విశాఖ వైపే ఏపీ సర్కారు అడుగులు.. మిలీనియం టవర్స్ లో ఐటీ సంస్ధలకు సాయిరెడ్డి బెదిరింపులు?
posted on Feb 25, 2020 @ 12:08PM
విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు అనుగుణంగా చకచకా పావులు కదుపుతోంది. విశాఖలోని రుషికొండ వద్దనున్న మిలీనియం టవర్స్ ను తొలుత రాష్ట్ర సచివాలయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిపై ఆలోచనలో పడింది. అయితే తాజాగా వైసీపీలో నంబర్ టూగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మిలీనియం టవర్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ఐటీ కంపెనీ కాడ్యుయెంట్ ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు తగిన స్ధలాల కోసం నగరంలో అన్వేషణ సాగిస్తోంది. అదే సమయంలో రుషికొండలోని మిలీనియం టవర్స్ లో ఉన్న పలు ఐటీ సంస్ధలను బెదిరించి బయటికి పంపుతున్నారన్న విమర్శలను నిజం చేస్తూ కాడ్యుయెంట్ ఐటీ కంపెనీ పెద్దలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బెదిరించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సాయిరెడ్డి మిలీనియం టవర్స్ కు వచ్చారు. దాదాపు 2000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక ఐటీ కంపెనీ కాడ్యుయెంట్లోకి విజయసాయిరెడ్డి నేరుగా వెళ్లారు. కాడ్యుయెంట్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తే మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులు ఇక్కడ మాకు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. ఉద్యోగులతో నేరుగా కంపెనీ ఖాళీ చేయకపోతే, చేయిస్తామనే అర్థం వచ్చేలా నర్మగర్భంగా హెచ్చరించేందుకే తాను ఆకస్మికంగా వచ్చాననే సంకేతాలిచ్చారు. దీంతో కాడ్యుయెంట్ ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. కాసేపటి తర్వాత కంపెనీ పెద్దలను కలిసిన సాయిరెడ్డి.. అక్కడి నుంచి ఖాళీ చేస్తే పరిసరాల్లో వేరే చోట స్ధలం కేటాయిస్తామంటూ కాడ్యుయెంట్ యాజమాన్యానికి ఆఫర్ ఇచ్చారు. అయితే తమకు ఇక్కడే సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు సాయిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మిలీనియం టవర్ ఖాళీ చేయకుంటే తామే చేయిస్తామనే అర్దం వచ్చేలా వారికి సాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చి వెనుదిరిగారని సమాచారం.
మరోవైపు తాజాగా విశాఖలో పర్యటించిన ఇద్దరు మంత్రులు మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు వార్తలను ఖండించారు. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సచివాలయం కోసం మిలీనియం టవర్స్ లోని ఐటీ సంస్ధలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలను కూడా వారు తోసిపుచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే సాయిరెడ్డి అక్కడికి వెళ్లి కాడ్యుయెంట్ సంస్ధ ఉద్యోగులను బెదిరించారన్న వార్తలు స్ధానికంగా కలకలం రేపుతున్నాయి.