ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ తో వైఎస్ జగన్ ప్లాన్!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులపై పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకే అప్పుల కోసం నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టుల కోసం అదే బాట పడుతోంది. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే వారి కోసం వేట మొదలు పెట్టింది. దానికి ప్రపంచ బ్యాంకే ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంది. సాగు నీటి పథకాలను కొత్తగా చేపట్టేందుకు రుణాలివ్వటానికి ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు అంగీకరించవు కానీ పూర్తైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు మాత్రం అప్పులు ఇస్తుంది. అయితే రాష్ట్ర అవసరాలను ప్రపంచ బ్యాంక్ కు తెలియచేసి కొత్తగా నిర్మించబోయే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కోసం రుణాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచ బ్యాంకును అర్థించాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. సీమ దుర్భిక్ష నివారణ పథకానికి 33,869 కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15,488 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదులు కాలువల అభివృద్ధికి రుణమివ్వాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా  పై రెండు కొత్త పథకాలకు అప్పులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతి నిధుల ముందు ఉంచుతారని అంటున్నారు. కానీ తన నియమ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులకు బ్యాంకు సహకరిస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్రం ఎప్పుడో దాటేసింది. దీంతో ప్రపంచ బ్యాంకుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరి ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  

నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేశా.. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు: తలసాని

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారం మెట్రో రైల్. తాజాగా మెట్రో రైల్లో కీలకమైన జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషనరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు పార్లమెంట్ జరుగుతుంటే ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభోత్సవం అధికార పార్టీ కార్యక్రమాల వలె చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తలసాని స్వయంగా కేంద్ర మంత్రికి తానే ఫోన్ చేశానని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను రాలేనని కిషనరెడ్డి చెప్పారని ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ తలసాని వెల్లడించారు. అదేవిధంగా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర మంత్రికి ఇప్పటి వరకు ఎక్కడా లోటు రానీయలేదని తెలిపారు. ఇలా ఇద్దరు మంత్రుల విమర్శలకు ప్రతి విమర్శ చేసుకోగా అంతా వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. ఇంతలోనే ప్రొటోకాల్ పై రాష్ట్ర మంత్రి తలసాని మరో వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.  ఈ నెల 18వతేదీన దక్షిణ మధ్య రైల్వేలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోయిగూడ వైపు జరగనుంది. అయితే బోయిగూడ పరిధి తన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే ఉందని తనకెందుకు ఆహ్వానం పంపలేదు అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిని తలసాని ప్రశ్నించారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభోత్సవానికి పిలవలేదని కిషనరెడ్డి రాద్దంతం చేశారని తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి కనీసం సమాచారం ఇవ్వలేదని ట్విట్టర్ లో కిషన్ రెడ్డి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తాము కిషన్ రెడ్డిలా చీప్ పాలిటిక్స్ చేయమని హుందాతనంగా ఉంటామని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. ఇక తనను పిలవక పోవడంపై కిషనరెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి మధ్య నెలకొన్న మెట్రో వివాదం ఎక్కడికి దారి తీస్తోందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.

ఏపీలో భూముల రీసర్వే నేటి నుంచే.. కృష్ణా జిల్లాలో స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పైలెట్ ప్రాతిపదికన కృష్ణాజిల్లా జగ్గయ్య పేట నుంచి మొదలు పెట్టనున్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా వినియోగించే బేస్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన భూముల సర్వే ప్రస్తుతం తప్పుల తడకగా మారడంతో రీసర్వే చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విదేశాలతో పాటు పరిమితంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల వినియోగిస్తున్న కార్స్ అనే టెక్నాలజీ ద్వారా భూముల రీసర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 బేస్ స్టేషన్ లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టనుంది ప్రభుత్వం. సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యాకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకు గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత భూరికార్డులు అన్నీ తప్పుల తడకగా మారడంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పుడు క్రాస్ సాంకేతిక సాయంతో ఉపగ్రహ ఛాయా చిత్రాల జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియ తర్వాత రీసర్వే రిజిస్టర్ ను రూపొందించనుంది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే రీసర్వే ప్రక్రియ కోసం మొత్తం 2000  కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు భూ రికార్డులను సవరించడం ద్వారా వివాదాలు కూడా లేకుండా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయ వచ్చనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ రికార్డుల ద్వారా ఉత్పన్నమయ్యే విధానాలను తగ్గించే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతుంది.

తెలంగాణ సర్కార్ కి హైకోర్టు అక్షింతలు.. ఆ జీవోలు వెబ్ సైట్ లో పెట్టండి!

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబర్ లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంత వరకు కౌంటర్ ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ఫిబ్రవరి 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.  ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లలో పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగటం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి నుండి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం ఒక లక్షా నాలుగు వేల నూట డెబ్బై యొక్క జీవోలు జారీ చేసిందని వివరించారు. 42,462 జీవోలను రహస్యంగా ఉంచిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచిన జీవోలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టేలా ఆదేశించాలని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు ఒక అధికారిని బాధ్యుడిగా నియమించాలని కోరారు.

పోలీసు ఒంటికి యోగా మంచిదేగా.. ఉపాసన యోగా పాఠాలు!

పక్షులు, జంతువుల మీద అత్యంత ప్రేమను కనబరిచే ఉపాసన కొణిదెల దృష్టి మనుషుల వైపు మళ్ళినట్లుంది. మనుషుల్లో ప్రేమ, ఆరోగ్య చైతన్యం కలిగించడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’మంటూ ఆమె తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘ముందు నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. అప్పుడే ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అంటూ నిన్నగాక మొన్న ట్వీట్‌ చేసిన ఆమె తాజాగా పోలీసులకు యోగా పాఠాలు బోధిస్తూ కనిపించారు.   ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు యోగా కావాలంటూ ఆమె యోగా గురువు ఎడ్డీ స్టెర్న్‌తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగాలో ఎడ్డీకి మంచి చరిత్రే ఉంది. ఆయన న్యూయార్క్‌ వాసి. మైసూర్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగాలో అష్టాంగమార్గాన్ని అభ్యసించారు. వేదాలను చక్కగా అధ్యయనం చేశారు.ఆయన ఉపాన్యాసాలు, రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. నిరంతరం విధుల్లో అలుపెరుగకుండా ఉండే పోలీసులకు యోగా అవసరమని భావించిన ఉపాసన అపోలో ఫౌండేషన్‌ తో కలిసి ఈ యోగా సదస్సు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారి అంజని కుమార్‌ ఈ కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించారు.

కేజ్రీవాల్ బాటలో కోదండరాం.. అధికారం మాదేనంటున్న ప్రొఫెసర్!!

దేశం మొత్తంలో హాట్ టాపిక్ గా మారుమ్రోగుతున్న పేరు  అరవింద్ కేజ్రివాల్. అందరి నోళ్లలో ఇప్పుడు కేజ్రీవాల్ పేరు నానుతుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకున్న ఆప్ పార్టీ దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం ఇప్పుడు కేజ్రీవాల్ తమకు ఆదర్శమంటున్నారు. ఓటములు ఎన్ని వచ్చినా నిరాశ చెందాల్సిన పని లేదని భవిష్యత్తు తమదేనని చెబుతున్నారు.  కేంద్రం చేతుల్లో అనేక అవమానాలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ప్రజల్లో తన కార్యదక్షతను నిరూపించుకున్నారు. అలాగే.. కేంద్రం తన అధికారంతో పెత్తనం చేసినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఎదురొడ్డి నిలబడ్డారు. అదే తమకు ఆదర్శమని కోదండరాం గారు అంటున్నారు. తెలంగాణలో కూడా మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మ గౌరవం, ఉద్యమ ఆకాంక్షల సాధన కేంద్రంగానే రాజకీయాలుండాలి. కుల, మతపరమైన భావోద్వేగాలు అర్థబలం, అంగబలం విసిరే మాయాజాలానికి తెరపడే రోజులొస్తాయి. అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టాలని ప్రొఫెసర్ గారు క్లాసులు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ఆప్ అధికారం లోకి వచ్చాక చేసిన పని కాదు. అసలు ఆ పార్టీ నిర్మాణానికి ముందు చేసిన కార్యాచరణ గురించి బోధిస్తే బావుంటుందని కోదండరాం గారు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీని ఎలా నిర్మించాలనే విషయాన్ని పక్కన బెట్టి ఇవన్నీ ఎందుకు అంటున్నారు. పార్టీ స్థాపించే కంటే ముందే కేజ్రీవాల్ తన సన్నిహితులతో కలిసి సిద్ధం చేసుకున్న ప్రణాళికల గురించి కోదండరాం పార్టీ వాళ్లతో చర్చిస్తే బెటర్ అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేగానీ పార్టీ పెట్టగానే రాజ్యాధికారమే లక్ష్యం పవర్ లోకి రావాలంటే ఎలా అని ప్లాన్ వేసుకొని ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్ ఆదర్శమని క్లాసులు చెప్తే వర్కవుట్ అవ్వదని కార్యకర్తలు ఎవరికీ వినిపించకుండా మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కసారి అధికారం లోకి వచ్చిన పార్టీలు ఆ తర్వాత ఏం చేసినా ఆదర్శంగానే కనిపిస్తాయిని అక్కడకు వెళ్లాలంటే ముందు పార్టీ నిర్మాణం సరిగా జరగాలనీ చర్చోపచర్చలు సాగుతున్నాయి. అసలు క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పట్టుకొనే నాధుడే లేనపుడు ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదని సెటైర్ లు వేస్తున్నారు. మరి ఇవన్నీ కోదండం గారికి ఎవరు చెప్తారో చూడాలి.

చంద్రబాబుని లైట్ తీసుకున్న తిరుపతి తమ్ముళ్లు.. ఇక కష్టమేనా!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. సిట్టింగ్ స్థానంగా ఉన్న తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. రెండవసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగిన సుగుణమ్మకు ఈ దఫా పరాజయం తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ అకాల మరణంతో జరిగిన తిరుపతి ఉప పోరులో ఆయన సతీమణి సుగుణమ్మ అనూహ్య విజయం సాధించారు. లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. నాటి పోటీకి వైసీపీ దూరంగా ఉండటంతో సుగుణమ్మ ఈ ఘనత సాధించారు. అయితే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పలేదు. సుగుణమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం తప్ప మిగిలిన 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 12 చోట్ల వైసిపి అభ్యర్ధులు 25 వేలకు పైగా మెజారిటీ సాధించగా తిరుపతి విషయానికి వస్తే కేవలం 800 ఓట్ల ఆధిక్యంతో భూమన గెలిచారు. భూమనకు సుగుణమ్మ గట్టి పోటీనిచ్చారని వైసిపి గాలిలో ఆమెకు గౌరవప్రదమైన ఓటమి దక్కిందని అంతా అనుకున్నారు. టిడిపి క్యాడర్ అంతా కలిసి సుగుణమ్మ కోసం బలంగా పోరాడారని భావించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా సీన్ మారిపోయింది. తిరుపతి టిడిపిలో గ్రూపుల గోల ముదురుతోంది. ఎవరికి వారు బడా లీడర్ లుగా భావించుకుంటూ ముందుకు వెళ్తూ.. ఉండడంతో సమస్య మొదలైంది. గత ఎన్నికల్లో తిరుపతి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టిడిపి నేత మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఇప్పుడు మారిపోయారు. ఎన్నికలకు ముందు సుగుణమ్మ విజయం కోసం బాగానే కష్టపడ్డ ఆయన ఇప్పుడు పార్టీకీ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సుగుణమ్మ ఆధ్వర్యంలో  ఈమధ్య జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలకు ఆయన మొక్కు బడిగా వచ్చి వెళ్లారే తప్ప అంతగా ఆసక్తి కనబరచలేదనే టాక్ నడుస్తోంది. చాలా మంది స్థానిక టిడిపి నాయకులది ఇదే పరిస్థితి. సుగుణమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు నిరసనలకు స్థానిక క్యాడర్ అంతంత మాత్రంగానే సహకరిస్తోంది. మొత్తం బాధ్యతంతా సుగుణమ్మపైనే పడుతోందని ఆమె అనుచరులు అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య తిరుపతి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నగర వీధుల్లో అమరావతి కోసం భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇక్కడే తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న వ్యవహారం మరింత బట్టబయలైందని చెప్తున్నారు. స్వయంగా అధినేత తిరుపతికి వస్తున్నా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. జన సమీకరణపై ఎవ్వరూ దృష్టి సారించకపోవడంతో చంద్రబాబు భిక్షాటన కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగిందని అంటున్నారు. వాహనాల హడావుడి తప్ప ఈ ర్యాలీలో పెద్దగా జనాలు కనిపించలేదు. పోలీసులు ఆంక్షలు కూడా ఈ పరిస్థితికి కారణం. అయినప్పటికీ.. తెలుగు తమ్ముళ్లు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే మొక్కుబడిగా ఈ వ్యవహారం ముగిసింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు పర్యటన ముగిసిన రెండు రోజులకే వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా నగర వీధుల గుండా భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని సూపర్ సక్సెస్ చేశారు. చూశావా చంద్రబాబు ఇది నా సత్తా అంటూ ఇదే ర్యాలీ నుంచి బాబుపై విరుచుకుపడ్డారు భూమన. ఈ మొత్తం వ్యవహారం టిడిపి అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనకు పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో పనిచెయ్యలేదని అధిష్ఠానం భావిస్తోందని చెబుతున్నారు. స్థానిక నేతల మధ్య గ్రూపుల గొడవే ఇందుకు కారణంగా అధిష్ఠానం భావిస్తోంది.

మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్లాన్.. నెలకు 70 కోట్లు!!

తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణాలు, నగరాల డెవలప్ మెంట్ కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 24 న మొదలయ్యే ఈ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల పూర్తి అయ్యాయి. కొత్త పాలక మండళ్లు కొలువుదీరడంతో ఇక పట్టణాల్లో అభివృద్ధిని ప్రణాళికా బద్ధంగా చేపట్టేందుకు రెడీ అయ్యింది. కొత్త మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టణాల్లో తమ బాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది. అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం విధి విధానాల రూపకల్పన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈరోజు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పట్టణ ప్రగతి ఉద్దేశాన్ని నేరుగా కొత్త నేతలకు సీఎం వివరించనున్నారు. కార్యక్రమం అమలుపై దిశా నిర్దేశం చేయనున్నారు. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించేలా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయనుంది. వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేయనుంది. మున్సిపాలిటీల అభివృద్ధికి నెలకు 70 కోట్ల రూపాయలను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. గజ్వేల్ లో చేపట్టిన అభివృద్ధి పనులను మోడల్ గా చూపించనున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అప్పుడు టికెట్ కోసం పోటీపడ్డారు.. ఇప్పుడు పట్టించుకోరు.. ఇదీ టీడీపీ నేతల తీరు!

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపికి మంచి పట్టుంది. అధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు ఆది నుంచి టిడిపికి మద్దతుగా వుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమితో నాయకులు ఢీలా పడ్డారు. దీంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడమే.. ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టిడిపిలో నాయకత్వం కోసం నాయకులు తీవ్రంగా పోటీ పడ్డారు. మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ వైకుంఠ శ్రీరాములు కుటుంబానికి అక్కడ మంచి పట్టుంది. శ్రీరాములు మరణం తర్వాత ఆయన తనయుడు మల్లికార్జునకు నియోజక వర్గం టిడిపి బాధ్యతలు అప్పజెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున వీరభద్రగౌడ్ బరిలో దిగి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్ నియోజక వర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోసం వైకుంఠం మల్లికార్జున, వీరభద్రగౌడ్ పోటిపడ్డారు. అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరి మధ్యా ఐదేళ్లుగా పోటీ సాగింది. ఇంతలో మూడో నాయకత్వం తెరమీదకు రావడంతో ఇద్దరి ఆశలు అడియాసలయ్యాయి. ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని వీరభద్రగౌడ్ ఆశపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో కోట్ల కుటుంబం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వీరభద్రగౌడ్ కు నిరాశ ఎదురైంది. ఇక్కడే ఉంది ట్విస్ట్. కోట్ల సుజాతమ్మను పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ బరిలోకి దించడంతో వీరభద్రగౌడ్ పార్టీ గెలుపు కోసం పని చేయాల్సి వచ్చింది. పార్టీ ఇన్ చార్జిగా అయిదేళ్లు కష్టపడినప్పటికీ.. హైకమాండ్ గుర్తించలేదని కన్నీటి పర్యంతమైన వీరభద్రగౌడ్ నిరుత్సాహంగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఆలూరుకు అనుకోని అతిథిగా వచ్చిన కోట్ల సుజాతమ్మ ఎన్నికల సమయంలో పార్టీ క్యాడర్ కు ఎంతో భరోసా నిచ్చారు. వారానికి నాలుగు రోజులు ఆలూరులోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం సుజాతమ్మ అస్సలు నియోజక వర్గం వైపు తొంగి చూడడం లేదని టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఆలూరుకు దూరంగా వుండటమే చర్చనీయాంశమైంది. అయిదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ వీరభద్రగౌడ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి న్యాయం చేస్తారని భావించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో పక్క కోట్ల సుజాతమ్మ కూడా ఆలూరుకు రాకుండా పోవడంతో పార్టీ కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తుండటం అసలైన ట్విస్ట్.

మార్చి 6నుంచి తెలంగాణ అసెంబ్లీ.. 8న బడ్జెట్...

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 8వతేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే రెండు రోజుల ముందు అంటే 6వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం అందించారని తెలిసింది.  బడ్జెట్ సమావేశాలు కావటంతో తొలి రోజు 6 న శాసన సభ, శాసన మండలి, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 6 న ఆమె ప్రసంగం మినహా సభ కార్యక్రమాలు ఏమీ ఉండవు. మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. 7 న తిరిగి ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి సమావేశాలు విడివిడిగా జరగనున్నాయి. 8 న తొలుత శాసన సభలో తర్వాత మండలిలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతోంది. 6 న సభ వాయిదా పడ్డాక అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశాలు వేరు వేరుగా జరగనున్నాయి.  

నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై హైకోర్టు సీరియస్!!

నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల వ్యవహారంపై మేడిపల్లికి చెందిన సామాజికవేత్త రాజేష్ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇంటర్ బోర్డు నుంచి పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోరింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీల పై రిపోర్టును హైకోర్టు సమర్పించింది. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బోర్డు తన నివేదికలో పేర్కొంది. మొత్తం 45 కాలేజీలనూ గుర్తింపు లేకుండా నడుపుతున్నారని ఇందులో 20,000 ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపింది. అదేవిధంగా ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ఇంటర్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని నిబంధనలు పాటించని కాలేజీలను ఎందుకు మూసివేయడం లేదని నిలదీసింది న్యాయస్థానం. గుర్తింపు లేని కాలేజీల్లో చదువుకుంటున్న 20,000 ల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కార్పోరేట్ కాలేజీలతో పాటుగా అధికారులు దీనిపై ఎలాంటి సమాధానం చెబుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్ట్. నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎలాంటి నిబంధనలూ పాటిస్తున్నారు..? కళాశాలల్లో వసతుల పరిస్థితేంటి.? ఇప్పటి వరకు కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు మృతి చెందారు? తదితర పూర్తి వివరాలతో ఈ నెల 25లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

లైఫ్ సైన్సెస్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మంత్రిగా చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. రేపటి కోసం నేడు అనే కాన్సెప్ట్ తో హెచ్ఐసీసీ వేదికగా బయో ఏషియా 2020 సదస్సును మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు 37 దేశాలకు చెందిన 2000 మంది ప్రతి నిధులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సెయిన్జిన్ బయోటెక్ రీసెర్చి సెంటర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ను హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నామని కేటీఆర్ వివరించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని... తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలోని 35 శాతం మెడిసిన్స్ హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 800 ఫార్మా కంపెనీలున్నాయని.. త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు రేపు కూడా కొనసాగనున్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. ఈ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.

రైతులను బ్రోకర్లు అన్న ఎమ్మార్వో వనజాక్షి.. తిరగబడ్డ రైతులు!!

టీడీపీ హయాంలో చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ తో పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మార్వో వనజాక్షి నోరు జారడంతో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేయగా.. సభలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు. సభ జరుగుతున్న సమయంలో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించారు.  ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను బ్రోకర్లు అంటారా? అంటూ వనజాక్షి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. వనజాక్షి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు. ఎమ్మార్వో వనజాక్షి తీరుపై మహిళలు, రైతులు మండిపడ్డారు. ఆమెపై ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిర్భయ దోషులు నలుగురికీ మార్చి 3న ఉరి!

ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. మార్చిన 3వ తేదీ ఉదయం ఆరు గంటలనకు దోషులైన నలుగుర్నీ ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే తాజాగా వెల్లడించిన తీర్పుతో తిహార్ జైల్లో మార్చి 3వ తేదీన నలుగుర్నీ ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్భయ కేసు ఉరిశిక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. గతంలోనే నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి1వ తేదీన ఉరి తీయాల్సి ఉంది. కానీ.. కోర్టు ఆదేశాలతో ఉరి శిక్ష అమలును నిలిపేయాలని పాటియాల కోర్టు జనవరి 31న తీర్పు చెప్పింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం హైకోర్టుకు వెళ్లగా.. ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 17వ తేదీన పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఆ దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ.. దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ... ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉందని. నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పుడు కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంతో నిర్భయ తల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈడీ జప్తు చేసింది  కేవలం రూ.43వేల కోట్లే..ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షల కోట్లుంది!!

రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీదాడుల గురించి, గత నాలుగురోజులుగా నిర్విరామంగా దుష్ర్ఫచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా లక్షలకోట్లు పోగేసుకొని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదన్న వెంకన్న, టీడీపీపై మాత్రం విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. శ్రీనివాస్ ఇంటిలో ఏ సూట్ కేసులు దొరకలేదని ఐటీశాఖే స్పష్టంగా చెప్పిందని, రూ.2వేలకోట్లు దొరికాయని విష ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, మంత్రులు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. రూ.2వేలకోట్లు దొరికాయని, ఆ సొమ్మంతా చంద్రబాబుదేనని  గగ్గోలు పెట్టిన వైసీపీ బృందం ఆ మొత్తంసొమ్ము ఎక్కడుందో చూపాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగిల్ బెడ్ రూమ్ ఇల్లున్న శ్రీనివాస్ ఇంట్లో ఆ రూ.2వేలకోట్లు ఎక్కడ దాచారో, వైసీపీనేతలే చెప్పాలన్నారు. వైసీపీ చెబుతున్న రూ.2వేలకోట్లు ఉంచడానికి వెయ్యి సూట్ కేస్ లు కావాలని,  శ్రీనివాస్ ఇంటిలో ఐటీవారికి ఒక్క సూట్ కేస్ కూడా దొరకలేదన్నారు. లక్షరూపాయలు, కోటి రూపాయల నోట్లు ఏవైనా జగన్ ముద్రించినట్లయితే, అప్పుడు రూ.2వేలకోట్లను తేలికగా దాచవచ్చని వెంకన్న ఎద్దేవా చేశారు.   చంద్రబాబు సమాజం గురించి ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సమాజనాశనం గురించి ఆలోచిస్తూ, దాన్ని నాశనం చేసి, శ్మశానం చేయాలని చూస్తున్నాడన్నారు. జగన్ తన అక్రమ సంపాదనను ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ లలో దాచి ఉంచాడని, ఆ సొమ్ములో ఈడీ జప్తుచేసింది  కేవలం రూ.43వేలకోట్లేనని, ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షలకోట్ల వరకు ఉందన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్నవారే, ఇప్పుడు, పోవాలి జగన్... జైలుకుపోవాలి జగన్ అంటున్నారని బుద్దా ఎద్దేవాచేశారు. అడ్డగోలుగా ప్రజలసొమ్ము తినడానికే జగన్ రాజకీయపార్టీ పెట్టాడని, అధికారపీఠాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు ఎలా దోచేయాలనేదాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడని వెంకన్న విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనచూశాక పోవాలి జగన్....పోవాలి జగన్ అనే పల్లవి పాడుతున్నారని, జగన్ చేస్తున్న పనులు అలాంటి స్థితిని కల్పించాడన్నారు.  విజయ్ మాల్యా తన మనసు మార్చుకొని ప్రజలసొమ్ముని తిన్నందుకు బాధపడుతూ, దాన్ని తిరిగిచ్చేయడానికి ముందుకొచ్చాదని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లో మాత్రం ఎక్కడా మచ్చుకైనా పశ్చత్తాపం కనిపించడంలేదన్నారు. చరిత్రలో చూసినట్లయితే చాణక్య- చంద్రగుప్తులు ప్రజలకు మేలుచేయడానికి, వారి సంక్షేమం, సంతోషం కోసం పనిచేస్తే, జగన్- విజయసాయిరెడ్డి మాత్రం  రాష్ర్టాన్ని ఎలా దోచుకోవాలి.. ప్రజల్ని ఎలా నాశనం చేయాలన్నదాని గురించే నిత్యం ఆలోచిస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. తన పైశాచిక ఆనందం కోసం సమాజాన్ని భయపెట్టి, బతకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ పాలనతో విసిగి, వేసారిన జనమంతా  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశానికే ఓటేయాలనే ధ్రఢసంకల్పంతో ఉన్నారని వెంకన్న స్పష్టంచేశారు.

చాక్లెట్ దొంగతనం.. స్టూడెంట్ ప్రాణం తీసింది...

హైదరాబాద్ లోని వనస్థలిపురం డిమార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. నిన్న షాపింగ్ కి వెళ్లిన సతీష్‌(17) కి డిమార్ట్ సెక్యూరిటీకి మధ్య వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.. చాక్లెట్ దొంగతనం చేసినందుకు డీమార్ట్ సెక్యురిటీ సతీష్ అనే విద్యార్థిని గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా నేలకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అటు తల్లిదండ్రులు కొడుకు మృతితో బోరున విలపిస్తున్నారు. తమ కొడుకును అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డిమార్ట్ దగ్గర ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు అక్కడ అద్దాల్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సతీష్ ను కాలేజీ యాజమాన్యం కూడా తమ పర్మిషన్ లేకుండానే బయటకు పంపారని అంటున్నారు. సతీష్ చావుకు డీమార్ట్ సిబ్బంది.. కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని వెల్లడించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

ఇంకా తెలియని బీటెక్ స్టూడెంట్ జీవన్ ఆచూకీ

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 11వ తేదీన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని హాస్టల్ నుంచి వెళ్లిన జీవన్ అనే విద్యార్థి తిరిగి రాలేదు. దీంతో అదేరోజు కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా జీవన్ ఆచూకీ లభ్యం కాకపోవడంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. స్టూడెంట్ తల్లిదండ్రులు.. పోలీసులు జీవన్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ.. ఆరు రోజులు దాటి పోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అలాగే పోలీసులు కూడా ఒక్కసారిగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అతను 11వ తేదీన హాస్టల్ లోపలికి వస్తున్నట్టు హరిహరా బాయ్స్ హాస్టల్ లోని సీసీ కెమెరాలో రికార్డు కావటం జరిగింది. ఆ తర్వాత మాత్రం అతను బయటకు వెళ్లే సమయంలో అక్కడ పవర్ కట్ ఉండటంతోటి అతను బయటకు వెళ్లే విజువల్స్ మాత్రం రికార్డు కాలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న పలు సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అతన్ని క్షేమంగా పట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతని వాష్ రూమ్ లో బ్లేడ్ తో పాటు రక్తపు మరకలు ఉన్నాయి. అది కూడా గోడకి మొత్తం రుద్దినట్టుగా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఏమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడా జీవన్? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జీవన్ అప్పు చేయటం జరిగిందని.. తోటి విద్యార్థులతో కలిసి బయట లోన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోన్ కి సంబంధించి వాళ్లు అతన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో పాటు వెంటనే చెల్లించాలంటూ కూడా అతని పైన ప్రెజర్ తీసుకురావటం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ తల్లితండ్రులకు ఆ విషయాన్ని చెప్పలేక హాస్టల్ నుంచి వెళ్లి పోయినట్లు కూడా అతని రూమ్ మేట్స్ చెప్తున్నారు. కాగా పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.

చంద్రబాబు గుట్టంతా రట్టైంది.. పీఎస్ పాస్ వర్డ్ లీక్!!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వద్ద పీఎస్ గా చేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ రైడ్స్ తాలూకూ ప్రకంపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటే.. లేదు, లేదు రూ.2లక్షల 63 వేలే దొరికాయని టీడీపీ వెల్లడిస్తుంది. ఇదే అసలు నిజం అంటూ.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ ను కూడా బయటపెట్టారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ తమ అధినేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పీఎస్.. శ్రీనివాస్ ఎపిసోడ్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంత బతుకు బతికి ఇంటెనక.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్లు.. ఐటీ దాడుల తర్వాత క్లియర్‌గా అర్థమైందని.. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశారు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి చేసిన మరో ట్వీట్ లో... 'చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ కమిట్మెంట్‌ని మెచ్చుకోవాలి.. యజమాని ప్రతిలావాదేవీనీ డైరీలో రాసుకున్నాను అని చెప్పాడు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసాడు. మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విజయసాయిరెడ్డి ట్వీట్స్ పై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ కేసుని కప్పిపుచ్చడం కోసమే ఇలా ఐటీ రైడ్స్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

సెర్బియా లో 'నిమ్మ' కాయని నొక్కితే ఏపీలో 'జాం' కాయ అదిరింది!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మరియు కొందరు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దల్ని కలిశారని వైసీపీ చెప్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం తనపై ఉన్న కేసులకు భయపడి ఎన్డీయేలో చేరటానికి జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించింది. ఇలా జగన్ ఢిల్లీ టూర్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్న వేళ.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. జగన్ ఢిల్లీ టూర్ వెనుక నిమ్మగడ్డ ప్రసాద్‌ కేసు ఉందని ప్రచారం జరుగుతోంది. ఎనిమిది నెలల క్రితం రస్‌ అల్‌ ఖైమా అనే దేశం జారీ చేసిన ఇంటర్‌పోల్ నోటీసుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల్లో పెట్టుబడులంటూ.. దాదాపుగా ఎడెనిమిది వందల కోట్ల రూపాయలను రస్ అల్ ఖైమా నుంచి నిమ్మగడ్డ సేకరించారు. అయితే తరువాత ఆ ఒప్పందాలు రద్దు అయ్యాయి. అయినా, రస్ అల్ ఖైమా పెట్టిన వందల కోట్లు పెట్టుబడిని మాత్రం నిమ్మగడ్డ తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు రస్‌ అల్ ఖైమా కీలకమైన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయమై రస్‌ అల్‌ ఖైమా దేశం కేంద్రాన్ని సంప్రదించిందని కూడా సమాచారం. రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ.. అప్రూవర్ గా మారిపోయారని అంటున్నారు. తాను పాల్ప‌డిన కుంభ‌కోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు విడ‌మ‌రిచి చెప్పేశార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ వ్యక్తిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని భారత్ ప్ర‌భుత్వాన్ని కోరింద‌ని స‌మాచారం. నిమ్మగడ్డ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అందరికి తెలుసునని, ఇప్పుడు ఆ వ్యక్తే కేంద్రం దగ్గరకు వెళ్లి తనని కాపాడాలని బ్రతిమాలుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మీడియాకు, ఏపీ ప్రజలకు ఈ సెర్బియా కేసు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. ఐటీ రైడ్స్, 2000 కోట్లు అంటూ ప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. అక్కడ సెర్బియాలో నిమ్మగడ్డ తీగని పట్టుకుంటే, ఇక్కడ ఏపీలో పెద్ద తలకాయ డొంక కదులుతుందని.. ఆ భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ విషయంపై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. "నీరసం గా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే అదో ఆనందం.. కానీ ఏపీ లో ఇప్పుడు బలం గా ఉన్నవాళ్ళు.. నిమ్మ దెబ్బకి రసం కార్చుకుంటున్నారు. రస్ అల్ ఖైమా లో ఉన్న 'నిమ్మ' కాయని నొక్కితే ఆంధ్ర లో ఉన్న 'జాం'కాయ ఖైమా అయిపోతుంది. అక్కడ ప్రతీ శుక్రవారం మనకి లాగా తప్పించు కోవడం కుదరదు. ఖైమా చేసేస్తారు. అబబ్బా దీన్ని కప్పిపుచ్చడం కోసం ఢిల్లీ టూర్ లో ఆంధ్ర అభివృద్ధి, నిధులు కోసం అంటూ ఏం చెప్తిరీ. మళ్ళా దీన్ని కప్పిపుచ్చడం కోసం IT రైడ్స్ తెర పైకి తీసుకొచ్చారు. అన్నట్టు.. 'నిమ్మ' కాయ నిజమైన రసాన్ని అధికారుల ముందు కక్కేసాడు అంట కదా!.. అంతా మీరే చేశారు అనే డైలాగ్ లాగా అంతా A1 చేసాడు అన్నాడు అంట. అది తెలిసే చలి కోటు కప్పుకుని ఢిల్లీ బాట పట్టారు అంట. వామ్మో ఎన్ని చావు తెలివితేటలు రా నాయనా..! సర్లే మొత్తానికి దొరికేశారు." అంటూ బుచ్చయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.