ట్రంప్ ముంచేశాడు! మోడీ మ‌న‌ల్ని గట్టున పడేసారా!

అమెరికా ఆసుపత్రులకు పోటెత్తు తున్న రోగులు! చేర్చుకోలేని స్థితి లో ఆసుపత్రులు! ఒక ventilator ను ఇద్దరికి వాడాలని నిర్ణయం! పూర్తిగా అలిసిపోయిన మెడికల్ సిబ్బంది! పరిస్థితి మరింత దిగ జారే ప్రమాదం! “ ఆసుపత్రికి వస్తున్న వారిలో అధిక శాతం ఆగ కుండా విపరీతంగా దగ్గుతున్నారు “ అని అమెరికా లోని డాక్టర్స్ చెబుతున్నారు. అమెరికా లో తట్టుకోలేని దగ్గు తో ఆయాస పడుతూ ఆసుపత్రికి వస్తున్నారు. బాధాకరమైన వాస్తవం ! మార్చి 18 నాటికి అమెరికా లో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు . ఇండియా లో 150. వారం తరువాత ఈ రోజుకి ఇది అమెరికా లో 85 వేలు అయ్యింది. ఇండియా లో 630. ట్రంప్ అమెరికా ను ముంచేశాడు ! మోడీ లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ఇండియా ను గట్టున పడేసాడు. అందరూ ఇల్లు దాటకుండా ఉండాల్సిన అవసరాన్ని ఈ లెక్క‌లు చెబుతున్నాయి. అమెరికా లో ఎక్కువ కరోనా కేసు లు బయట పడుతున్నాయి అంటే దానికి కారణం అక్కడ ఎక్కువ మందిని చెక్ చెయ్యడం! ఇండియా లో తక్కువ కేసు లు వున్నాయంటే అందుకు కారణం చాలా తక్కువ మందిని చెక్ చెయ్యడమే - ఇదొక వాదన / అభిప్రాయం ! అయితే వాస్త‌వం ఏమిటంటే చెక్ చేయడానికి చేయక పోవడానికి తేడా కేవలం వారం రోజులే. రోగం ముదిరితే పరుగెత్తుకొంటూ ఆసుపత్రికి వస్తారుగా? ఇంట్లో దుప్పట్లో దాక్కోలేరుగా? అమెరికా లో కేసు లు ఎనభై వేలు కు పైగా. ఇండియా లో 600. ఎక్కడ పోలిక ? ఇండియా కరోనా మరణాలు కొన్ని సంభవించి ఉండొచ్చు! కానీ అమెరికా లో లాగ తీవ్ర మైన స్థితి కనబడం లేదు . మలేరియా ప్రాంత ప్రజల పై కరోనా మైల్డ్ గానే ప్రభావం చూపుతుంది . వృద్ధాప్యం, హై బీపీ , శ్వాస కోస వ్యాధులు వున్నప్పుడే ఇండియా లాంటి ఉష్ణ మండల మలేరియా ప్రాంత వాసుల విషయం లో అది ప్రాణాంతకంగా మారుతుంది.

అమెరికాలో నిరుద్యోగ తీవ్రత! 32.83 లక్షల మంది రోడ్డున‌ప‌డ్డారు!

అమెరికాను కరోనా వైరస్ ఆవహించింది. ఈ క్రమంలో కంపెనీలు పరిశ్రమలు వివిధ సంస్థలు మూతపడుతున్నాయి. ఇది అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. దీంతో మార్చి 21 వరకే ఏకంగా అమెరికాలో 32.83 లక్షల మంది రోడ్డున పడ్డ పరిస్థితి కనిపించింది. 32 లక్షల మంది జాబ్ ల కోసం క్లెయిమ్స్ పెట్టుకోవడం.. చేస్తామని అప్లికేషన్లు పెట్టుకోవడం అమెరికాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి 21నాటికి గడిచినవారంలో అమెరికాలో 3.28 మిలియన్స్ మంది అమెరికన్లు జాబ్ లెస్ క్లెయిమ్స్ పెట్టుకోవడంతో కరోనా కారణంగా అమెరికాలో ఎంతటి పెను విధ్వంసం చోటుచేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కనుక మరింత ఎక్కువైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.

వడ్డీ రేట్ల తగ్గింపు, లోన్ల‌పై 3 నెలల మారిటోరియం!

ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత కూడా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని... ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన కీలక నిర్ణయాలను తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రేపో రేటును 75 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో పాటు.... రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయని, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ప్ర‌స్తుతం 3.74 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. అన్ని రకాల లోన్లుపై 3 నెలల మారిటోరియం ప్రకటించారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈఎంఐలు కట్టకపోయినా సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం ఉండదని గవర్నర్‌ తెలిపారు. ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాల‌తో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐలో పని చేసే 150 మంది ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.

గుంటరు ఆస్పత్రి నుంచి కరోనా పేషంట్ అదృశ్యం 

గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితుడు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు...కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కుటుంబసభ్యులు ఈనెల 25న గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చేర్పించారు. జీజీహెచ్ వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. కాగా, నిన్న వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగుల కళ్లుగప్పి సదరు వ్యక్తి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు కంగుతిన్నాయి. వెంటనే జీజీహెచ్ ఆర్ఎంవో ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం గాలిస్తున్నారు.

మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారు:  ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు...ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసింది. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెప్తున్నాయి.ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా సహకరించాలని కూడా అలీం బాషా విజ్ఞప్తి చేశారు.

గర్భిణీలకు కరోనా టెస్టు తప్పనిసరి!

గర్భిణీల నుంచి శిశువుకు కరోనా వ‌స్తుందా... అంటే అవున‌నే అంటున్నారు చైనా డాక్ట‌ర్లు. ఇటీవల చైనాలో ఓ గర్భిణీ డెలీవరి కోసం హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే ఆమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు పరీక్షలు చేసి కరోనా ఉందని నిర్ధారించారు. ముందుజాగ్రత్తగా యాంటీ వైరల్ డోస్ లు ఇచ్చినప్పటికీ క‌రోనా వైరస్ గర్భసంచికి పాకింది. డెలివరీ తర్వాత శిశువు హెల్త్ చెక్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కరోనా వైరస్ శిశువుకు సోకిందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 'పుట్టిన వెంటనే రక్తనమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులు చేశాం. పాపకు కరోనా పాజిటివ్ వచ్చింది' అని వైద్యులు అంటున్నారు. చైనాలో మ‌రో 33మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ప్రసవం తర్వాత రెండ్రోజుల వరకూ టెస్టులు చేయకపోవడంతో యాంటీ డోసుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కొందరు రీసెర్చర్లు తల్లికి ఉన్న కరోనా పాపకు కచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.

అమెరికాలో కరోనా కల్లోలం! చైనాను దాటేసిన‌ అమెరికా!

ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులలో అమెరికా ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ ఒన్ ప్లేస్‌లో వుంది. అత్యధికంగా 85,435 కోవిడ్-19 కేసులు నమోదై క‌రోనాకు కేంద్రంగా మారింది. అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది. గ‌తంలోనే కరోనావైరస్ కు అమెరికా కేంద్రం అవుతుంద‌ని  శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గురువారం అది నిజ‌మైంది.  ఇప్పటి వరకూ చైనాలలోనే అత్యధికంగా 81వేల కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్యను అమెరికా అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధికంగా 85,435 కోవిడ్-19 కేసులు అమెరికాలో నమోదయ్యాయి. మొత్తం 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 330 మిలియన్ల మంది జ‌నాభా వున్న యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ వైరస్ కనీసం 171 దేశాలలో 519,300 మందికి పైగా సోకింది. అమెరికా కరోనా బాధితుల్లో చైనాను దాటేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది.  కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయంలో ఉంది.   అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 24,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 5.32 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2,600 మంది మృతిచెందారంటే భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. గత రెండు రోజుల్లోనే 30వేల కేసులు అమెరికాలో నమోదయ్యాయి.  చైనా  నిరంకుశ ప్రభుత్వం ఆలస్యంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌ట్టికీ ఆ త‌రువాత చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసింది. చైనా ను చూసి  సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు అప్ర‌మ‌త్త‌మై త్వరగా క‌రోనా నియంత్ర‌ణ‌కు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ యథావిధిగా వ్యాపారంలో మునిగిపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం కాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ  ప‌రిస్థితి చూడాల్సివ‌చ్చింది.  కొద్దిమంది వైరాలజిస్టులు మాత్రమే దాని ముప్పును గుర్తించారు. వైరస్ ఇన్ఫ్లుఎంజా కాదు, కానీ దీనికి 1918 స్పానిష్ ఫ్లూ యొక్క లక్షణాలను కలిగి ఉంది. సాపేక్షంగా తక్కువ ప్రాణాంతకం అని భావించారు.  కానీ కనికరం లేకుండా వ్యాప్తి చెందుతూ అమెరికాను కంటి మీద కునుకులేకుండా చేసింది. చైనా నుండి బయటకు వస్తున్న సెల్‌ఫోన్ వీడియోలు వుహాన్‌లో వ్యాప్తి చెందుతున్నప్పుడు ఏమి జరుగుతుందో చూపించాయి. ఆసుపత్రి అంతస్తులలో మృతదేహాలు, నిరాశతో ఏడుస్తున్న వైద్యులు, శ్మశానవాటికల వెలుపల గమనింపబడని శవపేటికలు. బీజింగ్ పాశ్చాత్య జర్నలిస్టుల వీసాలను నిలిపివేయడం మరియు నిర్బంధాలను విధింది - చైనా యొక్క ప్రజా ఆరోగ్య వ్యవస్థ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి ప‌రిస్థితుల్ని అదుపులోకి తీసుకువ‌చ్చింది.    ఇప్పుడు కనీసం 160 మిలియన్ల అమెరికన్లు కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు ఉన్న రాష్ట్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. పాఠశాలలు మూసివేయబడతాయి, తరచుగా బార్‌లు, రెస్టారెంట్లు మరియు అనేక ఇతర వ్యాపారాలతో పాటు. అవసరమైన రక్షణాత్మక గేర్ మరియు పరికరాల సరఫరా తగ్గిపోతున్నప్పటికీ, న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న రోగుల సంఖ్యను  ఆసుపత్రులు ఎదుర్కొంటున్నాయి.  ఇతర ఆసుపత్రులు, ఇతర సంఘాలు ఏమి రాబోతున్నాయో అని భయపడుతున్నాయి. "మేము ఈ వ్యాధికి  ప్రపంచ కేంద్రంగా ఉన్నాము" అని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ వద్ద అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ సారా కెల్లెర్ చెప్పారు. "ఇప్పుడు, మన ఇళ్ళలో వుండిపోవ‌డం ద్వారా సాధ్యమైనంతవరకు వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డం మనం చేయగలిగేది, ఒక దేశంగా, మేము వ్యక్తిగత రక్షణ పరికరాలు, పరీక్షకు అవసరమైన పదార్థాలు మరియు వెంటిలేటర్ల ఉత్పత్తిని పెంచుతాము." అమెరికా.. కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయంలో ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర కూడా వేశారు. భార‌త‌దేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తోంది.  అత్యధిక మరణాలు కలిగిన దేశంగా భారత్ అమెరికాను అధిగమించవచ్చు. యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా, ఇది కూడా లోతైన అంతర్గత విభజనలతో కూడిన విస్తారమైన ప్రజాస్వామ్యం. కానీ దాని జనాభా, 1.3 బిలియన్లు, చాలా పెద్దది, మరియు దాని ప్రజలు మెగాసిటీలలో ఇరుకైన గ‌దుల్లో రద్దీగా ఉన్నారు.

దూరదర్శన్ లో మ‌ళ్లీ రామాయణం!

శ‌నివారం నుంచి దూరదర్శన్ లో రామాయణం పునః ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. వరుస ప్రకటనలతో బోర్ కొట్టించకుండా సీరియల్ ప్రసారం చేయనున్నారు. అప్పట్లో రామాయణం సీరియల్ కు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ ఆ సీరియల్ పట్ల ప్రజల్లో ఆదరణ వుంది. జనం పౌరాణిక సీరియల్ ను మరింతగా ఆదరిస్తారని దూరదర్శన్ వర్గాలు భావిస్తున్నాయి.  ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో  సీరియ‌ల్‌ను శ‌నివారం నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జ‌వ‌దేక‌ర్ తెలిపారు.  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు.  తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది.

కరోనా లక్షణాలున్నాయని యువకుడిపై రాళ్లదాడి!

కరోనా వైరస్ మూలంగా ప్రపంచం బెంబేలెత్తుతోంది. కరోనా వల్ల మనుషులంతా సమానమేనని మళ్లీ తెలిసొచ్చిందని, కులం-మతం, పేద-ధనిక అనే తేడా లేకుండా.. అందరూ ఎప్పుడో ఒకసారి ఉత్తి చేతులతో పోవాల్సిందేనని.. కాబట్టి ఉన్నంత కాలం నిస్వార్థంగా బ్రతకాలి అంటూ పెద్దలు నీతి వాక్యాలు చెబుతున్నారు. అయితే ఇలాంటి నీతులు ఎంతమంది చెవికి ఎక్కుతున్నాయో తెలియదు కానీ.. కరోనా ప్రాణభయం మాత్రం చాలామంది మెదళ్ళకు ఎక్కింది. ఎంతలా అంటే ప్రాణభయంతో ఎదుటి వ్యక్తి ప్రాణం తీయడానికి కూడా వెనకాడనంతలా!. కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌(35) సంగారెడ్డి జిల్లాలో నివసిస్తూ ప్యాసింజర్‌ ఆటో నడుపుతుంటాడు. అతను గురువారం నాడు రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలో దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనన్న అనుమానం, తమకెక్కడ ఆ వైరస్‌ అంటుతుందేమోనన్న భయంతో అతనిపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చూస్తుంటే కరోనా మనుషుల కన్నా ముందు వారిలోని మానవతాన్ని చంపేస్తుందేమో అనిపిస్తుంది. మనుషులకు ప్రాణ భయం ఉండటం సహజమే.. కానీ ఆ భయం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే అంత కౄరంగా మారకూడదు. దగ్గు, తుమ్ములు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా ఉన్నట్లు కాదు. ఒకవేళ అంతలా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతేకాని ఇలా దాడులు చేయకండి.

ఈ.ఎమ్.ఐ.ల చెల్లింపులు జూన్ వరకూ వాయిదా వేయాలి: పవన్ కళ్యాణ్ 

కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు  కృతజ్ఞతలు తెలియచేసిన పవన్ కళ్యాణ్,  ఇదే సమయంలో ఉద్యోగ వర్గాలకు, స్వయం ఉపాధి  పొందేవారికి ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈ.ఎమ్.ఐ. చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర సరిహద్దులు... మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతుల్లో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. వారిని ఆదుకొనే దిశగా వైసీపీ నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సంఘాల సభ్యురాళ్ళ వేదనను తగ్గించాలన్నారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

నాటక రంగానికి జీవం పోయాలి! 

-నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా దినోత్సవం, బాలల దినోత్సవం, క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, వాలెంటైన్స్ డే, లాంటి వివిధ అంశాల మీద ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పరచుకొని ఆ రోజు ఆ విషయం మీద విస్తృత చర్చ, పత్ర సమర్పణ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒకటి రంగస్థలానికి కూడా అంతర్జాతీయంగా  ‘ప్రపంచ థియేటర్ డే'గా ఏర్పరచాలని జాతీయ స్థాయి థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌ వారు 1961 మార్చి 27 నాడు నిర్ణయించారు.  1961 మార్చి 27 నాడు ప్రారంభించిన అంతర్జాతీయ రంగస్థల దినోత్సవానికి మొట్టమొదట ప్రారంభ వ్యాసాన్ని జీన్ కోకటియ్ ప్యారిస్‌లో 1962లో సమర్పించారు. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా కళా రంగాల్లో నిష్ణాతులు ఒకరు మార్చి 27 నాడు నాటకరంగంలో అన్నింటిని సోదాహరణగా వివరిస్తూ పత్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం'గా గుర్తించి,వివిధ దేశాల రంగస్థల కళాకారులంతా వారి వారి రంగస్థ‌ల‌ వేదికలపై మార్చి 27 నాడు ఘనంగా ప్రదర్శనలు, చర్చలు జరుపుకుంటున్నారు. ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలయి సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచదేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది. మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యలను మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్ని మన హక్కుల కోసం పోరాటం లాంటి స్వరూప స్వభావాలతో, సహజత్వంతో కూడిన సందేశాలతో, సార్వజనీనకంగా  ఉన్న రచనలు,  రచనల్లో సమగ్రంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నాటకాలను దర్శించడానికి ప్రయోక్తలు, టెక్నీషియన్స్ ఎన్నో అధ్యయనాలు చేసి సంగీతంలోనూ, లైటింగ్ లోనూ పాత్రల ఫ్రీజింగ్ లాంటివి సాంకేతికంగా చొప్పించి,  వాస్తవికంగా చూపించి ప్రదర్శించడానికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం (థియేటర్ డే)  నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగస్థల నిష్ణాతులు మార్చి 27 నాడు నాటక ప్రియులకు తమ అనుభవాలు, కొత్త ప్రయోగాలు, సిద్ధాంత వ్యాసాలు అందిస్తున్నారు.  ఈ సంవత్సరం పాకిస్థాన్ లోని ప్రముఖ నాటక రచయిత షాహిద్ నదీమ్ సందేశాన్ని అందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సంద‌ర్భంగా నాటకం దశ, దిశ గురించి విస్తృతంగా చర్చించుకోవడానికి మార్చి 27 ఎంతో తోడ్పడుతుంది. ఈ ఉత్సవ  వైశిష్ట్యాన్ని ముందుతరం కళాకారులకు అందించి ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి కళాకారులందరి మీదా ఉన్నది. - రావుల పుల్లాచారి, నాటక రచయిత , విశ్రాంత పర్యవేక్షకులు,  9949208476

శుక్రవారం నమాజ్ కు మసీదుకు వెళ్లకపోతే...

మనలో ఐదు పూటలా నమాజ్ చదివటం ప్రక్కన పెడితే ప్రత్యేకంగా పనికట్టుకుని శుక్రవారాలు మాత్రమే మసీదుకు వెళ్లి సెంటిమెంట్ గా నమాజ్ చదివేసేవారి సంఖ్యే ఎక్కువ! అందుకే మిగతా రోజుల్లో పెద్దగా జనాల్లేక బోసిపోయి ఉండే మసీదులు శుక్రవారాలు మటుకు ఒక్కసారిగా కోలాహాలంగా మారుతుంటాయ్. కాబట్టి పై సంఘటనలను దృష్టిలో పెట్టుకుని “నేను మసీదుకే కదా వెళుతుంది అలాంటప్పుడు కరోనా వైరస్ నన్ను ఏమి చెయ్యగలదు అల్లాహ్ యే అన్నీ చూసుకుంటాడని మొండిగా వెళ్లటం అన్నది చాలా తప్పు. ఎందుకంటే అనేక సార్లు వైరస్ ల బారిన పడే హజ్ కు ప్రపంచ నలుమూలల నుండి వెళ్లినోళ్లే  వేల కొద్దీ హాజీలు చనిపోవటం జరిగింది. వారంతా కూడా అల్లాహ్ ను నమ్ముకునే కదా  వెళ్లింది హజ్ చెయ్యటానికి పైగా కాబా దర్శనానికి. ఇదంతా విధి ప్రకారమే జరిగినప్పటికీ మన ద్వారా ఇతరులకు హాని తలపెట్టకుండా జాగ్రత్త వహించటం అన్నది మన విధి. “ఆ ఏముందిలే పోయే ప్రాణం ఎలాగూ పోతుంది కదా” అని అశ్రద్ధ వహించటం కేవలం మీ ప్రాణాల వరకే కాదు ఇతరుల ప్రాణాలను కూడా మీరు ప్రమాదంలో నెట్టటమే అవుతుంది. ఓ ప్రక్క ప్రభుత్వాలు కోట్లు నష్టం పెట్టుకుని దేశాలూ, పట్టణాలే వ్యక్తుల మధ్య సామాజిక దూరం (Social Distance) పెంచి కరోనాను కట్టడి చేయటానికి గృహ నిర్భంధం (Lock down) ప్రక్రియ మొదలు పెడితే మనం దానిలో  కచ్చితంగా భాగస్వామ్యం కావాలి. కొద్ది కాలం సామూహిక, శుక్రవారం నమాజులు మసీదులకు వెళ్లకపోయినా పర్లేదు. ఇళ్ళల్లో వ్యక్తిగతంగా చదువుకున్నా తప్పులేదు. ఎదురుగా ఓ ప్రమాదకరమైన కారణం ఉంది కాబట్టి. ఇప్పుడు కరోనా వచ్చింది రేపన్న రోజు ఏ భయంకర తుఫానో వచ్చి సగం ఊరు ముంగిపోతే సామూహిక నమాజ్ కోసం మసీదుకు వెళ్లగలరా? ఇదీ అంతే!   కరోనా వైరస్ కున్న ఓ ప్రత్యేకత,  అది ఏ వ్యక్తికి సోకినా  వెంటనే దాని లక్షణాలు బయటపడటం మొదలవ్వవు. 11 నుండి 14 రోజుల తరువాత నుండి దాని లక్షణాలు ఒకొక్కటిగా బయటపడతాయి. ఈ లోపులో బయట పరిసరాల్లో అతను  అప్రయత్నంగా తుమ్మటం, దగ్గటం ద్వారా తుప్పర్ల నుండి వెలువద్ద వైరస్ వివిధ వస్తువుల ఉపరితల (Surface) భాగంపై పడి, మూడురోజులకు  పైనే అది సజీవం (Live) గా ఉంటుంది. ఆ ఉపరితలాలను అప్రయత్నంగా తాకే ఇతరులకు ఆ వైరస్ అమాంతంగా అంటుకుంటుంది. అందుకే చేతులు కడుక్కోమనేది. అలా అంటుకునే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు పాకి దాదాపు ఐదు లక్షల మందికి సోకి ఎన్నో వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. కాబట్టి మసీదులకు వచ్చే వారిలో ఎంతమందిలో వారికి తెలియకుండా కరోనా వైరస్ ఉందో తెలియదు కదా! వారు ఏ కాస్త చిన్నగా దగ్గినా, తుమ్మినా చాలు ఆ మసీదులో ఉన్నోల్లందరూ తమకు తెలియకుండా కరోనా బారిన పడతారు. కాబట్టి మనం దేవునిపై బలమైన విశ్వాసాలు కలిగి ఉండటంలో తప్పులేదు, కానీ ఆ విశ్వాసాలను  మొండిగా కలిగి ఉండకూడదు. పరిస్థితులు సహకరించనప్పుడు ప్రాణాల్ని సంకటంలో పడవేసి మొండిగా విశ్వాస నిరూపణ చేసుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు కదా! ఎందుకంటే మనిషి శ్రేయస్సు కోసమే ధర్మం ఉంది ధర్మం కోసం కోసం మనిషి కాదు. ఇవేమీ పట్టించుకోకుండా నాకు నా విశ్వాసమే ప్రధానమని చెప్పి నేను పట్టిందానికి మూడే కాళ్లు అన్న చందంగా, ఎవరెన్ని చెప్పినా వినకుండా మొండిగా వ్యక్తుల సమూహాల్లోకి వెళ్ళిపోయి కరోనా తగిలించుకుని రేపన్నరోజున ఐసోలేషన్ వార్డ్  బెడ్ మీద పడుకుని చివరి రోజులు లెక్క పెడుతూ బాధపడేకంటే ఇప్పుడే జాగ్రత్త పడి మన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టక పోవటం ఎంతో పుణ్యం... మన వీధి చివర్లో ఉండే మసీదుల సంగతి ప్రక్కనపెడితే గత 1400 సం.ల కాలంలో మక్కాలో ఉన్న కాబా మసీదునే అనేక కారణాల వల్ల 40 సార్లు పూర్తిగా మూసివెయ్యటం జరిగింది! ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును గతంలో ఎన్నో సార్లు ఇప్పుడొచ్చిన కరోనా లాంటి వివిధ వైరస్ ల కారణంగా  ఉమ్రాలను మాత్రమే కాదు, హజ్ లను సైతం ఆపేసి, మొత్తానికి కాబా మసీదునే కొద్ది కాలం మూసివేసే  పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని ఎంతమందికి తెలుసు? ఇది నిజం. 1814 సం.లో మక్కాలో ప్లేగ్ వ్యాధి ప్రబలి 8000 మంది చనిపోయారు. అప్పుడు తవ్వాఫ్, సామూహిక నమాజ్ లను కొద్ది కాలం ఆపేసి, మస్జిదే హరామ్ ను పూర్తిగా కొద్దికాలం మూసివెయ్యటం (Lock down) జరిగింది. 1831 లో భారతదేశం నుండి వెళ్ళిన ఒక వ్యక్తి ద్వారా సోకిన వింత వైరస్ ద్వారా ఆ సంవత్సరం హజ్ కొచ్చినవారిలో మూడొంతుల్లో ఒక వంతు మంది చనిపోయారు. అప్పుడు కూడా మస్జిదే హరామ్ ను పూర్తిగా కొద్దికాలం మూసివెయ్యటం (Lock down) జరిగింది. 1837 లో ఒక ప్రమాదకరమైన వైరస్ మక్కా, మదీనా పట్టణాల్లో విలయతాండవం చేసింది. అది దాదాపు మూడేళ్ల వరకు అనేక మందిని పొట్టన పెట్టుకుని 1840 లో అది తగ్గు ముఖం పట్టింది. అప్పుడు కూడా కూడా మస్జిదే హరామ్ ను పూర్తిగా మూసివెయ్యటం (Lock down) జరిగింది. 1845 సం.లో “కొలీరా” అనే పేరు గల వైరస్ మక్కాలో వ్యాప్తి చెందింది, తరువాత 1864, 1892 సం. రాలలో సైతం ఒక విధమైన ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెంది వేల కొద్దీ హజ్ యాత్రికులు చనిపోయారు. ఆయా సంవత్సరాల్లో కూడా కాబా మసీదు ను  పూర్తిగా మూసివెయ్యటం జరిగింది.   కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి కొద్ది కాలం మక్కా మసీదు  లో ఉమ్రాను తాత్కాలికంగా ఆపెయ్యటం అదేదో పెద్ద విచిత్రమేమీ కాదు, అలా అంటువ్యాధుల కారణంగా మసీదును కొద్ది కాలం పాటు మూసివెయ్యటం ఘోర పాపం కూడా కాదు! గతంలో ఎన్నో సార్లు మొత్తానికి మక్కా మస్జిదే మూసివేసి హజ్ ను సైతం ఆపేసిన  సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారి నుండి అంటూ వ్యాధులు ప్రబలి వివిధ వైరస్ ల కారణంగా వేలల్లో ప్రాణ నష్టం జరగటం అన్నది గమనార్హం.   ఇప్పుడు కరోనా మహమ్మారి (Pandemic) గా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు సమూహంగా ఏర్పడటం ఒక్కటే కరోనా వేగంగా వ్యాప్తి చెందటానికి  మూల కారణంగా మారుతున్న సందర్భంలో మరి మసీదులకు పోయి సామూహిక నమాజ్ చదవకపోతే ఎలా? శుక్రవారం నమాజ్ తప్పనిసరికదా? అన్నది చాలా మందికి అదేదో బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది!

ఏపీ: విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు

కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు. బ్యాంక్ ద్వారా పంపే వారు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 38588079208 వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్ IFSC కోడ్: SBIN001884 ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039 వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079

50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు!

కేవ‌లం నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ ను గుర్తించే స్మార్ట్ ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్ ను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా రూపొందించింది.  గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా 50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు తెలిపారు. తమకు వైరస్ సోకిందో - లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్ ఉపయోగపడుతుందని వివరించారు.  గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ ఎన్ ఏను వెలికితీసి కరోనా నిర్థారిత పరీక్షలు చేయ‌వ‌చ్చు.  తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్ ను ఉపయోగించేలా రూపొందించిన‌ట్లు పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ తెలిపారు.  ఈ కిట్ ను నేషనల్ హెల్త్ సర్వీస్ రెండు వారాల పాటు పరీక్ష చేయనుంది.   ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది.

ఏపీ లో 44 మంది క్వారంటైన్‌కు తరలింపు

విదేశాల నుంచి వచ్చిన వారిని ముమ్మరంగా స్క్రీనింగ్  డేంజర్ జోన్ గా విజయవాడ గాయత్రీ నగర్  కరోనా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఏపీలో 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ కాగా,  289 కేసులు నెగటివ్‌గా వచ్చినట్లు చెప్పారు. మరో 33 కేసుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా స్క్రీనింగ్‌ చేస్తోంది. ఇప్పటివరకూ 26,059 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. మరోవైపు 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 117మందిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 332 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 289 కేసులు నెగటివ్‌గా, 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. మరో 33 కేసుల ఫలితాల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు.  ఇక పలు జిల్లాల్లో నిత్యావసరాలను రాష్ట్ర ప్రభుత్వం డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఫోన్‌ కాల్‌ చేస్తే ఇంటికే సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌, నాకా బందీకి సీఎస్‌, డీజీపీలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రహదారులను బ్లాక్‌ చేసి, పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ నుంచి వచ్చి 44 మందిని క్వారంటైన్‌కు తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రజల సందేహాలు తీర్చేందుకు 24 గంటల కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇరవై నాలుగు గంటలు పని చేసేలా నాలుగు టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, విజయవాడ గాయత్రి నగర్ లో అపార్ట్మెంట్ లో నివసించే వారిని గ్రామ వాలంటీర్లు పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అపార్ట్మెంట్ వారు అనుమతించకపోతే పోలీసువారి సహకారం తో పరిశీలించవచ్చునాని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ లో చాలా మంది విదేశాల్లో నివసించి  ఈ పది రోజుల్లో వచ్చి వుంటారని సమాచారం.

పేద‌ల‌కు అండ‌గా గరీబ్ కళ్యాణ్ యోజన! 

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్ర‌భుత్వం పని చేస్తోంద‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిష‌న్ రెడ్డి చెప్పారు.  ఢిల్లీలో కరోనా(corona) నివారణకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుండి లాక్ డౌన్ పై ఆయ‌న పర్యవేక్షిస్తున్నారు. లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలోని 17 జిల్లా కలెక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఆయా జిల్లాలలో  లాక్ డౌన్ తో  అందరికీ నిత్యావసర వస్తువులు,కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా ,  స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లో శానిటేషన్ విషయంలో   ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును అత్యవసర ఈ పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తున్న సౌకర్యాలు వెసలుబాటు విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో 17 జిల్లాల కలెక్టర్లతో స్వయంగా  కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు సమాచారాన్ని, అక్కడున్న పరిస్థితులను, సమస్యలను, తీసుకుంటున్న చర్యలను, సమాచారాన్ని ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి గారు తెలిపారు.  అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షిస్తూ  తగిన సూచనలను ఇస్తున్నారు.   ప్రజలందరూ కరోనా నివారణ చర్యలకు సహకరించాలని శ్రీ జి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు  ప్రధాని  నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం నడుం బిగించి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించింద‌ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకంలో భాగంగా 80 కోట్ల మంది పేదలకు కేంద్రం 1 లక్ష 70 వేల కోట్ల రూపాయల లాభాలను అందిస్తుందని ఆయ‌న అన్నారు.  1. రానున్న 3 నెలలు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం  2. 8.69 కోట్ల మంది రైతులకు తక్షణమే రూ 2,000 3. పెన్షనర్లకు, పేదలకు, వృద్ధులకు, దివ్యాన్గులకు, భర్త లేని వారికి రూ 1,000 4. జన్ ధన్ ఖాతా ఉన్న మహిళలకు రాబోయే మూడు నెలలు పాటు నెలకు రూ 500 5. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ 6. వైద్యులకు, ఆశ వర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు 50 లక్షల భీమా 7. ఉపాధి హామీ కూలీని రూ 182 నుండి రూ 202 లకు పెంపు  8. స్వయం సేవక మహిళా గ్రూపులకు ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు  9. ఉద్యోగాలను కాపాడేందుకు 100 మంది కంటే తక్కువ ఉన్న కంపెనీల్లో పని చేసే వారికి యాజమాన్యం, ఉద్యోగస్తులు చెల్లించే పిఎఫ్ ను ప్రభుత్వమే చెల్లిస్తుంది 10. ఉద్యోగస్తులు 75 శాతం పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే వెసలుబాటు