తెరముందుకు ప్రభుత్వ సలహాదారు- వైసీపీ పాలనపై మీడియా వ్యతిరేకతే కారణమా ?

గతంలో పలు మీడియా సంస్ధల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం విజయవాడలో మీడియాతో ముఖాముఖీ నిర్వహించారు. అప్పుడప్పుడూ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లలో మాత్రమే కనిపించే సజ్జల ఏకంగా మీడియాతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు మీట్ ద ప్రెస్ నిర్వహించడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవహారాల్లో గతంతో పోలిస్తే మీడియాకు ఆదరణ తగ్గింది. అంతకు ముందు ఎన్నికల్లో మీడియా తమకు అనుకూలంగా లేదని వైసీపీ భావించడం వల్లో లేక ప్రభుత్వ వ్యతిరేక వార్తల పరంపర ఆపలేకపోతున్నామన్న ఆవేదనో తెలియదు కానీ వైసీపీలో ముఖ్యులెవరూ మీడియా ప్రతినిధులపై కానీ సంస్ధలపై కానీ ఓ రకమైన వ్యతిరేక భావంతో కనిపిస్తున్నారు. దీంతో మీడియా కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న మూడు నిర్ణయాలు వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. వీటిలో ఒకటి నిరాధార, పక్షపాత, పరువుతీసే వార్తలు రాస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన 2430 జీవో. రెండవడి అసెంబ్లీ కవరేజ్ నుంచి మూడు మీడియా సంస్ధలను బహిష్కరించడం, మూడవది అమరావతి ఆందోళనల కవరేజ్ లో మహిళా కానిస్టేబుల్ వీడియోలు తీశారని కేసులు పెట్టడం. వీటిలో ముందుగా అసెంబ్లీ కవరేజ్ లో భాగంగా ప్రతిపక్ష నేతల అభిప్రాయాలను తీసుకుంటున్న మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం కొరడా ఝళిపించారు. మూడు మీడియా సంస్ధలపై అసెంబ్లీ ప్రసారాలను కవర్ చేయకుండా బహిష్కరణ వేటు వేశారు. ఇది కొనసాగుతుండగానే అమరావతి ఆందోళలు జరుగుతున్న క్రమంలో మందడంలోని ప్రభుత్వ పాఠశాలను పోలీసులు ఆక్రమించి పిల్లలను ఆరుబయట చదివిస్తున్న విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కొన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపై ప్రభుత్వం ఏకంగా ఎస్సీ, ఎస‌్టీ అట్రాసిటీ కేసులు సైతం పెట్టించింది. తాజాగా వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ రెండు వ్యవహారాలతో ప్రభుత్వానికి కాస్తో కూస్తో అనుకూలంగా ఉన్న మీడియా సంస్ధల్లోనూ ఆందోళన మొదలైంది. పరిస్ధితి చేదాటిపోతుందని అర్ధమైందో లేక, భవిష్యత్తులో మీడియా మరింత దూరమవుతుందన్న ఆవేదనో తెలియదు కానీ మీడియాకు దగ్గరవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగానే మీడియా అంటే అంటీముట్టనట్లుగా ఉండే మాజీ సీనియర్ జర్నలిస్టు సజ్జల ఏకంగా మీడియా మీట్ నిర్వహించినట్లు అర్ధమవుతోంది. సీఎం జగన్ కు రాజకీయ సలహాదారుగా ఉంటూ బ్యాక్ డోర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడతారని పేరున్న సజ్జల మీడియాతో మాత్రం ఎప్పుడూ ముభావంగానే ఉంటుంటారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. బెట్టు చేస్తే మీడియా పూర్తిగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది అందుకే వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకే సజ్జల రంగంలోకి దిగినట్లు అర్ధమవుతోంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి సచివాలయంలో మంత్రులే మీడియా ప్రశ్నలకు బెంబేలెత్తి పారిపోతున్న వేళ సజ్జల మీడియా మీట్ నిర్వహించడం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది. అదీ జగన్ కు సన్నిహితుడు, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ నిర్వహించిన పాత్రను ప్రస్తుతం పోషిస్తున్న సజ్జల మీడియాతో సఖ్యత కోసం ప్రయత్నిస్తుండటం కచ్చితంగా మార్పును సూచించే అంశంగా చెప్పుకోవచ్చు.

రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవసరం ఉంది: పీ వీ పీ

ట్వీట్ చేసి మరీ కొత్త సంక్షోభానికి తెర తీసిన వై ఎస్ ఆర్ సి పీ నేత పొట్లూరి పాలక వై ఎస్ ఆర్ సి పీ కి సంక్షోభాల మీద సంక్షోభాల తాకిడి మొదలైంది. మొన్నటి దాకా మంత్రులు కొడాలి నాని, బొత్స సత్తిబాబు కావాల్సినంత మసాలా  అందిస్తే,ఈ రోజు ట్వీట్ తో   పీ వీ పీ, అదేనం డీ,,, విజయవాడ లోక్ సభ స్థానానికి వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్థిగా నుంచుని , కేశినేని నాని చేతి లో ఓటమి పాలైన పొట్లూరి వీర ప్రసాద్ పొద్దున్నేవదిలిన ట్వీట్ బాణం ...సూటిగా జగనన్న గుండెలో దిగింది.. ఆడవారి కి ఆస్తిలో సమన హక్కు కల్పించి, తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి చాటి చెప్పిన అన్న ఎన్ టీ ఆర్ స్ఫూర్తి తో , మన తెలుగు వారు కూడా , మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారంటూ ట్వీట్ బాంబ్ పేల్చారు. వాస్తవానికి ఇక్కడ పీ వీ పీ ...సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ, బూజు పట్టిన సంప్రదాయాలను తన ట్వీట్ లో ఎండా గట్టారు. మగ ఆఫీసర్లు ఆడవారి ఆర్దర్లను తీసుకోరన్న ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి , సుప్రీమ్ కోర్టు కొత్త శకానికి నాంది పలికిందనే తన ఆనందాన్ని ఆయన తన ట్వీట్ లో పలికించటమే కాకుండా, ఆ సంబరానికి మరింత శోభ తేవటం కోసం, ఏకంగా ఈ  రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కావాలనే తన అభిలాషను చాలా ఉద్వేగం గా వ్యక్తం చేశారు..." అవకాశాల్లో సగం, ఆస్తి లో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వం లో సగం..." అంటూ తన ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు. పీ వీ పీ ట్వీట్ ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం నేతలు మాత్రం, ఆయన ఆకాంక్షకు కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయనీ, ఒక వేళ సి బీ ఐ కేసుల నేపధ్యం లో జగన్ తప్పుకుంటే, ముహ్యమంత్రి చెయిర్ లో భారతి ని కూర్చోబెట్టవచ్చుననే సంకేతం ఇవ్వటానికే, వై ఎస్ ఆర్ సి పీ నాయకుడు పీ వీ పీ ఈ రకంగా ట్వీట్ చేసి ఉంటాడని టీ డీ పీ  లీడర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు, ఈ రకమైన ఫీలర్లు వదలటం ద్వారా వై ఎస్ ఆర్ సి పీ అధిష్టానం , రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మార్పు గురించి ముందస్తుగా నే ప్రజలను సెన్సిటైజ్ చేసే కార్యక్రమం మొదలెట్టిందనీ, జగన్  మోహన్ రెడ్డి సి.బి.ఐ. కేసుల నేపధ్యం లో సి.ఎం. పదవి ని త్యజించాల్సి  వస్తే,వెంటనే ఆయన భార్య భారతి ని ముఖ్యమంత్రి ని చేయటం కోసమే వై ఎస్ ఆర్ సి పీ ఈ రకమైన వ్యూహాత్మక ప్రచారానికి దిగిందనీ తెలుగు దేశం నాలెడ్జ్ సెంటర్ ప్రముఖులు భావిస్తున్నారు.

ఏపీలో టాప్-5 అవినీతి శాఖలపై ఏసీబీ కన్ను.. వరుస సోదాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో లంచాల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అత్యంత అవినీతి శాఖగా పేరున్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై తొలి పంజా విసిరిన ఏసీబీ అధికారులు తాజాగా నిన్న పురపాలకశాఖ కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టారు. శాఖల వారీగా చేస్తున్న ఈ దాడులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ ఏసీబీ దాడులు తప్పవని అధికారులు తాజా దాడులతో హెచ్చరికలు పంపుతున్నారు. ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే తన కేబినెట్ లోని మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సైతం హెచ్చరికలు పంపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే సమస్యే లేదని కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు స్పష్టం చేసిన సీఎం జగన్ ఇప్పుడు దాన్ని చేతల్లో చూపుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవినీతి దర్యాప్తు విభాగాన్నిపటిష్టం చేయాలని భావించిన జగన్ అప్పటికే దాన్ని లీడ్ చేస్తున్న కుమార్ విశ్వజిత్ ను సాగనంపారు. అవినీతిని అరికట్టడంలో తన అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదని భావించడం వల్లే విశ్వజిత్ ను బదిలీ చేశారు. ఆయన స్ధానంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన సీతారామాంజనేయులును తీసుకొచ్చారు. గతంలో పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న సీతారామాంజనేయులు వచ్చీ రాగానే పని ప్రారంభించేశారు. రవాణాశాఖ కమిషనర్ నుంచి ఏసీబీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీతారామాంజనేయులు కీలకమైన రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై దృష్టిసారించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన అధికారులు అవినీతిలో మునిగి తేలడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని భావించిన ఆయన... వచ్చీ రాగానే రంగంలోకి దిగారు. అక్రమార్కులపై చర్యల విషయంలో సీఎం జగన్ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో విమర్శలకు వెరవకుండా గతేడాది 21న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, తహసీల్డార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ  సోదాలు చేపట్టింది. సిఫార్సులను సైతం లెక్కచేయకుండా అవినీతిపరుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి చేరవేసింది. ఆ తర్వాత మరో కీలక విభాగమైన పురపాలకశాఖపై ఏసీబీ దృష్టిసారించింది.  మంగళవారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. ఇందులో భారీ ఎత్తున ఆధారాలను సైతం సేకరించేంది. లెక్కతేలని నగదుతో పాటు డాక్యుమెంట్లను జప్తు చేసింది. 13 జిల్లాల్లో 14 టీమ్ లుగా విడిపోయి 100 మందికి పైగా అధికారులు చేపట్టిన సోదాల్లో పలుచోట్ల చాలా మంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. లంచాలకు కక్కుర్తి పడి సిటిజన్ ఛార్జర్ అమలు చేయకపోవడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడం, బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కేసులు నమోదు చేశారు. త్వరలో మిగిలిన విభాగాల్లోనూ సోదాలు నిర్వహించేందుకు ఏసీబీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.

యడ్యూరప్పకి మొదలైన తిప్పలు.. కమలం ఖాతా నుండి కర్ణాటక కూడా ఔటా?

కర్ణాటక బీజేపీ సర్కారుపై అసంతృప్తి మొదలైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకోవటం కలకలం రేపుతోంది. సీఎం యడ్యూరప్ప పని తీరుతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యేలు ఆనందంగా లేరని సమాచారం. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఏడాది పాటు పాలన సాగించిన కాంగ్రెస్ జెడియు సంకీర్ణాన్ని గద్దె దించి ముఖ్యమంత్రైన యడ్యూరప్పకు అప్పుడే కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచి అరవై రోజులు కాకముందే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకుంటున్నారు. సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. పార్టీని ఫిరాయించి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కడాన్ని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది సార్లు గెలిచిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి చివరి నిమిషంలో మొండి చేయి చూపారనే వాదన వినిపిస్తోంది.  మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ లో సీఎం పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు యడ్యూరప్ప వర్గీయుల సృష్టిగా చెబుతున్నా సంతకం లేని లేఖ గురించి కూడా చర్చ జరుగుతోంది. యడ్యూరప్పకి వయసు మీద పడింది అని వారసుడిగా విజయేంద్రకు పగ్గాలు ఇవ్వవలసిన సమయం వచ్చేసింది అనేది ఆ లేఖ సారాంశం. కాంగ్రెస్ మార్క్ అయిన వంశపారంపర్య రాజకీయాలకు బిజెపిలో చోటు లేదని ఓ వైపు కేంద్ర నాయకత్వం చెబుతుంటే యడ్యూరప్ప అందుకు విరుద్ధంగా కొడుకును ప్రోత్సహించే ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. బడ్జెట్ సెషన్ మొదలైన తొలి రోజే సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యేలు ముందుముందు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బిజెపిలో పరిణామాలని బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికే సీఎల్పీ భేటీ నిర్వహించింది. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మాజీ సీఎం సిద్దరామయ్య.

వారం రోజుల్లో పెళ్లి అనగా.. ప్రేమోన్మాది చేతిలో యువతి బలి

వారం రోజుల్లో పెళ్లి. ఆమెలో పెళ్లి కళ కూడా వచ్చేసింది. తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ లోగా ఘోరం జరిగి పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది దివ్య అనే యువతి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. గత రాత్రి గజ్వేల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన దివ్య.. గజ్వేల్ లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈ నెల 26వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఇదే సమయంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం నిన్న ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా తనకు బ్యాంక్ లో పనులున్నాయని వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్ళింది. ఎప్పట్లాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీ ప్రసన్న నగర్ లో తాముంటున్న ఇంటికి వచ్చింది దివ్య. తనకు కాబోయే భర్త సందీప్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. ఇంతలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడంలో ఫోన్ లో మాట్లాడుతున్న సందీప్ కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్ లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో చుట్టు పక్కలవారు తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసే సరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో విచారణ చేశారు. కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికొచ్చారు. అయితే ప్రేమోన్మాదం తమ కుమార్తె హత్యకు కారణమని బోరున విలపిస్తున్నారు. గత కొంత కాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్ లో చదువుకొనే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి నారాయణ తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు.

విద్యార్థిపై దంపతుల దాడి.. కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!

హైదరాబాద్ లోని సనత్ నగర్  ప్రభుత్వ పాఠశాల సమీపంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులపై ఓ దంపతులు దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. అమానుషంగా దాడి చేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రౌండ్ టేబుల్  ఆడుకుంటూ ఉండగా అటునుంచి ఓ జంట వెళ్తోంది. ఆడుకుంటున్న విద్యార్థులలో ఒక విద్యార్థి అనుకోకుండా వెళ్లి ఆ దంపతులకు తగిలాడు. అంతే, ఆ విద్యార్థిపై భార్యాభర్త విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఇది చూసిన విద్యార్థి  స్నేహితుడు వచ్చి కొట్ట వద్దూ ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్ళు పట్టుకున్నాడు. అయిన వారు కనికరించలేదు. కొట్టిందికాక, లేబర్ పిల్లలు.. చిల్లర గాళ్లు అంటూ పైగా విద్యార్థులపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ విజువల్స్ చూశాక పోలీసులకు అసలు విషయమేంటో అర్థమైంది. విద్యార్థులపై దాడి చేయటమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

గిఫ్టులు..రిటర్న్ గిఫ్టులతో తరిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

తెలంగాణ వారికి ఆంధ్ర సహజవనరులు అప్పనంగా దోచి పెడుతున్నారు అనటానికి స్పష్టమైన ఋజువు..ఫిబ్రవరి10 న వచ్చిన జీఓ ఎం ఎస్ 10. తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువు (మై హోమ్) జూపల్లి రామేశ్వరరావుకి చెందిన జయజ్యోతి సంస్థకి కర్నూలులో 343 ఎకరాల సున్నపురాయి గనులు 50 ఏళ్ల పాటు తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చారు.   కెసిఆర్ బర్త్ డే కి మన సహజవనరులు 50 సంవత్సరాల పాటు రాసిచ్చాడు...ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రి... వచ్చే బర్త్ డే కి బందరు పోర్ట్ రాసిస్తాడు..ఆ తర్వాత మనందరి బతుకులు కూడా రాసిచ్చేస్తాడు...అని ఆంద్రప్రదేశ్ జనాలు అనుకుంటున్నారు.  మన రాష్ట్రంలో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మంత్రి మండలిలో తీర్మానం చేసిన ప్రభుత్వం మన సహజ వనరులను మాత్రం పక్క రాష్ట్రాల వ్యాపారవేత్తలకు దారదత్తం చేయడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జగన్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గిఫ్టుగా ఇచ్చి..రిటర్న్ గిఫ్టులు బాగానే తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు.

జగన్ స్థానంలో చంద్రబాబు.. తాజా పరిణామాలతో వ్యూహం మార్చిన ఓవైసీ!

జాతీయ పౌరసత్వ పట్టిక (ఎస్‌పీఆర్) అమలు విషయంలో కేంద్రంతో విభేదిస్తున్న ఎంఐఎం అదినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏపీలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అడగకుండానే జగన్ కు మద్దతుగా నిలిచిన ఓవైసీ ఇప్పుడు సీఏఏ చట్టానికి మద్దతిచ్చిన జగన్ కు దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో చేరేందుకు సిద్దమవుతున్న జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి దగ్గరయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ కు దూరంగా జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు పాత మిత్రుడని, జగన్మోహన్ రెడ్డి తనకు ప్రస్తుత మిత్రుడని ( కిరణ్ కుమార్ రెడ్డి వజ్ మై ఫ్రండ్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఫ్రండ్) చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతీ సందర్భంలోనూ జగన్ కు అనుకూలంగా ఓవైసీ వ్యవహరించారు. 2014 ఎన్నికల్లోనూ ఏపీలో అధికారం చేపట్టేది వైసీపీయేనని, సీఎం జగనేనని ఆయన అందరికంటే ముందే జోస్యం చెప్పారు. కానీ అప్పట్లో ఆయన అంచనా తప్పింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు కూడా ఓవైసీ సరిగ్గా ఇదే అంచనా వేశారు. అంతటితో సరిపెట్టకుండా జగన్ కు అనుకూలంగా ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు. చివరికి ఆయన ఏపీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే జగన్ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చేశారు. సీన్ కట్ చేస్తే గతేడాది పార్లమెంటు ఉభయసభల్లోనూ సీఏఏ చట్టం అమలుకు ఉద్దేశించిన బిల్లుకు వైసీపీ బేషరతుగా మద్దతు పలికింది. అయితే రాష్ట్రంలో ముస్లిం సంఘాలు, నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో ఎన్సార్సీని ఏ రూపంలోనూ అంగీకరించబోమని సీఎం జగన్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సహా వైసీపీ నేతలంతా తేల్చిచెప్పారు. అప్పటికే సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి వైసీపీ పెద్ద తప్పిదం చేసిందని ఆరోపించిన ఓవైసీ, ఇప్పటికైనా ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం విజయవాడలో నిర్వహించిన బహిరంగసభలోనూ ఓవైసీ జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్.పి.ఆర్)కు వ్యతిరేకంగా గళం వినిపించారు. అదే సమయంలో ఎన్.పి.ఆర్ అమలుకు వ్యతిరేకంగా సీఎం జగన్ స్పందించి కోర్టులో  స్టే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏఏ విషయంలోనూ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఓవైసీ కోరారు. ఇప్పటికే సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికి ఇరుకునపడ్డ వైసీపీ అధినేత జగన్ కు ఓవైసీ తాజా వ్యాఖ్యలు మరింత ఇబ్బందికరంగా మారాయి. జగన్ ఎలాగో త్వరలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరిపోతారనే అంచనాకు వచ్చినందునే ఓవైసీ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతోంది. అయితే జగన్ స్ధానంలో టీడీపీకి మద్దతుగా నిలవాలని ఓవైసీ భావించడం ఇప్పటికిప్పుడు జగన్ కు నష్టం కలిగించకున్నా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తీసుకురావచ్చు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కారులో చేరిక కారణంగా తనకు ముందునుంచీ అండగా నిలుస్తున్న ముస్లిం ఓటుబ్యాంకు దూరమయ్యే పరిస్ధితుల్లో ఓవైసీ కూడా టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఆ ప్రభావం జగన్ పై తప్పకుండా పడే ప్రమాదం లేకపోలేదు.

విశాఖలో అమాంతం పెరిగిన భూ-లావాదేవీలు... కిటకిటలాడుతున్న సబ్-రిజిస్టర్ కార్యాలయాలు... 

పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో విశాఖలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో భూలావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. దాంతో, విశాఖ సబ్-రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మధురవాడ, ఆనందపురం సబ్-రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు టోకెన్ విధానం తీసుకువచ్చారు. ముఖ్యంగా రియల్టర్ల కన్ను విశాఖపై పడటంతో చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. దాంతో, సబ్-రిజిస్టర్ కార్యాలయాల్లో హడావుడి పెరిగింది. సహజంగానే విశాఖ నగరంలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించడంతో అది మరింత ఎక్కువైంది. ఎటుచూసినా జనాలు, కార్ల హడావుడితో ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ పక్రియ కొనసాగుతోంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు పెట్టడానికి, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజధాని ఏర్పాటైతే ధరలు మరింత పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడే కొనుగోళ్లు చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భూముల ట్రేడింగ్‌లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగింది. జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, ఎంవీపీ కాలనీ, సీతమ్మ ధార, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతోంది. విశాఖ శివారు ప్రాంతాల్లో కూడా భూముల ధరలు కొండెక్కుతున్నాయ్‌. ముఖ్యంగా మధురవాడ ప్రాంతం రాజధానిగా ప్రకటించిన ప్రాంతానికి అతి చేరువలో ఉండటంతో రిజిస్ట్రేషన్ల హడావిడి ఎక్కువగా ఉంది. దాంతో, తాకిడిని నియంత్రించడం కోసం టోకెన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వైసీపీ లక్ష్యంగా.. ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొప్పూడిలో 11గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని గ్రామాలు, వార్డుల్లో 45 రోజుల పాటు ఈ చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు.  ఈ యాత్రతో నవమాసాలు, నవమోసాలు, నవభారాల పేరుతో వైసీపీని టార్గెట్ చేయనుంది టీడాపీ. అదేవిధంగా మూడు రాజధానుల అంశం అమరావతిపై జగన్ తీరును బలంగా జనంలోకి తీసుకెళ్లనుంది. ఈ యాత్రలో భాగంగా పింఛన్ అందక గుండె ఆగిన కుటుంబాలనూ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను, భవన నిర్మాణ కార్మికులను చంద్రబాబు పరామర్శించనున్నారు. తొలిరోజు యాత్రలో భాగంగా నాలుగు నియోజక వర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే ఉండవల్లి నుంచి చంద్రబాబు ప్రకాశం జిల్లా బయలుదేరారు. అటు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతోంది.

టీకాంగ్రెస్ నేతలకు హైకమాండ్ భయపడుతోందా? పీసీసీని ఎందుకు మార్చడం లేదు? 

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో రూమరు చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ, అదిగో కొత్త ప్రెసిడెంట్‌ అంటూ వార్తలు వస్తున్నా, ఏదీ కార్యరూపం దాల్చడంలేదు. పీసీసీ చీఫ్‌ మార్పుపై తర్జభర్జనలు పడుతోన్న పార్టీ అధిష్టానం కూడా ఎటూతేల్చలేకపోతోంది. పీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్‌ అల్లంత దూరం జరిగినా, హైకమాండ్‌ మాత్రం పీఠంపై మరొకరిని కూర్చోబెట్టడానికి వెనకా ముందు ఆడుతోంది. పీసీసీ పీఠం నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ ప్రకటించి ఆరు నెలలు గడుస్తున్నా, కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో మాత్రం అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది.  అసలు, తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించడం చాలా కష్టమనే భావనలో హైకమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తుందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువనే భావనలో అధిష్టానం ఉందంటున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డితోపాటు ఇంకా పలువురు నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పీసీసీని నియమిస్తే అసమ్మతి భగ్గుమనడం ఖాయమని హైకమాండ్ భయపడుతోంది. అసలే, కష్టాల్లో ఉన్న పార్టీకి ఇది మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని భావిస్తోంది. అసమ్మతి నేతలు పార్టీని వీడే అవకాశముంటుందని, లేదా, రాష్ట్ర కాంగ్రెస్ నిట్టనిలువునా చీలినా ఆశ్చర్యపోనవసరం లేదని హైకమాండ్ భయపడుతోంది. అసలే, కొన ఊపిరితో ఉన్న పార్టీకి, ఈ పరిణామం మంచిది కాదని భావిస్తున్న అధిష్టానం... ఇప్పటికిప్పుడు పీసీసీని మార్చి, ఎందుకు కొత్త కష్టాలు తెచ్చుకోవడమని భావిస్తోంది. మరి, ఎంతకాలం పీసీసీని సాగదీస్తుందో చూడాలి.

అసద్ ఇలాకాలో షా అస్త్రం... ఒకే దెబ్బకు రెండు పిట్టలు...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి మొదటి వారంలో తెలంగాణ బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళ‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న సీఏఏపై అనుమానాలు తొల‌గించేందుకు నిర్వహిస్తున్న ఈ సభలో.... ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనేది సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సీఏఏ వ్యతిరేకతను భారీస్థాయిలో చాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో, దీనికి వ్యతిరేకంగా సభ పెడితే, అందుకు అమిత్ షా వస్తే, పోలరైజేషన్‌తో, పార్టీ మూలాలు మరింత బలపడతాయని భావిస్తోంది రాష్ట్ర నాయకత్వం. అందుకే భారీ ఎత్తున సీఏఏ అనుకూల సభను నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ స‌భ‌లో, అమిత్ షాతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సైతం పాల్గొనబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, జన‌సేన క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణయించుకున్న త‌రువాత జ‌ర‌గ‌బోతున్న, మొద‌టి సభ ఇదే కావ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.  పార్లమెంట్ వేదిక‌గా సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతుల‌ను చించి నిర‌స‌న తెలిపిన అసదుద్దీన్ ఇలాకాలోనే, ఈ స‌భ నిర్వహించ‌బోతున్నారట. ఇప్పటికే ఎంఐఎంతోపాటు ఇత‌ర ముస్లిం సంఘాలు నిర్వహించిన స‌భ‌లు స‌క్సెస్ కావ‌డంతో, సీఏఏ అనుకూల స‌భ‌కు భారీగా జ‌నస‌మీక‌ర‌ణ చేసి స‌క్సెస్ చెయ్యాలని భావిస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇందుకోసం ఇప్పటి నుంచే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.   అయితే, ఈ సభలో అమిత్ షా స్పీచ్ ఎలా ఉండబోతుందని ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వేదికగా జరుగనున్న ఈ సభలో వివాదాస్పద వ్యాఖ్యలకు ఛాన్స్ లేకపోలేదు. పైగా కేసీఆర్, అసద్‌లను ఓ రేంజులో టార్గెట్ చేసే అవకాశముంది. ఇక, పవన్ తొలిసారి తెలంగాణ గడ్డపై అమిత్‌ షాతో కలిసి సభలో పాల్గొనబోతుండటం కూడా, ఈ సభపై ఉత్కంఠను పెంచుతోంది.

సైకిలెక్కుతారా? కాషాయ గూటికి చేరతారా? జేడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

జనసేన నుంచి బయటికి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారా‍యణ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత, ఆయన తరువాతి అడుగులేంటన్నది ఉత్కంఠ రేపుతోంది. లక్ష్మీనారాయణ ఇప్పటివరకు తన భవష్యత్‌ కార్యాచరణ ప్రకటించలేదు. దాంతో, లక్ష్మీనారాయణ తర్వాతి ప్రస్థానంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా, ఒకప్పుడు జేడీ మాదిరే సివిల్ సర్వెంట్. ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించి, హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆప్‌ విజయఢంకా, లక్ష్మీనారాయణలోనూ ఉత్సాహం నింపిందని అంటున్నారు. దాంతో, కేజ్రీవాల్ తరహాలోనే జేడీ కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ మొదలైంది. కానీ జేడీ సన్నిహితులు మాత్రం, ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలంటే, సమాజంలో ఇమేజ్‌ ఒక్కటే సరిపోదని, ఆర్థిక వనరులు, రాజకీయ నాయకులూ అవసరమంటున్నారు. జేడీ దగ్గర డబ్బుల్లేవంటున్నారు. కేవలం యువతను మాత్రమే ఆయన నమ్ముకున్నారని చెబుతున్నారు. దాంతో, జేడీ... ఏదో ఒక పార్టీలో చేరతారని అంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణ... టీడీపీలోకి వెళతారన్న ప్రచారాన్ని వైసీపీ ఆయుధంగా మలుచుకుంది. నాడు జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం లక్ష్మీనారాయణనేనని ఆరోపించారు. దాంతో టీడీపీకి వెళతారనుకున్న లక్ష్మీనారాయణ, లాస్ట్‌ మినిట్‌లో జనసేనలోకి వెళ్లారని అంటారు. ఇప్పడు కూడా టీడీపీకి వెళితే, వైసీపీకి ఆరోపణలకు చిక్కే ప్రమాదమున్నందున, సైకిలెక్కే ఛాన్సే లేదంటున్నారు జేడీ సన్నిహితులు. అయితే, ఆరెస్సెస్ తో సత్సంబంధాలున్న లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరతారనే మాట వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ పై లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించడంతో ఈ ప్రచారం జరుగుతోంది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి, లక్ష్మీనారాయణ లాంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తులు పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆలోచిస్తోందని తెలుస్తోంది. దాంతో, కొందరు బీజేపీ నేతలు కూడా లక్ష్మీనారాయణను సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది.  అయితే, పవన్‌లో నిలకడలేదని విమర్శించి, జనసేన నుంచి బయటికి వచ్చిన లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరితే కొన్ని ఇబ్బందులూ ఉంటాయంటున్నారు. ఎందుకంటే, పవన్ ఇప్పుడు బీజేపీకి మిత్రుడు. ఏ ఎన్నికలు అయినా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. దాంతో, లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరితే, ఇబ్బందులే అంటున్నారు. అంతేకాదు, లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇస్తే, పవన్‌ ఫీలవుతారేమోనని బీజేపీ భావించవచ్చని అంటున్నారు. అందుకే, కాషాయ గూటికి వెళ్లడంపైనా లక్ష్మీనారాయణ ఆచితూచి అడగులేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ, ఇవన్నీ కాదని, లక్ష్మీనారాయణ బీజేపీలో చేరితే, విశాఖ ఎంపీ టికెట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎందుకంటే, బీజేపీ నుంచి ఆల్రెడీ పురంధేశ్వరి లైన్‌లో ఉన్నారు. అయితే, 2019లో వైజాగ్ నుంచి మంచి ఓట్లు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ, అదే సీటుపై ఆశలు పెట్టుకుంటే మాత్రం చిక్కులు తప్పవంటున్నారు. అందుకే బీజేపీలోకి వెళ్లాలనుకున్నా, అనేక అడ్డంకులు మాత్రం కళ్లముందు కదలాడుతున్నాయి. మొత్తానికి, టీడీపీలో చేరితే బాబుతోపాటు లక్ష్మీనారాయణకు ఇబ్బంది. పోనీ, బీజేపీలోకి అంటే, జనసేనతో గొడవ. అలాగని సొంత పార్టీ పెట్టలేరు. సమాజ సేవకు, రాజకీయమే అత్యుత్తమ వేదికని, పదేపదే అంటున్న లక్ష్మీనారాయణ, పాలిటిక్స్‌లో ఉంటానని మాత్రం గట్టిగానే చెబుతున్నారు. కానీ, ఏ పార్టీ అన్న ఆప్షన్స్‌ పరిశీలిస్తే మాత్రం, గందరగోళం కనిపిస్తోంది. క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డ లక్ష్మీనారాయణ, ఎటువైపు అడుగులు వేస్తారన్నది, ఆయనే చెప్పాలి.

ఒక కారు.. వంద అనుమానాలు... ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా?

కరీంనగర్‌ కాకతీయ కెనాల్‌లో దొరికిన కారుపై మిస్టరీ కొనసాగుతోంది. అది ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం... 20రోజులుగా కనిపించకపోయినా... ఎవ్వరూ పట్టించుకోకపోవడం మిస్టరీగా మారింది. అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించి... రక్షించే ప్రయత్నంచేస్తే... మరి, అంతపెద్ద కారు... ప్రమాదానికి గురై... కాలువలో పడిపోతే.... ఎవ్వరికీ కనీసం చప్పుడు కూడా వినిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే, సత్యనారాయణరెడ్డి కుటుంబం కనిపించకుండాపోయి... ఇరవై రోజులైనా, కుటుంబ సభ‌్యులు గానీ, పనివాళ్లు కానీ, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. కరీంనగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణరెడ్డి... తన భార్య రాధ, కూతురు వినయశ్రీతో కలిసి... జనవరి 27న సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. ఇది, సత్యనారాయణ ఇంటి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డైంది. దాంతో, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని టోల్ ప్లాజాలకు సత్యనారాయణరెడ్డి కారు నెంబర్ ...ఏపీ 15 బీఎన్‌ 3438ను పంపిన పోలీసులు... జనవరి 27కి ముందు... ఆ తర్వాత ఎప్పుడెప్పుడు వచ్చిందో వివరాలు సేకరిస్తున్నారు. అయితే, జనవరి 27కి ముందు.... సత్యనారాయణరెడ్డి కారు... పలుమార్లు గుండ్లపల్లి టోల్  ప్లాజా మీదుగా వెళ్లినట్లు గుర్తించినా, జనవరి 27 తర్వాత మాత్రం... హైదరాబాద్ కి వెళ్లే ఏ టోల్‌ప్లాజాను దాటలేదని తెలుస్తోంది. అలాగే, కరీంనగర్‌లోని సత్యనారాయణరెడ్డి ఇంటి నుంచి పది సీసీటీవీ పాయింట్లతోపాటు కాకతీయ కాలువ దగ్గర్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఏ సమయంలో కారు... కెనాల్‌లో పడిందనేది మిస్టరీగా మారింది. ఇక, సత్యనారాయణరెడ్డి సెల్‌ ఫోన్ సిగ్నల్ ఎక్కడ మిస్సైంది. చివరిగా ఎక్కడ అందుబాటులో ఉందనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే, సత్యనారాయణరెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ మిస్సైన ప్రాంతంలో ఇంకా ఎవరెవరి ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే, 15రోజుల కింద సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ చెప్పాలంటూ ఒకరు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను, అలాగే పెద్దపల్లి పోలీసులను సంప్రదించారన్న సమాచారం కలకలం రేపుతోంది. అయితే, ఈ ఎంక్వైరీ చేసిందెవరనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి, ఒక్క కారు... వంద అనుమానాలు రేకెత్తిస్తోంది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం అనుమానాస్పద మృతిపై అనేక ప్రశ్నలు రేగుతున్నాయి. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో... ఎక్కడికి వెళ్లిందో... కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో... ఆ ముగ్గురి మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కూడా... కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగిస్తున్నాయి. ఈ సందేహాలన్నీ తీరాలంటే సీసీటీవీ ఫుటేజే ఆధారం. మరి, కారు మిస్టరీని ఛేదించే ఆధారాలు దొరుకుతాయో లేక ముగ్గురి మృతి మిస్టరీగా మిగిలిపోతుందో మున్ముందు తేలుతుంది.

ఈ కార్యదర్శి మాకొద్దు.. గవర్నర్ కోర్టుకు మండలి పంచాయతీ...

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి వ్యవహారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు చేరింది. తన రాజ్యాంగ అధికారాలను కార్యదర్శి ప్రశ్నిస్తున్నారని, కార్యదర్శిని  తప్పించాలని, కొత్త కార్యదర్శిని నియమించాలని మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ కు వినతిపత్రం అందించారు.  అసెంబ్లీ కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంపై  శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఆగ్రహంతో వున్న సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొంది.  రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను కార్యదర్శి పాటించడం లేదన్నారు.  మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి... మండలికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో అసెంబ్లీ కార్యదర్శి తీరుని గవర్నర్ కు వివరించారు. రాష్ట్రచరిత్రలో మండలి కార్యదర్శిపై మండలి ఛైర్మన్ ఫిర్యాదుచేయడం ఇదే తొలిసారి అంటున్నారు. తన ఆదేశాలను పాటించడానికి రెండుసార్లు మండలి కార్యదర్శి నిరాకరించడంపై గవర్నర్ జోక్యం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్‌ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు. అసెంబ్లీకి ప్రస్తుతం ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు శాసనమండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సభలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉండేవారు. మండలి కార్యదర్శి రిటైరైన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికే ఆ విధులు కూడా అప్పగించారు. విజయరాజు గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక ఆయన్ను మార్చి బాలకృష్ణమాచార్యులను నియమించారు. మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రం గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ను కూడా ఇచ్చారు.  చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి పంపిన లేఖ.. చైర్మన్‌ అధికారాలను ధిక్కరించడమేనన్నారు.  శాసనమండలిలో జరిగిన పరిణామాలను షరీఫ్ గవర్నర్ కు వివరించారు. సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్‌ పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో కార్యదర్శి తీరును గవర్నర్‌కు వివరించానన్నారు. చైర్మన్‌ ఆదేశాలను కాదన్న సందర్భం గతంలో లేదని, నిబంధనలకనుగుణంగానే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. నా రూలింగ్‌ను కార్యదర్శి అమలు చేయడం లేదన్న విషయం ఆయనకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.  ఈ వ్యవహారంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు శాసన మండలిలో అనూహ్యంగా వీగి పోయాయి. అందుకు మండలిలో తెలుగుదేశం తెరపైకి తెచ్చిన రూల్స్ అధికారపక్షం ఊహించను కూడా లేదు. సభా వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు వంటి వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో, ఏంజరగబోతోందో ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ప్రాణాలు కోల్పోతున్న యువత... మిడ్-నైట్ ఎంజాయ్ మెంట్ తో పెడద్రోవ...

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం... విచ్చలవిడితనం... క్రమశిక్షణ కరువవడంతో... యువత పెడద్రోవ పడుతోంది. విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. స్పీడ్‌ థ్రిల్స్‌... బట్ కిల్స్‌... అంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... యువత మాత్రం... ప్రాణం కన్నా... వేగమే ముఖ్యమంటూ గాల్లో కలిసిపోతున్నారు. అర్ధరాత్రి ఎంజాయ్‌మెంట్‌ పేరుతో మితిమీరిన వేగంతో కార్లను నడుపుతూ గాల్లో కలిసిపోతున్నారు. ఎన్నో ప్రమాదాలు గుణపాఠాలుగా ముందు కనిపిస్తున్నా... మితిమీరిన వేగం... విచ్చలవిడి ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోతున్నారు. సేమ్ టు సేమ్‌.... గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ యాక్సిడెంట్‌ స్టైల్లో... జరిగిన మరో ప్రమాదం హైదరాబాద్‌లో కలకలం రేపింది. అతివేగం కారణంగా భరత్‌నగర్‌ బ్రిడ్జిపై కారు గాల్లోకి ఎగిరిపడగా.... ఒకరి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. హైదరాబాద్‌ భరత్‌నగర్‌ బ్రిడ్జిపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు అర్ధరాత్రి కారులో షికారు చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. బాలానగర్‌ నుంచి ఎర్రగడ్డకు వస్తుండగా భరత్‌నగర్ బ్రిడ్జి పైనుంచి కారు కిందపడిపోయింది. అయితే, మితిమీరిన వేగం కారణంగా కారు గాల్లో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సోహైల్ అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ కింద ...రోడ్డుపై ఉన్నవాళ్లు తృటిలో తప్పించుకున్నారు. కూరగాయల మార్కెట్లో లోడింగ్ జరుగుతుండగా, భారీ శబ్ధంతో కారు కిందకి వస్తుండటాన్ని గమనించినవాళ్లు పక్కకు తప్పుకున్నారు. దాంతో, భారీ ప్రాణనష్టం తప్పింది.  భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తేలింది. అయితే, ఈవిధంగా కార్లను నడిపేవాళ్ల కారణంగా, వాళ్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎలాంటి సంబంధం లేదని అమాయకులు కూడా మరణిస్తున్నారని, గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్‌లో అదే జరిగిందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అయితే, గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా కార్లలో నియంత్రణ చేపడితేనే ప్రమాదాలకు అడ్డుకట్టవేయగలమని అంటున్నారు. మరి, ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్నార్ధకమే?

ఏపీలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. జగన్ ఉద్దేశం అదేనా?

ఏపీ పోలీసు శాఖలో చేపడుతున్న సంస్కరణలకు కొత్త ఊపు తెచ్చే క్రమంలో జగన్ సర్కారు మంగళవారం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో కీలక విభాగాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. తాజా బదిలీల్లో భాగంగా వెయిటింగ్ లో ఉన్న నలుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ దక్కింది. దిశ చట్టం అమలుతో పాటు అవినీతి నిర్మూలన, ఎక్సైజ్, పాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం గతేడాది నవంబర్ లో పలువురు కీలక ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆ తర్వాత మంగళవారం మరోసారి 8 మంది ఐపీఎస్ అధికారులకు స్ధానభ్రంశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిశోర్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ లు ఉన్నారు. కిశోర్ కుమార్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం ఆయన్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా బదిలీ చేసింది. ఆయన స్ధానంలో పోస్టింగ్ కోసం ఎధురుచూస్తున్న మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ కుమార్ విశ్వజిత్ కు హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా అవకాశం కల్పించింది. వెయిటింగ్ లో ఉన్న మరో సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యాన్ని రైల్వే అదనపు డీజీగా నియమించింది. వీరిద్దరితో పాటు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కుమార్ నాయక్ కు సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. వెయిటింగ్ లో ఉన్న మరో ఐపీఎస్ అభిషేక్ మహంతిని గ్రేహౌండ్స్ అడ్మిన్ విభాగంలో గ్రూప్ కమాండర్ గా నియమించింది. అమరావతి భూముల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగాన్ని బలోపేతం చేసే క్రమంలో సునీల్ కుమార్ నాయక్ కు డీఐజీగా బాధ్యతలు అప్పగించింది. గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉన్న కృపానంద్ త్రిపాఠీ ఉజేలాతో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్ కు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా చోటు వెలుగుచూస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో చురుగ్గా వ్యవహరించలేదనే కారణంతో త్రిపాఠిని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలే హరికుమార్ బదిలీకి కారణమైనట్లు సమాచారం. గతేడాది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక పలుమార్లు ఆలిండియా సర్వీసు అధికారుల బదిలీలను చేపట్టింది. తొలిసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ పాలనపై పట్టు పెంచుకునే క్రమంలో తరచూ బదిలీలు చేపడుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను క్షేత్రస్ధాయికి తీసుకెళ్ళడంలో చురుగ్గా వ్యవహరించకపోవడం, పలు ఆరోపణలతో కొందరు అధికారులను తరచూ బదిలీలు చేస్తున్నారు. అవినీతి నిర్మూలనపై పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇందులో ఎంతటి స్ధాయి అధికారులైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇవ్వడం తాజా బదిలీల వెనుక మరో ఉద్దేశంగా కనిపిస్తోంది.

రాజ్ భవన్‌కు చేరిన ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీల వివాదం

  ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీ పంచాయితీ రాజ్ భవన్ కు చేరింది. కమిటీల ఏర్పాటులో అసెంబ్లీ సెక్రెటరీ తీరుపై గవర్నర్ కు  మండలి ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆరంభం నుంచి వివాదాలతో కొనసాగుతున్న సెలెక్ట్ కమిటీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ అంశం గవర్నర్ వరకు చేరింది. తన ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ అమలు చేయడం లేదంటూ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు మండలి చైర్మన్. గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ ను కలిసిన మండలి చైర్మన్ షరీఫ్ మండలిలో జరిగిన పరిణామాల్ని వివరించారు. నాలుగు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. నిబంధనల ప్రకారమే సెలక్ట్ కమిటీ ఏర్పాటైందని, సెక్రెటరీ రెండుసార్లు ఫైల్ తిప్పి పంపారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. గతంలో ఛైర్మన్ ఆదేశాల్ని కాదన్న సందర్భం ఒక్కటి కూడా లేదని గవర్నర్ కు గుర్తు చేశారు మండలి చైర్మన్ షరీఫ్. చైర్మన్ గా తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేశానని నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న వాదనలో నిజం లేదని చైర్మన్ గవర్నర్ కు వివరించారు. మండలి రద్దు తీర్మానానికి దారి తీసిన పరిణామాలతో పాటు మండలిలో అధికార పక్షం వైఖరి గురించి కూడా చైర్మన్ గవర్నర్ కు వివరించారని సమాచారం. రాజధాని వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ బిల్లు రద్దు అంశాలపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ జనవరి ఇరవై రెండవ (జనవరి 22) తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఆ తరవాత సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలంటూ పార్టీలను ఆదేశించారు. వైసిపి మినహా మిగిలిన పార్టీలన్నీ కమిటీలకు తమ పేర్లను అందజేశాయి. దీంతో ఆ పేర్లతోనే సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చెయ్యాలని కార్యదర్శిని మండలి చైర్మన్ ఆదేశించారు. అయితే సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అధికారం తనకు లేదన్నారు అసెంబ్లీ సెక్రెటరీ. ఇందుకు సెక్షన్ 154 ను తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కార్యదర్శి ఆ ఫైల్ ను మండలి చైర్మన్ కు తిప్పి పంపారు. దీనిపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై బులిటెన్ జారీ చేయాలంటూ రెండవసారి సెక్రటరీని ఆదేశించారు. దీన్ని కూడా అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపారు, దీంతో సెక్రెటరీ తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ గవర్నర్ కు వివరించారు. మరోవైపు కార్యదర్శి తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ సెక్రెటరీ సభా హక్కుల ఉల్లంఘనపై న్యాయపరమైన పోరాటం చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ అంశంపై వైసీపీ మరో వాదన తెరపైకి తీసుకొచ్చింది, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి పద్నాలుగు రోజులు దాటడంతో ఇక సెలక్ట్ కమిటీ ప్రస్తావనే ఉండదని చెబుతోంది. బిల్లులు కూడా ఆమోదం పొందినట్టేనని అంటోంది, మరిప్పుడు ఈ వివాదం కాస్త గవర్నర్ దగ్గరికి వెళ్లడంతో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆందోళన.. అలాంటిదేమీ లేదన్న ఏపీ సర్కార్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రత తగ్గింపు వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి చంద్రబాబు భద్రతపై పదేపదే జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమ నేతకు గతంలో ఉన్న 147 మందితో కల్పిస్తున్న భద్రతను తాజాగా 67కు తగ్గించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తన తాజా ప్రెస్ నోట్ లో ఆరోపించారు. దీన్ని డీజీపీ కార్యాలయం ఖండించింది. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. 2003లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడి కాన్వాయ్ లక్ష్యంగా తిరుపతి అలిపిరి గేటు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇందులో బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని భారీగా పెంచింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంతో పాటు ఎన్.ఎస్.జి కమాండోలతో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అదికారం కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం దాన్ని యథాతథంగా కొనసాగించాయి. అప్పట్లో చంద్రబాబు కానీ ఆయన పార్టీ నేతలు కానీ వైఎస్ ప్రభుత్వాన్ని మిగతా విషయాల్లో ఇరుకునపెట్టినా భద్రత విషయంలో మాత్రం ఏనాడూ విమర్శలకు దిగలేదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో ఆయన కుమారుడు జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ను కోర్టుకు తరలించే వాహనాన్ని సైతం సాధారణ ఖైధీలను తరలించే వాహనాన్ని కేటాయించారు. దీనిపై వైసీపీ కోర్టు దృష్టికి తీసుకురావడంతో అప్పటి కిరణ్ సర్కారు ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అప్పట్లో ప్రతిపక్షంలో చంద్రబాబు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తన భద్రతను గాలికొదిలేశారని జగన్ విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచాక కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చాక చంద్రబాబు విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష నేతగా జగన్ కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకూ అదే ట్రీట్ మెంట్ తప్పదని మంత్రులు సైతం వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆందోళనలో పడిన టీడీపీ.. చంద్రబాబు భద్రతపై హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ప్రభుత్వ వాదనను హైకోర్టు పూర్తిగా అంగీకరించలేదు. దీంతో చంద్రబాబుకు 97 మందితో భద్రత కల్పించాలని హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. ఇందులో జడ్ ప్లస్ కేటగిరీతో పాటు ఎన్ఎస్జీ కమెండోలు కూడా ఉంటారు. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం చంద్రబాబు భద్రతను కొనసాగించడంతో టీడీపీ కూడా ఆ విషయాన్ని వదిలేసింది. తాజాగా నిన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చంద్రబాబు భద్రతను 67కు తగ్గించారని ఆరోపిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. చంద్రబాబు భద్రతలో తామెలాంటి మార్పులు చేయలేదని డీజీపీ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామని, ప్రస్తుతం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతోనే ఉన్నారని తెలిపింది. సెక్యూరిటీ కమిటీ సమీక్ష మేరకే నిర్ణయాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం చంద్రబాబుకు 183 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. ఇందులో విజయవాడ నివాసం వద్దనున్న 135 మందితో పాటు హైదరాబాద్ లోని 48 మంది కూడా ఉన్నారని వెల్లడించింది.