్రభావం పడనుంది. విమానయాన సంస్ధల నిర్ణయాలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  

ఏకంగా మండలి ఛైర్మన్‌కే వార్నింగా...? సెలెక్ట్ కమిటీపై జగన్ సర్కార్ గేమ్..!

  ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య సాగుతోన్న పొలిటికల్‌ గేమ్‌లోకి ఇప్పుడు ఉద్యోగులు వచ్చిచేరారు. తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును బాధ్యతల నుంచి తప్పించాలంటూ, గవర్నర్‌కు మండలి ఛైర్మన్‌ ఫిర్యాదు చేసిన తర్వాత తర్వాతి రోజే సచివాలయ ఉద్యోగులు ఎదురుతిరిగారు. మండలి కార్యదర్శికి మద్దతుగా చీఫ్ సెక్రటరీని కలిసిన సచివాలయ ఉద్యోగులు... కౌన్సిల్ ఛైర్మన్ పై భగ్గుమన్నారు. సెలెక్ట్ కమిటీ వివాదంలో మండలి కార్యదర్శి రూల్స్ ప్రకారమే వ్యవహరించారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణమాచార్యులుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టిన ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి..... అసెంబ్లీ ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాదు, నిబంధనల ప్రకారం నడుచుకునే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తాము కూడా గవర్నర్‌‌ను కోరతామన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ షరీఫ్‌.... ఫైల్‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్‌ను తిప్పిపంపుతూ మండలి సెక్రటరీ కలకలం రేపారు. దాంతో, మరోసారి ఫైల్‌‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు ఛైర్మన్‌. అయితే, రెండోసారి కూడా ఫైల్‌ను వెనక్కి పంపడంతో... మండలి కార్యదర్శిపై... కౌన్సిల్ ఛైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తనకున్న రాజ్యాంగ అధికారాలను ప్రశ్నించడమే కాకుండా, తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే, కొత్త కార్యదర్శిగా విజయరాజును నియమించాలంటూ గవర్నర్‌ను కోరారు. దాంతో, సెలెక్ట్ కమిటీ వివాదం సెగ కాస్తా... సచివాలయం ఉద్యోగులను తాకింది.  నిబంధనలు ప్రకారం నడుచుకున్న కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు ఏకంగా మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇచ్చారు. అయితే, దీనంతటి వెనుక జగన్ సర్కారు గేమ్ ఉందనేది టీడీపీ ఆరోపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరించడం సర్వసాధారణమని, కానీ, రాజ్యాంగ పదవిలో ఉన్న  మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇవ్వడం మాత్రం ఎన్నడూ జరగలేదని అంటున్నారు.

యూట్యూబ్‌తో బలవన్మరణం... హైదరాబాద్‌లో వింత ఆత్మహత్య

  ఒక్క స్మార్ట్ ఫోన్ తోపాటు ఇంటర్నెట్ ఉంటే చాలు... ప్రపంచం మీ గుప్పిట్లో ఉన్నటే. అంతలా ప్రపంచాన్ని చిన్నది చేసింది స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. అయితే, ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే మంచిదే... కానీ, ఇదే టెక్నాలజీతో కొంతమంది యువత పెడద్రోవ పడుతోంది. లోక కల్యాణానికి వినియోగించాల్సిన టెక్నాలజీని స్వనాశనానికి వాడుతోంది. సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాల్సిన మేథస్సును... విధ్వంసానికి, విశృంఖలత్వానికి ఉపయోగిస్తోంది. ముఖ్యంగా యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం దారుణాలకు దారి తీస్తోంది. మనిషి ప్రాణాలను కాపాడే టెక్నాలజీతోనే తమ ఆయువును తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ బీటెక్ విద్యార్ధి ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరగనుందో తెలుసుకోవాలంటూ బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చాడు. హైదరాబాద్ ఫిలింనగర్‌లో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న తీరు... తల్లిదండ్రులనే కాదు, స్థానికులను, పోలీసులను కూడా నివ్వెరపోయేలా చేసింది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే అలాంటి సంఘటనను ప్రత్యక్షంగా చూసి ఇదేం దారుణమంటూ మాట్లాడుకున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడమే తప్పంటే, బీటెక్ విద్యార్ధి గణేష్ మాత్రం అందరిలా తానెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో ఏమో గానీ, ఎవ్వరూ ఊహించనిరీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి పాలిథిన్ కవర్‌ను చుట్టుకుని, నైట్రోజన్ ఆక్సిజన్‌ సిలిండర్ పైపులను ముక్కులో పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, గణేష్ ఆత్మహత్య చేసుకున్న తీరే విస్తుగొలిపితే, అతను రాసిన సూసైడ్ నోట్ మరింత సంచలనంగా మారింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందని, అందుకే చనిపోతున్నానంటూ అతడు రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఇక, ఆత్మహత్యకు ముందు వారం పది రోజులుగా...  ఎక్కువ బాధ లేకుండా ఈజీగా ఎలా చనిపోవాలో గణేష్‌ యూట్యూబ్‌‌లో విపరీతంగా సెర్చ్‌ చేశాడు. అయితే, ఆత్మహత్యకు పక్కాగా ప్లాన్ వేసుకున్న గణేశ్... అందుకు అవసరమైన సామాన్లను ఒక్కొక్కటికి ఇంటికి తెచ్చుకున్నాడు. ఫిబ్రవరి 14న ఎర్రగడ్డలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి మూడున్నర వేలు వెచ్చించి నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్‌‌... పైపులు... పాలిథిన్ కవర్లు కొనితెచ్చుకున్న గణేష్‌... స్టోర్ రూమ్‌లో దాచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వాటితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్యకు ముందు నేను నా రాక్షసి సినిమాలో తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలను గణేష్‌ విపరీతంగా చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి పదేపదే చూసినట్లు తెలుస్తోంది.